• facebook
  • whatsapp
  • telegram

భూమిని మండిస్తున్న మీథేన్‌

మానవాళికి పెనుముప్పు

పారిశ్రామిక విప్లవం తరవాత భూతాపానికి కారణమవుతున్న వాయువుల్లో మీథేన్‌ది ప్రధాన పాత్ర. నానాటికీ అధికమవుతున్న భూతాపం విషయంలో కర్బన ఉద్గారాల పాత్రపై ఉన్నంత అవగాహన మీథేన్‌పై ప్రజల్లో లేదు. మీథేన్‌ను నియంత్రించడం ద్వారా రాబోయే 25 ఏళ్లలో సంభవించబోయే పెను వాతావరణ మార్పులను అదుపులో ఉంచవచ్చని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఇంగర్‌ ఆండర్సన్‌ చెబుతున్నారు. ఐరాస వాతావరణ మార్పుల నియంత్రణ విధానంలో భాగంగా కర్బన ఉద్గారాల తగ్గింపు ఎలాగన్న అంశంపైనే ఎక్కువగా చర్చ జరిగేది. గతేడాది గ్లాస్గో సమావేశంలో మొదటిసారిగా మీథేన్‌ ఉద్గారాల నియంత్రణ చర్చకు వచ్చింది. 2030 నాటికి మీథేన్‌ ఉద్గారాలను ఇప్పుడున్న దానికన్నా 30శాతం తగ్గించాలని వందకు పైగా దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. ప్రపంచ మీథేన్‌ ఉద్గారాల్లో 35శాతం వాటా కలిగిన చైనా, భారత్‌, రష్యాలు ఆ ఒప్పందంలో భాగస్వాములు కాలేదు. పర్యావరణ వేత్తలు మీథేన్‌ను స్వల్పకాలిక కాలుష్య కారకమని వ్యవహరిస్తారు. మీథేన్‌ జీవితకాలం బొగ్గుపులుసు వాయువుతో పోలిస్తే చాలా తక్కువ. కానీ దానికన్నా 80 రెట్లు ఎక్కువ భూతాపానికి కారణమవుతుంది. అందుకే దాన్ని నిపుణులు అత్యధిక ఉష్ణకారిణి (సూపర్‌ వార్మర్‌) అంటారు.

మానవ కార్యకలాపాలే ప్రధాన కారణం

ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీథేన్‌ ఉద్గారాల్లో 64శాతానికి మానవ కార్యకలాపాలే కారణం. మిగిలిన 34శాతం మహాసముద్రాలు, చిత్తడి నేలలు, అగ్నిపర్వతాలు వంటి వాటి నుంచి ఉద్భవిస్తోంది. శిలాజ ఇంధనాల ఉత్పత్తి, వినియోగం, వరిసాగు, పశు పోషణ, గృహ, పారిశ్రామిక వ్యర్థాలు, సేంద్రియ, జీవ వ్యర్థాల విచ్ఛిన్నం మీథేన్‌ ఉద్గారాలకు కారణం. సహజ వనరుల నుంచి వెలువడే మీథేన్‌ ఉద్గారాలను ప్రకృతి సమతుల్యం చెయ్యగలదు. భూమి తొలగించగలిగిన దానికంటే ఎన్నో రెట్ల వేగంతో మానవులు మీథేన్‌ ఉద్గారాలను సృష్టిస్తున్నారు. గత 150 ఏళ్లలోనే పర్యావరణంలో మీథేన్‌ స్థాయులు రెండింతలకు పైగా పెరిగాయని అంచనా. శిలాజ ఇంధనాలు, మితిమీరిన పశువుల పెంపకం మానవ ప్రేరేపిత మీథేన్‌ ఉద్గారాల్లో 60శాతానికి కారణం. గేదెలు, పందులు, గొర్రెలు, మేకలు వంటివి- వాటి సాధారణ జీవక్రియలో భాగంగా మీథేన్‌ను ఉత్పత్తి చేస్తాయి. మానవులు ఆయా జంతువులను ఆహారం, ఇతర ఉత్పత్తుల కోసం అధిక మొత్తంలో పెంచుతున్నారు. అందువల్ల వాటినుంచి వెలువడే మీథేన్‌ను మానవ సంబంధిత కార్యకలాపాల నుంచి వెలువడే ఉద్గారాలుగానే పరిగణిస్తారు.

నానాటికీ పెరుగుతున్న వరిసాగు తొమ్మిది శాతం, పల్లపు ప్రదేశాల్లోకి చేరుకుంటున్న మురుగు, ఘన వ్యర్థాలు 16శాతం, వ్యర్థాలు, ఇతరాల దహనం 11శాతం మీథేన్‌ ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. శిలాజ ఇంధనాల ఉత్పత్తి, రవాణా, వినియోగం వల్ల ఏటా 11కోట్ల టన్నులు, పశువుల పెంపకం ద్వారా తొమ్మిది కోట్ల టన్నుల మీథేన్‌ ఉద్గారాలు వెలువడతాయని అంచనా. సహజ వాయువులో మీథేన్‌ ప్రధాన భాగం. ఆ పరిశ్రమలో ఏదో ఒక మూల లీకేజీల ద్వారా మీథేన్‌ నేరుగా వాతావరణంలోకి విడుదల అవుతుంది. మురుగు, ఘన వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోవడమూ మీథేన్‌ ఉద్గారాలకు మరో కారణం. వ్యర్థాల విచ్ఛిన్నంలో భాగంగా సూక్ష్మజీవులు మీథేన్‌ను వెలువరిస్తాయి. సేంద్రియ పదార్థ విచ్ఛిన్నం ఆమ్లజని రహితంగా జరిగితే మీథేన్‌ అధిక మొత్తంలో వెలువడుతుంది. పంట, జీవ వ్యర్థాలు, అడవుల దహనం భారీ స్థాయిలో మీథేన్‌ను వెలువరిస్తుంది. జీవ ఇంధనాల దహనం సైతం పర్యావరణంలోకి మీథేన్‌ వెల్లువకు గల కారణాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా నేటికీ సుమారు 270 కోట్ల మంది తమ రోజువారీ వంట, ఇతరాల కోసం ఘన జీవ ఇంధనాలనే వినియోగిస్తున్నారు. ఇటుక బట్టీలు, టైల్స్‌ తయారీ పరిశ్రమలు, గ్రామీణ ప్రాంతాల్లో హోటళ్లు వంటివి వాటికి మరింత అదనం!

వరి సాగులో సరైన విధానాల లోపం

మీథేన్‌ ఉద్గారాలను అరికట్టాలంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధన వనరులవైపు మళ్ళాలి. 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధించాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం వేగంగా అడుగులు వేయాలి. మెరుగైన పంట నిర్వహణ పద్ధతులతో మీథేన్‌ ఉద్గారాలను వేగంగా తగ్గించవచ్చని జపాన్‌ వంటి దేశాలు నిరూపించాయి. జపాన్‌ 1990 నుంచి నేల, నీరు, ఎరువుల నిర్వహణలో పాటించిన సమగ్ర విధానాల వల్ల వరి ఉత్పత్తిని పెంచడమే కాకుండా- మీథేన్‌ ఉద్గారాలను తగ్గించగలిగింది. వరి విస్తీర్ణంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఉత్పాదకతలో మాత్రం చైనాకన్నా వెనకబడింది. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు వరి సాగులో సరైన విధానాలను అవలంబించాల్సిన అవసరం ఉంది. దేశీయంగా వరిని అవసరానికి మించి పండిస్తున్నారన్నది కాదనలేని సత్యం. నీరు, ఎరువుల వినియోగం అధికంగా అవసరమయ్యే వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలవైపు రైతులు మొగ్గుచూపాలి. తద్వారా దేశార్థికానికి, పర్యావరణానికి మేలు కలుగుతుంది. ప్రభుత్వాలు సైతం ఆ దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

- గొడవర్తి శ్రీనివాసు
 

Posted Date: 23-06-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం