• facebook
  • whatsapp
  • telegram

కాలుష్య భూతం.. ఉక్కిరిబిక్కిరవుతున్న భారతం

డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలకు బహుదూరం

కొవిడ్‌ సంక్షోభంలో లాక్‌డౌన్‌వల్ల కాస్త తగ్గిందనుకున్న వాయుకాలుష్యం మళ్ళీ బుసలు కొడుతోంది. ఒక ఘనపు మీటరు పరిధిలో అయిదు మైక్రోగ్రాములకు మించి పీఎం 2.5 ధూళికణాలు ఉండకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రమాణాన్ని నిర్దేశించింది. ఒక మైక్రో గ్రాము అంటే... గ్రాములో పది లక్షలోవంతు. 2021 సంవత్సరంలో భారత్‌లో ఒక్క నగరం సైతం ఆ ప్రమాణాన్ని అందుకోలేదు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తించిన అరియలూరు(తమిళనాడు)లోనే పీఎం 2.5 స్థాయి (2.5 మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణంలోని) ధూళికణాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిత ప్రమాణాలకు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక దిల్లీ అయితే ప్రపంచంలో ఉన్న రాజధాని నగరాలన్నింటినీ తలదన్ని కాలుష్యం విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ ఘనపు మీటరుకు పీఎం 2.5 స్థాయి ధూళికణాలు ఏకంగా 96.4 మైక్రోగ్రాములు ఉన్నట్లు నమోదైంది! అంటే ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల కంటే 19 రెట్లు ఎక్కువ! స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూఎయిర్‌ అనే సంస్థ మొత్తం 117 దేశాల్లోని 6,475 నగరాల్లో వాయునాణ్యత తీరును నిరంతరం పరిశీలిస్తూ ప్రతి సంవత్సరం ఇందుకు సంబంధించిన నివేదికలు వెల్లడిస్తోంది. 2021 సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ప్రపంచ వాయునాణ్యత నివేదికలో అత్యంత ఆందోళనకర వాస్తవాలు బయటపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. వీటిలో భారత్‌ అయిదో స్థానంలో నిలిచింది. ఇక్కడ సగటున పీఎం 2.5 స్థాయి 58.1 మైక్రోగ్రాములుగా లెక్కతేలింది. 76.9 మైక్రోగ్రాములతో అత్యంత కలుషిత దేశంగా బంగ్లాదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. తరవాతి స్థానాల్లో చద్‌ (75.9), పాకిస్థాన్‌ (66.8), తజికిస్థాన్‌ (59.1) ఉన్నాయి. హరిత విభాగంలో (అయిదు నుంచి పది మైక్రోగ్రాముల్లోపు పీఎం 2.5 గాఢత కలిగిన) 24 దేశాలు ఉన్నాయి. పూర్టోరికో, యూఎస్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, న్యూ కెలడోనియాల్లో మాత్రమే పీఎం 2.5 గాఢత అయిదు కంటే తక్కువగా నమోదైంది. అమెరికా, జర్మనీ, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌ లాంటి దేశాల్లోనూ 10-11 మధ్యనే పీఎం 2.5 గాఢత ఉండటంతో అక్కడి పరిస్థితి కొంతవరకు మెరుగ్గానే అనిపిస్తోంది.

వాహనాల నుంచే అత్యధికంగా...

భారత్‌లో పట్టణాల్లో పీఎం 2.5 ధూళికణాల్లో 20-35శాతం నేరుగా మోటారు వాహనాల నుంచే వస్తున్నాయని ఐక్యూఎయిర్‌ నివేదిక చెప్పింది. ఇండియాలో పాటిస్తున్న బీఎస్‌-4 వాహన ప్రమాణాలు యూరో6-1కు సమానంగా ఉన్నాయి. అయినా పాత వాహనాల వాడకం ఇంకా కొనసాగుతుండటం, వ్యవసాయంలోనూ యంత్రపరికరాల వాడకం పెరగడంతో కాలుష్యం ఇంతలంతలు అవుతోంది. దీనికితోడు పారిశ్రామికీకరణ, నగరీకరణ పెరగడం కాలుష్యానికి మరింత దోహదం చేస్తోంది. బహుళజాతి సంస్థల కార్యాలయాలన్నీ పెద్ద నగరాలకు రావడం, వాటిలో ఉద్యోగావకాశాల కోసం గ్రామాలు, పట్టణాల నుంచి నగరాలకు వలసలు, ఫలితంగా పెరుగుతున్న వాహన రద్దీ... వెరసి కాలుష్యాన్ని మరింత పెంచుతున్నాయి. పీఎం 2.5 ధూళికణాలను 24 గంటలకంటే తక్కువ సమయం పీలిస్తేనే గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు; ఉబ్బసం, ఇతర శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా శిశువులు, పిల్లలు, వయోవృద్ధులు, అప్పటికే గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ముప్పు తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం పాటు... అంటే కొన్ని నెలల నుంచి ఏళ్ల తరబడి ధూళికణాలు పీలిస్తే పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదల తీవ్రంగా ప్రభావితమవుతుంది. పెద్దవారిలో గుండె సమస్యలు, మానసిక సమస్యలూ తలెత్తే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితోపాటు బయటి వాతావరణంలో ఉండే వాయుకాలుష్యమే ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణమవుతోందని ‘ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ (ఐఏఆర్‌సీ)’ చెబుతోంది.

ప్రపంచంలోని వంద అత్యంత కలుషిత నగరాల్లో 63 భారత్‌లోనే ఉన్నాయి. దేశాల రాజధాని నగరాల్లో డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలను అందుకున్నవి నాలుగే. అవి కాన్‌బెర్రా (4.8), శాన్‌ జువాన్‌ (4.8), షార్లెట్‌ అమాలీ (4.5), నౌమియా (3.8). మధ్య, దక్షిణాసియాలోని 15 అత్యంత కలుషిత నగరాల్లో 12 భారత్‌లోనే ఉన్నాయి. వాటిలో రాజస్థాన్‌లోని భివాడీ 106.2 మైక్రోగ్రాముల స్థాయితో అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌లోని ఆరు ప్రధాన నగరాల్లో చూస్తే ఒక్క చెన్నైలో మాత్రమే గత సంవత్సరం నాటి 26.5కంటే కాస్త తగ్గి 25.2కు చేరింది. ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లోనూ కాలుష్యం ఎంతోకొంత పెరిగింది. వీటిలో కోల్‌కతాలో అత్యధికంగా 26.6శాతం పెరిగింది. దిల్లీలో నెలవారీగా చూసినప్పుడు సెప్టెంబరులో అత్యల్పంగా 30.2, నవంబరులో అత్యధికంగా 224.1 చొప్పున పీఎం2.5 గాఢత నమోదైంది. హైదరాబాద్‌లో జులై నెలలో అత్యల్పంగా 12, డిసెంబరులో అత్యధికంగా 68.4 చొప్పున ఉంది. ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌ నాలుగో స్థానంలో నిలిచింది.

భావి తరాలకు ముప్పు

దేశంలోని 122 నగరాల్లో వాయునాణ్యతను మెరుగుపరచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2019లోనే జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం(ఎన్‌కాప్‌)ను ప్రారంభించింది. ఈ నగరాలన్నింటిలో 2024 నాటికి పీఎం గాఢతను 20-30శాతం మేర తగ్గించాలన్నది లక్ష్యం. నగరాలు, ప్రాంతాలు, రాష్ట్రాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి, వాయునాణ్యతను సాధించాలని భావించారు. ఈ కార్యక్రమం ఇప్పటివరకూ ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వలేదు. వాయుకాలుష్య ఉద్గారాలను గణనీయంగా తగ్గించాలి. లేకపోతే భావితరాలు ఆక్సిజన్‌ సిలిండర్లు మోసుకుంటూ తిరగాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత, పారిశ్రామిక అవసరాలకు వాడే వాహనాల నుంచి ఉద్గారాల విడుదలను కఠినంగా నియంత్రించాలి. విద్యుదుత్పత్తికి బొగ్గు వాడకం తగ్గించి, పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకోవాలి. ప్రజారవాణాకూ పునరుత్పాదక విద్యుత్‌ వాహనాలనే ఉపయోగించాలి. పాదచారులను, సైకిళ్లపై వెళ్ళేవారిని ప్రోత్సహించాలి. ప్రపంచ ఆరోగ్యసంస్థ 2021లో విడుదల చేసిన వాయునాణ్యత మార్గదర్శకాలను అందుకోవడానికి వీలైనంతవరకు ప్రయత్నం చేయాలి. వీటన్నింటినీ కచ్చితంగా పాటిస్తేనే- మన భావితరాలకు వాయుకాలుష్య ముప్పునుంచి కొంతయినా ఉపశమనం దక్కుతుంది!

ప్రత్యామ్నాయాలు అవసరం

భారత్‌లో వాయుకాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రైవేటు రంగానికీ భాగస్వామ్యం కల్పించి, హరిత ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హరిత పర్యావరణంకోసం పెద్దయెత్తున నిధులు కేటాయించాలి. దానివల్ల వాయు కాలుష్యంతో పాటు వాతావరణంలో చోటు చేసుకుంటున్న విపరిణామాలనూ కొంతవరకు ఎదుర్కోవచ్చు. శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించి, పునరుత్పాదక ఇంధన వనరులతో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ప్రాధాన్యమివ్వాలి. ఎలెక్ట్రిక్‌ వాహనాల విక్రయాలను ప్రోత్సహించాలి.

- రఘురామ కామేశ్వరరావు పువ్వాడ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రాంతీయ సహకారానికి బిమ్‌స్టెక్‌ భరోసా

‣ మాల్దీవుల్లో చైనా చిచ్చు

‣ శ్రామిక సంక్షేమానికి భరోసా

‣ ఒప్పందాలకు తిలోదకాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 02-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం