• facebook
  • whatsapp
  • telegram

భూ ఫలకాల మహా ఉత్పాతం

ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒకచోట భూమి కంపిస్తూనే ఉంటుంది. వాటిలో కొన్ని మనం గుర్తించలేని స్థాయిలో ఉంటాయి. మరికొన్ని భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలను కలిగిస్తున్నాయి. తుర్కియేలో ఇటీవలి భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. అసలు ఈ భూకంపాలు ఎందుకు వస్తాయి, తరచూ తుర్కియేలో అవి ఎందుకు సంభవిస్తున్నాయి?

మనం నివసించే ఖండాలు, మహాసముద్రాలు అన్నీ భూ ఫలకాలపై ఉన్నాయి. ఇవి భూగ్రహంలోని మధ్య పొరపై కదులుతూ ఉంటాయి. ఈ ఫలకాలు మొత్తం 17. వీటిలో పెద్దవి ఏడు, చిన్నవి పది. ఇవికాక వాటి మధ్య ఎక్కడికక్కడ మరింత చిన్నపాటి ఫలకాలు ఉంటాయి. పెద్ద ఫలకాలు దాదాపు 95శాతం భూమిని ఆక్రమించి శిలావరణంగా ఏర్పడ్డాయి. భూఫలకాల కదలికలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు ఒక భూఫలకం ఒత్తిడికి మరో ఫలకం వేగంగా కదలడమో, దిశను మార్చుకోవడమో, లేదా రెండూ ఢీకొనడమో, ఒకదానిపైకి మరొకటి చేరడమో జరుగు తుంటాయి. ఆ సమయంలో విపరీతమైన శక్తి విడుదలై, ప్రకంపనాల రూపంలో విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఇవి భూమిపై ఏర్పడితే భూకంపాలని, సముద్రాల్లో ఏర్పడితే సునామీలని పిలుస్తారు.

ఏటా ఇరవై దాకా..

భూఫలకాల కదలికల కారణంగానే తుర్కియేలో ఇటీవల పెను భూకంపం చోటుచేసుకుంది. ఇక్కడ తరచూ ఈ తరహా విపత్తులు సంభవిస్తున్నాయి. ఇక్కడ పెద్దవైన అరేబియన్‌, ఆఫ్రికన్‌ భూఫలకాల మధ్య ‘అనటోలియన్‌’గా పిలిచే చిన్నపాటి ఫలక ఉంది. దీనికి ఉత్తరం వైపు ఘర్షణ మండలం (ఫాల్ట్‌ జోన్‌) ఉంది. ఇస్తాంబుల్‌ దక్షిణ భాగం నుంచి ఈశాన్య తుర్కియే వరకు విస్తరించిన ఈ జోన్‌లో భూకంప విపత్తుల ముప్పు ఎక్కువగా ఉంటోంది. దక్షిణం వైపు ఉన్న అరేబియన్‌ భూఫలక నిత్యం ఉత్తరం దిశగా ఐరోపాలోకి కదులుతోంది. ఈ కదలిక వల్ల అనటోలియన్‌ భూఫలక పశ్చిమ దిశగా జరుగుతుండటమే కాకుండా- దాని సహజ వేగం, ఘర్షణ మండలంపై ఒత్తిడి పెరుగుతున్నాయి. దాంతో ఒక్కోసారి అకస్మాత్తుగా విపరీతమైన శక్తి విడుదలై, భూమి కంపిస్తోంది. భూఫలకాల కదలికల వల్ల చోటుచేసుకున్న మార్పులకు భూమిలోని పొరలు సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ సర్దుబాటులో భాగంగా తక్కువ తీవ్రత ఉండే భూకంపాలు వస్తుంటాయి. ఇది సర్వసాధారణమే. డెన్మార్క్‌, గ్రీన్‌ల్యాండ్‌ భూవిజ్ఞాన సర్వే ప్రకారం- తుర్కియేలో మొదటి భూప్రకంపనం తీవ్రత భూకంప లేఖిని (రిక్టర్‌ స్కేలు)పై 7.8గా నమోదైంది. ఆ తరవాతి ప్రకంపనలు క్రమంగా తీవ్రత తగ్గుతూ వస్తున్నాయి. భూకంప తీవ్రత 7-7.9 మధ్య ఉంటే పెద్ద భూకంపం చోటుచేసుకున్నట్టే. ఈ స్థాయి ప్రకంపనాలకు చాలా ప్రాంతాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుంది. ఇంతటి భారీ విపత్తులు విశ్వవ్యాప్తంగా ఏటా మూడు నుంచి 20 వరకు సంభవిస్తుంటాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల భూవిజ్ఞాన సర్వే ప్రకారం- తాజాగా తుర్కియేలో భూమి లోపల 18 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడింది. దాంతో ఈ ప్రకంపనాల ప్రభావం అక్కడికి 456 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్‌, లెబనాన్‌ (874 కిలోమీటర్లు), ఇజ్రాయెల్‌ (1,381 కిలోమీటర్లు), ఈజిప్ట్‌ (1,411 కిలోమీటర్లు)లలోనూ కనిపించింది. సాధారణంగా భూకంప కేంద్రం లోతు తక్కువగా ఉంటే, నష్టం కూడా స్వల్పంగానే ఉంటుంది.

పటిష్ఠమైన నిర్మాణాలు

తుర్కియేలో సంభవించిన భూకంపం ఆ దేశంతో పాటు సిరియానూ అతలాకుతలం చేసింది. లెక్కలేనన్ని భవనాలు కుప్పకూలి, భారీగా ప్రాణనష్టం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో పెళుసుగా ఉండే కాంక్రీటుతో నిర్మించిన భవనాలే ఎక్కువ. వాటికి త్వరగా పగుళ్లు ఏర్పడే గుణం ఉండటంతో, ఉక్కు సులభంగా తప్పుపడుతుంది. అందుకే భూ ప్రకంపనాలను తట్టుకొనే సామర్థ్యం అక్కడి భవనాలకు తక్కువ. ఇటీవలి భూకంపం కారణంగా ఇరవై ఎనిమిది వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. 50 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థల అంచనా! 1900-1999 మధ్య తుర్కియేలో ఎన్నో భూకంపాలు సంభవించాయి. అక్కడి ఎర్జింకన్‌ వద్ద 1939 డిసెంబరు 26న చోటుచేసుకున్న భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.8గా నమోదైంది. ఆ విలయంలో 32,700 మంది మరణించారు. ఇజ్మిట్‌ వద్ద వచ్చిన (1999 ఆగస్టు 17) భూకంప తీవ్రత 7.6. అందులో 17,127 మంది దుర్మరణం పాలయ్యారు. ఇంచుమించు అంతే తీవ్రతతో తాజా విపత్తు చోటుచేసుకుని, అదే రీతిలో భారీ నష్టం కలిగించింది. భారత్‌లోనూ భారీ జనాభా కలిగిన నగరాలు, పలు ప్రాంతాలు భూకంప ప్రభావిత మండలంలో ఉన్నాయి. ఈ క్రమంలో భూకంపాల కారణంగా వాటిల్లే నష్టాలను తగ్గించుకోవడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ముఖ్యంగా భూకంప నిరోధక సాంకేతికతతో నిర్మాణాలను చేపట్టాలి. ఆ దిశగా చట్టాలను రూపొందించి, ప్రజల సహకారంతో వాటిని అమలు చేయాలి.

- ఆచార్య నందిపాటి సుబ్బారావు 

(ఆంధ్ర విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఒక అభ్యర్థి.. ఒక్కచోటే పోటీ!

‣ భయపెడుతున్న ఎల్‌ నినో

‣ అడ్డగోలు అప్పులు... జనానికే తిప్పలు!

‣ సాగు మారితేనే ఆహార భద్రత

‣ వివాదాల సేతుసముద్రం

‣ భగ్గుమంటున్న పుడమి

Posted Date: 14-02-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం