• facebook
  • whatsapp
  • telegram

కళ తప్పుతున్న జీవవైవిధ్యం

మానవ కార్యకలాపాలే భూమికి శాపం

మానవ పరిసరాలు, అడవులు, ఇతర జీవజాలాన్ని కాపాడుకోవడానికి ఆవాస స్థాయి నుంచి అంతర్జాతీయ ధరిత్రీ సదస్సుల వరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ భరించలేని వేసవి ఉష్ణోగ్రతలు, అనావృష్టి, అతివృష్టి లేదా అకాల వర్షాలు, వరదలు, కరవు తదితరాలు ఇటీవలి కాలంలో అధికమవుతున్నాయి. రుతువుల్లో వస్తున్న విపరీత మార్పులను గమనిస్తే- పర్యావరణ పరిరక్షణకు చేయాల్సింది ఇంకా చాలా ఉందని అర్థమవుతుంది.

మనుగడకు ముప్పు

ప్రస్తుతం భూమ్మీద 10-14 లక్షల జీవజాతులు ఉన్నట్లు అంచనా. వాటిలో కేవలం సుమారు లక్షా ఇరవై వేల జాతులను మాత్రమే గుర్తించి నమోదు చేయగలిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మానవ కార్యకలాపాల మూలంగా గడచిన వందేళ్లలో దాదాపు అయిదు వందల జాతులు నశించిపోయాయని, మరో 500 జాతులు రాబోయే 20 ఏళ్లలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఎర్త్‌.ఆర్గ్‌ సంస్థ చెబుతోంది. విభిన్న ప్రాంతాల్లోని భూనైసర్గికత, వాతావరణాలకు అనుగుణంగా పలురకాల జీవులు, మొక్కలు వృద్ధి చెందాయి. మితిమీరిన మానవ చర్యలతో జీవవైవిధ్యం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇతర జీవుల ఆవాసాలను నాశనం చేస్తూ, వాటిని తమ అవసరాలకోసం మానవులు విశృంఖలంగా ఉపయోగించుకుంటున్నారు. ఆ క్రమంలో గాలి, నీరు, ధ్వని కాలుష్యాలకు విపరీతంగా పాల్పడుతున్నారు. ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్‌లతో భూమిని నింపేస్తున్నారు. ఆయా చర్యలు మానవజాతి మనుగడకూ ముప్పుగా పరిణమిస్తున్నాయి. స్థానిక జీవజాలాన్ని, ఆవరణ వ్యవస్థలను దెబ్బతీస్తూ భూతాపానికి, శీతోష్ణస్థితి మార్పులకు కారణమవుతున్నాయి. ఒక్క వాయు కాలుష్యం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఏటా 42లక్షల నుంచి 72లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం చాటుతోంది.

కొవిడ్‌-19 వంటి మహమ్మారులను కలిగించే వైరస్‌లు కాలుష్యకారక వాయువులు, కణాలపై చేరి వ్యాప్తి చెందుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలోకి అధికంగా విడుదలవుతున్న గ్రీన్‌హౌస్‌ వాయువులు భూమి ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి. దాంతో హిమానీ నదాలు కరిగి, సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. ఫలితంగా తీరప్రాంతాలు, వాటిలోని ఆవాసాలు ముంపునకు గురవుతాయి. సముద్రమట్టాలు ఏడాదికి 3.2 మిల్లీమీటర్ల వంతున పెరుగుతున్నాయని, 2100 సంవత్సరం నాటికి 0.2 నుంచి రెండు మీటర్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో 48 కోట్ల వరకు తీరప్రాంత జనాభా నిర్వాసితులయ్యే ప్రమాదం ఉందని, సమీప ప్రాంతాలకు వారి వలస కారణంగా అక్కడి వనరులూ తీవ్రఒత్తిడికి గురవుతాయని క్లైమేట్‌ సెంట్రల్‌ సంస్థ విశ్లేషిస్తోంది. పంటల్లో చీడపీడలకు, తెగుళ్లకు కారణమవుతున్న వాతావరణ మార్పులతో పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. అడవుల్లో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. భూతాపం మూలంగా సముద్ర జలం ఆమ్లపూరితమవుతోంది. భూమి ఎదుర్కొంటున్న ముప్పుల్లో మరో ప్రధానాంశం... ప్లాస్టిక్‌ వాడకం. 1950లలో ప్రపంచం సాలీనా 20లక్షల టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేయగా, 2015 నాటికే అది 42కోట్ల టన్నులకు చేరింది. తయారవుతున్న ప్లాస్టిక్‌లో సింహభాగం పునర్వినియోగానికి నోచుకోవడం లేదు. అంటే, అదంతా భూమిపై, సముద్రంలో పేరుకుపోతోందన్న మాట! ఏటా సుమారు 1.10కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ సముద్రాన్ని చేరుతోందని ప్రసిద్ధ సైన్స్‌ జర్నల్‌ ‘ద నేచర్‌’ లోగడ వెల్లడించింది.

పరిసరాల సంరక్షణ కీలకం

ప్రకృతి విపత్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు భూగ్రహం నివాసయోగ్యతను పరిరక్షించడానికి అందరూ నడుం బిగించడం తక్షణావసరం. ప్యారిస్‌ ఒప్పందం ప్రకారం భూతాపం కట్టడికి ప్రపంచ దేశాలు చిత్తశుద్ధితో కృషిచేయాలి. అడవులను పెంచడం, ఉన్న వాటిని సంరక్షించడం, అన్నిరకాల కాలుష్యాలను కట్టడిచేయడం, ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడం, పునర్వినియోగం వంటివీ తప్పనిసరి.  వ్యక్తిగత స్థాయిలో ప్రతి ఒక్కరూ తమవంతుగా మొక్కలు పెంచడానికి కంకణబద్ధులు కావాలి. పాలిథీన్‌ సంచులను పూర్తిగా పక్కనపెట్టాలి. స్థానికసంస్థలు తమ గ్రామ, ఆవాస ప్రాంత పరిధిలో పరిమితంగానైనా సరైన రీతిలో వ్యర్థాల నిర్వహణ, మొక్కలపెంపకం వంటి వాటిని చేపట్టవచ్చు. ప్రజలు, ముఖ్యంగా విద్యార్థుల్లో భూమి ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాల మీద అవగాహన కల్పించాలి. పరిసరాల సంరక్షణను దృష్టిలో పెట్టుకొనే- ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలి. కాలుష్య నియంత్రణ వ్యవస్థలను పటిష్ఠంచేసి, చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించాలి. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా వాహన ఉద్గారాలను తగ్గించవచ్చు. హరిత వనాలు, వన్యప్రాణుల సంరక్షణ ద్వారా జీవవైవిధ్యానికి ప్రోదిచేయడానికి పటిష్ఠచర్యలు తీసుకుంటేనే- జీవానికి ఆలంబనగా భూమి మనగలదు.

- ఎం.రామ్‌మోహన్‌

(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విశ్వసనీయ బంధానికి బాటలు

‣ పాక్‌ స్నేహ పల్లవి

‣ ఆర్థిక వృద్ధికి ద్రవ్యోల్బణం దెబ్బ

‣ సరిహద్దుల్లో సం‘గ్రామాలు’

‣ క్షేత్ర పాలన... ప్రజాస్వామ్యానికి ఆలంబన!

‣ కశ్మీరంలో ప్రగతి సమీరం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 30-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం