• facebook
  • whatsapp
  • telegram

సముద్ర జీవావరణానికి కాలుష్యం ముప్పు

సాగరాల్లో లక్షలాది జీవజాతులు మనుగడ సాగిస్తాయి. అద్భుతమైన జీవవైవిధ్యం వాటి సొంతం. అయితే పారిశ్రామిక వ్యర్థాలను వదలడం, ఇసుకను తోడటం, నౌకా రవాణా వంటి మానవ కార్యకలాపాలు ఈ జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేస్తున్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయ జలాల్లో జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు ఒక చారిత్రక ఒప్పందం కుదుర్చుకోవడం ముదావహం.

సముద్రాల్లోని జీవవైవిధ్యాన్ని పరిరక్షించే అంశంపై 2004లోనే ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో చర్చలు మొదలయ్యాయి. ఇటీవల నిర్వహించిన ‘దేశాల వెలుపలి ప్రాంతాల్లోని సముద్ర జీవవైవిధ్యంపై అంతర ప్రభుత్వాల సదస్సు’లో కూలంకష చర్చలు జరిగాయి. అవి ఫలించి ఒప్పందమూ కుదిరింది. సముద్ర జీవవైవిధ్యాన్ని ధ్వంసంచేసే శక్తులపై పోరాడేందుకు సాగిస్తున్న ప్రయత్నాలు విజయవంతం అయ్యాయంటూ ఆ సందర్భంగా ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పు, జీవవైవిధ్య నష్టం, సాగరాల కాలుష్యం అనే మూడు సంక్షోభాలను పరిష్కరించేందుకు ఈ ఒప్పందం కీలకం కానుందన్న అభిప్రాయాన్నీ ఆయన వ్యక్తపరచారు.

సాగరాల్లోని జీవవైవిధ్యానికి నష్టం కలిగించే కారకాల్లో చమురు తెట్టు ముఖ్యమైనది. చమురు రవాణాకుతోడు సముద్ర గర్భాల్లో చమురు కోసం అన్వేషణ జరుగుతుంటుంది. ఇలాంటప్పుడు చమురు నీళ్లలోకి లీకవుతుంది. అది తెట్టులా ఏర్పడటంతో ఆ ప్రాంతంలో ఉండే సముద్ర జీవులకు ఆమ్లజని అందక అవి మరణించే ప్రమాదం ఉంటుంది. అధిక విస్తీర్ణంలో వ్యాపించే తెట్టు కారణంగా చేపలు వంటి సముద్రజీవుల శరీరాల్లోకి అది ప్రవేశించి, వాటి పునరుత్పాదకతను సైతం దెబ్బతీస్తుంది. చమురు తెట్టు కారణంగా అవి ఊపిరాడక మరణిస్తాయి. ఇలా కొన్ని జలచరాలు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదముంది. తీర ప్రాంతాలకు కొట్టుకొచ్చే చమురు బంతుల వల్ల ఉభయ చరాలకు పెనుముప్పు పొంచి ఉందంటూ పరిశోధకులు కొందరు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రోజూ వేల సంఖ్యలో నౌకలు సముద్రాల్లో తిరుగుతుంటాయి. ఇవన్నీ పెద్ద మొత్తంలో నైట్రోజన్‌ ఆక్సైడ్‌, సల్ఫర్‌ ఆక్సైడ్‌లను వెలువరిస్తాయి. వీటివల్ల పర్యావరణంతో పాటు, సముద్ర జీవావరణంపైనా తీవ్ర దుష్ప్రభావాలు పడుతున్నాయి. ఈ వాయువులు ఓజోన్‌ పొరను ధ్వంసం చేయడం ద్వారా హరితగృహ ప్రభావానికి (గ్రీన్‌హౌస్‌ ఎఫెక్ట్‌కు), భూతాపానికి దారితీస్తాయి. సముద్రాల్లో తిరిగేటప్పుడే ఈ వాయువులు వెలువడుతుండటంతో సముద్ర జలాలూ వేడెక్కుతున్నాయి. నౌకలు ప్రయాణించేటప్పుడు వాటి పొగ గొట్టాల నుంచి పెద్ద మొత్తంలో నైట్రోజన్‌ ఆక్సైడ్‌, సల్ఫర్‌ ఆక్సైడ్‌ వంటి వాయువులు వెలువడుతున్నాయి. ఇవన్నీ సముద్ర జలాల్లో కలుస్తుండటంతో ఆమ్ల వర్షాలు కురవడం వంటి తీవ్ర దుష్పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ సాగరజీవుల మనుగడకు సవాలు విసురుతున్నాయి.

సాగర తీరాల్లో చేపట్టే పూడికతీత (డ్రెడ్జింగ్‌) ప్రభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. నౌకలు లంగరు వేయడానికి వీలుగా తీరాలకు సమీప ప్రాంతాల్లో తరచూ పూడికను తీస్తుంటారు. దీనివల్ల ఆ ప్రాంతాల్లో సహజ ఆవాసాలను ఏర్పాటుచేసుకున్న జీవులు చెల్లాచెదురవుతాయి. తీవ్ర ఒత్తిడికి గురై వేరే ప్రాంతాలకు వలస వెళ్తాయి. పూడికతీత కారణంగా సముద్ర గర్భాల్లో ఉండే గడ్డి జాతులు, పగడపు దిబ్బలు తీవ్రంగా దెబ్బతింటాయి. డ్రెడ్జింగ్‌ పనులు చేపట్టే ప్రాంతాల్లో గుడ్డు, లార్వా దశల్లో ఉండే జలచరాలు మొత్తంగా అంతరించిపోతాయి. సముద్ర జీవావరణానికి ఇన్ని నష్టాలున్నా- నౌకాయానం సాఫీగా సాగేందుకు వీలుగా పూడికతీతను విస్తృతంగా చేపడుతూనే ఉన్నారు. సాగరాల్లోని జీవజాతులను పరిరక్షించే దిశగా ఐక్యరాజ్య సమితి తీసుకున్న తాజా నిర్ణయం సత్ఫలితాలను ఇవ్వాలంటే- ఈ సమస్యలన్నింటినీ క్రమంగా పరిష్కరించుకోవాలి. నౌకల నుంచి వెలువడే వాయువులను నియంత్రించాలన్న ప్రతిపాదనలు ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. చమురు తెట్టుదీ అదే పరిస్థితి. ఇటువంటి సమస్యలన్నింటినీ అధిగమించి సముద్రాల్లోని జీవవైవిధ్యాన్ని కాపాడగలిగితే- భారీ విజయం సాధించినట్లే!

- రఘురామ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మహిళా సమానత్వమే పరమావధి

‣ ద్రవ్యోల్బణ కట్టడితోనే వృద్ధి జోరు

‣ సముద్ర సహకారంలో చెట్టపట్టాల్‌!

‣ భారత్‌-ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు

‣ మహిళా కేంద్రిత అభివృద్ధి అజెండా

‣ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2022-23

Posted Date: 18-03-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం