• facebook
  • whatsapp
  • telegram

మానవ తప్పిదం... ప్రకృతి ఆగ్రహం!

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం జోషీమఠ్‌లో తలెత్తిన పరిణామాలు స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నింపాయి. దానిపై ఆగమేఘాలపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

జోషీమఠ్‌లో నేల కుంగిపోయి నివాస గృహాలకు నిలువునా ఏర్పడిన పగుళ్ల దృశ్యాలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకె త్తించాయి. ప్రస్తుతం అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జోషీమఠ్‌ విపత్తుపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సహాయ చర్యలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు సైతం రంగంలోకి దిగాయి. దేహ్రాదూన్‌లోని వాడియా హిమాలయ భూగర్భ శాస్త్ర సంస్థ, జియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ), ఐఐటీ రూర్కీ పరిశోధక బృందాలు ఉత్తరాఖండ్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సిబ్బందితో కలిసి జోషీమఠ్‌లో చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు మొదలుపెట్టాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ (దేహ్రాదూన్‌), జాతీయ రిమోట్‌ సెన్సింగ్‌ కేంద్రం (హైదరాబాద్‌)లు జోషీమఠ్‌ పరిస్థితిపై అధ్యయనం జరిపి నివేదిక ఇవ్వాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కోరింది.

పర్యాటక కార్యకలాపాలు

ప్రకృతి పరిణామాలతో పాటు మానవ చర్యల కారణంగానూ జోషీమఠ్‌లో ప్రస్తుత విపత్కర పరిస్థితులు తలెత్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. భూగర్భ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ఎగువ భూభాగమైన గఢ్వాల్‌ హిమాలయాలు చాలా బలహీనమైనవి. కొన్నేళ్లుగా అక్కడ సాగుతున్న తవ్వకాలు, భారీ నిర్మాణ కార్యకలాపాలు ఆ ప్రాంతాన్ని తీవ్రంగా అస్థిరపరుస్తున్నాయి. ఏటా వర్షాకాలంలో ఆ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి తీవ్ర విధ్వంసం సృష్టించడం, మరణాలు సంభవిస్తుండటం అందరికీ తెలిసిందే. వర్షం కారణంగా మట్టి కొట్టుకుపోవడంతో తరచూ కొండచరియలు విరిగిపడుతున్నాయి. గఢ్వాల్‌ హిమాలయ ప్రాంతంలో ఏర్పడుతున్న చిన్నపాటి పగుళ్లకు కారణాలను తెలుసుకొని, సరైన పరిష్కారాలను సూచించడానికి ఉమ్మడి ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో 1976లో ఒక కమిటీని ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అప్పటి గఢ్వాల్‌ డివిజన్‌ కమిషనర్‌ మహేశ్‌చంద్ర మిశ్రా నేతృత్వం వహించిన ఆ కమిటీ పలు సిఫార్సులు చేసినా, అమలు ఊసే లేకుండా పోయింది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో విచ్చలవిడిగా నిర్మాణాలు చేపట్టడం తీవ్ర నష్టదాయకమని మహేశ్‌ చంద్ర కమిటీ హెచ్చరించింది. పాలకులు ఆ సూచనలను పట్టించుకున్న దాఖలాలు లేవు.

ఆది శంకరాచార్య దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన నాలుగు మఠాల్లో జ్యోతిర్మఠం ఒకటి. అది జోషీమఠ్‌గా వ్యవహారంలో స్థిరపడింది. హిందువులు ఈ పట్టణాన్ని అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. శీతాకాలంలో బద్రీనాథ్‌ క్షేత్రాన్ని మూసివేసినప్పుడు, ఆ స్వామిని జోషీమఠ్‌కు తీసుకొచ్చి పూజలు జరుపుతారు. హిమాలయ     పర్యాటకుల బేస్‌ క్యాంపుగానూ ఈ పట్టణం విరాజిల్లుతోంది. అలకనంద, ధౌలిగంగ నదుల సంగమ స్థానమైన విష్ణు ప్రయాగకు జోషీమఠ్‌ చాలా దగ్గరలో ఉంది. భూమి కుంగిపోవడం, గృహాలకు పగుళ్ల కారణంగా ప్రస్తుతం జోషీమఠ్‌ ఉనికికే ముప్పు దాపురించింది. ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్‌కు వెళ్ళే మార్గంలో ఉన్న ఈ పట్టణాన్ని ఏటా లక్షల సంఖ్యలో స్వదేశీ, విదేశీ పర్యాటకులు సందర్శిస్తారు. 1890 దాకా కొన్ని గృహాలు, ఒక ధర్మశాలతో జోషీమఠ్‌ చిన్నస్థాయి గ్రామంగా మాత్రమే ఉండేది. కాలక్రమంలో ఈ పట్టణంతో పాటు దాని చుట్టుపక్కల నిర్మాణాలు ఊపందుకొన్నాయి. ముఖ్యంగా బద్రీనాథ్‌, హేమ్‌కుండ్‌లకు భక్తుల రాకపోకలు పెరిగి జోషీమఠ్‌లో పర్యాటక కార్యకలాపాలు అధికమయ్యాయి. ఈ క్రమంలో ఇబ్బడి ముబ్బడిగా హోటళ్లు, ఇతర నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. రహదారుల విస్తరణ, ఇతర పనుల కోసం భారీ స్థాయిలో యంత్రాలు రంగంలోకి దిగాయి. ఈ ప్రాంతంలో జల విద్యుత్తు కేంద్రం ఏర్పాటు కోసం జాతీయ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) పలు సొరంగాలు తవ్వింది. వీటన్నింటివల్లా ప్రస్తుత పరిస్థితులు తలెత్తినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, తన కార్యకలాపాల వల్లనే జోషీమఠ్‌ ప్రాంతంలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయన్న వాదనలను ఎన్‌టీపీసీ కొట్టిపడేస్తోంది.

విస్తృత అధ్యయనం అవసరం

భారత భూకంప పటంలో గఢ్వాల్‌ హిమాలయ ప్రాంతం అయిదో జోన్‌లో ఉంది. ఈ జోన్‌లో భూకంపాల ముప్పు అధికంగా ఉంటుంది. జోషీమఠ్‌లో ప్రస్తుత పగుళ్లను ఈ కోణంలోనే చూడాలని పలువురు భూగర్భ, భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పడిన చీలికల వల్ల జోషీమఠ్‌ తీవ్ర అస్థిరతకు గురవుతోంది. వర్షాకాలంలో భారీ వానల వల్ల వాటిలోకి నీరు చేరి కొండచరియలు విరిగిపడటం అధికమవుతోంది. ఏది ఏమైనా గఢ్వాల్‌ హిమాలయ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా అధ్యయనం జరిపించాలి. ఆ ప్రాంతంలో మరిన్ని విపత్కర పరిస్థితులు తలెత్తకుండా సరైన చర్యలు తీసుకోవాలి.

- ఆర్‌.పి.నైల్వాల్‌ 

(ఉత్తరాఖండ్‌ వ్యవహారాల నిపుణులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈశాన్యంలో కొత్త కాంతులు

‣ సిరిధాన్యాలతో ఆహార భద్రత

‣ డ్రోన్‌ సాంకేతికతతో మార్కెట్‌కు రెక్కలు

‣ అనిశ్చితి నామ సంవత్సరానికి తెర

Posted Date: 13-01-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం