• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక శక్తికి సహకార యుక్తి

ప్రణాళికాబద్ధంగా సత్వర వృద్ధి

 

 

అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంలో సహకార సంఘాలు కీలక భూమిక నిర్వహిస్తాయి. ఉదాహరణకు స్విట్జర్లాండ్‌లో గృహ సహకార సంఘాలు అద్భుతమైన ప్రగతిని సాధించాయి. అక్కడి స్థిరాస్తి రంగంలో గృహ సహకార సంఘాల వాటా సుమారు అయిదు శాతం. నేడు భారత దేశ ఆర్థిక వ్యవస్థలో వివిధ సహకార సంఘాలు అంతర్భాగంగా ఎదిగాయి. ఈ సంఘాలకు అంతర్జాతీయంగా విశేష ఆదరణ లభిస్తుంటే, ఇండియాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దేశంలోని సహకార సంఘాలపై సామాజిక, ఆర్థిక, పర్యావరణ ప్రభావం తీవ్రంగా పడింది. భారతదేశంలో సహకార సంఘాల ద్వారా ప్రత్యక్షంగా ప్రభావితం కానివారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అవి ఉత్పత్తి చేసే వినియోగదారుల వస్తువులు మొదలుకొని మార్కెటింగ్‌, హౌసింగ్‌, విద్య, ఆరోగ్యసేవల వరకు దేశ ప్రజల జీవితాల్లో సహకార సంఘాలకు చెప్పుకోదగిన ప్రాధాన్యం ఉంది. కానీ, వీటి ఉనికిని దేశంలో ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. వాటిని విస్తరించే దిశగా చర్యలూ చేపట్టడంలేదు. ఇది ఆర్థిక వ్యవస్థకు చేటు చేసే అంశం.

 

విజయాల పరంపర...

ప్రపంచంలోని అనేక దేశాల్లో సహకార సంఘాలు విరాజిల్లుతున్నాయి. దక్షిణాసియాలో విభిన్నమైన సహకార సంఘాలు ఉండేవి. భూములు, చిట్‌ఫండ్లు, బావులు, రోడ్లు, కంచెల వినియోగంలో సమాన భాగస్వామ్యం ఉండేది. ఆధునిక కాలంలో సహకార సంఘాల రూపురేఖలు మారిపోయాయి. 19వ శతాబ్దంలోని ప్రత్యేక వాణిజ్య ఆర్థికంలో ఇవి భాగమైపోయాయి. వస్తు, సేవలను కేవలం సరకులుగా పరిగణించేవారు. ఒప్పందాలు కుదుర్చుకుని, వాటి పర్యవేక్షణ కోసం న్యాయవ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. భారత్‌లో తొలుత ఆధునిక సహకార సంఘాలు 19వ శతాబ్దంలోని వలసరాజ్య పాలనలో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నప్పుడు సహకారోద్యమ స్థాపనకు కృషి జరిగింది. సహకారోద్యమానికి ‘1904 కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీస్‌’ చట్టంతో బీజం పడింది. అయితే ఇది బ్రిటిషర్ల అనుభవాలతో రూపొందించింది కాదు. ఐరోపా, జర్మనీలోని సహకార సంఘాల నమూనాలతో భారత సహకారోద్యమాన్ని నిర్మించారు. తొలినాళ్లలో వీటికి ప్రభుత్వ మద్దతు లభించేది. ఫలితంగా ఇవి గణనీయంగా వృద్ధి చెందాయి. 1920 దశకంలో బహుళస్థాయి ఆర్థిక సహకారోద్యమం వెలుగులోకి వచ్చింది. గ్రామాల్లో ప్రాథమిక సంఘాలు, సహకార బ్యాంకులు పుట్టుకొచ్చాయి. 1930లో మాత్రం సహకార సంఘాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా మద్రాసు ప్రెసిడెన్సీలో సహకారోద్యమం ఒడుదొడుకులు చవిచూసింది. స్వాతంత్య్రం అనంతరం పరిస్థితులు మారాయి. ప్రభుత్వం ముందుకొచ్చి సహకారోద్యమానికి మద్దతుగా నిలిచింది. భారత సహకార సంఘాలు 20వ శతాబ్దంలో ఎన్నో విజయగాథలను లిఖించాయి. అమూల్‌తో డైరీ రంగంలో విప్లవం సృష్టించిన వర్గీస్‌ కురియన్‌ దేశవ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌ వీరయ్య చౌదరిదీ ఇదే కథ. పాల వీరయ్యగా పేరొందిన ఆయన, 1970 దశకం చివర్లో సంగం డైరీని స్థాపించి, వేలాది పాల ఉత్పత్తిదారులకు ఊతమిచ్చి, సహకార సంఘాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. జశ్వంతిబెన్‌ జమ్నాదాస్‌ పాపట్‌, పార్వతీబెన్‌ రాందాస్‌ థొండానిలతో సహా ఏడుగురు మహిళలు 1959లో ‘లిజ్జత్‌ పాపడ్‌ కోఆపరేటివ్‌’ను ముంబయిలో స్థాపించారు. వీరి విజయం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. గ్రామీణ ప్రాంతంలోని లక్షల మంది జీవితాల్లో వెలుగునింపి, వారికి ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందించే శక్తి సహకార సంఘాలకు ఉందని ఈ మూడు ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. ఇంతటి శక్తిమంతమైన సహకార సంఘాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

 

ప్రజావిశ్వాసమే సోపానం

సహకార సంఘాల ద్వారా విజయం సాధించిన మరెందరో తెరవెనకే ఉండిపోయారు. లక్షలాది ప్రజలు సహకార సంఘాల స్ఫూర్తిని పట్టుదల, నమ్మకంతో స్వీకరించి చరిత్రలో తమకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, వెనకడుగు వేయకుండా సొంత కుటుంబాలను, సమాజాన్ని ప్రగతివైపు నడిపించారు. దేశంలోని యువ నాయకుల జీవితాలను మలుపు తిప్పగలిగే శక్తి సహకారోద్యమానికి ఉంది. ఇది రెండువైపులా పదునున్న కత్తితో సమానం అన్నది విస్పష్టం. ఆర్థికం, పాలన, విస్తృత సమాజానికి సంబంధించిన ఎన్నో అంశాలను నేర్చుకునేందుకు ఇదొక సరైన వేదిక. అదే సమయంలో రాజకీయాలతో ముడివడి ఉన్న అంశాలు సహకార సంఘాలపై ప్రభావం చూపుతుంటాయి. స్వాతంత్య్రం నాటి నుంచి దేశానికిది సమస్యగా మారింది. కేంద్రీకృత యూనియన్లు ఎప్పుడూ ప్రయోజనకరమేనా, వికేంద్రీకరణ కన్నా విలీనం మంచిదా... వంటి ప్రశ్నలకు వాస్తవానికి కచ్చితమైన సమాధానాలు ఉండవు. అధిక కేంద్రీకరణతోనూ ముప్పు పొంచి ఉంది. సహకార సంఘాలకున్న శక్తి కొందరు బడా వ్యాపారస్తుల పాలబడే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఆ సంఘాల ప్రధాన సూత్రాలు భ్రష్టుపట్టిపోతాయి. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగినా, సమస్యల నుంచి బయటపడి సహకారోద్యమం ముందుకు సాగడం ఊరటనిచ్చే విషయం. సహకారోద్యమం సూత్రాలను విశ్వసించి, ప్రజలు సహకార సంఘాలవైపు అడుగులు వేస్తే సమాజాభివృద్ధి వేగవంతమవుతుంది.

 

- డాక్టర్‌ నికొలాయ్‌ కామినోవ్‌

(స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌ యూనివర్సిటీలో అధ్యాపకులు)
 

Posted Date: 16-10-2021గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం