• facebook
  • whatsapp
  • telegram

కారడవులపై గొడ్డలి వేటు

భారత్‌లో అడవుల విస్తీర్ణం పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ప్రపంచంలో వనాల క్షీణతలో ఇండియాది రెండో స్థానమని బ్రిటన్‌కు చెందిన ఒక సంస్థ వెల్లడించింది. భారత్‌లో దట్టమైన అడవులు తరిగిపోవడమే దీనికి కారణం.

ఇండియాలో 2019-2021 మధ్య అటవీ విస్తీర్ణం 1,540 చదరపు కిలోమీటర్ల (1.54 లక్షల హెక్టార్ల) మేర పెరిగిందని రెండేళ్ల కిందటి భారతదేశ అటవీ స్థితిగతుల నివేదిక తెలిపింది. అయితే, 2015-2020 మధ్య భారత్‌ 6.68 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వనాలను కోల్పోయిందని బ్రిటన్‌కు చెందిన యుటిలిటీ బిడ్డర్‌ సంస్థ ఈ ఏడాది మార్చిలో వెల్లడించింది. అదే కాలానికి 16.95 లక్షల హెక్టార్ల అడవులను కోల్పోయిన బ్రెజిల్‌- అటవీ క్షయంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అందుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణం. 6.50 లక్షల హెక్టార్ల అటవీ క్షయంతో ఇండొనేసియా మూడో స్థానంలో ఉంది. అక్కడ ఆయిల్‌ పామ్‌ సాగు కోసం అడవులను నరికేస్తున్నారు.

భారత్‌లో అధిక జనాభా అవసరాల కోసం అడవులు హరించుకుపోతున్నాయి. బ్రెజిల్‌ 1990-2000 మధ్యకాలంలో 42.54 లక్షల హెక్టార్ల అడవులను కోల్పోయింది. 2015-2020 మధ్య అక్కడ అటవీ క్షీణత 16.95 లక్షల హెక్టార్లకు దిగి వచ్చింది. ఇండొనేసియాలోనూ అటవీ క్షయం తగ్గింది. అదే కాలంలో భారత్‌లో మాత్రం పెరిగింది. 1990-2000 మధ్య 3.84 లక్షల హెక్టార్ల మేర అడవులను భారత్‌ కోల్పోయింది. 2015-2020 మధ్య అది 6.68 లక్షల హెక్టార్లకు చేరింది. ఈ లెక్కన 1990-2020 మధ్య ప్రపంచంలో అత్యధిక శాతం అడవులను భారత్‌ కోల్పోయింది. ప్రపంచమంతటా పశువుల పెంపకానికి అడవులను కొట్టేస్తున్నారు. ఈ ఒక్క కారణం వల్లనే ఏటా 21 లక్షల హెక్టార్లకు పైగా అడవులు హరించుకుపోతున్నాయి. నూనె గింజల సాగు కోసం మరో 9.50 లక్షల హెక్టార్ల అటవీ భూములు అంతరిస్తున్నాయి. ఆయిల్‌ పామ్‌తో పాటు సోయా బీన్ల సాగు కోసం అడవులను నరికేస్తున్నారు.

జాతీయ అటవీ గణన పద్ధతికి, అంతర్జాతీయ లెక్కింపు విధానానికి మధ్య వ్యత్యాసం వల్లనే భారత్‌లో అటవీ విస్తీర్ణం తగ్గినట్లు కనిపిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారత అటవీ సర్వే సంస్థ (ఎఫ్‌ఎస్‌ఐ) అడవుల వెలుపల పెరిగే గుబురు చెట్లనూ వనాల విస్తీర్ణంలో లెక్కిస్తుంది. అడవుల పరిధికి వెలుపల ఒక హెక్టారు విస్తీర్ణంలోని వృక్షాలను సర్వేలో చేరుస్తుంది. ఇతర సర్వేలు చెట్ల గుబుర్లను లెక్కలోకి తీసుకోవు. అందువల్ల అటవీ విస్తీర్ణంలో వ్యత్యాసం కనిపిస్తోంది. భారత్‌లో 23-25 శాతం భూభాగంలో అడవులు, గుబురైన చెట్లు ఉన్నాయని ఎఫ్‌ఎస్‌ఐ అంచనా. అందులో 18-19శాతం భూభాగంలో సహజ అరణ్యాలు, రెండు-మూడు శాతం భూమిలో వన్యమృగ అభయారణ్యాలున్నాయి. మిగతా భూమిలో వ్యావసాయిక వనాలున్నాయి. సంప్రదాయ అడవులకు వెలుపల వాణిజ్య ప్రాతిపదికపై పెంచుతున్న ఈ వ్యావసాయిక వనాలనూ అడవులుగా పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశ కలప అవసరాల్లో 80శాతాన్ని వ్యావసాయిక అడవులే తీరుస్తున్నాయి. ఇలాంటివి ఇటీవల బాగా విస్తరిస్తున్నాయి.

భారతీయ అడవులను ఎఫ్‌ఎస్‌ఐ నాలుగు రకాలుగా వర్గీకరించింది. 70శాతంకన్నా ఎక్కువ వృక్షాలు ఉన్న దట్టమైన అడవి, 40-70శాతం మధ్య చెట్లు ఉండే ఒక మోస్తరు దట్టమైన అడవి, 10 నుంచి 40శాతం చెట్లు ఉండే బహిరంగ అడవి, మడ అడవులు. 10శాతం కన్నా తక్కువ చెట్లు, పొదలు ఉన్న భూమిని చిట్టడివిగా వర్గీకరించారు. భారత్‌లో దట్టమైన అడవులు హరించుకుపోతున్న మాట నిజం. ఒక మోస్తరు దట్టంగా ఉండే అడవుల విస్తీర్ణం మాత్రం పెరుగుతోంది. ఇండియాలో 2021 నాటికి 9.96శాతం భూభాగంలోనే దట్టమైన అడవులు ఉన్నాయి. 1987లో వాటి విస్తీర్ణం 10.88శాతం. గనులు, పరిశ్రమలు, మౌలిక వసతుల నిర్మాణం కోసం కోల్పోయే వనాలకు బదులు వేరే చోట అంతే విస్తీర్ణంలో అడవులు పెంచాలని నిబంధన విధించారు. దీన్ని సక్రమంగా అమలు చేయాలి. 2030 కల్లా అదనంగా 250-300 కోట్ల టన్నుల బొగ్గుపులుసు వాయువును పీల్చుకోగల కొత్త అడవులను పెంచుతామని భారత్‌ అంతర్జాతీయ వాతావరణ సదస్సుల్లో హామీ ఇచ్చింది. దీన్ని సుసాధ్యం చేయడానికి తగినన్ని నిధులను మాత్రం కేటాయించడం లేదు. ఇకనైనా ఈ లోపాన్ని సరిదిద్ది అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి.

- ఆర్య
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ముసురుతున్న మాంద్యం మబ్బులు

‣ సమర్థ నిర్వహణతోనే జల సంరక్షణ

‣ పాక్‌ ఆర్థికం.. అతలాకుతలం!

‣ భూతాపంతో అకాల వర్షాలు

‣ కాలుష్యం కట్టడికి సహజ వాయువు

‣ సాగర వ్యూహం.. సరికొత్త బంధం!

Posted Date: 12-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం