• facebook
  • whatsapp
  • telegram

వన హననం... భవితకు ప్రమాదం

అంతర్జాతీయ అటవీ దినోత్సవం

ప్రపంచ దేశాల్లో వందల కోట్ల జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా అరణ్యాలపై ఆధారపడి జీవిస్తోంది. ప్రకృతి సంపదతోపాటు విశిష్టమైన జీవవైవిధ్యం కలిగిన అడవులు భూమిపై 80శాతం మేర వన్యప్రాణులు, వృక్షజాతులు, కీటకాలకు ఆవాసంగా ఉన్నాయి. వాతావరణ మార్పులకు దారితీసే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంతోపాటు జీవుల మనుగడకు అవసరమైన స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, ఔషధాలను అందించడంలో వనాలది విశేష పాత్ర. అడవుల్లో లభించే ఆహార, ఔషధ, కలపేతర ఉత్పత్తులద్వారా ఏటా భారీగా ఆదాయం సమకూరుతోంది. అటవీ వనరుల సేకరణ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు పూర్తిస్థాయి ఉపాధి పొందుతున్నారు. 75శాతం స్వచ్ఛమైన నీటి ప్రవాహాలకు అడవులే ఆధారంగా నిలుస్తున్నాయి. భూమిపై ఉన్న అటవీ ప్రాంతాల విశిష్టత, వాటి పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించేలా ఏటా మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవం జరుపుకొంటున్నాం.

లోపాలపై సమీక్ష అవసరం

అడవుల పరిరక్షణ విషయంలో ప్రపంచ దేశాల వేదికలపై భారతదేశ ప్రతినిధులు ఇచ్చే హామీలు ఆశాజనకంగా కనిపిస్తున్నా, దశాబ్దాలుగా క్షేత్రస్థాయిలో విధానాలు, చట్టాల అమలు తీరు అందుకు విరుద్ధంగా ఉంటోంది. పాలనా వ్యవస్థలు అడవిని ఒక ఆర్థిక వనరుగా పరిగణించి పరిరక్షణ, వాణిజ్య లాభాలపై గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. ఫలితంగా దశాబ్దాలుగా వనాల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం నామమాత్రం అవుతోంది. అడవుల రక్షణకు 10 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఓ బీట్‌ అధికారి చొప్పున నియమించాలని గతంలో జాతీయ అటవీ కమీషన్‌ సూచించింది. వనాల అభివృద్ధికి కేంద్రం, రాష్ట్రాల బడ్జెట్‌లలో నిర్దిష్టంగా నిధులను కేటాయించాలని సిఫార్సు చేసింది. అవేవీ అమలుకు నోచుకోలేదు. అడవుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలనే ఆశయంతో రెండు దశాబ్దాల క్రితం మొదలైన ఉమ్మడి అటవీ యాజమాన్యం, సామాజిక అటవీ యాజమాన్యం వంటి పథకాలు కనుమరుగయ్యాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం కొత్త జాతీయ అటవీ విధానం ముసాయిదాను ప్రకటించినా తరవాత పక్కన పెట్టేసింది. పర్యావరణ, అటవీ, వన్యప్రాణి సంరక్షణ, నీటి, వాయు కాలుష్య నియంత్రణ వంటి వేర్వేరు చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి సమగ్ర పర్యావరణ న్యాయ (నిర్వహణ) చట్టం తీసుకురావాలని సుబ్రమణియన్‌ కమిటీ కేంద్రానికి నివేదించింది. గతేడాది అటవీ పరిరక్షణ చట్టం-1980లో మార్పులు చేసి గనుల తవ్వకాలు, ప్రాజెక్టులకు అటవీ భూములిచ్చే ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు కేంద్రం ప్రయత్నించింది. వ్యతిరేకత రావడంతో ఆ తరవాత వెనక్కి తగ్గింది. అడవుల పరిరక్షణలో ముందుగా వ్యవస్థాగత లోపాలను విశ్లేషించుకోవాల్సి ఉంది. దేశవ్యాప్తంగా అడవితో మమేకమై జీవిస్తున్న స్థానికులను వనాల పరిరక్షణలో భాగస్వామ్యం చేయడానికి పటిష్ఠమైన కార్యాచరణ అమలు చేయాలి. అటవీ ఆధారిత ఉత్పత్తులే జీవనాధారంగా బతుకుతున్న ఆదివాసులు, ఇతర సమూహాలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలనే ఆశయంతో అటవీ హక్కుల గుర్తింపు చట్టం తెచ్చారు. దాని ప్రకారం వారికి కనీస హక్కులు దఖలు పరచడంలో అలసత్వం చోటుచేసుకుంది. ఫలితంగా ఆదివాసులు, అటవీ సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణం పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు తగిన చర్యలు చేపట్టాలి. 

దేశంలో భూమి లేని నిరుపేదలు అడవుల్లో కలపేతర ఉత్పత్తుల సేకరణ ప్రధాన జీవనాధారంగా బతుకుతున్నారు. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం మూడు కోట్ల మంది అసంఘటిత పేదలు ఏటా రమారమి రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన అటవీ ఫలసాయ ఉత్పత్తులను సేకరిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా అడవుల్లో లభించే సేంద్రియ ఉత్పత్తులైన తేనె, కరక్కాయ, కుంకుడు, నల్లజీడి గింజలతో పాటు చెట్ల వేర్లు, వృక్షాల బెరడు, ఇతర మూలికలు, పుష్పాలు వంటి ఔషధ ఉత్పత్తులు, గృహోపకరణాలు కలపేతర అటవీ ఫలసాయం కిందకు వస్తాయి. మొత్తం సేకరిస్తున్న ఉత్పత్తుల్లో 60శాతందాకా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇంతటి గిరాకీ ఉన్న ఈ ఉత్పత్తులను సేకరించే స్థానిక సమూహాలకు, ప్రభుత్వ వ్యవస్థలకు సరైన ఆదాయం సమకూరడం లేదు. ఏళ్ల తరబడి అటవీ, గిరిజన సంక్షేమ శాఖల మధ్య సమన్వయం, సహకారం కొరవడటం, మార్కెట్‌ వసతులు, రవాణా సౌకర్యాల కొరత మూలంగా పేదలు నామమాత్రం ధరలకే ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

లక్ష్య సాధనలో విఫలం

వనాలకు నష్టం వాటిల్లకుండా అటవీ ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్‌, అటవీ ఆధారిత కుటీర పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాష్ట్రాల్లో గిరిజన సహకార సంస్థ (జీసీసీ), గిరిజన మార్కెటింగ్‌ సహకార సమాఖ్య వంటి సంస్థలు ఏర్పాటయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో మినహా చాలా చోట్ల లక్ష్య సాధనలో అవి విఫలమయ్యాయి. అటవీ ఉత్పత్తులను సేకరించే వారికి శిక్షణ, మార్కెట్‌ వసతులు, మద్దతు ధర కల్పించే లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం మొదలైన వనధన్‌ కార్యక్రమమూ ఆశించిన లక్ష్యాలను అందుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అయిదేళ్ల క్రితం కేంద్రం వెదురును కలపేతర అటవీ ఫలసాయాల జాబితాలో చేర్చింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా వెదురు ద్వారా జీవనోపాధులను అభివృద్ధి పరిచేందుకు అవకాశాలున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. కలపేతర అటవీ ఫలసాయాల విషయంలో అటవీ, గిరిజన సంస్థలు నియంతృత్వ ధోరణి వీడి స్థానిక సమూహాల జీవనోపాధుల వృద్ధికి, తద్వారా అడవుల పరిరక్షణ, విస్తీర్ణం పెంపునకు కృషి చేస్తే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి.

విచ్చలవిడి నరికివేతతో వినాశనం

కొన్ని దశాబ్దాలుగా వేగంగా క్షీణిస్తున్న అడవులతో మానవాళి భవిత ప్రమాదంలో పడింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వనాలు వినాశనానికి గురవుతున్నాయని అంచనా. అడవులు క్షీణించడం మూలంగా జీవనోపాధులు, జలవనరులతో పాటు వాతావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. తుపానులు, భారీ వర్షాలు, వరదలు వంటి విపత్తులు ముప్పేట దాడి చేస్తున్నాయి. అడవుల పరిరక్షణకు నడుం కడుతున్నామంటూ ప్రపంచ దేశాలు పదేపదే చెబుతున్నా, విధానాల అమలు మాత్రం లోపభూయిష్ఠంగా ఉంటోంది. 2010-2020 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 47 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు తరిగిపోయాయని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) తేల్చి చెప్పింది. జాతీయ అటవీ సర్వే-2021 నివేదిక సైతం భారత్‌లో వనాల సుస్థిర ప్రగతిలో లోపాలను ఎండగట్టింది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కౌలురైతుకు కవుకు దెబ్బలు

‣ రసాయన దాడుల ముప్పు

‣ ఈశాన్యంలో వేళ్లూనుకొంటున్న భాజపా

‣ ఏడున్నర దశాబ్దాలుగా తప్పటడుగులే!

‣ సమగ్ర వికాసానికి ఆయువుపట్టు

‣ ఉత్తరాఖండ్‌లో కమల వికాసం

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 21-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం