• facebook
  • whatsapp
  • telegram

నదుల్ని తవ్వేస్తున్నారు

మానవాళితో పాటు ఎన్నో రకాల జీవజాతుల మనుగడకు నదులే ఆధారం. మితిమీరిన మానవ కార్యకలాపాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదుల స్వచ్ఛత, ఉనికికి ముప్పు ఏర్పడుతోంది. వీటి పరిరక్షణ పట్ల అందరికీ అవగాహన కలిగించే ఉద్దేశంతో ఏటా మార్చి 14న నదుల అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ‘నదుల హక్కులు’ అనేది ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం.

నదులు జీవజల వాహికలు. జీవవైవిధ్యానికి అవి ప్రతీకలు. నాగరికత విలసిల్లింది నదీతీరాల్లోనే. పర్యావరణ వ్యవస్థలను పోషించడంలో వాటి పాత్ర ఎనలేనిది. అడవులు, మైదానాలు, చిత్తడి నేలలు, తీరప్రాంతాలతో పాటు సముద్రాల్లోని జీవులకు అవసరమైన పోషకాలను అందించేవీ- ఈ జలవనరులే! తాగునీటికి, సాగునీటికి మనం ఎక్కువగా ఆధారపడుతున్నదీ వాటిపైనే. అందుకే నదులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత యావత్‌ మానవాళిపైనా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ నదులపై భారీ ఆనకట్టలను నిర్మించడం వల్ల ప్రభావితమైన వారంతా 1997 మార్చిలో బ్రెజిల్‌లోని కురిటీబాలో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే 20 దేశాలకు చెందిన నదీ నిపుణులు నదుల పరిరక్షణే లక్ష్యంగా అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవాన్ని తెరపైకి తెచ్చారు.

చట్టపరమైన హక్కులు

మన రాజ్యాంగంలోని 51వ అధికరణ ప్రకారం- నదులు, సరస్సులు, అడవులతో పాటు సహజ పర్యావరణాన్ని పరిరక్షించడం పౌరుల బాధ్యత. నదులను పూజించే మనదేశంలో ఏ నదీతీరాన్ని చూసినా కాలుష్యం, ఇసుక దోపిడీ కనిపిస్తాయి. నదులపై భారీ ఆనకట్టలను నిర్మిస్తే సహజ పర్యావరణానికి హాని కలుగుతుంది. వాటికి బదులు చిన్నచిన్న అడ్డుకట్టలతో నీటిని మళ్ళిస్తే పర్యావరణ ప్రయోజనాలు అధికంగా ఉంటాయన్నది భూభౌతిక శాస్త్రవేత్తల మేలిమి సూచన. చాలా దేశాలు ఈ సూచనను పెడచెవిన పెడుతున్నాయి. ప్రపంచంలోని వివిధ నదులపై సుమారు 57వేల భారీ ఆనకట్టలు ఉన్నాయి. ముందుచూపు, సమగ్ర విధానం లేకుండానే వీటి నిర్మాణాలు చేపడుతున్నారన్నది పర్యావరణవేత్తల వాదన. ఇష్టానుసారంగా ఆనకట్టలను నిర్మించి ప్రవాహాలను నిరోధించడం- నదుల ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమే! తమలోకి వచ్చే ప్రవాహాలను రక్షించడం, కాలుష్యం నుంచి విముక్తం కావడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం వంటి హక్కులు నదులకు ఉంటాయి. వీటిని కాపాడే బాధ్యతను పలు దేశాలు భుజానికెత్తుకున్నాయి. మొదటిసారిగా 2008లో ఈక్వెడార్‌ రాజ్యాంగం ప్రకృతికి చట్టబద్ధమైన హక్కులను కల్పించింది. 2011లో బొలీవియా సైతం ఈ దిశగా అడుగులు వేసింది. న్యూజిలాండ్‌ పార్లమెంట్ 2017లో వాంగనూయ్‌ నదీ పర్యావరణ వ్యవస్థకు వ్యక్తిత్వ హోదా కట్టబెట్టింది. అదే ఏడాది ఉత్తరాఖండ్‌ హైకోర్టు గంగ, యమున, గంగోత్రి, యమునోత్రి హిమనదాలకు జీవిస్తున్న వ్యక్తికి ఉండే చట్టపరమైన హక్కులన్నీ ఉంటాయంటూ తీర్పు వెలువరించింది. 2018లో బంగ్లాదేశ్‌ తమ దేశంలోని నదులన్నింటికీ పౌరులతో సమానమైన చట్టపరమైన హోదా కల్పించింది. నదులు, జలాశయాల పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలదేనని కేరళ హైకోర్టు 2020లో స్పష్టీకరించింది. నదులకు హక్కులు కల్పించడంతోనే వాటి పరిరక్షణ సుసాధ్యమైపోదు. నదులను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత పట్ల అందరికీ అవగాహన కల్పించడంతో పాటు- ఆ దిశగా సామాజిక బాధ్యతను పెంపొందించాల్సిన అవసరముంది.

కాటేస్తున్న కాలుష్యం

పారిశ్రామిక కార్యకలాపాలకు తోడు పట్టణీకరణ శరవేగంగా విస్తరిస్తుండటంతో దేశంలోని నదులకు హాని కలుగుతోంది. తీరప్రాంతాల్లో వెలసిన గ్రామాలు కాలక్రమంలో పట్టణాలు, నగరాలుగా విస్తరిస్తున్నాయి. ఈ పరిణామంతో నదులు ఆక్రమణలకు, కాలుష్యానికి గురవుతున్నాయి. యమునానది ప్రవాహంలో కేవలం రెండు శాతమే దిల్లీ పరిసరాల్లో విస్తరించినా, 80శాతం కాలుష్యానికి హస్తినే కారణం! కాలుష్యం బారి నుంచి నదులకు విముక్తి కల్పించడం ఎంతో ప్రయాసతో కూడుకున్న పని. 2014లో మొదలైన నమామి గంగే ప్రాజెక్టే ఇందుకు ఉదాహరణ. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసినా, లక్షిత ఫలితాలను వేగంగా సాధించలేకపోతున్నాం. నదులు ఎదుర్కొంటున్న మరో తీవ్ర ముప్పు- వనరుల దోపిడీ. తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి, కృష్ణా, పెన్నా వంటి నదులు మొదలు... చిన్నపాటి వాగుల్లోనూ చట్టవిరుద్ధంగా, భారీ యంత్రాలతో ఇసుక దోపిడీ సాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో ఆనకట్టలు నిర్మించడం, మితిమీరిన ఇసుక తవ్వకాల వల్ల చాలా నదుల్లో కేవలం వరదలు వచ్చినప్పుడే జలకళ సంతరించుకొంటోంది. నదులు సమస్త జీవుల ఉమ్మడి ఆస్తి. వీటి విషయంలో సర్వ జీవులకూ సమాన హక్కులు, బాధ్యతలు ఉంటాయి. మానవాళి ఆ బాధ్యతను సమర్థంగా నెరవేర్చినప్పుడే- నదులు పరిశుభ్రంగా కళకళలాడతాయి!

- గొడవర్తి శ్రీనివాసు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సామాజిక న్యాయమే ప్రపంచ గమ్యం

‣ చైనా - ఇరాన్‌ సహకారంలో చిటపటలు

‣ అమ్ముల పొదిలో కృత్రిమ మేధ

‣ త్రైపాక్షిక సహకారంతో వ్యూహాత్మక ముందడుగు

Posted Date: 18-03-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం