• facebook
  • whatsapp
  • telegram

జల సంరక్షణకు జన భాగస్వామ్యం

సమర్థ నిర్వహణతోనే భవితకు భరోసా

ప్రకృతికి, మానవాళికి ప్రధాన చోదకశక్తి నీరే. కానీ, జనాభా పెరుగుదల, పట్టణీకరణ, కాలుష్యం, వాతావరణ మార్పులతో జల వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. తద్వారా నీటికి కొరత ఏర్పడి, అభద్రతకు దారితీస్తోంది. ఇండియాలో వర్షపాతం రుతుపవనాలతో ముడివడి ఉంది. కానీ ప్రాంతాలను బట్టి ఏటా రుతుపవనాల్లో మార్పులు సంభవిస్తున్నాయి. తద్వారా భూగోళమంతటా క్షామం తాండవించే పరిస్థితులు నెలకొంటున్నాయని ‘కరవు ముందస్తు హెచ్చరిక వ్యవస్థ’ నివేదిక వెల్లడించింది. భారతదేశంలో ఏటా సుమారు 1,200 మిల్లీమీటర్ల వర్షపాతం- వంద రోజుల్లో కురుస్తోంది. ఆ నీటిని సంరక్షించుకోకపోవడంతో ఏటా కొరత తప్పడంలేదు. ప్రజలంతా రుతుపవనాలు, భూగర్భ జలాలపై ఆధారపడటంతో నీటి సమస్య తీవ్రతరమవుతోంది. భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం కూడా నీటి కటకటకు ప్రధాన కారణం. అతిపెద్ద సంక్షోభాల్లో నీటి సమస్య మూడోస్థానానికి చేరిందని ప్రపంచ ఆర్థిక వేదిక లోగడ తెలిపింది. ఇజ్రాయెల్‌లో తక్కువ వర్షపాతం ఉన్నా, సమర్థ నిర్వహణతో ఆ దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది.

భారత్‌లో 2030నాటికి నీటి అవసరాలు రెట్టింపై, స్థూల జాతీయోత్పత్తిలో ఆరుశాతం నష్టం ఏర్పడనుందని నీతి ఆయోగ్‌ మదింపు వేసింది. నీటి సంరక్షణకు ఒక డాలర్‌ ఖర్చు చేస్తే, ప్రతిఫలంగా 6.80డాలర్లు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. భూగర్భ జలాలు భూగోళంపై ఎంతటి ప్రభావవంతమైన పాత్రను పోషిస్తాయో అవగాహన కల్పించి, సంరక్షించాలని ఐక్యరాజ్య సమితి పిలుపిస్తోంది. భారత్‌లో తలసరి వార్షిక నీటి లభ్యత 1951లో 5,177 ఘనపు మీటర్లు. 2050నాటికి అది 1,140 ఘనపు మీటర్లకు కుదించుకుపోనుందని ప్రభుత్వ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో భారత్‌ వాటా సుమారు 18శాతం. జల వనరుల్లో వాటా నాలుగు శాతమే. భారత్‌లో ఏటా వర్షంద్వారా, మంచు కరగడంవల్ల ఉత్పన్నమయ్యే నీరు 4000 బిలియన్‌ ఘనపు మీటర్లు (బీసీఎం) అని అంచనా. అందులో 53శాతం ఆవిరైపోతోంది. 1,869 బీసీఎంల నీరు మాత్రమే మిగులుతోంది. మిగిలిన నీటిలో భౌగోళిక పరిస్థితుల రీత్యా 40శాతం నిరుపయోగమవుతోంది. చివరికి 1,123 బీసీఎంల నీటి వనరులు మాత్రమే వినియోగానికి అందుబాటులో ఉన్నాయి. ఇందులో 690 బీసీఎంలు ఉపరితల జలాలు. 433 బీసీఎంలు భూగర్భ జలాలు. విశాల ప్రయోజనాలు, న్యాయపరమైన విధివిధానాలతో సహజ వనరైన నీటి భద్రత, పరిరక్షణ, క్రమబద్ధీకరణ, యాజమాన్యం మీద దృష్టి సారించాలని డాక్టర్‌ మిహిర్‌ షా కమిటీ సిఫార్సు చేసింది. జల సంరక్షణ, భద్రతే ధ్యేయంగా కేంద్రం జలశక్తి అభియాన్‌ను అమలు చేస్తోంది. ‘ఎప్పుడు, ఎక్కడ వర్షం కురిసినా ఒడిసి పట్టండి’ అనే నినాదంతో ప్రభుత్వం జల సంరక్షణకు నడుం బిగించింది. ఉపాధిహామీ పథకం నిధుల సంపూర్ణ వినియోగంతో భూగర్భ జలాలను పెంచే పనులను చేపట్టేందుకు కృషి చేస్తోంది. కానీ, పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. నీతి ఆయోగ్‌ సంయుక్త నీటి యాజమాన్య సూచీ ప్రకారం- గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు జల వనరులను సమర్థంగా వినియోగించుకొంటున్నాయి. కానీ, మేఘాలయ, ఉత్తరాఖండ్‌, నాగాలాండ్‌ రాష్ట్రాలు అసమర్థ నిర్వహణతో వెనకంజలో ఉన్నాయి.

దేశంలో తాగునీటి కోసం 85శాతం భూగర్భ జలాలనే వినియోగిస్తున్నారు. మొత్తం సాగునీటిలో భూగర్భ జలాల వాటా సుమారు 65శాతం. వ్యవసాయ రంగానికి అత్యధికంగా నీటిని వాడుతున్నారు. అందుకే నీటి వినియోగాన్ని తగ్గించడానికి సూక్ష్మ సేద్యాన్ని విస్తరించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ, ఆశించిన పురోగతి లేకపోవడం విచారకరం. ప్రధానమంత్రి కృషి సించాయ్‌, అటల్‌ భూజల్‌ యోజన వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి. బిందు తుంపర్ల సేద్యం, శ్రీ విధానంలో వరి చెరకు సాగు చేపట్టడం ద్వారా నీటి వాడకాన్ని తగ్గించాలి. నీటి సరఫరా పథకాల నిర్వహణ, యాజమాన్య పద్ధతులను బలోపేతం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు లోబడి- సురక్షిత జల ప్రణాళికను సిద్ధం చేయాలి. విద్యార్థి దశ నుంచే నీటి సంరక్షణ ప్రాధాన్యాన్ని పౌరులకు తెలియజేయాలి. ఒకసారి వినియోగించిన నీటిని శుద్ధి చేసి, తిరిగి వాడటంపై స్థానిక ప్రభుత్వాలు దృష్టి సారించాలి. నీటి సంరక్షణలో ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీలన్నీ క్రియాశీలక పాత్రపోషించాల్సిన అవసరం ఉంది. ఇందులో ప్రైవేటు సంస్థలు, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. నీటిని సృష్టించలేం కానీ, సంరక్షించుకోగలమన్న సృహను ప్రజల్లో కలిగించాలి. జలవనరుల నిర్వహణలో అందరూ బాధ్యత వహించినప్పుడే భూగర్భజలాల సంరక్షణ సాధ్యమవుతుంది. మానవాళి భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది!

- ఎ.శ్యామ్‌కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నేత మారినా... కథ అదేనా?

‣ మానవ మనుగడకు గొడ్డలిపెట్టు

‣ షాంఘైలో ఆకలి మంటలు

‣ ఆర్థిక సంక్షోభంలో పాక్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 19-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం