• facebook
  • whatsapp
  • telegram

కార్చిచ్చుల వన విధ్వంసం

వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. ఆ ప్రభావం అడవులపై పడుతోంది. కార్చిచ్చుల వల్ల అరణ్యాలు దహించుకుపోయి వాటి విస్తీర్ణం నానాటికీ కుంచించు కుపోతోంది.

ప్రపంచ అటవీ విస్తీర్ణం వేగంగా క్షీణిస్తోంది. గత మూడు దశాబ్దాల కాలంలో 104 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో అడవులు కనుమరుగయ్యాయి. ఇది ప్రపంచ మొత్తం అటవీ విస్తీర్ణంలో 10.34శాతం! 2015 నుంచి ఏటా 2.5 కోట్ల ఎకరాల మేర అడవులు నాశనమవుతున్నాయి. భారత్‌లో 24.62శాతం భూభాగంలో అడవులు విస్తరించి ఉన్నా... అందులో దట్టమైన అరణ్యాలు 20శాతం లోపే కనిపిస్తాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, పొడి వాతావరణానికి మానవ చర్యలు తోడవడంతో కార్చిచ్చులు రేగుతున్నాయి. ఫలితంగా ఏటా లక్షల ఎకరాల్లో అడవులు బుగ్గిపాలవుతున్నాయి. 2022 నవంబరు- 2023 మార్చి మధ్య దేశంలో అత్యధికంగా ఒడిశాలో 871 భారీ కార్చిచ్చులు చోటుచేసుకున్నాయి. ఆ తరవాతి స్థానాల్లో వరసగా ఆంధ్రప్రదేశ్‌ (754), కర్ణాటక (642), తెలంగాణ(447)లు నిలిచాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో నిరుడు ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో పెద్దసంఖ్యలో భారీ కార్చిచ్చులు చోటుచేసుకుని, 57వేల ఎకరాల్లో అడవులు నాశనమయ్యాయి. వనాల దగ్ధంతో స్ట్రాటో క్యుములస్‌ మేఘాలు తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కార్చిచ్చుల కారణంగా ఉత్పన్నమయ్యే పొగ రేణువులు భూగోళానికి రక్షణ కల్పిస్తున్న ఓజోన్‌ పొరకు తీవ్రహాని కలిగిస్తున్నట్లు మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధనలో తేలింది. కార్చిచ్చులు ఎక్కడ చోటుచేసుకున్నా, ఆ ప్రభావం ప్రపంచమంతటా ఉండటం మానవాళితో పాటు సమస్త జీవరాశికి పెను సవాలుగా మారింది.

వ్యవసాయం, పట్టణీకరణ, పారిశ్రామిక కార్యకలాపాలు, తవ్వకాల కారణంగా ఏటా లక్షల ఎకరాల్లో అడవులు కనుమరుగవుతున్నాయి. ఈ కారణంగా భూతాపం అనుకున్న దానికంటే వేగంగా పెరుగుతోందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక హెచ్చరించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి ప్రపంచంలో ఏటా 560 ఘోర విపత్తులు చోటుచేసుకుంటాయని ఐరాస పేర్కొంది. 2001తో పోలిస్తే 2030 నాటికి వడగాడ్పులు మూడు రెట్లు అధికమవుతాయని, పర్యవసానంగా భారీగా కార్చిచ్చులు చోటుచేసుకుంటాయని విశ్లేషించింది. అడవుల పరిరక్షణ, ఉద్గారాల కట్టడికి ప్రపంచదేశాలు సమర్థ చర్యలు చేపట్టకపోతే- వచ్చే ఇరవై ఏళ్లలో కరవు పరిస్థితులు 30శాతం పెరుగుతాయన్నది ఐరాస నివేదిక సారాంశం! విపత్తుల వల్ల వాటిల్లే నష్టాలను పూడ్చుకోవడానికి భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. 1990లో విపత్తుల నిర్వహణ నిమిత్తం ప్రపంచదేశాలు రూ.5.5లక్షల కోట్లు ఖర్చు చేశాయి. 2022 నాటికి ఆ వ్యయం రూ.13.5లక్షల కోట్లకు చేరింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంత దేశాలు తమ జీడీపీలో 1.6శాతం నిధులను విపత్తుల నివారణ చర్యలకు ఖర్చు చేయాల్సి వస్తోందని ఇందౌర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

దేశంలో 2021 జూన్‌ నుంచి 2022 నవంబరు వరకు 3.46లక్షల కార్చిచ్చులు చోటుచేసుకున్నట్లు అటవీ స్థితి నివేదిక లెక్కగట్టింది. ఇండియాలో అటవీ ఉత్పత్తులు, పోడు వ్యవసాయం కోసం గిరిజనులు కొన్ని ప్రాంతాల్లో అడవులను కాల్చివేస్తున్నారు. పశువుల కాపరులు, అడవుల సమీపంలో ప్రయాణించేవారు తాగి పడేసే సిగరెట్లు, బీడీలతో పాటు చలిమంటలు వేసుకుని వాటిని ఆర్పకుండా వెళ్ళిపోతున్న ఘటనలతో మంటలు చెలరేగుతున్నాయి. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో అడవుల క్షీణత తగ్గింది. అయితే దేశంలోని పశ్చిమతీర ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో అడవుల క్షీణత ఎక్కువగానే ఉంటున్నట్లు బ్రిటన్‌కు చెందిన రీడింగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు నిరుడు వెల్లడించారు. 2001-18 మధ్య ఇండియాలోని మొత్తం అటవీ ప్రాంతంలో 7.34శాతం క్షీణించినట్లు వారు లెక్కగట్టారు. పర్యావరణాన్ని, అడవులను పరిరక్షించుకునేందుకు వీలుగా భూ, ఇంధన వినియోగంలో సంస్కరణలు చేపట్టాలి. రవాణా, పారిశ్రామిక రంగాల్లోనూ మార్పులు తీసుకురావాలి. అడవుల పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి, వాటిని కాపాడుకునేందుకు ప్రభుత్వాలు తక్షణం నడుం బిగించాలి.

- ఎం.ఎస్‌.వి.త్రిమూర్తులు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పాక్‌ ఆర్థికం.. అతలాకుతలం!

‣ భూతాపంతో అకాల వర్షాలు

‣ కాలుష్యం కట్టడికి సహజ వాయువు

‣ సాగర వ్యూహం.. సరికొత్త బంధం!

Posted Date: 22-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం