• facebook
  • whatsapp
  • telegram

సహ్యాద్రి... జీవవైవిధ్యానికి పెన్నిధి!

మానవ కార్యకలాపాలతో పెనుముప్పు

జీవవైవిధ్యానికి ఆలవాలాలుగా నిలుస్తూ, పర్యావరణానికి ఊతమిస్తున్న అమెజాన్‌ అడవులను ప్రపంచానికి ఊపిరితిత్తులుగా వ్యవహరిస్తారు. పశ్చిమ కనుమలు సైతం దక్షిణ భారత దేశానికి అంతే కీలకమైనవి. వాటిని సహ్యాద్రి పర్వతాలనీ పిలుస్తారు. భారత్‌లోని పర్యావరణ, జీవావరణ వ్యవస్థలపై ఎంతో ప్రభావం చూపే సహ్యాద్రి శ్రేణుల్ని జీవవైవిధ్యానికి నిధిగా అభివర్ణిస్తారు. ఈ కనుమలు 1.60 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో భారత భూభాగంలో అయిదు శాతాన్ని ఆక్రమిస్తున్నాయి. వాటిని ప్రపంచంలో అతి ముఖ్యమైన ఎనిమిది జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లలో ఒకటిగా యునెస్కో గుర్తించింది. గడచిన అయిదు దశాబ్దాల్లో పశ్చిమ కనుమల్లో అటవీ విస్తీర్ణం నానాటికీ తగ్గుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

పశ్చిమ కనుమల విస్తీర్ణంలో కర్ణాటకదే సింహభాగం. వాటి విధ్వంసంలోనూ కర్ణాటక ముందుంది. తెలుగు రాష్ట్రాలకు వరదాయనులైన గోదావరి, కృష్ణాలతోపాటు కావేరి, పెరియార్‌, తామ్రపర్ణి, నేత్రావతి తదితర నదులన్నీ పశ్చిమ కనుమల్లోనే ఉద్భవిస్తాయి. భారతదేశంలో నాలుగోవంతు వర్షపాతానికి పశ్చిమ కనుమల్లో విస్తరించి ఉన్న పచ్చదనమే కారణం. సుమారు అయిదు వేల వృక్షజాతులు వాటిలో విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో కనిపించే జీవ వైవిధ్యమూ ప్రత్యేకమైనది. ఆ అడవులు నానాటికీ తరిగిపోతుండటంతో జీవవైవిధ్యం ప్రమాదంలో చిక్కుకొంది. పశ్చిమ కనుమల విధ్వంసం బ్రిటిష్‌ కాలంలోనే ఆరంభమైంది. తేయాకు, కాఫీ, రబ్బరు పంటల సాగుకు పెద్దయెత్తున అడవుల విధ్వంసం జరిగింది. గనులకోసం కనుమలను తవ్వేశారు. స్వాతంత్య్రం అనంతరమూ ఆ విధ్వంసం కొనసాగింది.

థర్మల్‌, జల విద్యుత్తు కేంద్రాల ఏర్పాటు, రోడ్లు, రైల్వే లైన్ల నిర్మాణం, సహజ వనరుల విధ్వంసాలతో పశ్చిమ కనుమల పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. కొన్నేళ్లుగా ఆ విధ్వంసం పతాక స్థాయికి చేరింది. పశ్చిమ కనుమల్లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని 2019 కేరళ వరదల సమయంలో ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్‌ గాడ్గిల్‌ వ్యాఖ్యానించారు. ఆయన నేతృత్వంలోని పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల బృందం రూపొందించిన నివేదిక 2011లోనే సహ్యాద్రి శ్రేణుల పరిరక్షణకు పలు సూచనలు చేసింది. నిర్దేశిత ప్రాంతాల్లో ఖనిజాల తవ్వకాలు, నూతన ఆర్థిక మండళ్ల ఏర్పాటు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం, అటవీ భూములను అభివృద్ధి కార్యక్రమాలకు బదిలీ చేయడం పూర్తిగా ఆపివేయాలని నివేదిక సూచించింది. పూర్తిగా పర్యావరణంపైనే దృష్టి సారించిందంటూ ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాయి. దాంతో కేంద్రం 2012లో కస్తూరి రంగన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. పశ్చిమ కనుమల్లో 37శాతం భూభాగాన్ని పర్యావరణపరంగా సున్నిత ప్రాంతంగా గుర్తించాలని రంగన్‌ కమిటీ సిఫార్సు చేసింది. గనుల తవ్వకాలపై నిషేధం విధించాలనీ చెప్పింది. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ ఆ నివేదికను ఆమోదించింది. ఆ మేరకు పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 కింద దాదాపు 56,825 చ.కి.మీ. విస్తీర్ణంలో పశ్చిమ కనుమలను సున్నిత ప్రాంతంగా గుర్తిస్తూ ముసాయిదా ప్రకటనను విడుదల చేసింది. కరోనా కారణంగా కొత్త నిబంధనలను నోటిఫై చేయడానికి ఈ ఏడాది జూన్‌ 30దాకా గడువును పొడిగించింది.

గతేడాది డిసెంబర్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై- కస్తూరి రంగన్‌ కమిటీ నివేదిక అమలును నిరాకరించారు. ఆ సిఫార్సులను అమలుచేస్తే సహ్యాద్రి శ్రేణుల్లో నివసించే స్థానికుల మనుగడకే ముప్పు వాటిల్లుతుందని ఆయన వాదిస్తున్నారు. గనుల తవ్వకాల కోసమే కమిటీల సిఫార్సుల్ని కేరళ, కర్ణాటక ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. మరోవైపు మానవ కార్యకలాపాలతో వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నాయి. ప్రజల జీవనోపాధులను, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. విపత్తుల అనంతరం పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ కోసం చేసే ఖర్చుతో పోలిస్తే ‘పరిరక్షణ’ అనేది తక్కువ వ్యయంతో కూడిన వివేకవంతమైన చర్యగా బెంగళూరులోని ‘పర్యావరణ శాస్త్రాల కేంద్రం’ స్పష్టం చేసింది. పశ్చిమ కనుమలను ధ్వంసం చేయడం వల్ల దక్షిణాది మొత్తానికీ నష్టం వాటిల్లుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం భావితరాలను దృష్టిలో ఉంచుకొని కఠిన నిర్ణయాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. సహ్యాద్రి శ్రేణుల పరిరక్షణకు ఉద్యమ ప్రాతిపదికన కదలాలని కోరుతున్నారు.

- జి.శ్రీనివాసు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సముద్రాలకు ప్లాస్టిక్‌ గండం

‣ అంతరిక్షంలో ఆధిపత్య పోరు

‣ పంటలకు భానుడి సెగ

‣ కల్తీని పారదోలితేనే ఆరోగ్య భారతం

‣ సవాళ్లు అధిగమిస్తేనే సమ్మిళిత అభివృద్ధి

‣ బొగ్గు కొరతతో విద్యుత్‌ సంక్షోభం

‣ ఖలిస్థానీ ముఠాలకు ఐఎస్‌ఐ దన్ను

Posted Date: 13-06-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం