• facebook
  • whatsapp
  • telegram

దక్షిణాసియాకు వాయుగండం

దక్షిణాసియాలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని ప్రపంచ బ్యాంకు ఇటీవలి నివేదిక హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిత ప్రమాణాల కన్నా గాలిలో అతి సూక్ష్మ ధూళికణాల (పీఎం2.5) సాంద్రత భారత ఉప ఖండంలో చాలా ఎక్కువగా ఉంది. ఫలితంగా ప్రజారోగ్యం గుల్లబారుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మార్గదర్శకాల ప్రకారం గాలిలో అతి సూక్ష్మ ధూళికణాల (పీఎం2.5) సాంద్రత ఘనపు మీటరుకు అయిదు మైక్రోగ్రాముల కంటే అధికంగా ఉండకూడదు. నైట్రోజన్‌ డయాక్సైడ్‌ పరిమితి 10 మైక్రోగ్రాములకు మించరాదు. భారత్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్థాన్‌లలోని ప్రధాన నగరాల్లో అవి ఎన్నో రెట్లు అధికంగా ఉన్నాయని ఇటీవలి ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ప్రపంచ వాయు స్థితి నివేదిక ప్రకారం విశ్వవ్యాప్తంగా వాయు కాలుష్యంతో అల్లాడుతున్న నగరాల జాబితాలో దిల్లీ, కోల్‌కతా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా అయిదు, పాకిస్థాన్‌లోని కరాచీ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. తీవ్ర కాలుష్యం కోరల్లో చిక్కిన తొలి పది నగరాల్లో నాలుగు భారత ఉపఖండంలోనే ఉండటం, పర్యావరణవేత్తల్లో తీవ్ర ఆందోళన పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏడువేల నగరాల్లో ప్రపంచ బ్యాంకు పరిశోధన చేపట్టింది. ఎన్నో మహానగరాలు, పట్టణ ప్రాంతాల్లో గాలి నాణ్యత అధ్వానంగా ఉన్నట్లు అందులో తేలింది. శిలాజ ఇంధనాలు, ఘన, పంటవ్యర్థాలు, అడవుల దహనం, వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, అభివృద్ధి పేరిట సాగుతున్న పనులు గాలి నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. నగరాల్లో నిత్యం ట్రాఫిక్‌ రద్దీలో చిక్కుకొనేవారు, రహదారుల పక్కన నివసించేవారు అధికంగా నైట్రోజన్‌ డయాక్సైడ్‌ కాలుష్యానికి గురవుతున్నారు.

ప్రస్తుతం దక్షిణాసియాలోని 60శాతం ప్రజలు అతిసూక్ష్మ ధూళికణాలు 35 మైక్రోగ్రాముల స్థాయిలో ఉన్న గాలిని పీలుస్తున్నారు. ముఖ్యంగా ఇండో గంగా మైదాన ప్రాంతంలో కొన్ని చోట్ల పీఎం2.5 సాంద్రత ఘనపు మీటరుకు 100 మైక్రో గ్రాములుగా ఉంది. వాయు కాలుష్యాన్ని అదుపులో ఉంచడానికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు ఆయా రాష్ట్రాలు, దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సమన్వయంతో ముందుకు సాగాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. ఈ క్రమంలో అంతర్జాతీయ సమీకృత పర్వత అభివృద్ధి కేంద్రం (ఐసీఐఎంఓడీ), ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, నేపాల్‌ల ప్రతినిధులు ఇటీవల రెండు రోజుల పాటు నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూలో సమావేశమయ్యారు. ఇండో-గంగా మైదానం, హిమాలయ పర్వత ప్రాంతాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడంపై వారు చర్చలు జరిపారు. నాలుగు దేశాల మధ్య జరిగిన ఈ సమావేశం మేలిమి ముందడుగుగా బంగ్లాదేశ్‌ పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఉప కార్యదర్శి అమీరుల్‌ కైజర్‌ వ్యాఖ్యానించారు. ఐసీఐఎంఓడీలోని మిగిలిన నాలుగు దేశాలైన భూటాన్‌, మయన్మార్‌, చైనా, అఫ్గానిస్థాన్‌లు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపిచ్చారు.

పెచ్చరిల్లుతున్న వాయు కాలుష్యం రాబోయే రోజుల్లో దక్షిణాసియాలో భారీ ప్రజారోగ్య సంక్షోభానికి దారితీస్తుందని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ఉపాధ్యక్షుడు మార్టిన్‌ రైజర్‌ హెచ్చరించారు. వాయు కాలుష్యం వల్ల భారత్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుండె, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. మహిళలు, యువతలో మానసిక కుంగుబాటుకు, అయిదేళ్ల పిల్లల్లోనూ మధుమేహం, శ్వాస ఇబ్బందులు తలెత్తడానికి వాయు కాలుష్యమే కారణమని నిపుణులు చెబుతున్నారు. వాయు కాలుష్యం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి వాతావరణ మార్పులు ముమ్మరిస్తున్నాయి. భారత్‌లోని అత్యంత కాలుష్యభరితమైన నగరాలను తెరిపిన పడేలా చేయాలన్న లక్ష్యంతో 2019లో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాన్ని సమర్థంగా అమలు చేయాలి. పంజాబ్‌ వంటి ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనం వల్ల దేశ రాజధాని దిల్లీని ఏటా శీతాకాలంలో కాలుష్య మేఘం కమ్మేస్తోంది. దాన్ని నివారిస్తూ పంట వ్యర్థాలను ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగించాలి. తద్వారా రైతులకూ ఆదాయం లభిస్తుంది. గాలి నాణ్యతకు పొగపెడుతున్న శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. విద్యుత్తు వాహనాల వాడకం ఇతోధికం అయ్యేలా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉంది. దేశీయంగా అటవీ విస్తీర్ణాన్ని ఇతోధికం చేసుకోవడమూ తప్పనిసరి. అప్పుడే నానాటికీ విజృంభిస్తూ ప్రజారోగ్యంపై పంజా విసరుతున్న వాయు కాలుష్య కట్టడిలో చెప్పుకోదగ్గ పురోగతి సాధ్యపడుతుంది.

- గొడవర్తి శ్రీనివాసు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

ఓటు... ప్రజాస్వామ్య జీవనాడి!

‣ మహాసాగరంలో ఆధిపత్యపోరు

‣ పచ్చని ఉదజని తోడుంటే...

‣ మిన్నంటుతున్న ఆకలి కేకలు

‣ రాజ్యాంగమే సర్వోన్నతం!

‣ మధ్యతరగతి ఆశల పద్దు

‣ అమృత కాలానికి పటిష్ఠ మార్గం

Posted Date: 27-01-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం