• facebook
  • whatsapp
  • telegram

వాతావరణ మార్పులు.. జనజీవనం తలకిందులు

వాతావరణ మార్పులు మానవ సమాజాలను, ఆర్థిక వ్యవస్థలను తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయన్నది సుస్పష్టం. గతంలో వరదలు, నదీ ప్రవాహ గతుల మార్పులు- అనేక నాగరికతలు అంతరించిపోవడానికి కారణమయ్యాయి. అయినా అభివృద్ధి యావలో పడిన మానవాళి ముంచుకొస్తున్న ముప్పును గ్రహించలేకపోతోంది. ఇప్పటి నుంచే జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని విస్మరిస్తోంది.

ప్రపంచమంతటా వాతావరణ వైపరీత్యాలు సంభవించినా అవి మన దృష్టిని అంతగా ఆకర్షించలేకపోయాయి. అవి ఎక్కడో దూరాన జరిగిన ఘటనలు కాబట్టి మనదాకా రావనే నిర్లిప్తత దీనికి కారణం. కానీ, శాస్త్రీయ దృష్టితో చూస్తే పరిస్థితి ఇప్పటికే అదుపు తప్పిపోయిందని అర్థమవుతుంది. పరిస్థితుల తీవ్రతను గమనించకుండా, సత్వర కార్యాచరణకు ఉపక్రమించకుండా తాత్సారం చేస్తున్నాం. ఫలితంగా వాతావరణ మార్పులు ఉత్పాత స్థాయికి పెరిగిపోతున్నాయి.

కరిగిపోతున్న హిమనదాలు

హిమనదాలు కరిగిపోవడం వల్ల వచ్చిపడిన వరదలు పొరుగున పాకిస్థాన్‌లో మూడో వంతు భూభాగాన్ని ముంచెత్తాయి. రేపోమాపో హిమాలయాల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తి, భారత్‌ వరద విలయాన్ని చవిచూడవలసి రావచ్చు. పాక్‌లో ఉన్నఫళాన 75 శాతం అధిక వర్షపాతం నమోదవడమే వరద బీభత్సానికి కారణమని ప్రపంచ వాతావరణ శాస్త్రజ్ఞుల బృందం అంచనా వేసింది. మరో అంచనా ప్రకారం, లా నినా మూడేళ్లపాటు కొనసాగడం పాక్‌లో భారీ వర్షాలకు కారణం. భారత ఉపఖండంలో గడచిన 70 ఏళ్లలోలా నినా ఇలా రెండేళ్ల కంటే ఎక్కువ కాలం ఉండటం ఆరుసార్లు సంభవించింది. లా నినా వల్ల భారత్‌లో అధిక వర్షపాతం సంభవిస్తే ఉత్తర అమెరికా, ఐరోపాలలో తీవ్ర వర్షాభావం నెలకొంటుంది. 1836లో వాతావరణ రికార్డులు మొదలైనప్పటి నుంచి ఎన్నడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రత బ్రిటన్‌లో ఈ ఏడాది నమోదైంది. లా నినా వల్ల ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాల్లో ఆహార ధాన్యాలు, పొద్దు తిరుగుడు, సోయా బీన్‌ పంటల దిగుబడి ఎనిమిది నుంచి తొమ్మిది శాతం క్షీణిస్తుందని ఈయూ సంయుక్త పరిశోధక బృందం లెక్కగట్టింది. అమెరికాలో తీవ్ర అనావృష్టి వల్ల అక్కడి జలాశయాల్లో ఇప్పుడు కేవలం 40 శాతం నీరు మాత్రమే ఉంది. ఐరోపాలో ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌ వంటి ఏడు దేశాలగుండా విస్తరించిన ఆల్ప్స్‌ పర్వతాలలో హిమనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. గత 500 ఏళ్లలో ఎన్నడూ ఎరగని తీవ్ర అనావృష్టి వల్ల ఐరోపాలో నదులు ఎండిపోయాయి. ఐరోపా, బ్రిటన్‌లలో 63 శాతం భూభాగంలో వర్షాలు లేవు. ఐరోపా దేశాల్లో 1800 మైళ్ల పర్యంతం ప్రవహించే డాన్యూబ్‌ నదిలో నీటి మట్టం అడుగుకు పడిపోయింది. దీని పరీవాహక ప్రాంతం ఎనిమిది లక్షల చదరపు కిలోమీటర్లు. అది ఐరోపా భూభాగంలో 10 శాతానికి సమానం. నదీ ప్రవాహాలు వట్టిపోవడంతో జల విద్యుదుత్పాదన 20 శాతంమేర పడిపోయింది. ఇప్పటికే రష్యా నుంచి సహజ వాయు సరఫరా నిలిచిపోవడంతో ఐరోపా గృహాలు, పరిశ్రమలు తీవ్ర విద్యుత్‌ కోతలను ఎదుర్కొంటున్నాయి. ఐరోపా నదులు ఎండిపోవడంతో రెండో ప్రపంచ యుద్ధంనాటి పడవలు, నౌకలు బయటపడుతున్నాయి. జలరవాణా కోసుకుపోవడంతో ఐరోపాకు 8,000 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం సంభవించింది. నదులు, ఉపనదుల్లో ప్రవాహాలు అడుగంటినందు వల్ల తాగునీటి సరఫరాకు కోత పెట్టాల్సి వస్తోంది. రియాక్టర్లను చల్లబరచేందుకు అవసరమైన నీరు లేక అణు విద్యుత్కేంద్రాన్ని మూసివేయాల్సి రావచ్చని ఫ్రాన్స్‌ తన ప్రజలకు వివరించింది. ఇలా... వాతావరణ మార్పులు వ్యవసాయ, ఆర్థిక రంగాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.

పునరుత్పాదక ఇంధనాలకూ దెబ్బ

వాతావరణ మార్పులు ప్రపంచాన్ని కష్టాల్లోకి నెడుతున్నాయి. కర్బన ఉద్గారాలు పెరిగినందువల్ల ఉత్తర, దక్షిణ ధ్రువాలు వేడెక్కి గాలులు వీచే వేగం తగ్గిపోతోంది. 2100కల్లా సగటు వార్షిక గాలి వేగం 10 శాతంమేర తగ్గిపోవచ్చని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఐపీసీసీ అంచనా వేసింది. ధ్రువాల్లో మంచు వేగంగా కరిగిపోతున్నందువల్ల గాలి వేగం ఇంతకన్నా ఎక్కువగానే పడిపోయే అవకాశం ఉంది. 1979 నుంచి ఆర్కిటిక్‌ మిగతా ప్రపంచంకన్నా నాలుగు రెట్లు ఎక్కువగా వేడెక్కిపోతోందని విఖ్యాత విజ్ఞానశాస్త్ర పత్రిక ‘నేచర్‌’లో ప్రచురితమైన వ్యాసం వెల్లడించింది. మున్ముందు ప్రపంచంలో కొన్ని చోట్ల గాలుల వేగం పెరిగితే, ఇతర చోట్ల తగ్గిపోవచ్చు. ఫలితంగా భారత ఉపఖండానికి రుతుపవనాలను తీసుకొచ్చే గల్ఫ్‌ స్ట్రీమ్‌ వాయు ప్రవాహం ప్రతికూల మార్పులకు గురికావచ్చు. ప్రపంచమంతటా కొన్నిచోట్ల తీవ్ర అనావృష్టి సంభవిస్తే ఇతర చోట్ల పెను తుపానులు విజృంభించవచ్చు. వాతావరణం వేడెక్కడంతో నీరు వేగంగా ఆవిరైపోయి కొన్ని చోట్ల కుంభవృష్టి, ఇతర చోట్ల వర్షాభావానికి దారితీయవచ్చు. ఇదంతా తీవ్ర ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది. గాలి వేగం మందగిస్తే నౌకలు, విమానాలు సరిగ్గా కదలలేకపోతాయి. అంతేకాదు- గాలి వేగం తగ్గిపోయినప్పుడు పవన విద్యుదుత్పత్తి 10 నుంచి 20 శాతం వరకు కోసుకుపోతుంది. అంటే, వాతావరణ మార్పుల నిరోధానికి పునరుత్పాదక ఇంధన వనరులపై ఆధారపడటం కష్టమవుతుంది. 24 శాతందాకా బ్రిటిష్‌ విద్యుత్‌ అవసరాలను పవన విద్యుత్తే తీరుస్తోంది. ఆ లెక్కన ఆ దేశానికి ఎంత ఆర్థిక నష్టం సంభవిస్తుందో అంచనా వేసుకోవచ్చు. హిమాలయ మంచు, రుతు పవనాల మీద ఆధారపడిన భారత్‌ వంటి దేశానికి ముప్పు మరింత ఎక్కువగా ఉంది. ఇండియాకు 70 శాతం వార్షిక వర్షపాతం రుతుపవనాల ద్వారానే లభిస్తోంది. 100 జలాశయాలకు రుతు పవనాలు తెచ్చే వర్షమే దిక్కు. కనుక భారత్‌ 2050నాటికో, 2070 నాటికో కర్బన ఉద్గారాలను తగ్గించి వాతావరణ మార్పులను నిరోధిస్తామని ప్రకటించే బదులు,  తక్షణ కార్యాచరణకు ఉపక్రమించాలి. ఇప్పటికే సమయం మించిపోయిందని గ్రహించి శీఘ్రమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మానవాళికి సంక్షోభం

వాతావరణ మార్పుల కారణంగా మానవాళి అన్ని విధాలుగా సంక్షోభాన్ని ఎదుర్కొనబోతోంది. రాబోయే దశాబ్దాల్లో మనుషులతో పాటు సమస్త జీవజాలం అతలాకుతలం కానున్నది. ప్రపంచం ఆర్థికంగా పెను నష్టాలను చవిచూడటం ఖాయం. కొవిడ్‌ వల్ల సంభవించిన సరఫరా గొలుసుల విచ్ఛిన్నంకన్నా ఎన్నో రెట్లు తీవ్రమైన సమస్యలు వచ్చిపడనున్నాయి. ఈ పెను మార్పులు దశాబ్దాల పర్యంతం కొనసాగుతాయి. సత్వరమే మేల్కొనకపోతే శతాబ్దాల పాటు ప్రపంచాన్ని అల్లకల్లోలపరుస్తాయి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇరకాటంలో గుజరాత్‌ సర్కారు

‣ సేంద్రియ సేద్యం... భూసారం పదిలం!

‣ సమస్యల ఊబిలో అన్నదాత

‣ రైతుల ఆర్థికాభివృద్ధికి మార్గం

‣ సమర్కండ్‌లో భారత్‌ సహకార నినాదం

Posted Date: 30-09-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం