• facebook
  • whatsapp
  • telegram

నేల తల్లికి పుట్టెడు శోకం

ప్రపంచ మృత్తికా దినోత్సవం. మనిషి ఉనికికి,  జీవనానికి మట్టి మూలాధారం. ఆరోగ్యవంతమైన నేల ఉన్నప్పుడే ప్రపంచవ్యాప్తంగా జనాభాను పోషించడానికి కావాల్సిన ఆహారోత్పత్తి సాధ్యమవుతుంది. అయితే, నానాటికీ నేల పైపొర దెబ్బతింటోంది. ఇది ఆహార భద్రతపై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

మానవాళికి అందే ఆహారంలో 95శాతాన్ని నేల అందిస్తుంది. అయిదు శాతమే సముద్రాలు, నదులు మొదలైనవాటి నుంచి లభిస్తుంది. మితిమీరిన మానవ కార్యకలాపాల వల్ల పోనుపోను నేల ఆరోగ్యం క్షీణిస్తోంది. ఫలితంగా మన ఆహార భద్రత ప్రమాదంలో పడుతోంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ప్రకారం ఆరోగ్యవంతమైన నేలలు స్థిరమైన వ్యవసాయాభివృద్ధికి, ఆహార భద్రతకు కీలకం. అందుకే నేలను కాపాడుకొనే లక్ష్యాలు నిర్దేశించుకొనేందుకు ప్రతి ఏటా డిసెంబరు అయిదున ప్రపంచ మృత్తికా దినోత్సవం జరుపుతున్నారు. నేల సహజత్వాన్ని కాపాడటానికి, ప్రజలందరికీ ఆహారభద్రత కల్పించడానికి, పేదరిక నిర్మూలనకు కృషి చేసిన థాయ్‌లాండ్‌ రాజు భూమిబోల్‌  జయంతిని ప్రపంచ మృత్తికా దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ఈ ఏడాది ‘నేల: ఆహారానికి ఆధారం’ అనే నినాదంతో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మృత్తిక అనేది సంక్లిష్టమైన ప్రకృతి వనరు. దాన్ని ప్రకృతి మాత్రమే సృష్టిస్తుంది. మానవాళి చర్యలపై నేల నాణ్యత ఆధారపడి ఉంటుంది. భూమి పైపొర క్రమంగా క్షీణించడాన్ని మృత్తికా క్రమక్షయంగా పిలుస్తారు. దానివల్ల వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత తీవ్రంగా దెబ్బతింటాయి. నేలలో తేమ, భూగర్భ జలమట్టాల నాణ్యతపైనా ప్రభావం పడుతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మూడింట ఒకవంతు నేల క్షీణతకు గురయిందని ఎఫ్‌ఏఓ అంచనా వేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే అరవై ఏళ్లలో ప్రపంచంలోని నేల పైపొర పూర్తిగా దెబ్బతింటుందని ఎఫ్‌ఏఓ హెచ్చరించింది. జాతీయ నేల సర్వే, భూ వినియోగ ప్రణాళిక సంస్థ లెక్కల ప్రకారం ఇప్పటికే భారత్‌లో దాదాపు 11.92 కోట్ల హెక్టార్ల నేల కోతకు గురైంది. దేశంలో నేల కోత సగటు వార్షిక రేటు హెక్టారుకు 16.35 టన్నులు. ఇందులో 29శాతం మృత్తిక సముద్రంలోకి తరలిపోతోంది. పదిశాతం జలాశయాల్లోకి చేరుతోంది. మిగిలిన 61శాతం గాలి, వరదలు వంటి వాటి కారణంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి జరిగిపోతోంది. నేల కోత కారణంగా భారత్‌లో ప్రధాన పంటల ఉత్పత్తిలో 72 లక్షల టన్నుల వార్షిక నష్టం సంభవిస్తోందని అంచనా.

వరదలు, గాలి, రసాయన వ్యవసాయం, భూ వినియోగ మార్పులు, అటవీ నిర్మూలన, కాలుష్యం, ప్లాస్టిక్‌, రసాయన వ్యర్థాల చేరిక వంటి కారణాలతో నేల దెబ్బతింటోంది. వాయవ్య భారత్‌తో పాటు వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలి కారణంగా నేల కోతకు గురవుతోంది. గాలి వేగంగా వీయడం వల్ల ఒక ప్రాంతంలోని సారవంతమైన నేల పైపొర మరో ప్రాంతానికి తరలిపోతోంది. అధిక వర్షపాతం సంభవించే ప్రాంతాల్లో నీటి కోతవల్ల నేల పైపొర కొట్టుకొనిపోతోంది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) లెక్కల ప్రకారం నీటి కోత వల్ల భారత్‌లో ఏటా 5.33 కోట్ల హెక్టార్ల మేర పైపొరను నేల నష్టపోతోంది. ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌లలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. తీర ప్రాంతాల్లో సాగర మట్టాలు పెరగడం, తుపానుల కారణంగా నేల కోతకు గురవుతోంది. భూమి క్షారత్వం, లవణీయత పెరగడం వంటివీ మృత్తిక నాణ్యతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణతో నేల నాణ్యతను కాపాడుకోవడం, కోతను నివారించడం వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ వంటి దేశాలకు పెను సవాలేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నేల పైపొర అనేది పోషకాల ఖజానా. అందులో నైట్రోజన్‌, భాస్వరం, సల్ఫర్‌ వంటివి ఉంటాయి. అటవీ విధ్వంసం, రసాయన, ప్లాస్టిక్‌ వ్యర్థాల వెల్లువను అరికట్టడం, కాలుష్య నియంత్రణ ద్వారా నేల పైపొరను కాపాడవచ్చు. నదీ పరీవాహక ప్రాంతాల్లో వనాలు పెంచడం ద్వారా భారీ వరదలను నియంత్రించవచ్చు. తద్వారా భూమి పైపొర కొట్టుకొనిపోకుండా నివారించవచ్చు. మితిమీరిన రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగమూ నేల సహజ స్వభావాన్ని దెబ్బతీస్తోంది. సేంద్రియ వ్యవసాయం నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని విస్తృతంగా ప్రోత్సహించేలా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ మేరకు కర్షకుల్లో సరైన అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు నడుంకట్టడం అత్యావశ్యకం.

- గొడవర్తి శ్రీనివాసు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సహ చట్ట స్ఫూర్తిపై దాడి

‣ మదుపరుల పుట్టిముంచిన క్రిప్టో

‣ డేటా కేంద్రాల విపణిగా భారత్‌

‣ నేపాల్‌ చెలిమితో డ్రాగన్‌కు ముకుతాడు

‣ అటవీ నేరాలకేదీ అడ్డుకట్ట?

‣ ఈశాన్యంలో సరిహద్దుల నెగళ్లు

‣ వర్ధమాన వాణి... విశ్వశ్రేయ శ్రేణి!

Posted Date: 09-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం