• facebook
  • whatsapp
  • telegram

ప్రమాదంలో చిత్తడి నేలలు

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. వాటి సక్రమ వినియోగాన్ని ప్రోత్సహించడానికి, జీవ వైవిధ్యాన్ని మెరుగుపరచడానికి కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా అమృత్‌ ధరోహర్‌ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్లో ప్రకటించారు. వివిధ కారణాల వల్ల దేశంలో ఎన్నో చిత్తడి నేలలు కనుమరుగవుతున్నాయి. వాటి పరిరక్షణకు పాలకులు మరిన్ని పటిష్ఠ చర్యలు తీసుకోవాలి.  

జీవ వైవిధ్యానికి నెలవులుగా గుర్తింపు పొందిన చిత్తడి నేలలు ఎక్కువ లోతు లేకుండా వివిధ జంతు, వృక్ష జాతులకు ఆవాసాలుగా ఉంటాయి. ఎన్నో రకాల చేపలు, పక్షులకు ఆహారాన్ని సమకూరుస్తూ వాటి సంతానోత్పత్తికి, ఆవాసాలకు అవి ప్రధాన ఆధారాలుగా నిలుస్తున్నాయి. రామ్‌సర్‌ అంతర్జాతీయ చిత్తడి నేలల పరిరక్షణ ఒప్పందం ప్రకారం- ప్రవహించే లేదా స్థిరమైన నీటిని కలిగి ఉన్న ప్రాంతాలన్నీ చిత్తడి నేలలే. 2014కు ముందు రామ్‌సర్‌ జాబితాలోని చిత్తడి నేలలు దేశీయంగా 26 మాత్రమే ఉండేవి. ప్రస్తుతం అవి 75కి చేరినట్లు ఇటీవల మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. వాటి పరిరక్షణ ప్రయత్నాల్లో స్థానిక ప్రజలు ఎప్పుడూ ముందు వరసలో ఉంటున్నట్లు తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశంసించారు.

వేగంగా కనుమరుగు

అడవులను ప్రకృతికి శ్వాసకోశాలుగా పరిగణిస్తే, చిత్తడి నేలలను మూత్రపిండాలుగా అభివర్ణిస్తారు. అవి నీటి నుంచి వ్యర్థాలను తొలగించి శుద్ధి చేస్తాయి. భూగర్భ జలాలను పెంపొందిస్తాయి. సముద్ర తీర స్థిరీకరణ, వరదల నియంత్రణ వంటి ఎన్నో సేవలను చిత్తడి నేలలు అందిస్తాయి. అధిక వర్షాలవల్ల వచ్చే నీటిని స్పాంజి మాదిరిగా అవి శోషించుకొని వరదలను నియంత్రిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ప్రజలకు మత్స్య సంపద ద్వారా ఆహార భద్రతను, జీవనోపాధులను చిత్తడి నేలలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం మనుగడ అత్యంత ప్రమాదంలో పడిన ఆవరణ వ్యవస్థలుగా వాటిని పరిగణిస్తున్నారు.

చిత్తడి నేలల ప్రాముఖ్యాన్ని గుర్తించి వాటి పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి కోసం ఇరాన్‌లోని రామ్‌సర్‌లో 1971లో వివిధ దేశాలు, స్వచ్ఛంద సంస్థల మధ్య అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది. అది రామ్‌సర్‌ ఒప్పందంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి మూడేళ్లకోసారి సభ్య దేశాల సమావేశం జరుగుతుంది. నిరుడు నవంబరులో చైనాలోని వుహాన్‌, స్విట్జర్లాండ్‌లోని జెనీవాలలో 14వ సమావేశం నిర్వహించారు. భారత్‌ 1982లో రామ్‌సర్‌ ఒప్పంద సభ్య దేశంగా చేరింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండువేల నాలుగు వందలకు పైగా చిత్తడి నేలలను రామ్‌సర్‌ క్షేత్రాల జాబితాలో చేర్చారు. అత్యధికంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ 175 రామ్‌సర్‌ క్షేత్రాలను కలిగి ఉంది. 142 క్షేత్రాలతో మెక్సికో తరవాతి స్థానంలో నిలుస్తోంది.

కొన్నేళ్లుగా అడవుల కంటే మూడు రెట్ల అధిక వేగంతో చిత్తడి నేలలు అంతరించిపోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1900ల తరవాత అభివృద్ధి పనుల పేరిట ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగానికిపైగా చిత్తడి నేలలు కనుమరుగయ్యాయని ఒక అంచనా. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార అవసరాల కోసం చిత్తడి నేలలను పంట భూములుగా మార్చేస్తున్నారు. గతి తప్పిన పట్టణ ప్రణాళికల వల్ల భవనాలు, రోడ్లనిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల్లో భాగంగా చిత్తడి నేలలను కోల్పోతున్నాం. కాలుష్యం కాటూ వాటికి ముప్పుగా పరిణమించింది. వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న సముద్ర మట్టాలు కొన్నిచోట్ల సమీప చిత్తడి నేలలను ముంచెత్తుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కరవు కారణంగా అవి పూర్తిగా ఎండిపోతున్నాయి. సహజ నదీ ప్రవాహాలపై భారీ ఆనకట్టల నిర్మాణం వల్ల మరికొన్ని చిత్తడి నేలల ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. అవి తరిగిపోతుండటంతో కొన్ని ప్రాణులు అంతరించి జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. భూ, సముద్ర సంబంధ జీవజాతులకంటే చిత్తడి నేలల జీవజాతులు చాలా వేగంగా కనుమరుగవుతున్నాయి.

చిత్తశుద్ధితో కృషి చేయాలి

పన్నెండో శతాబ్దంలో కాకతీయుల కాలం నుంచే తెలుగు నేలపై విస్తృతంగా చెరువులు, కాలువలు తవ్వారు. అప్పట్లో చెరువుల నిర్మాణాన్ని పుణ్య కార్యంగా పరిగణించేవారు. తెలుగు రాష్ట్రాల్లో కొల్లేరు సరస్సు రెండు దశాబ్దాల క్రితమే రామ్‌సర్‌ క్షేత్రాల జాబితాలోకి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో మరెన్నో చిత్తడి నేలలు రామ్‌సర్‌ క్షేత్రాలుగా గుర్తింపు పొందాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న చిత్తడి నేలలను గుర్తించి, వాటి సహజసిద్ధ వాతావరణాన్ని పరిరక్షించాలి. అవి ఆక్రమణలకు గురికాకుండా, వాటి భూ వినియోగం మారకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. పట్టణ, నగర ప్రణాళికల రూపకల్పనలో చిత్తడి నేలలకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్త వహించడం అత్యావశ్యకం. లేకుంటే భారీ వర్షాలు కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తి తీరని నష్టం వాటిల్లుతుంది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నాశనమైన చిత్తడి నేలలను తిరిగి పునరుద్ధరించడమూ తప్పనిసరి. అందుకోసం పాలకులు చిత్తశుద్ధితో కృషి చేయాలి.    

- ఎం. రామ్‌మోహన్‌

(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మిన్నంటుతున్న ఆకలి కేకలు

‣ రాజ్యాంగమే సర్వోన్నతం!

‣ మధ్యతరగతి ఆశల పద్దు

‣ అమృత కాలానికి పటిష్ఠ మార్గం

Posted Date: 03-02-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం