• facebook
  • whatsapp
  • telegram

భూతాపం... పుడమికి శాపం!

వాతావరణ మార్పులతో మానవాళికి పెరుగుతున్న సవాళ్లను అధిగమించడంలో ప్రపంచ దేశాలు ఏళ్ల తరబడి చర్చలకే పరిమితమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈజిప్టులో కాప్‌27 సదస్సు ప్రారంభమైంది. ఈసారైనా ప్రపంచ పర్యావరణాన్ని కాపాడేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపుదిద్దుకొంటుందా?

ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల విభాగం ఆధ్వర్యంలో ఈజిప్టులోని షర్మ్‌ ఎల్‌ షేక్‌ పట్టణం వేదికగా కాప్‌-27 సదస్సు ఆదివారం ప్రారంభమైంది. 1995 నుంచి ఐరాస ఈ సదస్సును నిర్వహిస్తోంది. ప్రపంచం వాతావరణ సంక్షోభాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సుమారు రెండు వారాల పాటు జరిగే ఈ సదస్సులో చర్చలు, తీర్మానాలు ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. వైఫల్యాలను అధిగమించి మేలైన కార్యాచరణను సాధ్యం చేసేందుకు ఈ సదస్సు తోడ్పడుతుందని పర్యావరణ ఉద్యమకారులు ఆశిస్తున్నారు. 17 ఏళ్ల క్రితం ప్యారిస్‌ వేదికగా చేసుకున్న ఒప్పందం అమలుపై సంపన్న దేశాలు పేచీ విడిచిపెట్టి ముందుకు వెళ్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇకనైనా అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ మార్పులవల్ల తలెత్తే దుష్ప్రభావాలను కట్టడి చేసేందుకు చిత్తశుద్ధితో ఏకతాటిపైకి రావాలని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆకాంక్షిస్తున్నారు.

కొనసాగుతున్న విధ్వంసం

అడవులు, తీర ప్రాంత పరిరక్షణ, కర్బన ఉద్గారాల నియంత్రణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోని ప్రభుత్వ వ్యవస్థలు ప్రకటించడం పరిపాటిగా మారింది. ప్రపంచ వేదికల్లో చేసే తీర్మానాలను అనుసరించి- వాటికి తగ్గట్టుగానే విధానాలు, చట్టాల రూపకల్పన సాగుతోంది. వాటిని అమలు చేయడంలోనే అసలు చిక్కు వస్తోంది. కొన్ని దేశాల అభివృద్ధి కోసం భూగోళంపై విచ్చలవిడిగా సాగుతున్న వనరుల వెలికితీత, దుర్వినియోగం మొత్తం మానవాళిని ప్రమాదంలో పడేస్తోంది. ఐరాస నివేదికల ప్రకారం- ఏటా ఒక కోటీ పదహారు వేల ఎకరాల విస్తీర్ణం మేర అడవులను ధ్వంసం చేస్తున్నారు. 80శాతం వ్యర్థజలాలను నేరుగా నదులు, సముద్రాల్లోకి విడిచిపెట్టడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన శతాబ్దకాలంలో చిత్తడినేలలు, పగడపు దిబ్బలు 50శాతం మేర అంతరించిపోయాయి. వాయుకాలుష్యం పెచ్చరిల్లింది. ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటోంది. పెరుగుతున్న భూతాపం అనేక విధాలుగా నష్టం కలిగిస్తోంది. తరచూ తలెత్తుతున్న కార్చిచ్చులు, సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల, కరవు కాటకాలు, తుపానులు, వేడి గాలులు వంటి వైపరీత్యాలు ప్రపంచ దేశాలను పీడించడం సర్వసాధారణమైంది. ఐరాస అంచనా మేరకు గడచిన దశాబ్ద కాలంలోనే ఉష్ణోగ్రత సగటున ఒక డిగ్రీ సెల్సియస్‌ మేర పెరిగింది. భూతాపం మరో 0.5 డిగ్రీలు అధికమైతే ప్రకృతి వైపరీత్యాలు ఇంకా దారుణంగా విరుచుకుపడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి విపత్తులకు మానవుల స్వయంకృతాపరాధాలే ప్రధాన కారణమని ప్రపంచ దేశాలు గుర్తించినా సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాయి.

గడచిన అయిదేళ్లలో ప్యారిస్‌ ఒప్పందం అమలు కార్యాచరణలో ప్రపంచ దేశాలు ఏ స్థాయిలో ఫలితాలు సాధించాయనే అంశంపై కాప్‌-27లో సమగ్ర సమీక్ష జరుగుతుందని వర్ధమాన, పేద దేశాలు ఎదురు చూస్తునాయి. సంపన్న దేశాల్లో శిలాజ ఇంధనాల మితిమీరిన వినియోగం భూతాపాన్ని పెంచి- వాతావరణ మార్పులకు కారణమవుతోంది. శిలాజ ఇంధనాల ఉత్పాదకాలపై పెట్టుబడుల ఉపసంహరణకు 29 దేశాలు మాత్రమే ముందుకు వచ్చాయి. కాప్‌-27లో మరిన్ని దేశాలు ఆమోదం తెలుపుతాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బొగ్గు ఆధారిత థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులు, చమురు నిల్వలపై అధికంగా ఆధారపడిన దేశాలు ప్రస్తుత ఆర్థిక వనరులను బలోపేతం చేసుకునేందుకే ప్రయత్నిస్తున్నాయి. సౌర విద్యుత్తు, ఎలెక్ట్రిక్‌ వాహనాలు వంటి ప్రత్యామ్నాయ విధానాలపై అవి తగినంత దృష్టి సారించడంలేదు. ఈ వైఖరిలో మార్పు రావాలి.

కొరవడిన సమన్వయం

పరిమితంగా వనరులను వినియోగిస్తూ, ప్రకృతి వ్యవస్థలను కొంతవరకైనా కాపాడుతున్నది నిరుపేద దేశాలే అన్న విషయం నిర్వివాదాంశం. సంపన్న, వర్ధమాన దేశాధినేతలు అంతర్జాతీయ వేదికలపై చేసే వాగ్దానాలకు, అమలు చేసే విధానాలకు ఎక్కడా పొంతన ఉండకపోవడం విచారకరం. వాతావరణ మార్పుల సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు వంటి సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం పెంచే చర్యలను మరింత ముమ్మరం చేయాలి. భారత్‌లో అడవుల పెంపు, వాతావరణ మార్పుల కోసం రూపుదిద్దుకోవాల్సిన ప్రణాళికలు, నిర్దిష్ట చర్యలు, నిధుల కేటాయింపు వంటి అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్రాల స్థాయి దాకా వాతావరణ మార్పులకు సంబంధించి సమగ్ర ప్రణాళికలను రూపొందించలేదు. రాష్ట్రాల్లో తీరప్రాంతం, చిత్తడి నేలలు, మడ అడవుల వంటి సున్నితమైన పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించే చర్యలను ముమ్మరం చేయాలి. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రూపొందుతున్న పర్యావరణ స్పృహ- భారత్‌లో క్షేత్ర స్థాయిలో ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది.

అమలు అంతంతమాత్రమే

వాతావరణ మార్పులకు ప్రధాన కారణమైన భూతాపం పెరుగుదలను నియంత్రించేందుకు 2015లో ప్యారిస్‌ వేదికగా ప్రపంచదేశాల మధ్య కుదిరిన ఒప్పందం అమలులో అనిశ్చితి నెలకొనడం విచారకరం. చైనా, అమెరికా, ఐరోపా దేశాలు అధికశాతం కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. 2050 నాటికి సగటు భూతాపం పెరుగుదలను రెండు డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చేస్తామంటూ 196 దేశాలు ప్యారిస్‌ ఒప్పందంలో సంతకాలు చేశాయి. 2030 నాటికి 50శాతానికి, 2050 నాటికి సమూలంగా కర్బన ఉద్గారాల నియంత్రణకు పర్యావరణ హితకర కార్యక్రమాలను అమలు చేస్తామని హామీ ఇచ్చాయి. ఈ ఒప్పందం అమలులో భాగంగా- ప్రజల ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేయనున్నట్లు ప్రకటించాయి. సాంకేతిక పరిజ్ఞానం, ఇతర అవసరాలకు ఖర్చు చేయడానికి నిరుపేద, వర్ధమాన దేశాలకు ఏటా రూ.6.70 లక్షల కోట్ల నిధులను కేటాయించడానికి సంపన్న దేశాలు ముందుకొచ్చాయి. అయిదేళ్లకోసారి వివిధ దేశాలు సాధించిన ప్రగతిని సమీక్షించాలని తీర్మానించుకున్నాయి. ఇప్పటివరకూ జర్మనీ, నార్వే, స్వీడన్‌ దేశాలు మాత్రమే స్వల్పంగా నిధులు కేటాయిస్తున్నాయి. అగ్ర దేశాలు ఆశించిన స్థాయిలో స్పందించడంలేదు. నిరుడు బ్రిటన్‌లో జరిగిన కాప్‌ సదస్సులో దీర్ఘకాలిక ఆర్థిక సహకారాన్ని రెట్టింపు చేస్తామని సంపన్న దేశాలు మరో మారు హామీ ఇచ్చాయి. గడచిన ప్యారిస్‌ ఒప్పందం అమలు వైఫల్యాలను మాత్రం లోతుగా చర్చించలేదు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సేద్యంలో డ్రోన్ల విప్లవం

‣ అమెరికా - పాక్‌ అవకాశవాద పొత్తు

‣ తైవాన్‌తో ఉపయుక్త బంధం

‣ తరిగిపోతున్న వన్యప్రాణి జనాభా

‣ బ్రెజిల్‌ పీఠంపై మరోసారి లూలా

‣ ఆర్థిక ఉత్తేజానికి సత్వర పెట్టుబడులు

Posted Date: 07-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం