• facebook
  • whatsapp
  • telegram

మడ అడవులకు మరణ శాసనం

కర్బన ఉద్గారాలను పెద్దమొత్తంలో గ్రహించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు మడ అడవులు తోడ్పడతాయి. ప్రపంచవ్యాప్తంగా అవి అంతరించి పోతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవుల విధ్వంసంపై తాజాగా ఎన్‌జీటీ కన్నెర్రజేసింది.

తీరప్రాంతాల సంరక్షణ, ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలకపాత్ర పోషించే మడ అడవుల విధ్వంసం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జీ20 సదస్సులో వాతావరణ మార్పుల సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు మడ అడవులను పరిరక్షించుకోవాలని ప్రపంచ దేశాల నేతలు పిలుపిచ్చారు. సదస్సు సాక్షిగా మడ అడవుల పరిరక్షణకు ఉద్దేశించిన ‘మాంగ్రూవ్‌ అలయన్స్‌ ఫర్‌ క్లైమేట్‌’ వేదికలో భారత్‌ భాగస్వామిగా చేరినట్లు  ప్రధాని మోదీ ప్రకటించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు పేరుతో కాకినాడ తీరంలో పెద్దయెత్తున మడ అడవులను ధ్వంసం చేయడాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) తప్పుపట్టింది. ధ్వంసం చేసిన మడ అడవులను అయిదేళ్లలో ప్రభుత్వం పునరుద్ధరించాలని ఆదేశించింది. అందుకోసం అయిదు కోట్ల రూపాయలమేర మధ్యంతర పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని ట్రైబ్యునల్‌ ఆదేశించడం సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది.

తీవ్ర నిర్లక్ష్యం

‘ప్రపంచ మడ అడవుల సంస్థ’ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు లక్షన్నర చదరపు కిలోమీటర్ల మేర మడ అడవులు విస్తరించి ఉన్నాయి. భారత్‌లో దాదాపు అయిదు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో అవి కనిపిస్తాయి. పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్‌కు మడ అడవుల ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు దక్కింది. ఇవి రాయల్‌ బెంగాల్‌ పులులు, నీటి పిల్లులు, ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు వంటి ఎన్నో ప్రాణులకు ఆవాసంగా విలసిల్లుతున్నాయి. తీరప్రాంత రక్షణ వ్యవస్థగా భావించే మడ అడవుల ఉనికి ప్రమాదంలో పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇండియాలో పర్యావరణ పరిరక్షణ చట్టం, తీర నియంత్రణ ప్రాంతం (సీఆర్‌జడ్‌) నియమాలను ఉల్లంఘించి మడ అడవుల ప్రాంతాలను ఆక్రమించడం, వాటి అసలు స్వరూపాన్ని మార్చేసి, నేలలను ఛిద్రం చేయడం వంటి విధ్వంస చర్యలు పెరుగుతున్నాయి. ఫలితంగా మడ అడవుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. శుద్ధి చేయని వ్యర్థాలను, జలాలను మడ అడవుల ప్రాంతాల్లోకి వదలడం పెనుముప్పుగా పరిణమిస్తోంది. గడచిన పాతికేళ్లలో ప్రపంచవ్యాప్తంగా వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మడ అడవులు నాశనమయ్యాయి. భారత్‌తోపాటు ఇండొనేసియా, బంగ్లాదేశ్‌, వియత్నాం, మయన్మార్‌ దేశాల్లో వినాశనం అధికంగా సాగుతోంది. అభయారణ్యంగా గుర్తింపు పొందిన ఏపీలోని కోరింగ మడ అడవుల్లోకి ఆక్వా వ్యర్థ జలాలను విచ్చలవిడిగా వదులుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఈ అక్రమాలను అడ్డుకోవడంలో కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర తీర ప్రాంత నిర్వహణ ప్రాధికార సంస్థలు విఫలమవుతున్నాయని కాగ్‌ ఆక్షేపించింది. చాలా రాష్ట్రాల్లో మడ అడవుల ప్రాంతాల్లో ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇచ్చే సందర్భాల్లో వాటి నష్టాన్ని భర్తీ చేసే చర్యల పట్ల యంత్రాంగం శ్రద్ధ చూపడంలేదని కాగ్‌ వెల్లడించింది. తాజాగా కాకినాడ శివారు దమ్మాలపేటలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు పేరిట మడ అడవులను ధ్వంసం చేయడాన్ని హరిత ట్రైబ్యునల్‌ తప్పుపట్టిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ప్రాంతంలో మడ అడవుల ఉనికి, రక్షణపై తీవ్ర ప్రభావం చూపే విధంగా భూ వినియోగ మార్పిడికి యత్నించవద్దని స్పష్టం చేస్తూ ఇళ్ల స్థలాల ప్రాజెక్టు చేపట్టవద్దని చెప్పింది. ప్రభుత్వం అక్కడ చేసిన విధ్వంసానికి పరిహారం చెల్లించి, ఆ ప్రాంతంలో మడ అడవుల పెంపకం, సంరక్షణ కోసం ఆ ధనాన్ని వెచ్చించాలని నిర్దేశించింది. వాస్తవానికి కోరింగ వంటి అభయారణ్యంతో పాటు కాకినాడ జిల్లాలోని గోదావరి ప్రాంతంలో దమ్మాలపేట, కుంభాభిషేకం, చొల్లంగి, ఎస్‌.యానాం పరిధిలోనూ, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని బందరు రిజర్వు అడవులు, శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతాల్లో అక్కడక్కడా మడ అడవులు విస్తరించి ఉన్నాయి. అవి సీఆర్‌జడ్‌ పరిధిలో ఉన్నా ఆయా ప్రాంతాల్లో మడ అడవుల సంరక్షణలో ప్రభుత్వ యంత్రాంగం ఎడతెగని నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు ఉన్నాయి. కాకినాడ అంశంలో హరిత ట్రైబ్యునల్‌ బృందం క్షేత్ర పరిశీలన చేయడంతో వాస్తవాలు వెలుగు చూశాయి.

చిత్తశుద్ధి అవసరం

సముద్ర తీరాల్లో వ్యర్థాల నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువులతోపాటు ఫ్లెక్సీ బ్యానర్ల ఏర్పాటును నిషేధిస్తూ ఏపీ ముఖ్యమంత్రి ఘనంగా ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగమే తీర పరిరక్షణలో కీలకపాత్ర పోషించే మడ అడవుల విధ్వంసానికి తెగబడుతోంది. కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను గ్రహించే మడ అడవుల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే, భూతాపం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ వ్యవస్థలు చిత్తశుద్ధితో కృషిచేస్తేనే మడ అడవుల పరిరక్షణ సాధ్యమవుతుంది. వాటి సంరక్షణకు దీర్ఘకాలిక యాజమాన్య ప్రణాళికలు రూపొందించి, నిర్దుష్టంగా అమలు చేయాలి. ఈ తరహా ప్రకృతి వనరుల ధ్వంసాన్ని నివారిస్తేనే తీర ప్రాంతం సురక్షితంగా ఉంటుంది. 

పలువిధాల మేలు

నదులు, సముద్ర తీరాలు కలిసి ఏర్పడే ఉప్పుకయ్యల్లో, నదీముఖ పరీవాహక ప్రాంతాల్లో మడ వనాలు సహజసిద్ధంగా పెరుగుతాయి. అవి తీర ప్రాంత ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలకంగా నిలుస్తాయి. వాటిలో లభించే మత్స్య సంపదతోపాటు, తేనె వంటి వాటిపై ఆధారపడిన కోట్ల మందికి జీవనోపాధులు సమకూరుతున్నాయి. తుపానులు సంభవించే సందర్భాల్లో గాలుల తీవ్రతను మడ వనాలు నియంత్రించి నష్ట ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. నదుల ద్వారా వచ్చే వ్యర్థాలు సముద్రంలో కలవకుండా నిరోధిస్తాయి. పగడపు దిబ్బల వంటి సున్నిత తీర ప్రకృతి వ్యవస్థలను అవి కాపాడతాయి. మడ అడవులు అనేక సముద్ర ప్రాంత మత్స్య జాతుల సంతానోత్పత్తికి అనువుగా ఉంటాయి. వలస పక్షులకు సైతం అవి ఆవాసంగా నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మడ అడవులు నెలకొన్న ప్రాంతాలు జీవవైవిధ్యం, ప్రకృతి సౌందర్యంతో విలసిల్లుతూ పర్యాటక రంగానికి ఆర్థిక చేయూతను అందిస్తున్నాయి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇరాన్‌ మహిళ స్వేచ్ఛానినాదం

‣ చట్టం... రైతు చుట్టం కావాలి!

‣ పర్యావరణ పరిరక్షణ... పుడమికి సంరక్షణ!

‣ పొరుగుపై చైనా దూకుడు

‣ జీ20 అధ్యక్షత... భారత్‌పై గురుతర బాధ్యత!

‣ కశ్మీర్‌పై అమెరికా ద్వంద్వ వైఖరి

Posted Date: 26-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం