• facebook
  • whatsapp
  • telegram

ఉజ్జ్వల వెలుగుల ప్రస్థానం

దేశార్థికానికి దన్నుగా విద్యుత్‌ రంగం

 

 

ఒక దేశ సర్వతోముఖాభివృద్ధిలో విద్యుత్‌ రంగం పోషించే పాత్ర ఎంతో కీలకమైనది. భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించే నాటికి ఇక్కడి విద్యుదుత్పత్తి కేంద్రాల స్థాపిత సామర్థ్యం 1,362 మెగావాట్లు, తలసరి వార్షిక వినియోగం 16.3 యూనిట్లు. ప్రస్తుతం స్థాపిత సామర్థ్యం 287 రెట్లు పెరిగింది. అది 3,90,791 మెగావాట్లకు చేరింది. తలసరి వినియోగం 74 రెట్లు ఎక్కువై 1,208 యూనిట్లకు చేరింది. బ్రిటిష్‌ కాలం నాటి విద్యుత్‌ చట్టాలను తొలగించి, 1948లో సమగ్ర నూతన చట్టం తేవడంతో కేంద్రం అధీనంలో జాతీయ విద్యుత్‌ ప్రాధికార సంస్థ (సీఈఏ), రాష్ట్రాల పరిధిలో విద్యుత్‌ బోర్డులు ఏర్పడ్డాయి. అవి విద్యుత్‌ వ్యవస్థను విస్తృతంగా అభివృద్ధి చేశాయి. 1947కు ముందు విద్యుత్‌ వ్యవస్థ పూర్తిగా ప్రైవేటు అధీనంలో కేవలం ప్రధాన నగరాలకు పట్టణాలకు మాత్రమే పరిమితమైంది. నేడు మారుమూల గ్రామాలకూ విస్తరించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ పంపిణీ లైన్ల ఏర్పాటుకు కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసీ), విద్యుత్‌ ఆర్థిక సహకార సంస్థ(పీఎఫ్‌సీ)ల తోడ్పాటు ఇతోధికం. మొదట్లో రాష్ట్రాల్లో అంతర్గత సరఫరాకే విద్యుత్తు పరిమితమైంది. 1964లో అయిదు ప్రాంతీయ గ్రిడ్ల ఏర్పాటుతో సరిహద్దు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ భాగస్వామ్యానికి అవకాశం కలిగింది. 1989లో పవర్‌ గ్రిడ్‌ సంస్థ ఏర్పాటుతో ప్రారంభమైన ప్రాంతీయ గ్రిడ్ల అనుసంధానం ప్రయత్నాలు 2013 నాటికి పూర్తయ్యాయి. జాతీయ గ్రిడ్‌ ఆవిష్కరణతో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా విద్యుత్‌ సరఫరాకు మార్గం సుగమం అయింది. జాతీయ గ్రిడ్‌ను ఇతర దేశాలకు అనుసంధానించడం ద్వారా బంగ్లాదేశ్‌, నేపాల్‌లకు సరఫరా చేస్తూ- భూటాన్‌ నుంచి విద్యుత్తును తీసుకోగలుగుతున్నాం. భారత్‌, శ్రీలంకల మధ్య విద్యుత్‌ సరఫరాకు సముద్ర గర్భం నుంచి కేబుల్‌ లైన్ల ప్రతిపాదన అమలు దశలో ఉంది.

 

పెరుగుతున్న వినియోగం

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ లాంటి థర్మల్‌, జల విద్యుదుత్పత్తి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రాలూ విరివిగా విద్యుత్‌ కేంద్రాలు స్థాపించాయి. కొన్ని ప్రాంతాల్లో పర్యావరణ ఆందోళనలు ఉన్నప్పటికీ- అనేక జల విద్యుత్‌ ప్రాజెక్టులను స్థాపించారు. 1998లో సరళీకరించిన విద్యుత్‌ చట్టంతో ప్రైవేటు భాగస్వామ్యం సుమారు 33 శాతానికి చేరింది. 2015 నాటికి విద్యుత్‌ మిగులు స్థాయికి చేరింది. భారత్‌ 2019కల్లా ప్రపంచంలో మూడో స్థానానికి ఎదిగింది. కేంద్ర ప్రభుత్వం, నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్తును అందరికీ అందజేయాలనే సంకల్పంతో 2016లో ప్రారంభించిన, ‘అందరికీ విద్యుత్‌’ అనే బృహత్తర కార్యాచరణ పథకం అమలులో ఉంది. పెరుగుతున్న నగర జనాభా, విస్తరిస్తున్న గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, ఏసీల వినియోగం, ఇప్పుడిప్పుడే పుంజుకొంటున్న విద్యుత్‌ వాహనాల వల్ల 2030 నాటికి విద్యుత్‌ వినియోగం రెట్టింపవుతుందన్నది అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా.

 

విద్యుదుత్పత్తికోసం 75శాతానికి పైగా బొగ్గుతో నడిచే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలపై ఆధారపడటం వల్ల, ఏటా 230 కోట్ల టన్నుల హానికర కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. పునరుద్ధరణీయ ఇంధన విద్యుదుత్పత్తి 2000 నాటికి వెయ్యి మెగావాట్లు; గత 20 ఏళ్లలో లక్ష మెగావాట్ల మైలురాయిని దాటడం ముదావహం. దీన్ని గణనీయంగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పాత పంపిణీ లైన్లను బలోపేతం చేయడం, విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టడం, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ద్వారా సాంకేతిక, వాణిజ్య నష్టాలను ప్రస్తుతం ఉన్న 21.35శాతం నుంచి కనీస లక్ష్యమైన 12శాతానికి... క్రమేపీ ప్రపంచ సగటు అయిన ఆరు శాతానికి తగ్గించేందుకు కృషి చేయాలి. ఇంధన పొదుపు చట్టాన్ని అందరూ తప్పనిసరిగా  పాటించేలా చూడాలి. నగరాల్లో పట్టణాల్లో భూగర్భ కేబుళ్లు ఏర్పాటు చేసి, స్కాడా లాంటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా నాణ్యమైన, నిరంతరాయమైన, ప్రమాద రహిత విద్యుత్తును వినియోగదారులకు అందించవచ్చు. ఛార్జీలను నిర్ణయించడంలో రాజకీయ జోక్యాన్ని నివారించి, ఎప్పటికప్పుడు హేతుబద్ధీకరించాలి.

 

 

కీలక పరిణామాలెన్నో...

స్వాతంత్య్రం రాక ముందు నుంచే విద్యుత్‌రంగంలో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 1887లో విద్యుత్‌ ప్రమాదాల నుంచి రక్షణకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. 1910లోనే ఉత్పత్తి, సరఫరా, పంపిణీల్లో ప్రైవేటు సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసేందుకు స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఇచ్చారు. స్వతంత్ర భారతంలో 1948లో విద్యుత్‌ రంగం కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోకి వచ్చింది. రాష్ట్రానికో విద్యుత్‌ బోర్డు ఏర్పాటయింది. ప్రైవేటు విద్యుత్‌ సంస్థల లైసెన్సులు రద్దయ్యాయి. అనంతరం విద్యుత్‌ నియంత్రణ చట్టం(1998)తో ఛార్జీలు, బోర్డుల కార్యకలాపాల నియంత్రణకు కేంద్ర, రాష్ట్రాల పరిధిలో మండళ్లు ఏర్పాటయ్యాయి. అదే సంవత్సరం విద్యుత్‌ సవరణ చట్టం ఏర్పాటయింది. ఉత్పత్తి, సరఫరా, పంపిణీలకు స్వతంత్ర సంస్థలూ ఏర్పడ్డాయి. సరఫరా, పంపిణీలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యానికి తెర తీశారు.

 

 

ఇంధన పొదుపు చట్టం (2001) కింద వస్తూత్పత్తిలో వివిధ రంగాలకు ఇంధన పొదుపునకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ)ని నెలకొల్పారు. 2003లో సమగ్ర (ఏకీకృత) విద్యుత్‌ చట్టం అమలులోకి వచ్చింది. విద్యుత్‌ సరఫరా, పంపిణీ రంగాల్లో ప్రైవేటు ఫ్రాంచైజీలకు అవకాశం లభించింది. అంతర్గతంగా సంస్థల మధ్య పోటీ పెంచడం, కాలుష్య రహిత విద్యుదుత్పత్తిని ప్రోత్సహించడం, ఛార్జీల హేతుబద్ధీకరణ, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం ఇందులోని ప్రధానాంశాలు. 2007లో చట్ట సవరణ ద్వారా ప్రైవేటు స్వతంత్ర ఉత్పత్తిదారులు లైసెన్స్‌ అవసరం లేకుండా విద్యుత్తును ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పించారు. విద్యుత్‌ చౌర్యంపై కఠిన చర్యలకు రంగం సిద్ధమైంది. నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పునరుత్పాదక విద్యుదుత్పత్తి, వాడకాలను నిరుడు తప్పనిసరి చేశారు. విద్యుత్‌ ఒప్పందాల అమలుకు ‘కాంట్రాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అథారిటీ’ ఏర్పాటయింది. ప్యారిస్‌ ఒప్పందాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు పార్లమెంటు తాజా సమావేశాల్లో ఇంధన వినియోగ రంగంలో ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాల పెంపుదలకు ఉద్దేశించిన సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతోంది.

 


 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మానవ హక్కుల విలవిల

‣ పారిశ్రామిక రథానికి కొత్త ఊపు

‣ ఆత్మస్థైర్యమే ఆలంబనగా...

‣ అక్కరకు రాని సాగు విధానాలు

Posted Date: 06-12-2021గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం