• facebook
  • whatsapp
  • telegram

పుడమికి గొడ్డలి పెట్టు

భయపెడుతున్న భూకంపాలు

నెల రోజుల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన భూ ప్రకంపనలు ప్రజల్లో వణుకు పుట్టించాయి. నల్లమల అడవిలోని కృష్ణా నదిలో శ్రీశైలం జలాశయానికి పశ్చిమ దిశగా 44 కిలోమీటర్ల దూరంలో, కొల్లాపూర్‌కు తూర్పున 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) ఇటీవల గుర్తించింది. భూకంప కేంద్రం ఏడు కిలోమీటర్ల లోతున ఉన్నట్లు పేర్కొంది. తాజాగా బంగాళాఖాత సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతున భూ ప్రకంపనలు సంభవించాయి. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు 257 కిలోమీటర్ల దూరంలో వీటిని గుర్తించారు. కృష్ణా నదీ గర్భంలో భూప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.7గా, బంగాళాఖాత భూకంప తీవ్రత 5.1గా నమోదయ్యాయి. కృష్ణా నదిలో భూకంప ప్రభావంతో అచ్చంపేట, కొల్లాపూర్‌, లింగాల, అమ్రాబాద్‌, ఉప్పునూతల, బలమూరు ప్రాంతాలతోపాటు శ్రీశైలానికి సమీపంలోనున్న గ్రామాలు, గిరిజన గూడేల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కొన్ని ఇళ్లలోని వంట పాత్రలు, డబ్బాలు కదిలి కింద పడ్డాయి. కొన్నిచోట్ల పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ భూకంప ప్రభావానికి తీర ప్రాంతాల్లో కొన్నిచోట్ల సముద్రం వెనక్కు వెళ్ళింది. కాకినాడలో సముద్రం 100 మీటర్ల మేర, ఉప్పాడ కొత్తపల్లిలో 40 మీటర్లు, అంతర్వేదిలో 15 మీటర్ల మేర వెనక్కి వెళ్ళింది. బంగాళాఖాతంలో సంభవించిన భూకంప తీవ్రత చెన్నైలోని ఎన్‌జీఆర్‌ఐలో 5.1గా నమోదైంది. నదీ ప్రాంతాలు, ఆనకట్టలకు సమీప ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నందువల్ల ఆనకట్టల భద్రతపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎత్తిపోతల పథకాల పేరిట ప్రభుత్వాలు భారీ ఎత్తున జలాశయాల నిర్మాణాలు చేపడుతుండటం సైతం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు భూకంపాల ముప్పు లేని ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవిస్తుండటం వాటిపై లోతైన పరిశోధనల ఆవశ్యకతను చాటుతోంది.

దెబ్బతింటున్న సమతౌల్యం

భారత ఉపఖండం భూకంపాలు, వరదలు, సునామీలు, కొండ చరియలు విరిగిపడటం వంటి ప్రకృత్తి విపత్తులకు ఆస్కారమున్న ప్రాంతం. ఈశాన్య, ఉత్తర భారతదేశానికి భూకంపాల ముప్పు ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో 1950 లగాయతు తరచూ ఓ మోస్తరు నుంచి భారీ భూకంపాలు సంభవిస్తున్నాయి. రిక్టరు స్కేలుపై సగటున 6.0 తీవ్రతతో వణికిస్తున్నాయి. ఈశాన్య భారతం తరవాత అండమాన్‌ నికోబార్‌ దీవులకు తీవ్ర భూకంపాల ముప్పు ఎక్కువ. హిమాలయ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణ పుడమికి ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ప్రకృతి, సహజ వనరుల విధ్వంసం కొనసాగిస్తూ, అశాస్త్రీయంగా చేపడుతున్న నిర్మాణ, అభివృద్ధి కార్యకలాపాలవల్ల ఆ ప్రాంతాన్ని భూకంపాలు కుదిపేస్తున్నాయి. పర్వత లోయల్లో విచ్చలవిడిగా చేపడుతున్న జల విద్యుత్‌ ప్రాజెక్టులు, ఆనకట్టలు, జలాశయాల నిర్మాణాలు పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాయి. గడచిన 15 ఏళ్లలో భారతదేశంలో 10 భారీ భూకంపాలు సంభవించాయి. దాదాపుగా 20 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది. గతంలోనూ తీవ్ర విధ్వంసకర భూకంపాలను భారత్‌ చవిచూసింది. 1987లో షిల్లాంగ్‌లో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 8.7గా నమోదైంది. 1950లో అస్సాం-టిబెట్‌ సరిహద్దుల్లో 8.6 తీవ్రతతో, 1934లో బిహార్‌-నేపాల్‌ సరిహద్దు వెంట 8.3 తీవ్రతతో, 1905లో హిమాచల్‌ప్రదేశ్‌ కాంగ్రా ప్రాంతంలో 8.0 తీవ్రతతో భూకంపాలు విరుచుకుపడ్డాయి. భారతదేశ భూకంప మాండలిక పటం ప్రకారం మొత్తం భూభాగంలోని 59శాతానికి భూకంపాల ముప్పు పొంచి ఉంది. హిమాలయ ప్రాంతంలో పెను భూకంపం సంభవించే ప్రమాదం ఉందని, దేశంలోని లక్షల మందిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు చెందిన శాస్త్రీయ పరిశోధన, అధ్యయన పత్రం హెచ్చరించింది.

నష్టాన్ని తగ్గించేలా... 

భూకంపాలు ఎప్పుడైనా విధ్వంసకారకాలే. వాటిని నివారించడం సాధ్యం కాదు. ముందస్తు సంసిద్ధతతో వాటి నష్ట తీవ్రతను కొంత వరకు తగ్గించవచ్చు. ఇందుకోసం భూప్రకంపనల తీరుతెన్నులు, స్వభావాన్ని పరిశీలించే పరిశోధన కేంద్రాల వ్యవస్థను విస్తృతపరచాలి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 115 భూకంప పరిశీలన కేంద్రాలే ఉన్నాయి. ఇటీవలే కేంద్రం మరో 35 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది చివరికల్లా ఇవి వినియోగంలోకి వస్తాయంటున్నారు. రానున్న అయిదేళ్లలో మరో 100 కేంద్రాలను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. వీటి ద్వారా భూమి అడుగు పొరల్లో నిరంతరం సంభవించే పరిణామాలను ఎప్పటికప్పుడు గమనించవచ్చు. పర్యావరణ హితకరమైన, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, సహజ వనరులను విచక్షణతో వినియోగించడం ద్వారా కొంతమేరకైనా ప్రకృతి విపత్తులను నివారించవచ్చు. అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, మరింత భూభాగాన్ని పరిశీలనా కేంద్రాల పరిధిలోకి తేవడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

- డాక్టర్‌ జీవీఎల్‌ విజయ్‌కుమార్‌ (భూ విజ్ఞానశాస్త్ర నిపుణులు)

Posted Date: 02-09-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం