• facebook
  • whatsapp
  • telegram

పచ్చని ఉదజని తోడుంటే...

విద్యుదుత్పాదన, పరిశ్రమలు, రవాణా రంగాల్లో శిలాజ ఇంధనాలైన బొగ్గు, చమురు వాడకం వల్ల దిగుమతుల బిల్లుతో పాటు కర్బన కాలుష్యం పెరిగిపోతోంది. భారత్‌ నేడు చమురు దిగుమతుల్లో, కర్బన ఉద్గారాలలో ప్రపంచంలో మూడో స్థానం ఆక్రమిస్తోంది. దీని నుంచి బయటపడేందుకు హరిత ఉదజని మేలిమి మార్గంగా కనిపిస్తోంది.

దేశీయంగా 2070 నాటికి నెట్‌జీరో (కర్బన ఉద్గారాల తటస్థత)ను సాధించాలని మోదీ ప్రభుత్వం లక్షిస్తోంది. తదనుగుణంగా 2030 నాటికి సౌర, పవన, జల, అణు, బయోమాస్‌ వనరుల ద్వారా 500 గిగావాట్ల విద్యుదుత్పాదన సాధించాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. గత అక్టోబరు 31 నాటికే ఈ వనరుల నుంచి 172 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని సాధించింది. తాజాగా కర్బన ఉద్గార రహిత ఇంధనమైన హరిత ఉదజని ఉత్పత్తికి కేంద్రం ప్రత్యేక పథకం ప్రకటించింది. జాతీయ హరిత ఉదజని యోజన కింద 2030 నాటికి ఏటా 50 లక్షల టన్నుల హరిత ఉదజని ఉత్పత్తికి రూ.20 వేల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ పథకం మొత్తం ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షిస్తుందని, ఆరు లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా. ఇప్పటికే కర్ణాటకలో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలతో హరిత ఉదజని ప్రాజెక్టులు చేపట్టాలని ఏడు కంపెనీలు యోచిస్తున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో అదానీ గ్రీన్‌ ఎనర్జీ, ఎవాడా ఎనర్జీ, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌, అంకుర సంస్థ ఓసియోర్‌ ఎనర్జీ హరిత ఉదజని ప్రాజెక్టుల స్థాపనకు నడుంకట్టాయి. ప్రస్తుతం భారత్‌లో కిలో హరిత ఉదజని ధర ఏడు డాలర్లు. దీన్ని మరో పదేళ్లలో ఒక్క డాలరుకే అందించాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పథక రచన చేస్తోంది.

ఎన్నో రకాలు

ప్రస్తుతం ప్రపంచంలో వినియోగిస్తున్న 96శాతం ఉదజని శిలాజ ఇంధనాల నుంచే లభిస్తోంది. సహజ వాయువు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను 800 డిగ్రీల సెల్సియస్‌ వరకు వేడిచేసి వాటిలో ఉదజని, బొగ్గుపులుసు వాయువులను విడగొడుతున్నారు. అత్యుష్ణంలో బొగ్గును వాయువుగా మార్చినప్పుడు వెలువడే ఉదజనిని బ్రౌన్‌ హైడ్రోజన్‌ అంటారు. సహజవాయువును విడగొడితే గ్రే హైడ్రోజన్‌ వస్తుంది. భారత్‌ ఏటా 60 లక్షల టన్నుల గ్రే హైడ్రోజన్‌ను వినియోగిస్తోంది. బ్రౌన్‌, గ్రే ఉదజని ఉత్పత్తిలో వెలువడే కర్బన ఉద్గారాలను ఒడిసిపట్టి, నిల్వచేయగా మిగిలే ఉదజనిని నీలి ఉదజని అంటారు. గ్రే, నీలి ఉదజనుల ధర కిలోకు రెండు డాలర్లే కావడంతో వాటి వినియోగం ఎక్కువగా ఉంది. నీలి ఉదజనీ కాలుష్య కారకమే. సౌర, పవన విద్యుచ్ఛక్తి సాయంతో ఎలక్ట్రాలిసిస్‌ ప్రక్రియలో జలాన్ని ఉదజని, ఆమ్లజనిగా విడగొట్టినప్పుడు పూర్తిగా కర్బనరహిత హరిత ఉదజని లభిస్తుంది. ఉదజనిని ఇంధనంగా వాడితే వ్యర్థ పదార్థంగా కర్బనం కాకుండా నీరు వస్తుంది. అయితే హరిత ఉదజని ఉత్పత్తి ఖరీదైన ప్రక్రియ. అందుకే నేడు హరిత ఉదజని ధర కిలోకు ఏడు డాలర్లుగా ఉంది. భారత్‌లో పోనుపోను చవకగా మారుతున్న సౌర, పవన విద్యుత్తులతో నీటిని ఎలక్ట్రాలిసిస్‌ ప్రక్రియ ద్వారా ఆమ్లజని, ఉదజనిగా విడగొట్టే ప్రక్రియ ఊపందుకొంటోంది. ఈ ప్రక్రియకు కావాల్సిన ఎలక్ట్రోలైజర్లను భారత్‌లో చాలా కొద్ది కంపెనీలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. అంతర్జాతీయ విపణిలో అమెరికా, ఐరోపాలకన్నా 75శాతం తక్కువ ధరకు చైనా ఎలక్ట్రోలైజర్లను అందిస్తోంది. కేంద్రం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం ద్వారా సబ్సిడీలు ఇచ్చి భారత్‌లో ఈ తరహా కంపెనీల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. ఎలక్ట్రాలిసిస్‌ ద్వారా హరిత ఉదజని ఉత్పత్తికి కావాల్సిన విద్యుత్తు ఖర్చులను రద్దు చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఇటువంటి చర్యల ద్వారా భారత్‌ ఎలక్ట్రోలైజర్ల ఎగుమతి మార్కెట్లో గణనీయ భాగాన్ని కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది. కేంద్రం మున్ముందు 60 నుంచి 100 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్‌ సామర్థ్యంతో హరిత ఉదజని ఉత్పత్తి కర్మాగారాలను నెలకొల్పాలని తలపెట్టింది. భారత్‌లో కొన్ని రాష్ట్రాలు హరిత ఉదజని రంగంలో చొరవ తీసుకుంటున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఎలక్ట్రోలైజర్ల ఉత్పత్తిదారులకు సబ్సిడీలు ఇస్తానంటోంది. కేరళలో కొచ్చి నగరం చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిలో హరిత ఉదజని ఉత్పత్తి, నిల్వ, వినియోగానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది.

స్వదేశీ సాంకేతికత

ప్రస్తుతం సౌర విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమయ్యే ఫలకాల కోసం చైనా, అమెరికా వంటి దేశాలవైపు ఇండియా చూస్తోంది. చమురు కోసం పశ్చిమాసియా, రష్యాలపై ఆధారపడుతోంది. హరిత ఉదజని ఉత్పత్తికి కావాల్సినవి విద్యుత్తు, జలమే కాబట్టి ఈ రంగంలో స్వావలంబన సాధ్యమే. దీనికోసం నిపుణ మానవ వనరులు, అధునాతన సాంకేతికతలను స్వదేశంలోనే తయారు చేసుకోవచ్చు. జీ-20 అధ్యక్ష స్థానంలో భారత్‌- హరిత ఉదజని ఉత్పత్తిలో అంతర్జాతీయ సాంకేతిక సహకార వృద్ధికి కృషిచేయాలి. ఫ్రాన్స్‌తో మాదిరిగానే ఇతర సభ్య దేశాలతోనూ హరిత ఉదజని ఉత్పత్తికి ద్వైపాక్షిక సహకార ఒప్పందాలను కుదుర్చుకోవాలి.

తక్కువ ఖర్చుతో ప్రయాణం 

భారతదేశ కర్బన ఉద్గారాలలో మూడో వంతుకు కారణమవుతున్న రవాణా రంగం హరిత ఉదజని వినియోగానికి అత్యంత అనువైనది. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ నిరుడు మార్చిలో హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌తో నడిచే టొయోటా మిరాయ్‌ కారులో పార్లమెంటుకు వచ్చారు. హరిత ఉదజనిని దేశంలో ఉత్పత్తి చేయడమే కాకుండా విదేశాలకు ఎగుమతి సైతం చేస్తామని ప్రకటించారు. దేశమంతటా మోటారు వాహనాల్లో హరిత ఉదజనిని నింపే బంకులను ఏర్పాటు చేయదలచామని, వాటివల్ల కిలోమీటరుకు రెండు రూపాయలకన్నా తక్కువ ఖర్చుతోనే ప్రయాణించే సౌలభ్యం ఏర్పడుతుందని వివరించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ ఏడాది చివరికే ఎనిమిది ‘హెరిటేజ్‌’ మార్గాల్లో హరిత ఉదజనితో నడిచే రైళ్లను ప్రవేశపెడతామని ప్రకటించారు. ప్రస్తుతం వీటిలో నారో గేజ్‌లో డీజిల్‌ రైళ్లు నడుపుతున్నారు. ఇకపై హైడ్రోజన్‌ ఘటాల మోటార్లతో నాలుగు బోగీల రైళ్లుగా వీటిని నడపదలచామని రైల్వే మంత్రి వెల్లడించారు. ఉదజని ఘటంతో నడిచే రైలును ఫ్రెంచి కంపెనీ ఎల్‌ స్టామ్‌ తయారు చేయగా, దాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారి జర్మనీలో ప్రయోగాత్మకంగా నడిపారు. 2018 నుంచి రెండేళ్లపాటు ప్రయోగపరీక్షలు నిర్వహించిన తరవాత జర్మనీ ఉదజని రైళ్లను వాణిజ్య ప్రాతిపదికపై నడుపుతోంది.

- ఏఏవీ ప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నదుల్ని కాటేస్తున్న వ్యర్థాలు

‣ మానవ తప్పిదం... ప్రకృతి ఆగ్రహం!

‣ ఎగుమతులు పెరిగితేనే ఆర్థిక ప్రగతి

‣ తుర్కియే జిత్తులకు పైయెత్తు!

Posted Date: 23-01-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం