• facebook
  • whatsapp
  • telegram

పచ్చదనం పెంపులో వెనకంజ

నీరోడుతున్న ‘గ్రీన్‌ ఇండియా’

 

 

దేశంలో అటవీ విస్తీర్ణం పెంచడానికి కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రీన్‌ ఇండియా మిషన్‌ నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో సహా 14 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం కింద అడవులను వృద్ధి చేయాలని ప్రభుత్వం తలపోసింది. 2015-21 మధ్య కాలంలో మిజోరం, ఒడిశా, పంజాబ్‌, కర్ణాటక, సిక్కిం రాష్ట్రాలు వంద శాతం లక్ష్యాలను సాధించాయి. అయిదు రాష్ట్రాలు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పచ్చదనాన్ని పాదుగొల్పడంలో వెనకబడ్డాయి. ఆరేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 6763 ఎకరాల్లో అటవీ విస్తరణ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా, 3541 ఎకరాలకే అది పరిమితమైంది. ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు సైతం లక్ష్యాలను అందుకోలేకపోయాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్‌సీసీ) ఇటీవల వెల్లడించిన ఈ గణాంకాలు- ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు సైతం క్షేత్రస్థాయిలో ఎలా నీరుగారిపోతున్నాయో కళ్లకు కడుతున్నాయి.

 

ఆరేళ్లలో అంతే!

పర్యావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళికకు కేంద్రం 2008 జూన్‌ 30న ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా జాతీయ సౌరశక్తి, ఇంధన సామర్థ్య మెరుగుదల, సుస్థిర ఆవాసం, జల, హిమాలయ పర్యావరణ పరిరక్షణ, గ్రీన్‌ ఇండియా, సుస్థిర వ్యవసాయం, పర్యావరణ మార్పులపై వ్యూహాత్మక పరిజ్ఞానం తదితర ఎనిమిది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. వాటిలో గ్రీన్‌ ఇండియా కార్యక్రమం 2015-16 ఆర్థిక సంవత్సరంలో మొదలైంది. దేశంలో అడవుల విస్తరణ, పరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, పర్యావరణ మార్పులకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో పచ్చదనాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక కార్యాచరణ ప్రణాళిక(ఏపీఓ)లను పంపితే వాటిని ఎంఓఈఎఫ్‌సీసీ విశ్లేషించి ఆమోదం తెలుపుతుంది. నిబంధనల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేస్తుంది. 2015-21 మధ్యలో 14 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 4.13 లక్షల ఎకరాలను అటవీకరణ చేయాలని ప్రణాళికలను రూపొందించారు. కానీ, ఇప్పటి వరకు 2.90 లక్షల ఎకరాల్లో మాత్రమే లక్ష్యాలను సాధించగలిగారు. ఈ ఆరేళ్ల కార్యక్రమానికి కేంద్రం రూ.455 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.4.16 కోట్లు కేటాయించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది రాష్ట్రాలు, జమ్మూ, కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతానికి రూ.250 కోట్లు మంజూరు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం వీటికి రూ.112.65 కోట్లు అందించింది. గ్రీన్‌ ఇండియాకు తోడు 2020-21లో పరిహారక అటవీ విస్తరణ నిధి నిర్వహణ, ప్రణాళిక ప్రాధికార సంస్థ (సీఏఎంపీఏ) దేశవ్యాప్తంగా 5.25 లక్షల ఎకరాల్లో వనాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. దేశీయ వృక్ష జాతుల మొక్కలు నాటడం, అటవీ విస్తీర్ణాన్ని వృద్ధిచేయడం, అగ్ని ప్రమాద సమర్థ నివారణ, జల వనరుల పెంపు, జీవుల వలసలకు నెలవులైన ప్రాంతాలను పరిరక్షించడం, కలప ఉత్పత్తులనే కాకుండా పండ్లు, గింజలు, రబ్బరు తదితర చెట్లను పెంచడం తదితర అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. సీఏఎంపీఏ కింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 14వేల ఎకరాల్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేసినట్లు కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. తెలంగాణలో 22వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వనాల పెంపు సాధ్యమైనట్లు గణాంకాలు చాటుతున్నాయి. 

 

తరుగుతున్న అడవులు

కేంద్రం, రాష్ట్రాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా దేశంలో అడవుల విస్తీర్ణం ఆశించినంత మేర పెరగడంలేదు. రెండేళ్ల నాటి భారతదేశ అడవుల స్థితిగతుల నివేదిక (ఐఎస్‌ఎఫ్‌ఆర్‌) ప్రకారం 2015లో దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం 7.01 లక్షల చదరపు కిలోమీటర్లు ఉండగా, 2019 నాటికి అది 7.12 లక్షల చదరపు కిలోమీటర్లకు చేరింది. నాలుగేళ్లలో పెరుగుదల కేవలం 1.5శాతమే! మరోవైపు ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ ప్రకారం 2010లో ఆంధ్రప్రదేశ్‌లో అటవీ విస్తీర్ణం 24,424 చదరపు కిలోమీటర్లు; 2019 నాటికి అది 29,137 చదరపు కిలోమీటర్లకు చేరింది. రాష్ట్రంలో పచ్చదనం పెంపుదల కోసం తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ నివేదిక ప్రకారం తెలంగాణలో 2015-19 మధ్య అడవుల విస్తీర్ణం వెయ్యి చదరపు కిలోమీటర్లకు పైగా కోసుకుపోయింది. పర్వతాలు, లోయలతో పచ్చదనానికి ఆటపట్టులైన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం స్వల్పంగానైనా అటవీ విస్తీర్ణం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా దేశం ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవలి కాలంలో ఆకస్మిక భారీ వర్షాలు ఎక్కువయ్యాయి. సముద్రాలు త్వరగా వేడెక్కుతుండటంతో రాబోయే రోజుల్లో ఇవి మరింత అధికమయ్యే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో వాతావరణ మార్పులను సమర్థంగా అడ్డుకొనేలా పచ్చదనంతో దేశానికి రక్షణ ఛత్రం ఏర్పరచడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి కనబరచాల్సి ఉంది.

 

- దివ్యాన్షశ్రీ
 

Posted Date: 23-09-2021 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌