• facebook
  • whatsapp
  • telegram

అసమానతల అంతమే నిజమైన వృద్ధి

దశాబ్దాల తరవాతా తీవ్ర అంతరాలు

దేశంలో ఆర్థిక అసమానతలు ఇటీవల గరిష్ఠ స్థాయికి చేరాయి. స్వాతంత్య్రం అనంతరం ఆర్థిక-సామాజిక సూచీల్లో దేశం ఎంతో పురోగతి సాధించింది. మూడు దశాబ్దాల క్రితం మొదలైన సరళీకృత ఆర్థిక విధానాల వల్ల జాతీయ ఆదాయ వృద్ధి రేట్లలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. పేదరికం సైతం అంతకు ముందున్న దానికంటే సగానికి తగ్గింది. అదే సమయంలో దేశంలో ఆర్థిక అసమానతలు పెచ్చుమీరాయి. అమెరికా, చైనాల తరవాత అత్యధిక సంఖ్యలో శతకోటీశ్వరులు భారత్‌లోనే ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత పేదల్లోనూ ఇండియా వాటా ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2017లో అత్యంత పేదరికంలో ఉన్న జనాభా దాదాపు 68.9 కోట్లు. అందులో 20.17శాతం భారత్‌లోనే నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో భారత్‌ వాటా 17.8శాతమే!

నానాటికీ అధికం 

అభివృద్ధి అన్నది ఆర్థిక అసమానతల పెరుగుదలకు దారితీస్తుందని నోబెల్‌ పురస్కార గ్రహీత సైమన్‌ కుజ్నెట్స్‌ పేర్కొన్నారు. అదిప్పుడు భారత్‌లో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. సాధారణంగా అభివృద్ధి ప్రారంభ దశల్లో కొత్త అవకాశాలు వచ్చినప్పుడు ధనవంతులు వాటిని సమర్థంగా వినియోగించుకుంటారు. అదే సమయంలో నైపుణ్యం లేని కార్మికులు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల వారి వేతనాల్లో కోత పడుతుంది. ఫలితంగా అసమానతలు పెరుగుతాయి. భారత్‌లో సరిగ్గా ఇదే జరిగింది. దేశంలో సరళీకృత విధానాల అమలు తరవాత ఆర్థిక వృద్ధి వేగవంతమైంది. దుర్భర దారిద్య్రం వేగంగా తగ్గింది. ఆదాయ అసమానతలు మాత్రం పెరిగాయి. దీనికి భారత్‌లో విస్తృతంగా ఉండే ఇతర అసమానతలు తోడయ్యాయి. దేశంలో ఆదాయం, ఆస్తులు, అవకాశాలు కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అయ్యాయి. 1991 నుంచి అసమానతల్లో అధిక పెరుగుదల కనిపించింది. ఫలితంగా ప్రపంచంలో ఎక్కువగా ఆర్థిక అసమానతలున్న దక్షిణాఫ్రికా, జాంబియా వంటి దేశాల సరసన ఇండియా నిలుస్తోంది. 

శ్రామిక విపణిలో 1991 తరవాత మూలధన వాటా పెరిగింది. శ్రామిక వాటా తగ్గింది. ఈ మార్పుల వల్లే అసమానతలు అధికమయ్యాయి. లాభం రేటులో పెరుగుదల వేతన వాటా క్షీణతకు తోడైంది. దీనికి విద్య, ఆరోగ్యం వంటి ప్రజాసేవలను పొందడంలో ఉన్న అసమానతలు తోడయ్యాయి. దేశంలో బలమైన మార్కెట్‌ నిబంధనలు ఉన్న సమయంలో ఎగువ వర్గాల ఆదాయాలు తక్కువగానే ఉండేవి. నూతన ఆర్థిక విధానాలు ప్రజల నిజ ఆదాయాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. ఈ వృద్ధి అన్ని వర్గాలకూ సమానంగా పంపిణీ కాలేదు. 1950-80 దశకాల్లో భారత ఆర్థిక వ్యవస్థ సగటున కేవలం 3.5శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జనాభాలో 0.5శాతం కంటే తక్కువ మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. 1990 దశకం చివరి నాటికి అది మూడు శాతానికి, 2018-19 నాటికి 4.18శాతానికి చేరింది. దేశ జనాభాలో ఒకశాతమే ఉండే అత్యంత సంపన్నవర్గం, 2014-15 లెక్కల ప్రకారం జాతీయ ఆదాయంలో 21.3శాతాన్ని సొంతం చేసుకుంది. దేశంలో ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయికి చేరేవారి సంఖ్య మొదటి నుంచీ తక్కువగానే ఉంది. ఫలితంగా పేద వర్గాల్లో జన్మించిన వారు అలాగే మిగిలిపోతున్నారు. ఇది అసమానతలు కొనసాగడానికి దారితీస్తోంది. వినియోగంలో సైతం పెద్దయెత్తున అసమానతలున్నాయి. 2011-12లో భారత్‌ మొత్తం వినియోగంలో దాదాపు 45శాతం... 20శాతంగా ఉన్న ధనవంతులదే. గత ముప్ఫై ఏళ్లలో అగ్రశ్రేణి ఆదాయాల వాటాలో ఇండియా అత్యధిక పెరుగుదల నమోదు చేసింది. పై స్థాయిలో ఉన్న 10శాతం వాటా 1980-2016 మధ్య 31శాతం నుంచి 56శాతానికి పెరిగింది.

అవే అవరోధాలు

అసమానతలు పెరిగాయని ఆర్థిక వృద్ధిని కాదనడానికి వీల్లేదు. ఆదాయం, సంపదల్లో అసమానతలను ఆర్థిక వృద్ధి పెంచి ఉండవచ్చు. దానివల్ల పేదరికం తగ్గింది. మూలధన రూపకల్పనతో కార్మికులకు గిరాకీ పెరుగుతుంది. ఫలితంగా వేతనాలు అధికమవుతాయి. నైపుణ్యాలను సంపాదించడం వల్ల రాబడిలో గణనీయమైన పెరుగుదల చోటుచేసుకుంటుంది. అది మానవ అభివృద్ధి నైపుణ్యాలపై పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది. అల్పాదాయ వర్గాలు ఉన్నత స్థాయికి చేరడానికి తలుపులు తెరుస్తుంది. ఇటువంటి అభివృద్ధి నిలకడగా ఉంటుందా లేదా అనేది కేవలం ఆర్థిక విధానాలపైనే కాకుండా- మానవాభివృద్ధి, వృద్ధి సమ్మిళిత విధానాలపైనా ఆధారపడి ఉంటుంది. భారత్‌లో అత్యంత సంపన్నుల ఆదాయం పెరిగేకొద్దీ, దానికి అనుగుణంగా పన్నులు విధించవలసిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఆ ఆదాయాన్ని దేశంలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయడం ద్వారా ఆర్థిక అసమానతలను తగ్గించవచ్చని సూచిస్తున్నారు. ఆదాయ పంపిణీ మాత్రమే మానవాభివృద్ధి, ఆర్థిక వృద్ధి ఫలాలను నిర్ణయించదు. కులం, సంఘం, మతం, ప్రాంతం, లింగం వంటి అంశాలూ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి ప్రజల సమాన అవకాశాలను ప్రభావితం చేస్తాయి. వాటిని రూపుమాపడానికి నైపుణ్యాలు, అవకాశాల్లో సమానత్వం రావాలి. ఆ దిశగా ప్రభుత్వాల విధివిధానాలు కొనసాగడం అత్యావశ్యకం.  

వెనకంజలోనే...

కొన్ని దశాబ్దాలుగా విద్య, ఆరోగ్య రంగాల్లో భారత్‌ గణనీయమైన పురోగతిని సాధించింది. 1991-2013 మధ్య కాలంలో మనిషి ఆయుర్దాయం సగటున ఏడేళ్లు పెరిగింది. శిశు మరణాల రేటు సగానికి తగ్గింది. ఆసుపత్రుల్లో కాన్పులు మూడు రెట్లు పెరిగాయి. మాతృ మరణాల నిష్పత్తి అరవై శాతం తగ్గింది. ప్రాథమిక, ఉన్నత తరగతుల్లో విద్యార్థుల నమోదు పెరిగింది. అయితే ఈ పురోగతి ఒకే విధంగా లేదు. పిల్లల్లో పోషకాహార లోపాలను రూపుమాపడం ఇప్పటికీ సవాలుగానే ఉంది. ఎదుగుదల లోపం దేశంలో నేటికీ ప్రధాన సమస్యే. 2015-16నాటికి భారత్‌లో 38శాతం పిల్లల్లో ఎదుగుదల లోపాలున్నాయి. రాష్ట్రాలు, సామాజిక సమూహాలు, గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య అంతరాలు నేటికీ అలాగే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సూచీ, మానవ మూలధన సూచీ వంటి వాటిలో భారత్‌ పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది. పాఠశాల విద్యలో అన్ని స్థాయుల్లో బడి మానేసే ఎస్టీ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది. అక్షరాస్యత పరంగా ఎస్సీలు, ఎస్టీలు, పురుషులు, మహిళలు, గ్రామీణం, పట్టణాలు... ఇలా అన్నింటిలో గణనీయ స్థాయిలో వ్యత్యాసాలు కనిపిస్తాయి. పెరుగుతున్న అసమానతలు రాజకీయ, ఆర్థిక స్థిరత్వాలనే కాకుండా వ్యక్తుల అభివృద్ధినీ ప్రభావితం చేస్తున్నాయి.


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సరఫరా స్తంభిస్తే ఇక్కట్లే

‣ టర్కీపైనా ఆంక్షల కొరడా

‣ పర్యావరణానికి తూట్లు

‣ చిత్తశుద్ధితోనే... భూతాప నియంత్రణ

Posted Date: 22-11-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం