• facebook
  • whatsapp
  • telegram

కాలుష్యం కట్టడికి సహజ వాయువు

కాలుష్యాన్ని తగ్గించేందుకు సహజ వాయువు ఉత్పత్తి, వినియోగం పెంచాలని ప్రభుత్వం లక్షించింది. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలైనా దేశ ఇంధన రంగంలో నేటికీ మూడొంతుల వాటా బొగ్గుదే. దీన్ని మండించడం వల్ల కర్బన ఉద్గారాలు ఇబ్బడిముబ్బడిగా వెలువడి పర్యావరణం దెబ్బతింటోంది. కాలుష్యాన్ని కట్టడి చేయకపోతే వాతావరణ మార్పులు చోటుచేసుకుని విపత్తులు మరింతగా ముమ్మరిస్తాయి.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడానికి, కనీస అవసరాలు తీర్చడానికి ఇంధనం అవసరం. అయితే ఏ రకమైన ఇంధనాన్ని ఎక్కువగా వినియోగిస్తామన్నదానిపై పర్యావరణ పరిరక్షణ ఆధారపడి ఉంటుంది. జపాన్‌, ఐరోపా దేశాలు థర్మల్‌ విద్యుదుత్పత్తిని పూర్తిగా తగ్గించడం, బొగ్గును మండించడాన్ని నియంత్రించడం ద్వారా కాలుష్యాన్ని అరికడుతున్నాయి. మన దేశ మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యంలో సగం థర్మల్‌ విద్యుత్తే! ఈ విద్యుత్తు కేంద్రాల్లో ఏటా 65 కోట్ల టన్నులకు మించి బొగ్గును మండిస్తూ... బూడిద, కర్బన ఉద్గారాలను యథేచ్ఛగా గాలిలోకి వదులుతున్నారు. సహజ వాయువు (ఎన్‌జీ) కొరత కారణంగా ఆ గ్యాస్‌తో విద్యుదుత్పత్తి చేపట్టే కేంద్రాలు పూర్తిస్థాయిలో నడవడంలేదు.

ఉత్పత్తి పెంపు తీరు..

కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడతామని పారిస్‌ తదితర అంతర్జాతీయ వాతావరణ సదస్సుల్లో భారత్‌ ఉద్ఘాటించింది. మొత్తం ఇంధనంలో సహజ వాయువు వినియోగాన్ని 2030కల్లా 15 శాతానికి పెంచాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం రికార్డుల్లో చాటుతోంది. ఆచరణలో మాత్రం అది కానరావడం లేదు. 2012-22 మధ్య మనదేశంలో ఎన్‌జీ ఉత్పత్తి 3400 కోట్ల ఘనపు మీటర్ల (బీసీఎంల) నుంచి 2700 బీసీఎంలకు పడిపోయింది! ఈ పదేళ్ల కాలంలో బొగ్గు ఉత్పత్తి ‘సంచిత వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్‌)’ 3.80శాతంగా ఉంటే... సహజ వాయువుది మైనస్‌ 2.44 శాతానికి దిగజారినట్లు కేంద్ర గణాంక మంత్రిత్వశాఖ తాజా నివేదిక ఎండగట్టింది. ఇంధన ఉత్పత్తిని ‘పెటాజౌల్‌’లో లెక్కిస్తారు. దేశంలో 2021-22లో అన్నిరకాల వనరుల నుంచి మొత్తం 16,146.44 పెటాజౌళ్ల ఇంధనం ఉత్పత్తి అయింది. ఇందులో బొగ్గు నుంచి 11,774, సహజ వాయువు ద్వారా 1,318 పెటాజౌళ్ల ఇంధనం సమకూరింది. ఈ పరిస్థితుల్లో దేశ ఇంధన ఉత్పత్తిలో సహజ వాయువు వాటాను 15శాతానికి పెంచడం చాలా కష్టమని నీతి ఆయోగ్‌ భావిస్తోంది. దాంతో కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడం ఎలాగన్నది కీలక ప్రశ్నగా మారింది. దేశంలో విద్యుదుత్పత్తి వార్షిక వృద్ధిరేటు 2012-23 మధ్యకాలంలో స్థిరంగా 4.41శాతం నమోదైంది. సహజ వాయువు ఉత్పత్తి మాత్రం ఆ స్థాయిలో లేదు. పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గును యథేచ్ఛగా మండిస్తున్నారు. 2012-13లో 55.64 కోట్ల టన్నుల బొగ్గును వెలికితీసి విద్యుదుత్పత్తి, పారిశ్రామిక అవసరాలకు వినియోగించారు. 2021-22లో బొగ్గు ఉత్పత్తి 77.81కోట్ల టన్నులకు ఎగబాకింది. దేశీయ ఇంధన అవసరాలను తీర్చేందుకు మరో మూడేళ్ల నాటికి వంద కోట్ల టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తిని సాధించాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించుకొంది.

వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) ధరల పెంపు భారతీయ సగటు కుటుంబాలకు ఆర్థికంగా భారమవుతోంది. ప్రధానమంత్రి ఉజ్జ్వల్‌ యోజన కింద 9.59కోట్ల కుటుంబాలకు సరఫరా చేసే గ్యాస్‌ సిలిండర్‌ ధరపై రూ.200 రాయితీ ఇస్తూ, ఆ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. మధ్యతరగతి కుటుంబాలకు గ్యాస్‌ ధర మోయలేని భారమే అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో 2020-2022 మధ్య ఎల్‌పీజీ ధరలు 300శాతం ఎగబాకాయి. మన దేశంలో గృహావసరాలకు సరఫరాచేసే గ్యాస్‌ సిలిండర్‌ ధర ఈ కాలవ్యవధిలో 72 శాతమే పెరిగిందని, ధరల నియంత్రణ వల్ల చమురు సంస్థలకు నష్టాలు వచ్చాయని కేంద్రం చెబుతోంది. చమురు సంస్థలను ఆదుకునేందుకు రూ.22,000 కోట్ల గ్రాంటును గత నవంబరులో కేంద్రం ప్రకటించినా గ్యాస్‌ సిలిండర్‌ ధర మాత్రం చిల్లర మార్కెట్‌లో దిగిరాలేదు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్‌ ధరలు మండుతున్న మాట వాస్తవం. వాటి ధరలు అమెరికాలో 140శాతం, బ్రిటన్‌లో 281శాతం పెరిగినా ఇండియాలో 72శాతమే పెంచామని కేంద్రం సమర్థించుకుంటోంది. ఇప్పటికే పెంచిన సిలిండర్‌ ధరలతో చిన్న కుటుంబాలు ఆర్థికంగా సతమతమవుతున్నాయి.

ధరల నియంత్రణ..

ఎల్‌పీజీ ధరలను నియంత్రించేందుకు వ్యూహాత్మక నిల్వలు చేపట్టాలని కేంద్రం ప్రణాళికల తయారీకి కసరత్తు చేయడం మంచి పరిణామం. జపాన్‌ సైతం ఎల్‌పీజీ వ్యూహాత్మక నిల్వలు చేపట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్‌ యుద్ధంలాంటి విపత్తులు తలెత్తితే సామాన్య కుటుంబాలకు అందించే గ్యాస్‌ సిలిండర్లతో పాటు ఎరువుల తయారీకీ గ్యాస్‌ కొరత ఏర్పడి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. కర్బన ఉద్గారాల కట్టడి నిమిత్తం ఇంధనోత్పత్తిలో సహజ వాయువు వాటాను పెంచుతామంటున్న కేంద్రం- ఈ రంగాన్ని అభివృద్ధి చేయడంపై చిత్తశుద్ధితో దృష్టి సారించాలి. ఎరువుల తయారీ మొదలు దేశ జనాభాకు నిత్యం ఆహారం వండి పెట్టడానికి నియంత్రిత ధరల్లో సహజ వాయువును అందించడం ఎంతో అవసరం. మౌలిక సదుపాయాలు కల్పించకుండా, పెట్టుబడులను పెంచకుండా సహజ వాయువు ఉత్పత్తి పెరగదన్నది యథార్థం!

బొగ్గే ఆధారం

భారత్‌ ఇంధనోత్పత్తి రంగంలో బొగ్గుపైనే అధికంగా ఆధారపడుతోంది. 2021-22లో అన్ని వనరుల నుంచి ఉత్పత్తిచేసిన మొత్తం ఇంధనంలో బొగ్గు ద్వారా 72.92శాతం, సహజ వాయువు ద్వారా 8.16శాతం సమకూరింది. దేశంలో ఏటా వినియోగిస్తున్న సుమారు 5,500 కోట్ల ఘనపు మీటర్ల గ్యాస్‌లో 45శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. ఈ నేపథ్యంలోనే 2030 నాటికి మొత్తం ఇంధనంలో సహజ వాయువు వాటాను 15శాతానికి పెంచుకోవాలని, అలాగైతేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని కేంద్రం చెబుతోంది. ప్రస్తుత సహజవాయువు ఉత్పత్తి, అమ్మకాల తీరును చూస్తుంటే 2030 నాటికి దీని వాటా 7-11 శాతం మధ్యే ఉంటుందని బీపీ ఎనర్జీ ఔట్‌లుక్‌ తాజా నివేదిక అంచనా వేసింది. బొగ్గు వినియోగం వల్ల కర్బన ఉద్గారాలు అధికంగా విడుదలవుతాయి. వీటి కారణంగా వాయు కాలుష్యం విపరీతంగా పెరిగి పర్యావరణం దెబ్బతిని భూతాపం అధికమవుతోంది. ప్రస్తుతం మనదేశంలో పర్యావరణంలోకి విడుదలవుతున్న కర్బన ఉద్గారాలను 2050 నాటికి 95శాతం మేర తగ్గించుకోవాలంటే- సహజవాయువు వినియోగాన్ని 17,700 కోట్ల ఘనపు మీటర్లకు పెంచుకోవాలి. ఎన్ని రకాల అంచనాలు వేసినా, అప్పటికి దాని ఉత్పత్తి 13,200 కోట్ల ఘనపు మీటర్లు మించదన్నది నిపుణుల మాట!

- మంగమూరి శ్రీనివాస్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భావ ప్రకటన స్వేచ్ఛకు భరోసా

‣ సౌరశక్తితో ఇంధన భద్రత

‣ శ్రామిక నైపుణ్యం.. దేశానికి వరం!

‣ అంగట్లో వ్యక్తిగత సమాచారం!

Posted Date: 12-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం