• facebook
  • whatsapp
  • telegram

తీరాలను మింగేస్తున్న కడలి

వాతావరణ మార్పుల ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ ఓడరేవుకు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పాడ గ్రామం సముద్ర పోటుకు గురవుతోంది. సముద్ర జలాలు అంతకంతకూ ముందుకు వస్తుండటం, కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో క్రమంగా గృహాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. కళింగపట్నం... శ్రీకాకుళం జిల్లాలో బ్రిటిష్‌ కాలం నుంచి ఉన్న ఓడరేవు, ప్రముఖ పర్యాటక స్థలం. అక్కడ సముద్రం తీవ్ర విలయాన్ని సృష్టిస్తోంది. ఊరిలోని రహదారులు, ఇతర నిర్మాణాలను కబళించి వేస్తోంది. ఓ ఆలయం, శ్మశానం సైతం కడలిలో మునిగిపోయాయి. పర్యాటకమూ బాగా దెబ్బతింది. ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతంలో తూర్పు, పశ్చిమ గోదావరులు, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం లాంటి జిల్లాల్లో పలు ప్రాంతాలు క్రమంగా సముద్రకోతకు గురవుతున్నాయి. ఏపీలోని తీరప్రాంతంలో దాదాపు 30శాతం వరకు సముద్రకోతకు గురయ్యే ప్రమాదం ఉందని చెన్నైలోని జాతీయ తీర పరిశోధన కేంద్రం (ఎన్‌సీసీఆర్‌) చెబుతోంది. ఒడిశా, పశ్చిమ్‌ బెంగాల్‌ వంటి రాష్ట్రాలూ అదే సమస్యతో సతమతం అవుతున్నాయి.

వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా సముద్రం రోజురోజుకూ ముందుకు చొచ్చుకురావడం, కెరటాలు ఎక్కువ ఎత్తులో విరుచుకు పడటంతో తీరప్రాంతాలకు పెనుముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కొన్నిచోట్ల ఆ ప్రభావం కనిపిస్తుండగా, రాబోయే రెండు మూడు దశాబ్దాల్లో పరిస్థితి మరింతగా విషమించడం ఖాయమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఇటువంటి ఇక్కట్లు సంభవిస్తున్నాయని, ఈ ప్రభావం తీరప్రాంతాల్లో దాదాపు 40శాతం ప్రజలపై ఉంటుందని అంటున్నారు. ఒడిశాలోని పూరి జిల్లాలో ఉదయకని ప్రాంతం శరవేగంగా కోతకు గురవుతోంది. 1999లో అక్కడ ఉన్నట్టుండి కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో చాలామంది ఇళ్లు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడకు సమీపంలోని ఛెనువా గ్రామవాసులైతే రెండుసార్లు తమ ప్రాంతాలను ఖాళీ చేశారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన గంజామ్‌ జిల్లాలోని రామాయపట్నం సైతం సముద్రుడి ఆగ్రహానికి గురయింది. అక్కడ దాదాపు పది గ్రామాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒడిశా తీర ప్రాంతంలోని 40శాతం గ్రామాలు సముద్రకోతకు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్నా, పాలకులు పట్టించుకోవడంలేదన్న విమర్శ ఉంది. కొంతమంది ప్రాణాలకు తెగించి అలాగే ఉండిపోగా, మరికొంతమంది వలస బాట పట్టారు. గంజాం జిల్లాకు చెందిన దాదాపు ఏడు లక్షల మంది వలస కార్మికులు సూరత్‌లోని వస్త్ర పరిశ్రమల్లో పని చేస్తున్నారు. ఇంకా బాలేశ్వర్‌, భద్రక్‌, జగత్‌సింగ్‌పుర్‌, పూరి జిల్లాల ప్రజలనూ కలిపితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ‘ఎయిడ్‌ ఎట్‌ యాక్షన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ చెబుతోంది. గంజాం జిల్లాలో వాతావరణ మార్పులవల్ల సముద్రం ముందుకొచ్చి, ఇళ్లు కొట్టుకుపోయి వలసలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయని బెర్హంపూర్‌ విశ్వవిద్యాలయంలో సముద్రశాస్త్ర అధ్యయన విభాగాచార్యులు ప్రతాప్‌ మొహంతి చెబుతున్నారు. సముద్ర కోతకు తోడు వర్షాభావం, వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం వంటి కారణాలూ వలసలకు ఊతమిస్తున్నట్లు విశ్లేషించారు. ఒడిశాలోని తీరం గరాటు ఆకారంలో ఉండటం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల కెరటాలు తీవ్రస్థాయిలో వచ్చి తీర ప్రాంతాలను అస్తవ్యస్తం చేస్తున్నట్లు వివరించారు. భూతాపంతో పాటు కడలి మట్టాలు పెరుగుతుంటే దేశంలోని తీరప్రాంతాల్లో సముద్ర కోతలు కూడా అధికమవుతున్నట్లు భువనేశ్వర్‌ ఐఐటీ పరిశోధకులు గుర్తించారు.

క్లైమేట్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ తదితర సంస్థలు భారత్‌లో 2021లో చేపట్టిన అధ్యయనం ప్రకారం, 2050 నాటికి వాతావరణ పరిస్థితుల కారణంగా నాలుగున్నర కోట్లమంది వలసబాట పట్టాల్సి వస్తుంది. వాతావరణ మార్పులవల్ల తీరప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చి పడవలు ధ్వంసం కావడం, ఇళ్లు కోల్పోవడం, పంటపొలాల నాశనమవడం వంటివి వలసలకు దారితీస్తున్నాయి. పశ్చిమ్‌ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయ జీవనోపాధి మార్గాలు ఇప్పుడు మనుగడలో లేకపోవడం, పేదరికం, మౌలిక సదుపాయాలు కొరవడటంవల్ల వలసలు తప్పడంలేదు. దేశవ్యాప్తంగా సముద్ర కోతలు ఎక్కువగా ఉన్న 98 హాట్‌స్పాట్లను ఎన్‌సీసీఆర్‌ గుర్తించింది. వాటిలో అత్యధికంగా తమిళనాడులో 28, పశ్చిమ్‌ బెంగాల్‌లో 16, ఆంధ్రప్రదేశ్‌లో ఏడు, ఒడిశాలో అయిదు, పుదుచ్చేరిలో మూడు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి, ఈ కోతల ప్రభావం నుంచి తీరప్రాంత వాసులను రక్షించేందుకు తగిన చర్యలు చేపట్టాలి. వారి జీవనోపాధులను సైతం పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది.

- కామేశ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రణాళిక కొరవడి... ప్రగతి తడబడి!

‣ యూపీలో భాజపా - ఎస్‌పీ మధ్య తీవ్ర పోటీ

‣ భూతాపం ఉత్పాదకతకు శాపం

‣ డ్రాగన్‌ వైపు రష్యా మొగ్గు!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 21-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం