• facebook
  • whatsapp
  • telegram

దేశార్థికానికి మేలెంత?

క్రిప్టో కరెన్సీపై భిన్నవాదనలు

ప్రపంచవ్యాప్తంగా నేడు పదివేలకు పైగా క్రిప్టో కరెన్సీలు చలామణీలో ఉన్నాయి. వాటిలో రోజుకు కొన్ని కనుమరుగైపోతుంటే కొత్తవి పుట్టుకొస్తున్నాయి. లక్షల సంఖ్యలో మదుపరులు క్రిప్టో లావాదేవీలు జరుపుతున్నారు. క్రిప్టోలను కరెన్సీ అనడంకన్నా మదుపునకు అనువైన చరాస్తి సాధనంగా పరిగణించడం భావ్యంగా ఉంటుంది. నవంబరు 24 నాటికి ప్రపంచ క్రిప్టో మార్కెట్‌ విలువ 2.4 లక్షల కోట్ల డాలర్లని అంచనా. భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణానికి ఇది దాదాపుగా సమానం. ఇండియాలోనూ క్రిప్టో లావాదేవీలు పెరుగుతున్నాయి. అమెరికాలో 2.74 కోట్ల మంది, రష్యాలో 1.74 కోట్ల మంది క్రిప్టో మదుపరులు ఉంటే, భారత్‌లో వారి సంఖ్య 10.7 కోట్లకు మించిపోయింది. ఇందులో భారతీయులు మదుపు చేస్తున్న మొత్తాలు బాగా తక్కువగా ఉంటున్నాయి. 70శాతం భారతీయ క్రిప్టో మదుపరులు తలా మూడు వేల రూపాయల కన్నా తక్కువే పెట్టుబడి పెట్టారని రిజర్వు బ్యాంకు గవర్నర్‌ ఇటీవల వెల్లడించారు. మొత్తంమీద వివిధ క్రిప్టో కరెన్సీల్లో భారతీయులు   రూ.75 వేల కోట్లకుపైగా మదుపు చేశారని అంచనా. క్రిప్టోలను కేంద్రం నిషేధించవచ్చనే వార్తలు- వాటి ధరల పతనానికి దారితీశాయి.

సరఫరా తక్కువ... గిరాకీ ఎక్కువ

క్రిప్టోలు రంగప్రవేశం చేసినప్పటి నుంచి సంపన్నులు వాటిని మదుపు సాధనాలుగా పరిగణించసాగారు. ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో పెట్టుబడి నిధి దగ్గర 4,500 కోట్ల డాలర్ల మూలనిధి ఉందంటే- వాటికి ఎంత గిరాకీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వేలాది క్రిప్టోలు చలామణీలో ఉన్నా వాటిలో దాదాపు 12 మాత్రమే ముఖ్యమైనవి. అందులోనూ నాలుగింటిలోనే విస్తృత లావాదేవీలు జరుగుతున్నాయి. క్రిప్టో కరెన్సీల మొత్తం విలువలో మూడో వంతును బిట్‌కాయిన్‌ ఆక్రమిస్తోంది. గత సెప్టెంబరులో ఎల్‌ సాల్వడార్‌ దేశం ప్రపంచంలో తొలిసారిగా దాన్ని చట్టబద్ధ మారక ద్రవ్యంగా గుర్తించింది. క్రిప్టోల నుంచి అధికారిక మారక ద్రవ్యాలకు పోటీ వస్తుందనే ఆందోళనతోపాటు ఇతర కారణాల వల్ల ప్రధాన దేశాల కేంద్ర బ్యాంకులు వాటిని వ్యతిరేకిస్తున్నాయి. అధికార డిజిటల్‌ కరెన్సీలను తీసుకురావడానికి సన్నాహాలు చేసుకొంటున్నాయి. త్వరలో భారత పార్లమెంటు ముందుకు రాబోతున్న బిల్లు- బ్లాక్‌చెయిన్‌ సాంకేతికత ఆధారంగా అధికార డిజిటల్‌ మారక ద్రవ్యానికి ఆమోదముద్ర వేయవచ్చు. క్రిప్టో లావాదేవీలకు అయ్యే ఖర్చు చాలా తక్కువ కావడంతో మదుపరులు వాటిపై ఆసక్తి చూపుతున్నారు. ఒక దేశం నుంచి మరో దేశానికి చాలా వేగంగా నగదు బదిలీ చేయడానికి క్రిప్టోలు బాగా అక్కరకొస్తాయి. ప్రస్తుతం చాలా దేశాల్లో బ్యాంకుల వంటి అధికార మార్గాల్లో డబ్బు బదిలీకి అయిదు నుంచి 15శాతం వరకు కమిషన్‌ చెల్లించాల్సి వస్తోంది. క్రిప్టోలతో ఆ పరిస్థితి ఉండదు. ప్రభుత్వాలు ఆర్థిక మాంద్యంలోనూ, కొవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ అభివృద్ధికి ఊపు తీసుకురావడానికి పెద్దయెత్తున కరెన్సీని ముద్రించి రుణాలు, పెట్టుబడులను సమకూరుస్తాయి. దానివల్ల కరెన్సీ విలువ పడిపోయి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. తమ డబ్బు విలువ అలా తరిగిపోకుండా చూసుకోవడానికి క్రిప్టోలు ఉపకరిస్తాయని సంపన్న వర్గం, కార్పొరేట్లు భావిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీలను పరిమిత సంఖ్యలోనే విడుదల చేస్తారు. చలామణీలో ఉన్న క్రిప్టోలను తనిఖీ చేసుకోవడానికి వీలు ఉంటుంది. నిజానికి క్రిప్టో అంటే బ్లాక్‌చెయిన్‌ సాంకేతికత ఆధారంగా నిర్వహించే డిజిటల్‌ పద్దుల్లో ఒక అంకె మాత్రమే. అందువల్ల కొన్ని నిబంధనలకు లోబడి దాన్ని తేలిగ్గా బదిలీ చేయవచ్చు.  ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పంపవచ్చు. క్రిప్టోలను అధికార  కరెన్సీగా మార్చుకుని వస్తుసేవలను పొందే సౌలభ్యం ఉండటం అన్నింటికన్నా పెద్ద ఆకర్షణ. వాటిని ఉపయోగించి ప్రపంచంలో ఎక్కడైనా సరే తక్షణం కొనుగోళ్లు జరపవచ్చు. అధికార కరెన్సీలనైతే రుసుము చెల్లించి స్థానిక మారకద్రవ్యంలోకి మార్చుకొని ఉపయోగించాల్సి ఉంటుంది. అది ఖరీదైన వ్యవహారమే కాక, దానికి పలురకాల నియమ నిబంధనలు, ఆంక్షలు ఉంటాయి. క్రిప్టోలు ఆ బాదరబందీని తప్పిస్తాయి. అయితే, అంత సునాయాసంగా డబ్బు దేశాల సరిహద్దులు దాటిపోవడం- చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారికి ఎక్కువగా ఉపకరిస్తుండటంతో సమస్య వస్తోంది.

నిషేధించాలా, వద్దా?

మత్తుమందుల అక్రమ రవాణాదారులు, ఉగ్రవాదుల వంటి అవాంఛనీయ శక్తులకు అనువుగా ఉండటంవల్లనే క్రిప్టోలపై ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నేరగాళ్లతోపాటు సంపన్నులు, మధ్యతరగతివారు క్రిప్టోలకు మళ్ళితే ప్రభుత్వాలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తరిగిపోతుంది. మరోవైపు భారతీయ క్రిప్టో ఖాతాదారుల్లో 21-35 ఏళ్లవారే ఎక్కువ. 16 శాతం మేర పట్టణవాసులకు ఆ ఖాతాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో క్రిప్టోలను గంపగుత్తగా నిషేధించేకన్నా లాభనష్టాలను బేరీజు వేసుకొని సాలోచనగా సరైన నిర్ణయం తీసుకోవాలి. క్రిప్టోలో చాలామంది చిన్న మదుపరులే కాబట్టి ప్రభుత్వ నిర్ణయం వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. వారు తమ డబ్బును తిరిగి తీసుకోవడానికి వ్యవధి ఇస్తూ దశలవారీగా నిషేధం విధించడం ఉత్తమం. క్రిప్టో కరెన్సీ వేదికలు సైతం ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలని నిబంధనలు విధించడం మరో పద్ధతి. బ్యాంకుల మాదిరిగానే క్రిప్టో వేదికలూ సంస్థలుగా నమోదై, తమ ఖాతాదారుల వివరాలను కేవైసీ ఫారాల ద్వారా తెలుసుకోవాలి. దానివల్ల పారదర్శకత పెరుగుతుంది. కేవైసీ ప్రమాణాలను పాటించిన తరవాతనే క్రిప్టో లావాదేవీలను అనుమతించాలి. చిన్న మొత్తాలకు కాకపోయినా పెద్ద మొత్తాలకు కేవైసీని తప్పనిసరి చేయాలి. ఇలా రకరకాల జాగ్రత్తలు పాటిస్తూ, అధునాతన సాంకేతికత ద్వారా అందివస్తున్న క్రిప్టో కరెన్సీలను ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే సాధనాలుగా మలచాలి.

నియంత్రణ కష్టసాధ్యం

క్రిప్టోల నియంత్రణకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలేవీ లేనందువల్ల ఇవాళ కోట్లలో పలికిన క్రిప్టో కరెన్సీ విలువ రేపు దారుణంగా పడిపోవచ్చు. పైగా క్రిప్టో లావాదేవీలపై ప్రభుత్వాలకు ఎటువంటి నిఘా ఉండదు. అందువల్ల అక్రమ ధనాన్ని సక్రమమైనదిగా చలామణీ చేయడానికి, నేరస్తుల కార్యకలాపాలకు క్రిప్టో ఉపకరించకుండా నిరోధించడం ప్రభుత్వాలకు కష్టసాధ్యమవుతుంది. ప్రభుత్వ సంస్థలను, వ్యాపారాలను నేరగాళ్ల ముఠాలు ర్యాన్సమ్‌వేర్‌ దాడులతో స్తంభింపజేసి, వాటిని విడుదల చేయాలంటే బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోల్లో చెల్లింపులు జరపాలని డిమాండ్‌ చేస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు తీసుకొంటున్న కఠిన చర్యలవల్ల ఈమధ్య అటువంటి నేరాలు కొద్దిమేర తగ్గుముఖం పడుతున్నాయి. క్రిప్టోల స్థానంలో అధికార డిజిటల్‌ కరెన్సీలు రంగప్రవేశం చేస్తే నల్లధన నిల్వలను, అక్రమ లావాదేవీలను అరికట్టడానికి వీలవుతుందని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆధునిక పద్ధతుల్లో ధాన్యం నిల్వ

‣ పౌరహక్కులకు సంకెళ్లు

‣ వాడి వేడి సమరానికి సిద్ధం

Posted Date: 01-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం