• facebook
  • whatsapp
  • telegram

భూతాపం ఉత్పాదకతకు శాపం

ప్రభుత్వాల చిత్తశుద్ధితోనే పరిష్కారం

భూమి ఉపరితల వాతావరణం వేడెక్కుతోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఆరుబయట పనిచేయడం చాలా కష్టం. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఉన్నా, భారతదేశంలో దీని విపరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పరిస్థితులవల్ల ఏడాదికి దాదాపు 10 వేల కోట్ల పనిగంటలను భారతదేశం నష్టపోతుందని, ఇది ప్రపంచంలోని ఏ దేశంతో పోల్చినా ఎక్కువేనని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. వేడి వాతావరణంలో పనిచేయడం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎండ ఎక్కువగా ఉండే మిట్టమధ్యాహ్న సమయంలో కాకుండా తెల్లవారుజామున, సాయంత్రం పనిచేయించేలా వ్యూహాలు మార్చినా, వాటివల్ల కలిగే ప్రయోజనం కొంతేనని అంటున్నారు.

మండే ఎండల్లో ఆరుబయట పనిచేయడం వల్ల త్వరగా అలసిపోతారు. మనిషి శరీరం సాధారణంగా చెమటతో చల్లబడుతుంది. కానీ, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట అంత త్వరగా ఆవిరి కాదు. అందువల్ల బయట పనిచేస్తుంటే ఎక్కువసార్లు విరామం తీసుకోవాల్సి వస్తుంది. భూతాపం కారణంగా వేడిగా, తేమగా ఉండే రోజులు భారతదేశంలో పెరుగుతాయి. వాతావరణ మార్పుపై అంతర ప్రభుత్వాల కమిటీ (ఐపీసీసీ) తాజా నివేదిక ప్రకారం చూస్తే, భారతదేశంలో వేడిగాలులు మరింత ఎక్కువ అవుతాయి. కర్బన ఉద్గారాలు ఇదేస్థాయిలో ఉంటే- రాబోయే నాలుగు దశాబ్దాల్లో వేడిగాలులు 25 రెట్లు అధికం అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ నమూనాలపై డ్యూక్‌, స్టాన్‌ఫర్డ్‌, నార్త్‌ కరొలినా, వాషింగ్టన్‌ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేసింది. వివిధ దేశాల్లో వేడి, తేమ వాతావరణాలు ఎలా ఉన్నాయో పరిశీలించింది. వాతావరణం మరింతగా వేడెక్కడం వల్ల ఏయే దేశాలు ఎంతమేర పనిగంటల్ని నష్టపోతాయో ఆ బృందం వెల్లడించింది. గడిచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ 22,800 కోట్ల పనిగంటలు నష్టపోయాయి. భూ ఉపరితల వాతావరణంలో ఉష్ణోగ్రత ప్రస్తుతం ఉన్నదానికంటే రెండు డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగితే- పనిగంటలు తగ్గడం వల్ల ఉత్పాదకత నష్టం ప్రపంచవ్యాప్తంగా 16 లక్షల కోట్ల డాలర్లదాకా ఉంటుందని అంచనా! అయితే, తెల్లవారుజాము నుంచి పనిచేయిస్తే ఈ నష్టం దాదాపు 30శాతం తగ్గుతుంది. మొత్తం 163 దేశాల్లో పరిస్థితిపై పరిశోధనలు చేయగా, అన్నింటికంటే భారతదేశంపైనే అత్యధికంగా ప్రభావం పడుతుందని తేలింది. రాబోయే కొన్ని సంవత్సరాల పాటు చైనా, పాకిస్థాన్‌, ఇండొనేసియాలతో కలిసి భారతదేశమే ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంటుందని అంచనా.  

భూతాపం ప్రభావం వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నది వ్యవసాయరంగమే. ఎల్‌నినో ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటే, పని గంటల నష్టం సైతం అంత తీవ్రంగా ఉంటోంది. అందువల్ల, ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ ఒకవైపు ఉత్పాదకత, మరోవైపు జీవనాధారాలు దెబ్బతినకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దేశంలోని వివిధ రాష్ట్రాలు వేసవి కార్యాచరణ ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందించుకుంటున్నాయి. ఆసియాలోనే తొలిసారిగా అహ్మదాబాద్‌లో ఇలాంటి ప్రణాళికను సిద్ధం చేశారు. 2010 మే నెలలో ఎండలకు అహ్మదాబాద్‌లో 1,300 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ముందస్తుగానే వాతావరణ హెచ్చరికలు చేయడం, ఏ సమయంలో ఎండ ఎక్కువగా ఉంటుందో చెప్పడం ద్వారా ఆ సమయాల్లో ఆరుబయట పనిని మాన్పించడం లాంటివి అమలుచేయగా, అవి కొంతవరకు సత్ఫలితాలనిచ్చాయి.

ప్రపంచంలోని 1,500 ప్రాంతాలలో 1979 నుంచి 2019 వరకు చోటుచేసుకున్న విపరీత వాతావరణ పరిస్థితులను జర్మన్‌ శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఏడాది మొత్తమ్మీద విపరీతమైన వర్షపాతం ఉండే రోజులు పెరిగినప్పుడు ఆర్థిక వృద్ధి తగ్గిపోతున్నట్లు గుర్తించారు. వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు పంట దిగుబడులు పడిపోతున్నాయి. యాంత్రిక శక్తిమీద కాకుండా... కార్మికశక్తి మీద ఎక్కువగా ఆధారపడే భారత్‌ లాంటి దేశాల్లో భూతాపాన్ని, ఫలితంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అత్యవసరంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సమగ్ర ప్రణాళికల రూపకల్పన ద్వారా సమర్థమైన వ్యవస్థల ఏర్పాటు అత్యావశ్యకం. ప్రస్తుతం ఆర్థికపరమైన అడ్డంకులను సాకుగా చూపుతూ ప్రభుత్వాలు సరైన దృక్కోణంతో వ్యవహరించడంలేదనే విమర్శలున్నాయి. స్థానిక ప్రభుత్వాలు స్పందించి- ఎక్కడికక్కడ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ‘క్రౌడ్‌ ఫండింగ్‌’ ద్వారా విరాళాలు సేకరించి నష్ట నివారణ చర్యలు చేపట్టడంద్వారా కొంతమేర ఫలితాలను సాధించవచ్చనేది పర్యావరణ నిపుణుల మాట.

- కామేశ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డ్రాగన్‌ వైపు రష్యా మొగ్గు!

‣ క్షమాభిక్షలో తీవ్ర కాలయాపన

‣ దేశీయ ఆయుధ తయారీకి దన్ను

‣ అన్నదాత ఓటు ఎటు?

‣ అంతర్గత పోరులో మయన్మార్‌

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 11-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం