• facebook
  • whatsapp
  • telegram

వణికిస్తున్న ప్రకృతి విపత్తులు

భారీ వరదలు, వడగాలుల్లాంటి ప్రకృతి విపత్తులు రాబోయే కాలంలో భారత్‌లో మరిన్ని రెట్లు పెరగనున్నాయి. దీనంతటికీ వాతావరణ మార్పులే ప్రధాన కారణం.

పాకిస్థాన్‌లో సంభవించిన భారీ వరదలు కొన్ని లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపాయి. పలు ప్రాంతాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి విపత్తులే మన దేశంలోనూ సంభవించే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. 1951 నుంచి 2020 వరకు దేశంలో సంభవించిన మొత్తం ప్రకృతి విపత్తులన్నింటినీ ఐఐటీ-గాంధీనగర్‌ పరిశోధకులు పరిశీలించి, భవిష్యత్తులో సంభవించే అవకాశమున్నవాటి తీరును అంచనా వేశారు. దీనివల్ల వ్యవసాయోత్పత్తులు, ప్రజారోగ్య సదుపాయాలు, మౌలిక వసతులు తదితర రంగాలన్నింటిపైనా తీవ్ర ప్రభావం పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో ఎండలు మండిపోతాయని, ఆ వెంటనే వానాకాలంలో అవే ప్రాంతాలను కుంభవృష్టి ముంచెత్తుతుందని స్పష్టం చేస్తున్నారు. మున్ముందు విపత్తులు తరచూ సంభవిస్తాయని, వాటి తీవ్రతా పెరుగుతుందని గాంధీనగర్‌-ఐఐటీ సివిల్‌ ఇంజినీరింగ్‌-భూ విజ్ఞాన శాస్త్రాల విభాగం పరిశోధకులు వివరించారు. ఎల్‌నినో కారణంగా మహాసముద్ర జలాల ఉష్ణోగ్రతల్లో తలెత్తుతున్న మార్పులు దీనికి ప్రధాన కారణమని తెలిపారు. 1981 నుంచి 2010 వరకు తీవ్రమైన వడగాలుల ప్రభావం ఏడాదిలో మూడు రోజులే ఉండేవి. రాబోయే కాలంలో 2071 నుంచి 2100 వరకు ఏడాదిలో 11 రోజులదాకా ఉంటాయని అంచనా వేస్తున్నారు. శతాబ్దం చివరి నాటికి వడగాలుల తీవ్రత ఏకంగా ఏడాదికి 33 రోజులదాకా ఉంటుందని హెచ్చరించారు.

ఆ దీవుల భవిష్యత్తేమిటి?

వాతావరణ మార్పు ప్రభావం తీవ్రతను తెలుసుకోవడానికి ‘టువాలు’ దీవి ప్రత్యక్ష నిదర్శనంగా నిలవబోతోంది. రాబోయే యాభై నుంచి వందేళ్లలోపు ఆ దీవి సహా మరికొన్ని సముద్రంలో పూర్తిగా మునిగిపోయి అంతర్ధానమయ్యే ప్రమాదం ఉంది. కిరిబాటి, వనౌటు, మార్షల్‌ దీవులదీ ఇలాంటి పరిస్థితే అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మాల్దీవులకు సైతం కొంతమేర ముప్పు పొంచి ఉన్నట్లు విదితమవుతోంది. టువాలు అనేది దక్షిణ పసిఫిక్‌ మధ్యలో ఉండే ఒక చిన్న దీవి. వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వాల కమిటీ (ఐపీసీసీ) ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం... సముద్ర ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ నీటిమట్టం మరింత పెరిగి, తీవ్రస్థాయి తుపానులు సంభవిస్తాయి. ఫలితంగా టువాలు దీవి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే ముప్పుంది. అందుకే ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో జరిగిన వాతావరణ మార్పు చర్చల్లో ఆ దీవి ప్రతినిధులు క్రియాశీలకంగా పాల్గొన్నారు. వాతావరణ మార్పుల ప్రభావం తమ దేశంపై ముందెన్నడూ ఎరుగనంత తీవ్రంగా ఉందని, ఇది తమ ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని ఆ దేశ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలాఏళ్ల క్రితమే ఐరాసలో చేరినా, సమితి మూలసూత్రాలైన అభివృద్ధి, భద్రత, మానవ హక్కులు తమకు దక్కకుండా పోతున్నాయని ద్వీప దేశవాసులు వాపోతున్నారు. ఆ దేశానికి ప్రత్యేకమైన భాష, సంస్కృతి ఉన్నాయి. ఒకవేళ ఇక్కడి వారందరికీ వేరేచోట పునరావాసం కల్పించినా, ఆ సంస్కృతికి ముప్పు తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భూతాపం పెరిగితే...

ప్రపంచవ్యాప్తంగా భూతాపం పారిశ్రామిక యుగానికి ముందునాటి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌ మాత్రమే పెరిగితే భారతదేశంలో ఇలాంటి విపరీత వాతావరణ పరిస్థితులకు ప్రభావితమయ్యేవారు 27 శాతమే ఉంటారు. అదే భూతాపం మూడు డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగితే 36 శాతం, నాలుగు డిగ్రీలు పెరిగితే 45 శాతం ప్రభావితమవుతారు. మన దేశంలోని ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక లాంటి రాష్ట్రాల మీద ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఇలాంటి రాష్ట్రాల్లో దాదాపు పదిరెట్లు ఎక్కువగా భూతాప ప్రభావ తీవ్రత ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల్ల భారత్‌ లాంటి దేశాల్లో ఇటు భారీవర్షాలు, అటు వడగాలులతో మరణాలు ఎక్కువగానే సంభవిస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అలాంటప్పుడు ప్రజారోగ్య మౌలిక సదుపాయాలపై ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఎక్కువకాలం పాటు భారీవర్షాలు కురవడం వల్ల వరదలు సంభవించి, వ్యవసాయ ఉత్పాదకతతో పాటు రహదారులు, వంతెనలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. వరదలతో లోతట్టు ప్రాంతాల వాసులు తమ ఆవాసాలను కోల్పోవడం వల్ల వలసలూ తప్పవు. ఇలాంటి తీవ్ర దుష్పరిణామాల నుంచి కొంతైనా ఉపశమనం దక్కాలంటే ప్రభుత్వాల స్థాయిలో ముందస్తు ప్రణాళికలు చాలా అవసరం. వరద కాలానికి ముందే ఏటిగట్లను పటిష్ఠం చేయడం, కాలువల గట్లు బలహీనంగా ఉన్న ప్రదేశాలను, గతంలో భారీ వరదలు వచ్చినప్పుడు తీవ్రనష్టం జరిగిన ప్రాంతాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం లాంటివి అత్యంత ఆవశ్యకం. లేనిపక్షంలో ప్రకృతి ప్రకోపాన్ని గతంకంటే మరింత ఎక్కువ స్థాయిలో చవిచూడాల్సి వస్తుంది.

- కామేశ్వరరావు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జీ20 నాయకత్వం బృహత్తర అవకాశం

‣ ద్వైపాక్షిక బంధానికి కొత్త చివుళ్లు

‣ నీరుగారుతున్న సహ చట్ట స్ఫూర్తి

‣ ఒప్పంద సేద్యంలో లొసుగుల రాజ్యం

‣ మడ అడవులకు మరణ శాసనం

‣ ఇరాన్‌ మహిళ స్వేచ్ఛానినాదం

‣ చట్టం... రైతు చుట్టం కావాలి!

Posted Date: 26-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం