• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర బ‌డ్జెట్ 2022 - 23


ఆర్థిక చక్రం గాడితప్పకుండా.. ఈ పరిస్థితులు ఇలా సాగితే చాలన్న రక్షణాత్మక ధోరణిని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రదర్శించారు. దేశాన్ని డిజిటల్‌ బాట పట్టించేందుకు పలు ప్రతిపాదనలు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.39.45 లక్షల కోట్ల అంచనాతో కేంద్ర బడ్జెట్‌ను ఆమె 2022 ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 35% వృద్ధితో రూ.7.5 లక్షల కోట్ల మూలధన వ్యయం చేస్తామని ప్రకటించారు. అందులో రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణం సమకూర్చనున్నట్లు భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది ఖర్చుచేయబోయే మొత్తంలో దాదాపు 42% మొత్తాన్ని అప్పుల రూపంలోనే సమకూర్చుకోవాల్సి రావడంతో ఆచితూచి అడుగులేశారు. మోదీ హయాంలో నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శల జడివాన కురుస్తుండటంతో విత్తమంత్రి తన ప్రసంగంలో 18 సార్లు ఉపాధి, ఉద్యోగాల కల్పన గురించి ప్రస్తావించారు. ప్రధాని మోదీ పదే పదే చెబుతున్న మౌలిక వసతుల అంశాన్ని 28 సార్లు వల్లెవేశారు. ప్రభుత్వ ప్రధాన నినాదాలైన గతిశక్తి గురించి 13 సార్లు, ఆత్మనిర్భరత గురించి 5 సార్లు ప్రస్తావించి తమ ప్రాధాన్యాలేంటో చెప్పకనే చెప్పారు. రక్షణ రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. రూ.5.25 లక్షల కోట్లు (పింఛన్లతో కలిపి) కేటాయించారు. గత సంవత్సరం కేటాయింపు కంటే ఇది దాదాపు 10% అదనం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 9.2% ఉంటుందని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది కొంత తగ్గి 8-8.5% మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. ద్రవ్యలోటు జీడీపీలో 6.9% ఉంది. దాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6.4%కు, 2025-26 నాటికి 4.5%కు తెస్తామని చెప్పారు. మొత్తమ్మీద ద్రవ్య స్థిరీకరణ కంటే ఆర్థికవ్యవస్థ విస్తరణకే ఈ బడ్జెట్‌ ప్రాధాన్యం ఇచ్చిందన్నది ఆర్థిక నిపుణుల విశ్లేషణ.

అన్ని రంగాలూ డిజిటల్‌ దారిలోనే..
అన్ని రంగాలూ డిజిటల్‌ దారిలోనే.. డిజిటలీకరణకు ఆర్థికమంత్రి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. విద్య, వైద్యం, ఆర్థికం, వ్యవసాయం... ఇలా అన్ని రంగాలనూ డిజిటల్‌ సాంకేతికత దారిలోకి తీసుకెళ్లనున్నట్లు సంకేతమిచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వర్చువల్‌ డిజిటల్‌ కరెన్సీని అందుబాటులోకి తెస్తామన్నారు. దేశంలో క్రిప్టో మార్కెట్‌ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో క్రిప్టోకరెన్సీలు, ఎన్‌ఎఫ్‌టీ (నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్లు) లావాదేవీలపై ఏప్రిల్‌ 1 నుంచి 30% పన్ను విధిస్తామన్నారు. అంకుర సంస్థలకు పన్ను విరామం 2023 మార్చి 31 వరకు కొనసాగిస్తామన్నారు. త్వరలో ఈ-పాస్‌పోర్టు విధానం అమలులోకి రానుంది. దేశంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వీలుగా ఏకీకృత రిజిస్ట్రేషన్‌ పథకం అమలుచేస్తామని ప్రకటించారు. వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందుల పిచికారీకి డ్రోన్ల వాడకాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇంటి వద్దే నాణ్యమైన విద్యను అందించేందుకు డిజిటల్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు పాఠాల కోసం 200 టీవీ ఛానళ్లను అందుబాటులోకి తెస్తామన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలోనే దేశంలో 5జీ టెలికాం సర్వీసులకు శ్రీకారం చుట్టేలా అవసరమైన స్పెక్ట్రం వేలం వేయబోతున్నట్లు వెల్లడించారు. ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకాల వల్ల వచ్చే అయిదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు, రూ.30 లక్షల కోట్ల అదనపు ఉత్పత్తి సాధ్యమవుతుందన్న ఆశలు రేపారు. కేంద్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఇన్నాళ్లూ భావించిన పెట్టుబడుల ఉపసంహరణ ప్రస్తావన ఈ బడ్జెట్‌లో లేకపోవడం ప్రస్తావనార్హం.

ఏడు చోదక శక్తులు
ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించేందుకు ఏడు చోదకశక్తుల్ని నిర్మలా సీతారామన్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అవి..1.రహదారులు, 2.రైల్వే, 3.విమానాశ్రయాలు, 4.ఓడరేవులు, 5.ప్రజారవాణా, 6.జలమార్గాలు, 7.రవాణా మౌలిక సదుపాయాలు. వీటితో పాటు రానున్న రోజుల్లో చేపట్టబోయే ప్రాధాన్య అంశాల్ని ప్రస్తావించారు. 5జీ స్పెక్ట్రం వేలం, నదుల అనుసంధానం, మూడేళ్లలో 400 వందేభారత్‌ రైళ్ల తయారీ వంటివాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వివరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిందని, వందేళ్ల దిశగా వెళ్లేందుకు ఈ బడ్జెట్‌ బాటలు వేస్తుందని చెప్పారు.

దేశ ‘గతి’ మార్చే ‘శక్తి’
దేశ ఆర్థికవృద్ధి, సమీకృత అభివృద్ధి తీరును ‘పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్‌ప్లాన్‌’ సమూలంగా మార్చేస్తుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఏడు చోదక శక్తులూ దేశ ఆర్థికవ్యవస్థను ఏక రీతిలో ముందుకు తీసుకెళ్తాయని తెలిపారు. వీటికి విద్యుత్‌ సరఫరా, ఐటీ కమ్యూనికేషన్, నీటి సరఫరా - మురుగునీటి పారుదల, సామాజిక మౌలిక వసతులు మద్దతుగా ఉంటాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13,327 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించగా, 2022 - 23లో 25వేల కిలోమీటర్ల మేర విస్తరిస్తామన్నారు. యువతకు ఉద్యోగ, వాణిజ్య అవకాశాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగం కలిసే ఉంటాయన్నారు. 

4 స్తంభాలపై 40 లక్షల కోట్లు

- కేంద్ర బడ్జెట్‌లో ఇవీ ప్రధానాంశాలు 
* కేంద్ర బడ్జెట్‌ మొత్తం అంచనాలు రూ.39.45 లక్షల కోట్లు. ఇందులో ఆదాయ వనరులు రూ.22.84 లక్షల కోట్లు
* మేకిన్‌ ఇండియాలో భాగంగా దేశంలోని 14 రంగాలకు ఉత్పాదకతో ముడిపడిన ఆర్థిక ప్రోత్సాహకాలు. తద్వారా 60 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన లక్ష్యం 
* స్థానిక సంస్థలకు నష్టం కలగకుండా కస్టమ్స్‌ సంకాల హేతుబద్ధీకరణ 
* దేశీయంగానే తగినంత ఉత్పత్తి సాధించడానికి అవకాశమున్న... వ్యవసాయ, రసాయన, వస్త్ర, వైద్య పరికరాలు, ఔషధ పరిశ్రమలకు ఇస్తున్న 350 రకాల పన్ను మినహాయింపులు క్రమంగా తగ్గింపు 
* నగరాలు, పట్టణాల అభివృద్ధికి నూతన పట్టణ ప్రణాళిక. నిర్మాణ రంగంలో సంస్కరణలు
* కొత్తగా 400 వందేభారత్‌ రైళ్లు, ఇతర రవాణా సదుపాయాలను రైల్వేలతో అనుసంధానిస్తూ రానున్న మూడేళ్లలో 100 గతిశక్తి లాజిస్టిక్‌ టర్మినళ్ల ఏర్పాటు 
* 25 వేల కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల విస్తరణ 
* అన్ని రకాల దీర్ఘకాలిక మూలధన ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను 15 శాతానికి తగ్గింపు. ఇప్పటివరకు అది 37% ఉండేది 
* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్‌పీఎస్‌(నేషనల్‌ పిన్షన్‌ స్కీం)లో 14% డిడక్షన్‌ వర్తింపు 
* వ్యక్తులు, సంస్థల వద్ద బయటపెట్టని ఆదాయం దొరికినప్పుడు చట్టాల నుంచి ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా పూర్తిగా స్వాధీనం 

ఈ నాలుగు సూత్రాలే ఆధారం
ప్రధాని గతిశక్తి యోజన
సమీకృత అభివృద్ధి
ఉత్పాదక అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు
పరిశ్రమలకు ఆర్థిక ఊతం

కేటాయింపులు... సంస్కరణలు
* రాష్ట్రాలకు చేయూతనిచ్చేందుకు రూ.లక్ష కోట్ల ప్రత్యేక నిధి
* దేశవ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం రూ.1.68 లక్షల కోట్లు  
* వరి, గోధుమ సేకరణకు రూ.2.37 లక్షల కోట్లు. చిరుధాన్యాల సంవత్సరంగా 2023 
* ఎంఎస్‌ఎంఈ సంస్థలను ఆదుకునేందుకు రూ.2 లక్షల కోట్లతో ‘రుణ హామీ ట్రస్టు’
* ప్రతి ఇంటికీ నల్లా పథకం ద్వారా 3.8 కోట్ల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికి రూ.60 వేల కోట్లు 
* పీఎం ఆవాస్‌ యోజన కింద 80 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.48 వేల కోట్లు 
* రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు డిఫెన్స్‌ బడ్జెట్‌లోని 68% నిధులు దేశీయ సంస్థలకే ప్రత్యేకం. డీఆర్‌డీవో ఇతర రక్షణ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో ప్రైవేటు సంస్థలకు అవకాశం.
* పర్వతమాల ప్రాజెక్టులో భాగంగా కొండప్రాంతాల అభివృద్ధికి ఎనిమిది రోప్‌వేల నిర్మాణం

ఆదాయపు పన్ను నిబంధనలు యథాతథం

ఆదాయపు పన్ను శ్లాబులను సవరిస్తారని, మినహాయింపులు పెంచుతారని వేయి కళ్లతో ఎదురుచూసిన సామాన్యులకు బడ్జెట్‌లో ఎలాంటి ఊరటా లభించలేదు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు పన్ను నిబంధనల్లో ఆర్థిక మంత్రి ఎలాంటి మార్పులు, చేర్పులను ప్రతిపాదించలేదు. 
సర్‌ఛార్జి తగ్గింపు
ప్రస్తుత నిబంధనల ప్రకారం షేర్లు అమ్మినప్పుడు వచ్చిన మూలధన లాభంపై సర్‌ఛార్జి 15 శాతమే విధిస్తున్నారు. ఈ నిబంధనను ఇతర ఆస్తి లావాదేవీలకు ఇప్పటివరకు వర్తింపజేయలేదు. ప్రస్తుత బడ్జెట్‌లో అన్ని రకాల మూలధన లాభాలకు గరిష్ఠంగా 15 శాతం సర్‌ఛార్జిని ప్రతిపాదించారు. 
రెండేళ్లపాటు..
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఇప్పటికే సమర్పించిన రిటర్నులను సరిదిద్దుకునేందుకు నిర్ణీత వ్యవధి మాత్రమే ఉండేది. మదింపు సంవత్సరం ముగిసిన తర్వాత రెండేళ్ల వరకూ ఈ వ్యవధిని పొడిగిస్తూ ప్రత్యేక సెక్షన్‌ 139(8ఏ)ని తీసుకొచ్చారు. ఉదాహరణకు 2021-22 మదింపు సంవత్సరానికి (2020-21 ఆర్థిక సంవత్సరం) గాను రిటర్నులలో 31.03.2024 వరకు మార్పులు చేసుకునేందుకు వీలవుతుంది. గతంలో వెల్లడించని ఆదాయాలను రిటర్నులలో దాఖలు చేసేందుకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా మరో రిటర్నుల ఫారాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నష్టాలను నమోదు చేసేందుకు, అదనపు రిఫండును కోరేందుకు, రిటర్నులలో మార్పులు చేయాలంటే ఇందులో అనుమతించరు. 

డిజిటల్‌ ఆస్తులపై.. 
భారతీయ, విదేశీ కరెన్సీలు కాకుండా.. డిజిటల్‌ కరెన్సీల క్రయవిక్రయ లావాదేవీలపై వచ్చిన లాభాలకు సెక్షన్‌ 115బీబీహెచ్‌ ప్రకారం 30 శాతం పన్ను చెల్లించాలి. అంతేకాకుండా వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులు బదిలీ చేసినప్పుడు సెక్షన్‌ 194 ఎస్‌ ప్రకారం 1శాతం టీడీఎస్‌ వర్తిస్తుంది. ఈ ఆస్తులను ఎవరికైనా బహుమతిగా ఇచ్చినా పన్ను చెల్లించాల్సి వస్తుంది. 
* సెక్షన్‌ 194ఐఏ ప్రకారం రూ.50 లక్షలపైన విలువున్న ఆస్తి కొన్నప్పుడు టీడీఎస్‌ 1 శాతాన్ని చెల్లించాలి. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం ఆస్తి లావాదేవీల్లో చెల్లించిన మొత్తం లేదా ప్రభుత్వం నిర్ణయించిన స్టాంపు డ్యూటీ విలువపై ఏది ఎక్కువ మొత్తం ఉంటే.. దానిపై టీడీఎస్‌ వర్తిస్తుంది.

విద్యారంగం
కరోనాతో కుంటుబడిన విద్యా రంగానికి తిరిగి జవసత్వాలు చేకూర్చేందుకు డిజిటల్‌ విద్యను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐఎస్‌టీఈ ప్రమాణాలతో కూడిన ప్రపంచస్థాయి నాణ్యమైన విద్యను దేశంలోని విద్యార్థులకు ఇంటివద్దే అందుబాటులో ఉంచేందుకు ఓ డిజిటల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. అలాగే పీఎం ఈ-వీఐడీవైఏలోని ‘ఓ తరగతి - ఓ టీవీ ఛానల్‌’ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఉన్న 12 ఛానళ్ల నుంచి 200 ఛానళ్లకు పెంచనున్నారు. వీటి ద్వారా అన్ని రాష్ట్రాలకు చెందిన 1-12వ తరగతి విద్యార్థులకు వారివారి ప్రాంతీయ భాషల్లో మరిన్ని విద్యా విషయాలు అందుబాటులోకి వస్తాయి. ఇందుకు సంబంధించి అధిక నాణ్యతతో కూడిన ఈ-కంటెంట్‌ను వివిధ భాషల్లో అభివృద్ధి పరచనున్నారు. 

హైటెక్‌ బాటలో సాగు
సాంకేతికత, సేంద్రియం జోడెద్దులుగా దేశ వ్యవసాయ రంగాన్ని ముందుకు నడిపించాలని కేంద్రం ప్రతిపాదించింది. వ్యవసాయ అనుబంధ, ఆహారశుద్ధి రంగాలకు అధిక కేటాయింపులు చేసింది. సేంద్రియ సాగు, కిసాన్‌ డ్రోన్లు, రైతులకు డిజిటల్, హైటెక్‌ సేవలను చేరువచేసేందుకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కొత్తగా అగ్రిస్టార్టప్‌లకు ఆర్థిక సహకారం అందిస్తామని వెల్లడించారు. పంటల విలువ మదింపు, సస్యరక్షణ మందుల పిచికారీ, భూదస్త్రాల డిజిటలైజేషన్‌కు కిసాన్‌ డ్రోన్లు వినియోగిస్తామని వెల్లడించారు. 2021 - 22లో 163 లక్షల మంది రైతుల నుంచి కనీస మద్దతు ధరలకు 1208 లక్షల టన్నుల ధాన్యం, గోధుమలను సేకరిస్తున్నామని, తద్వారా రైతుల ఖాతాలకు రూ.2.37 లక్షల కోట్ల నగదు జమ చేస్తున్నామని తెలిపారు. వివరాలు ఆమె మాటల్లోనే..
 

బడ్జెట్‌లో వ్యవ‘సాయం’ ఇలా..
అగ్రి స్టార్టప్‌లు, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించే గ్రామీణ వ్యాపార సంస్థలకు రుణాలిచ్చేందుకు మూలధనంతో కూడిన నిధిని ప్రభుత్వం సమకూరుస్తుంది. నాబార్డ్‌ ద్వారా ‘సహ-పెట్టుబడి విధానం’ కింద దీనిని అమల్లోకి తెస్తుంది. ఈ అగ్రి స్టార్టప్‌లు రైతు ఉత్పత్తి సంస్థల (ఎఫ్‌పీఓస్‌)కు యంత్రాలు అద్దెకు ఇవ్వడం, సాంకేతికత అందించడం తదితర అంశాల్లో సహకరిస్తాయి. 
గంగానది తీరాన సేంద్రియ సాగు
దేశవ్యాప్తంగా రసాయనాల రహిత సాగును ప్రభుత్వ ప్రోత్సహిస్తుంది. తొలి దశలో గంగానదికి ఇరువైపులా 5 కి.మీ. కారిడార్‌లో వ్యవసాయ భూముల్లో ఈ విధానం అమలు చేస్తాం.
ప్రభుత్వ రంగ పరిశోధన, విస్తరణ సంస్థలు, ప్రైవేటు అగ్రిటెక్‌ సంస్థలు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ సంస్థల ప్రమేయంతో రైతులకు డిజిటల్, హైటెక్‌ సేవలను అందించేందుకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఓ పథకాన్ని తెస్తాం. 
ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలు తమ పాఠ్యప్రణాళికలను మెరుగుపరచుకునేందుకు ప్రోత్సహిస్తాం.
‣ 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించినందున దేశీయంగా వీటి ఉత్పత్తులకు విలువ జోడించి వినియోగం పెంచేలా ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. 
ఆగ్రో ఫారెస్ట్రీ, ప్రైవేటు భూముల్లో అడవుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు నూతన విధానాలు తీసుకొస్తాం. చట్టాల్లో అవసరమైన మార్పులు తెస్తాం. 
నూనె గింజల ఉత్పత్తి పెంచుతాం
దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు హేతుబద్ధమైన, సమగ్ర పథకాన్ని అమలు చేస్తాం. తద్వారా వంట నూనెల కోసం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తాం.
పూచీకత్తు లేకుండా రూ.1.6 లక్షల రుణం
చిన్న, మధ్య తరహా రైతులకు రుణాలను మరింత చేరువ చేసేందుకు.. పూచీకత్తు లేకుండా ప్రస్తుతం ఇస్తున్న రూ.లక్ష మొత్తాన్ని రూ.1.6 లక్షలకు పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. 


బిందు సేద్యానికి నిధులు రాలే..
పంటలకు సాగునీటిని పొదుపుగా అందించేందుకు సూక్ష్మ సేద్య పథకం కింద బిందు, తుంపర్ల పరికరాలను రైతులకు రాయితీపై ఇస్తారు. ఈ పథకానికి గతేడాది రూ.5 వేల కోట్లతో నాబార్డులో నిధి ఉండగా మరో రూ.5 వేలు కోట్లు అదనంగా పెంచుతామని 2021 - 22 బడ్జెట్‌లో కేంద్రమంత్రి తెలిపారు. కానీ ఈ నిధుల పెంపు ఇంతవరకూ జరగలేదు. అదనపు నిధుల ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీకి పంపినట్లు తాజా బడ్జెట్‌లో తెలిపారు. ఈ ఏడాది మిగిలింది రెండు నెలలే అయినందున నిధులు పెంచుతారా అనేది అనుమానమేనని అధికారులు చెప్పారు.
‘ఆపరేషన్‌ గ్రీన్‌’ పథకం కింద టమాటా, ఉల్లిగడ్డ, ఆలుగడ్డలకు మాదిరిగానే మరో 22 ఆహార పంటల శుద్ధి, నిల్వ సదుపాయాలు పెంచడం ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేసి ఎగుమతులను ప్రోత్సహిస్తామని గత బడ్జెట్‌లో ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ 19 పంటలనే గుర్తించారు. వాటిని అధికంగా పండించే రాష్ట్రాల వివరాలు సేకరించారు.  కానీ, ఈ పథకాన్ని ప్రధానమంత్రి కిసాన్‌ సంపద పథకంలోకి మార్చారు. దీనిని 2021 - 22 నుంచి 2025 - 26 వరకు అమలుచేయాలని ఆర్థిక వ్యయ కమిటీ సిఫార్సు చేసింది. ఇది కూడా ఇప్పుడు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీకి పంపినట్లు తాజా బడ్జెట్‌లో తెలిపారు. 
‘జాతీయ ఎలక్ట్రానిక్‌ వ్యవసాయ మార్కెట్‌’ (ఈనామ్‌) పథకం కింద కొత్తగా వెయ్యి వ్యవసాయ మార్కెట్లను ఆన్‌లైన్‌ వేదికలోకి తెచ్చి పంటల క్రయవిక్రయాలు జరిగేలా చూస్తామని గత బడ్జెట్‌లో తెలిపారు. కానీ ఇంతవరకూ ఈ దిశగా చర్యలే లేవు. దీని అమలుకు మంత్రివర్గానికి నివేదిక పంపినట్లు కొత్త బడ్జెట్‌లో తెలిపారు. 

బడ్జెట్‌లో కెన్‌-బెట్వా నదులకు నిధుల కేటాయింపు
నదుల అనుసంధానంలో ఓ ముందడుగు పడింది. రెండు దశాబ్దాలుగా చర్చలు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు, సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి ఇది పరిమితం కాగా, మొదటిసారిగా ఉత్తర్‌ప్రదేశ్‌-మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే కెన్‌-బెట్వా నదుల అనుసంధానానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.  ఉత్తర్‌ప్రదేశ్‌-మధ్యప్రదేశ్‌లకు ప్రయోజనం కలిగించే కెన్‌-బెట్వా అనుసంధానం కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేశారు. మొదటి దశ వల్ల 9.08 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు ప్రయోజనం కలగనుండగా, రూ.44,605 కోట్ల వ్యయమవుతుంది. ప్రస్తుత సంవత్సరం సవరించిన బడ్జెట్‌లో రూ.4300 కోట్లు , వచ్చే సంవత్సరం రూ.1400 కోట్లు కేటాయించారు. నిర్మాణ వ్యయంలో 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. అనుసంధానానికి గతంలో నాబార్డు ద్వారా నిధులివ్వగా.. ఈ ప్రాజెక్టుకు నేరుగా బడ్జెట్‌లోనే కేటాయింపులు చేయడం గమనార్హం.  

బడ్జెట్‌లో క్రీడలకు రూ.305.58 కోట్లు పెంపు 
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ మెరుగైన ప్రదర్శన బడ్జెట్‌లో క్రీడారంగం పట్ల సానుకూల ప్రభావం చూపించింది. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం క్రీడారంగానికి రూ.3062.60 కోట్లు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే రూ.305.58 కోట్లు అధికంగా నిధులు ఇచ్చింది. 2021 - 22లో క్రీడలకు ప్రభుత్వం రూ.2596.14 కోట్లు కేటాయించింది. అనంతరం రూ.2757.02 కోట్లకు సవరించింది. ఇక ఈ ఏడాది కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడలు వంటి మెగా టోర్నీలు ఉండటంతో బడ్జెట్‌లో ఈ రంగానికి ప్రాధాన్యం లభించింది. ఖేలో ఇండియాకు రూ.974 కోట్లు, క్రీడాకారుల ప్రోత్సాహకాల అవార్డులకు రూ.357 కోట్లు, భారత క్రీడాప్రాధికార సంస్థకు రూ.653 కోట్లు, జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ.280 కోట్లు కేటాయించింది.

జాతీయ రహదారుల విస్తరణకు పెద్దపీట
దేశంలో జాతీయ రహదారుల (ఎన్‌హెచ్‌) విస్తరణకు కేంద్రం పెద్ద పీట వేసింది. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 25 వేల కిలోమీటర్ల మేర ఎన్‌హెచ్‌లను నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో జాతీయ రోప్‌వే అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేయదలచిన బహుళవిధ రవాణా పార్కుల నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టుల అమలును 2022 - 23లో చేపడతామంది.  గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద 35 శాతం అధికంగా రూ.19,000 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై)కు 2.5 శాతం అధికంగా రూ.20,000 కోట్లు చూపించారు. గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో చేపట్టే ఉపాధి హామీ సహా కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ.1,.35,944.29 కోట్లు కేటాయించారు. 2021 - 22లో సవరించిన అంచనాలు రూ.1,53,558.07 కోట్లకు చేరాయి. 

‘రక్షణ’కు 9.8 శాతం మేర పెరిగిన కేటాయింపులు
బడ్జెట్‌లో రక్షణ రంగానికి మెరుగైన కేటాయింపులు దక్కాయి. 2022 - 23 సంవత్సరానికి రూ.5,25,166 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకించింది. ఇది స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతంగా ఉంది. గత బడ్జెట్‌లో చేసిన కేటాయింపు (రూ.4.78లక్షల కోట్లు) కన్నా ఇది 9.8 శాతం అధికం. స్వదేశీ సంస్థల నుంచి ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు ఈ దఫా ప్రాధాన్యం దక్కింది. అలాగే రక్షణ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)లో ప్రైవేటు సంస్థలకు చోటు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. 
ఈ దఫా రక్షణ కేటాయింపుల్లో పెట్టుబడి వ్యయం కింద రూ.1,52,369 కోట్లు కేటాయించారు. కొత్త ఆయుధాలు, యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, ఇతర సైనిక హార్డ్‌వేర్‌ సమకూర్చుకునేందుకు ఈ సొమ్మును వెచ్చించనున్నారు. 2021 - 22 నాటి సవరించిన అంచనాలతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. 
రెవెన్యూ వ్యయం కింద రూ.2,33,000 కోట్లు ప్రత్యేకించారు. వేతనాల చెల్లింపులు, నిర్వహణ వ్యయాల కోసం ఈ సొమ్మును వినియోగిస్తారు. 
రక్షణ బడ్జెట్‌లో పింఛన్ల కోసం  రూ.1,19,696 కోట్లు, రక్షణ మంత్రిత్వశాఖ (పౌర) కోసం రూ.20,100 కోట్లు కేటాయించారు. 
పెట్టుబడి వ్యయంలో సైన్యానికి రూ.32,015 కోట్లు ప్రత్యేకించారు. గత బడ్జెట్‌లో ఈ పద్దు కింద రూ.36,481 కోట్లు కేటాయించారు. అందులో రూ.25,377 కోట్లను సైన్యం ఖర్చు చేసింది. 
పెట్టుబడి వ్యయం కింద వైమానిక దళానికి రూ.55,586 కోట్లు కేటాయించారు. గత ఏడాది అది రూ.53,214 కోట్లుగా ఉంది. అందులో రూ.51,830 కోట్లను వాయుసేన ఖర్చు చేసింది. 
సరిహద్దు రహదార్ల సంస్థ (బీఆర్‌వో)కు పెట్టుబడి వ్యయం కింద రూ.3,500 కోట్లు కేటాయించారు. 
కోస్ట్‌ గార్డ్‌ దళానికి పెట్టుబడి వ్యయం కింద రూ.4,246 కోట్లు ప్రత్యేకించారు. 
రక్షణ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కార్యక్రమాల కోసం పరిశ్రమలు, అంకుర పరిశ్రమలు, విద్యా సంస్థలకు అవకాశం కల్పించనున్నారు. ఆర్‌ అండ్‌ డీ కేటాయింపుల్లో 25 శాతాన్ని వీటికే ప్రత్యేకించారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), ఇతర సంస్థలతో కలిసి ఎస్‌పీవీల ద్వారా భాగస్వామ్యాలు ఏర్పర్చుకునేలా ప్రైవేటు రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. 
ప్రైవేటు సంస్థలు సాంకేతిక వ్యవస్థల పరీక్షలను పూర్తిచేసుకోవడానికి, కొత్త పరిజ్ఞానాల అవసరాలను అందుకునేలా చూడటానికి, ధ్రువీకరణ పత్రాలు పొందేలా సాయపడటానికి ఒక స్వతంత్ర నోడల్‌ సంస్థను ఏర్పాటు చేస్తారు. 
68% రక్షణ శాఖలో పెట్టుబడి వ్యయం కింద కేటాయించిన సొమ్ములో  68 శాతాన్ని దేశీయ పరిశ్రమల నుంచి చేపట్టే కొనుగోళ్లకు ఉపయోగిస్తారు.
47,590కోట్లు నౌకాదళానికి ఇచ్చిన సొమ్ము. గత ఏడాది ఇది రూ.33,253 కోట్లుగా ఉంది. అయితే నేవీ రూ.46,021 కోట్లు ఖర్చు చేసింది. 

రక్షణ రంగం బలోపేతంతో హైదరాబాద్‌కు లబ్ధి
కేంద్ర బడ్జెట్‌లో రక్షణ పరిశోధనాభివృద్ధికి కేటాయిస్తున్న నిధుల్లో ప్రైవేట్‌ సంస్థలకు 25% కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో దేశంలోనే ప్రధాన రక్షణ రంగ కారిడార్‌గా ఉన్న హైదరాబాద్‌కు ప్రయోజనం చేకూరనుంది. భాగ్యనగరంలో డీఆర్డీవోకు చెందిన పరిశోధన సంస్థలతోపాటు రక్షణరంగ ఉత్పత్తి సంస్థలైన మిథాని, బీడీఎల్, ఆర్డినెన్స్‌ పరిశ్రమలున్నాయి. వీటికి అవసరమైన పరికరాలు, ఉప వ్యవస్థలను సరఫరా చేసే కంపెనీలు ఇక్కడ రెండువేల వరకు ఉన్నాయి. కొత్తగా పలు అంకుర సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఇక్కడ యుద్ధ విమానాల ఉపభాగాలు కూడా తయారవుతున్నాయి. రక్షణ రంగంలో అవసరమైన ఆయుధాలు, ఇతర వ్యవస్థలన్నీ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసి.. దిగుమతులు మరింత తగ్గించాలంటే ప్రైవేట్‌ భాగస్వామ్యంతో వేగం పెంచాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. ఈమేరకు కొత్త క్షిపణుల రూపకల్పన దశ నుంచే ప్రైవేట్‌ సంస్థలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నారు. అవసరమైతే డీఆర్డీవో శాస్త్రవేత్తలు వారికి మెంటార్‌షిప్‌ అందించనున్నారు. రక్షణ రంగంలో పెద్ద ఎత్తున ప్రైవేట్‌ పెట్టుబడులు వస్తుండటంతో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. 

సింగరేణికి రూ.2 వేల కోట్లు
వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్, సింగరేణి బొగ్గు గనులకు మినహా కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా కేటాయింపులేమీ కనిపించలేదు. ఐఐటీలు, ఐఐఎంలు, ఐసర్‌లు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఎయిమ్స్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్లకు దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలన్నింటికీ కలిపి ఉమ్మడిగా నిధులు ప్రకటించినందున ఏపీ, తెలంగాణల్లోని సంస్థలకు ప్రత్యేకంగా ఎన్ని నిధులు వస్తాయన్నది స్పష్టత లేదు. ఉన్నత విద్యాసంస్థల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఫైనాన్సింగ్‌ ఏజెన్సీ నుంచి రుణాలు తీసుకొని చెల్లిస్తున్నందున వీటికి సంస్థల వారీగా నిధులను చూపలేదు. 
వైజాగ్‌ స్టీల్‌కు రూ.910 కోట్లు ప్రకటించారు. 2021 - 22లో ఈ సంస్థకు రూ.595 కోట్లు కేటాయించి, అంచనాల సవరణ నాటికి రూ.730 కోట్లకు పెంచారు. 
ఇరు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.44 కోట్లు ఇచ్చారు. వీటికి గత బడ్జెట్‌లో రూ.53.80 కోట్లు కేటాయించినా అంచనాల సవరణ తర్వాత రూ.13.37 కోట్లకు పడిపోయింది.
సింగరేణి కాలరీస్‌కు ఈసారి రూ.2వేల కోట్లు కేటాయించారు. నిరుడు రూ.2,500 కోట్లుగా పేర్కొన్నా, సవరించిన అంచనాల నాటికి రూ.2వేల కోట్లకు కుదించారు.
హైదరాబాద్‌ ఆటమిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌కు రూ.374.25 కోట్లు ప్రకటించారు. దీనికి గత బడ్జెట్‌లో రూ.4.69 కోట్లు కోతపడింది. 
హైదరాబాద్‌ ఐఐటీ (ఈఏపీ)కి రూ.300 కోట్లు కేటాయించారు. పాత బడ్జెట్‌లో రూ.150 కోట్లు ప్రకటించినా తుదకు రూ.230 కోట్లకు పెంచారు. 
హైదరాబాద్‌ నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుకు రూ.19 కోట్లు ప్రకటించారు. గతేడాది తొలుత రూ.23.84 కోట్లుగా పేర్కొని, రూ.18.04 కోట్లకు తగ్గించారు. 
దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వాతంత్య్ర పోరాటాల్లో పాల్గొన్న సమరయోధులు, వారి కుటుంబసభ్యుల సంక్షేమం, పింఛన్ల కోసం రూ.688.14 కోట్లు కేటాయించారు. 
హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌కు రూ.135.46 కోట్లు కేటాయించారు.  
సొసైటీ ఫర్‌ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (సమీర్‌)కు  రూ.150 కోట్లు ప్రకటించారు. 

డిజి.. డిజి... పరుగులు
* డిజిటల్‌ ఎకానమీకి ఊతమిచ్చేందుకు ‘డిజిటల్‌ రూపీ’ని ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ
* 75 జిల్లాల్లో వాణిజ్య బ్యాంకులకు చెందిన 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్ల ఏర్పాటు
* 1.5 లక్షల పోస్టాఫీసుల్లో వాణిజ్య బ్యాంకుల్లో మాదిరే పూర్తి లావాదేవీలకు అవకాశం 
* ఈ ఏడాది నుంచి ఈ-పాస్‌పోర్టు విధానం 
* కాంట్రాక్టర్లకు ఈ-బిల్లులకు అవకాశం. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకునే సౌకర్యం 

పర్యావరణానికి ఊతం
* కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖకు రూ.3,030 కోట్లు 
* పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక గ్రీన్‌ బాండ్లు 
* సోలార్‌ ఫలకల తయారీకి రూ.19,500 కోట్లు.
* విద్యుత్తు మోటార్ల రంగానికి ఊతమిచ్చేందుకు ఈ-ఛార్జింగ్‌ కేంద్రాల్లో బ్యాటరీలు ఇచ్చిపుచ్చుకునే విధానానికి అనుమతి.
* బొగ్గు ద్వారా గ్యాస్‌ ఉత్పత్తికి 4 పైలట్‌ ప్రాజెక్టులు 

ఈ-విద్యకు విశ్వవిద్యాలయం 
ప్రధాని ఈ-విద్య కింద ప్రస్తుతం ఉన్న 12 టీవీ ఛానళ్లను 200కు పెంపు. ఉపాధ్యాయుల డిజిటల్‌ నైపుణ్యాల వృద్ధికి శిక్షణ. విద్యార్థులందరికీ అందుబాటులోకి ఈ-కంటెంట్‌. దేశంలో ఈ-విద్య విస్తరణకు డిజిటల్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు.

రానుంది 5జీ 
దేశవ్యాప్తంగా ప్రైవేటు సంస్థల ద్వారా ఈ ఏడాది అందుబాటులోకి 5జీ సాంకేతికత. మారుమూల ప్రాంతాలకు భారత్‌నెట్‌ ప్రాజెక్టు ద్వారా ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ 
డేటా సెంటర్లు, శక్తి నిలువ వ్యవస్థలకు మౌలిక సదుపాయాల రంగం హోదా

ప్రైవేటుకు అడవులు 
అడవుల పెంపకానికి ప్రైవేటు వ్యక్తులకు అవకాశం ఇచ్చేలా గిరిజనుల కోసం అటవీ పెంపకానికి ప్రత్యేక పథకం.

కొవిడ్‌-19 ముందుతో పోలిస్తే 101.3% పుంజుకోనున్న ఆర్థిక వ్యవస్థ
కొవిడ్‌-19 పరిణామాల కంటే ముందు (2019 - 20)తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 101.3 శాతం మేర పుంజుకుంటుందని బడ్జెట్‌ పత్రాల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021 - 22) వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 9.2 శాతంగా ఉంటుందనే జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) అంచనాను లెక్కలోకి తీసుకుని, ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 2021 - 22 మూడో త్రైమాసికంలో పలు కీలక సూచీలు పుంజుకోవడం, కొవిడ్‌ టీకాలు వేసే కార్యక్రమంలో గణనీయ పురోగతి లాంటివి వృద్ధికి దోహదం చేస్తాయని బడ్జెట్‌ పత్రాల్లో ప్రభుత్వం తెలిపింది. అన్ని రంగాల్లోనూ గిరాకీ పుంజుకుంటుండటాన్నీ ప్రస్తావించింది. బడ్జెట్‌ పత్రాల ప్రకారం.. 2019 - 20తో పోలిస్తే పెట్టుబడులు, ఎగుమతులు పూర్తిగా పుంజుకున్నాయి. ప్రైవేట్‌ వినియోగ వ్యయాలు 2021 - 22 రెండో అర్ధభాగంలో సంపూర్ణంగా పెరిగాయి. 2021 - 22 ఆర్థిక సంవత్సరానికి ప్రైవేట్‌ వినియోగ వ్యయాలు 6.9 శాతం పెరిగే అవకాశం ఉంది. 


ఎయిరిండియా అసెట్‌ హోల్డింగ్‌కు రూ.9,259 కోట్లు
వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2022 - 23) ఎయిరిండియా అసెట్స్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ (ఏఐఏహెచ్‌ఎల్‌)కు కేంద్రం రూ.9,259 కోట్లను కేటాయించింది. ఎయిరిండియా రుణాలు, ప్రధానేతర ఆస్తులను నిర్వహించేందుకు 2019లో ఏఐఏహెచ్‌ఎల్‌ను ఏర్పాటు చేశారు. ‘ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ మూలధన వ్యయ అంచనాను రూ.6.03 లక్షల కోట్లుగా సవరించాం. ప్రభుత్వం హామీదారుగా ఎయిరిండియా తీసుకున్న బకాయిలు, ఇతరత్రా చెల్లింపుల కోసం కేటాయించిన రూ.51,971 కోట్లు కూడా ఇందుఓ కలిసి ఉన్నాయ’ని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చెప్పారు. ఎయిరిండియా రుణ పునర్‌వ్యవస్థీకరణ కింద ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ చేసిన రుణాల నిమిత్తం రూ.9,259 కోట్లు కేటాయించామన్నారు. ఎయిరిండియా ప్రైవేటీకరణకు ముందు ఆ సంస్థకున్న బకాయిలు చెల్లించే ఉద్దేశంతో 2021-22లో ఏఐఏహెచ్‌ఎల్‌కు ఈక్విటీ రూపంలో రూ.62,057 కోట్లను ప్రభుత్వం ఇచ్చింది. 


ఇక ఇంట్లోనే ‘టీవీ’ మాస్టారు
- రాష్ట్రానికి 3 లేదా 4 ఛానళ్లు కేటాయించే అవకాశం
ఒక్కో తరగతికి ఒక్కో ఛానల్‌.. ప్రాంతీయ భాషల్లో పాఠాలు కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదన ఇది. ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఒక్కో తరగతికి ఒకటి చొప్పున 12 ఛానళ్లు ప్రారంభిస్తామని గత బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. స్వయంప్రభ పేరిట వాటిని అందుబాటులోకి తెచ్చింది. వాటిని 200కు పెంచుతామని తాజా బడ్జెట్లో ప్రకటించింది. అంటే మరో 188 కొత్తగా రానున్నాయి. దేశంలో హిందీ సహా మొత్తం 22 అధికార భాషలున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రానికి మూడు లేదా నాలుగు డీటీహెచ్‌ ఛానళ్లు కేటాయించే అవకాశముందని టీశాట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో దూరదర్శన్‌ యాదగిరితోపాటు టీశాట్‌ కింద విద్య, నిపుణ ఛానళ్లు ఉన్నాయి. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో పాఠాలకు వీటిలో స్లాట్లు దొరకడం ఇబ్బందిగా మారింది. మరికొన్ని ఛానళ్లు వస్తే ఈ సమస్య తీరనుంది.
మన వాటా 17,165 కోట్లు
రాబోయే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణకు రూ.17,165.98 కోట్లు దక్కనున్నాయి. ఆర్థిక సంఘం నిర్దేశించిన ప్రకారం కేంద్రం రాష్ట్రానికి 2.102% కేటాయించనుంది. ఇది 2021 - 22 బడ్జెట్‌ అంచనాలకంటే రూ.3,175.85 కోట్లు, సవరించిన అంచనాలకంటే రూ.1,240.14 కోట్లు అధికం. 2022 - 23లో తెలంగాణకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ కింద రూ.5,359.87 కోట్లు, ఆదాయపన్ను కింద రూ.5,176.50 కోట్లు, సెంట్రల్‌ జీఎస్‌టీ కింద రూ.5,636.47 కోట్లు, కస్టమ్స్‌ కింద రూ.744.26 కోట్లు, ఎక్సైజ్‌ డ్యూటీ కింద రూ.231.83 కోట్లు, సర్వీస్‌ ట్యాక్స్‌ కింద రూ.17.24 కోట్లు దక్కనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ బడ్జెట్‌ పద్దుల్లో పేర్కొంది. ఇందులో సంపద పన్ను కింద రూ.19 లక్షల మినహాయింపు ఉంటుంది. రాష్ట్రానికి 2021-22లో బడ్జెట్‌ అంచనాలకు మించి కేంద్ర పన్నుల్లో వాటా దక్కింది. ఆ బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.13,990.13 కోట్లు వస్తాయని అంచనా వేయగా, వాస్తవంగా రూ.15,925.84 కోట్లు వస్తున్నట్లు తాజా బడ్జెట్‌ పత్రంలో కేంద్రం పేర్కొంది. ఇందులో రూ.15,497.62 కోట్లు ఈ సంవత్సరానివి కాగా, రూ.444.73 కోట్లు 2020-21కి చెందినవని తెలిపింది. అయితే 2019-20కి సంబంధించిన రూ.16.51 లక్షల బకాయిలను మినహాయించుకొంది. ఈ లెక్కన 2021-22లో తెలంగాణకు అంచనాకంటే రూ.1,935.71కోట్ల వాటా అధికంగా దక్కింది. 

పోలీసు శాఖ ఆధునికీకరణ 
బడ్జెట్‌లో పోలీసుశాఖ ఆధునికీకరణకు కేంద్రం ప్రాధాన్యమిచ్చింది. తద్వారా సంస్కరణల్లో ముందున్న తెలంగాణ పోలీసుశాఖకు దీనివల్ల ఎంతోకొంత ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకు జైళ్లు, న్యాయస్థానాలు, ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలను అనుసంధానం చేస్తూ రూపొందించిన ‘ఇంటర్‌ ఆపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టం’కు గత బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు జరపలేదు. ఈసారి రూ.590 కోట్లు కేటాయించారు. దామాషా ప్రకారం రాష్ట్రానికి ఆ నిధులు అందే పక్షంలో ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అమల్లో ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అలాగే దేశవ్యాప్తంగా ఆపదలో ఉన్నవారు ఎక్కణ్నుంచి ఫోన్‌ చేసినా స్పందించేలా 112 వ్యవస్థకు మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు తాజాగా రూ.150 కోట్లు కేటాయించారు.  ఫోరెన్సిక్‌ ప్రయోగశాలల్ని మెరుగుపరిచేందుకు గతంలో ఒక్క పైసా ఇవ్వలేదు. ఈ దఫా రూ.300 కోట్లు ఇచ్చారు. పోలీసు బలగాల ఆధునికీకరణ, క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టం (సీసీటీఎన్‌ఎస్‌)లకు కలిపి గత బడ్జెట్‌లో రూ.240.49 కోట్లు ఇవ్వగా, ఈసారి దాన్ని రూ.621.45 కోట్లకు, సేఫ్‌సిటీ ప్రాజెక్టు నిధులను రూ.122.06 కోట్ల నుంచి రూ.520.04 కోట్లకు పెంచారు. 

గిరిజన గురుకులాలకు నిధుల పెంపు
గిరిజన విద్యార్థులకు గురుకుల విద్య కోసం ఏర్పాటు చేసిన ఏకలవ్య ఆదర్శ నమూనా గురుకులాల (ఈఎంఆర్‌ఎస్‌)కు కేంద్రం నిధులు దాదాపు రెట్టింపు చేసింది. 2021 - 22 ఏడాదికి రూ.1057 కోట్లు కేటాయించగా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.2 వేల కోట్లుగా పేర్కొంది. ఈ పథకం కింద రాష్ట్రంలో 23 ఏకలవ్య గురుకులాలు ఉన్నాయి. గతంలో ఈ గురుకులాలు రాష్ట్ర గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో ఉండేవి. రెండేళ్ల క్రితం ఈఎంఆర్‌ఎస్‌లను నవోదయ విద్యాలయాల తరహాలో కేంద్ర సిలబస్‌ (సీబీఎస్‌ఈ)లో నిర్వహణకు ప్రత్యేక సొసైటీని కేంద్రం ఏర్పాటు చేసింది. 

‘ఉపాధి హామీ’కి తగ్గిన నిధులు
కేంద్ర బడ్జెట్‌లో ఉపాధిహామీ పథకానికి 2022 - 23 ఏడాదికి ఏకంగా రూ.25 వేల కోట్ల కోత పడింది. రూ.98 వేల కోట్ల నుంచి రూ.73 వేల కోట్లకు తగ్గించింది. ఆ మేరకు ఈ ఏడాదికి రాష్ట్రానికి వచ్చే వాటాపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఉపాధి పథకానికి ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల కేటగిరీ, మెటీరియల్‌ కేటగిరీతో కలిపి రూ.3053 కోట్లు విడుదలయ్యాయి. వచ్చే ఏడాదికి ఈ స్థాయిలో నిధులు విడుదల కాకపోవచ్చని, దీంతో ఉపాధి కూలీల జీవనోపాధిపై ప్రభావం పడే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.రాష్ట్రంలో ప్రస్తుతం 1.19 కోట్ల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. కనీస కూలి రూ.237గా ఉంది. అర్హులైన వారికి వంద రోజుల పని కింద గరిష్ఠంగా రూ.23,700 వరకు వస్తోంది. 2021 - 22 ఏడాదికి రాష్ట్రంలో ఇప్పటికే 13.43 కోట్ల పనిదినాలు పూర్తయ్యాయి. వచ్చే ఏడాదికి కేంద్రం బడ్జెట్‌ నిధులు తగ్గించడంతో ఉపాధి పొందే కూలీల సంఖ్య తగ్గే ప్రమాదముంది. కనీసం 25 శాతం వరకు పనిదినాలు కోల్పోయే అవకాశముంది. కరోనా మహమ్మారితో గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

దేశవ్యాప్తంగా ఏకరూప రిజిస్ట్రేషన్‌ విధానం
- భూములకు విశిష్ట గుర్తింపు సంఖ్య
పౌరుల ఆస్తుల క్రయ విక్రయ దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కు దేశవ్యాప్తంగా ఏకరూప విధానాన్ని ఒక ఆప్షన్‌గా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ‘ఒకే దేశం...ఒకే రిజిస్ట్రేషన్‌ సాఫ్ట్‌వేర్‌’తో జాతీయ సార్వజనిక పత్ర రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ (ఎన్‌జీడీఆర్‌ఎస్‌)ను అనుసంధానించడానికి రాష్ట్రాలను ప్రోత్సహించనుంది. దీనిలో భాగంగానే భూముల రికార్డుల నిర్వహణను సమాచార సాంకేతికత (ఐటీ) ఆధారంగా చేపట్టే వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురానుంది. భూములకు, స్థలాలకు విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయనున్నారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూలులో పేర్కొన్న 22 భారతీయ భాషల్లోకి భూమి రికార్డులను తర్జుమా చేసే సదుపాయాన్ని తీసుకొస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. ఈ చర్యలన్నీ దేశవ్యాప్తంగా ఏకరూప రిజిస్ట్రేషన్‌ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు దోహదపడనున్నాయి.

పేదలకు 80 లక్షల ఇళ్లు
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో 80 లక్షల ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకుగాను తాజా బడ్జెట్‌లో రూ.48వేల కోట్లను కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ గృహాల నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్దేశించుకుంది. భూమి, నిర్మాణ సంబంధ అనుమతుల సమస్యలేమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని వాటిని పరిష్కరిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ స్పష్టం చేశారు. మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడిన వారికి అందుబాటు ధరల్లో గృహాలను సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేస్తామని పేర్కొన్నారు.
పట్టణాల్లో వలస కార్మికులు, కూలీలకు అద్దె ప్రాతిపదికన ఇళ్లు కేటాయించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎమ్‌ఏవై) పట్టణ పథకం కింద ఈ స్కీమును అమలు చేయనుంది.


3.80 కోట్ల గృహాలకు నల్లా కనెక్షన్లు
ప్రజలకు సురక్షిత తాగు నీరు అందించే లక్ష్యంలో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2022 - 23)లో దేశంలో 3.80 కోట్ల గృహాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఇందుకోసం రూ.60,000 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపింది. 
జలశక్తి మంత్రిత్వ శాఖకు కేంద్రం రూ.86,189 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌ (రూ.69,052 కోట్లు) కన్నా 24 శాతం నిధులను ఈ శాఖకు పెంచారు.


సెజ్‌లకు కొత్త చట్టం
ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌)కు రానున్న సెప్టెంబరు 30 లోగా కొత్త చట్టం తెస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. వ్యాపార, సేవల కేంద్రాల ప్రగతిలో రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పించేలా మార్పులు చేస్తామన్నారు. సెజ్‌లను నెలకొల్పిన పారిశ్రామికవర్గాలు తమకు  ప్రోత్సాహకాలను కొనసాగించాలని  కోరుతున్న నేపథ్యంలో కొత్త చట్టాన్ని తెస్తామంటూ ఆర్థికమంత్రి తెలిపారు. 
ఈ ఏడాది జనవరి 27 వరకు దేశవ్యాప్తంగా 425 సెజ్‌లకు అనుమతులు ఇవ్వగా 2021 డిసెంబరు 31 వరకు 268 చోట్ల కార్యకలాపాలు మొదలయ్యాయి. 
‣ 2021 సెప్టెంబరు 30 వరకు సెజ్‌లు రూ.6.28 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 25.60 లక్షల ఉద్యోగాలు కల్పించాయి.

సంఘాలకు ‘సహకారం’
‘సహకారం ద్వారా సమృద్ధి’ అనే నినాదంలో భాగంగా కేంద్ర మంత్రివర్గంలో గత ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖకు రూ.900 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.350 కోట్లను ప్రాథమిక సహకార సంఘాల డిజిటలీకరణకు ఖర్చు చేయనున్నారు. అదే సమయంలో ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వార్షిక ఆదాయం రూ.కోటి నుంచి రూ.10 కోట్ల మధ్య ఉన్న సహకార సంఘాలు ఇప్పటివరకు 18.5% ప్రత్యామ్నాయ కనీస పన్ను(ఏఎంటీ) చెల్లించాల్సి వచ్చేది. దాన్ని 15 శాతానికి తగ్గించారు. 

రాష్ట్ర ఉద్యోగులకు ‘ఎన్‌పీఎస్‌’ ఊరట?
- యజమాని వాటా 14 శాతానికి పెరిగేనా!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్రాల ఉద్యోగులకు సామాజిక భద్రత పథకాల ఫలాలు అందించేందుకు వీలుగా మంగళవారం నాటి బడ్జెట్లో కేంద్రం కీలక ప్రతిపాదన చేసింది. జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) కింద యజమాని వాటాగా చెల్లించే చందాను 10 నుంచి 14 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి మూలవేతనం, డీఏ మొత్తంలో 14 శాతాన్ని యజమాని వాటా కింద ఎన్‌పీఎస్‌లో జమ చేసి, ఆ మొత్తానికి ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇస్తోంది. ఇదే తరహాలో రాష్ట్ర ఉద్యోగులకూ వెసులుబాటు కల్పించాలని కేంద్రం పేర్కొంది. రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తే ఉద్యోగులు లబ్ధి పొందుతారు. 
ఇదీ లాభం..: 
రాష్ట్రంలో ఒక ఉద్యోగికి మూలవేతనం రూ.18,950 ఉంటే, డీఏ రూ.7,348గా ఉంది. ఈ మొత్తం కలిపి రూ.26,298 అవుతుంది. ఇందులో ఉద్యోగి వాటా కింద 10 శాతం అంటే నెలకు రూ.2,630 అవుతుంది. దీనికి సమానంగా యజమాని వాటా కింద 10 శాతం ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ లెక్కన నెలకు ఇద్దరి వాటాల మొత్తం రూ.5,260 ఎన్‌పీఎస్‌ ఖాతాకు వెళ్తోంది. కేంద్ర ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర సర్కారు వాటా 14 శాతమైతే నెలకు రూ.3,682 అవుతుంది. అంటే.. నెలకు దాదాపు రూ.1,052 అదనంగా ప్రభుత్వ వాటా కింద ఎన్‌పీఎస్‌లో జమ అవుతుందన్న మాట. ఈ లెక్కన ఏడాదికి దాదాపు రూ.12,624 మేర రాష్ట్ర ఉద్యోగి ఎన్‌పీఎస్‌ ఖాతాలో అదనంగా వచ్చి చేరుతుంది. ఈ మొత్తానికి ఆదాయపన్ను కింద మినహాయింపు పొందే అవకాశముంది.


 ఐటీ, టెలికం రంగానికి అత్యధికంగా పెంపు
కేంద్ర బడ్జెట్‌లో 24% మొత్తం వడ్డీలకే పోనుంది. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన రూ.39.44 లక్షల కోట్లను స్థూలంగా 26 విభాగాలకు ఖర్చు చేయనున్నారు. అందులో ఒక వంతు వడ్డీలకు పోనుండగా.. మరోవంతు రక్షణ, రవాణా, రాష్ట్రాలకు వెళ్లనుంది. మిగిలిన రెండొంతులను విభిన్న రంగాలకు ప్రాధాన్యక్రమంలో వ్యయం చేయనున్నారు. ఇందులోనూ అత్యధికం పింఛన్లు, సబ్సిడీలకే వెళ్తుంది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఐటీ, టెలికం రంగంపై చేసే వ్యయాన్ని అత్యధికంగా 177% పెంచారు. మిగిలిన రంగాల ఖర్చుల్లో అత్తెసరు పెంపుదలే కనిపించింది.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటం, అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికానుండటంతో పేదల కోసం అమలుచేస్తున్న ఉచిత తిండిగింజల పథకాన్ని ఎత్తేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే ఆహార సబ్సిడీ వ్యయంలో దాదాపు 28% కోత విధించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఎరువుల సబ్సిడీలో 25%, పెట్రోలియం సబ్సిడీ వ్యయాన్ని 10% తగ్గించారు. వ్యవసాయం, వైద్య రంగాల వ్యయాల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల కనిపించలేదు. విద్యారంగం ఖర్చులు మాత్రం 18% పెంచారు. అయితే ఈ రంగానికి గతేడాది బడ్జెట్‌లో రూ.93,224 కోట్లు కేటాయించినా అంచనాల సవరణ నాటికి దాని వ్యయం రూ.88,002 కోట్లకు తగ్గిపోయింది. కేటాయించిన మొత్తంలో దాదాపు 6% కోతపెట్టారు.


ఈసారి రూ.11.6 లక్షల కోట్ల రుణాలు
ప్రభుత్వ వ్యయ లక్ష్యాలను అందుకునేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2022 - 23)లో రూ.11,58,719 కోట్ల రుణాలను మార్కెట్‌ నుంచి సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. 
ఇది 2021-22 బడ్జెట్‌ అంచనా రూ.9.7లక్షల కోట్ల రుణాల కంటే సుమారు రూ.2 లక్షల కోట్లు అధికం. 
‣ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల్లో రుణాల మొత్తాన్ని రూ.8,75,771 కోట్లకు కుదించారు. వచ్చే ఏడాదికి సంబంధించి స్థూల రుణాలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.12,05,500 కోట్ల నుంచి రూ.14,95,000 కోట్లకు చేరనున్నాయి. బడ్జెట్‌లో పేర్కొన్న హరిత బాండ్లు కూడా స్థూల రుణాల్లో భాగమేనని ఆర్థిక కార్యదర్శి అజయ్‌ సేథ్‌ చెప్పారు. 


పింఛను నిధికి కోటా పెంపు 
ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌) పథకం పరిధిలోని కార్మికులు, ఉద్యోగులు, వేతన జీవుల పింఛను కోసం కేంద్రం తన వాటా కింద ఇచ్చే నిధులను తాజా బడ్జెట్‌లో పెంచింది. ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్‌) కింద గత ఏడాదితో పోల్చితే రూ.1,121 కోట్లు అదనంగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈపీఎఫ్‌ పరిధిలోని ఉద్యోగుల పదవీ విరమణ తరవాత పింఛను చెల్లించేందుకు కేంద్రం తన వాటా కింద ఉద్యోగి వేతనంలో 1.16 శాతం (గరిష్ఠంగా రూ.15 వేల వేతనం) ఈపీఎస్‌లో జమ చేస్తోంది. కనీస పింఛను రూ.వెయ్యి అమలు చేసేందుకు వీలుగా అదనపు భారాన్ని గ్రాంటు రూపంలోనూ భరిస్తోంది. ఈ రెండు కేటగిరీల కింద కలిపి వచ్చే ఏడాది కేటాయింపు రూ.8,485 కోట్లుగా పేర్కొంది. 


మెట్రోరైలు ప్రాజెక్టులకు రూ.19,130 కోట్లు
దేశంలోని వివిధ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ.19,130 కోట్లు ప్రతిపాదించింది. 2021-22 బడ్జెట్‌లో ఈ మొత్తం 18,978 కోట్లు మాత్రమే. గత ఏడాది నవంబరు నాటికి 18 నగరాల్లో 723 కి.మీ. పొడవైన మెట్రో రైలు మార్గాలు వినియోగంలో ఉన్నాయి. వివిధ నగరాల్లో 1000 కి.మీ. పొడవైన మెట్రో ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 2022 - 23 బడ్జెట్‌లో జాతీయ రాజధాని ప్రాంత రవాణా సంస్థ పరిధిలోని ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.4,710కోట్లు కేటాయించినట్లు ఆ సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 


పట్టణ ప్రణాళికల్లో సమూల మార్పులు
నగరీకరణ వేగంగా జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణ ప్రణాళికలను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. ‘మరి కొన్నేళ్లలో దేశ జనాభాలో 50శాతం మంది నగరాలు, పట్టణాల్లోనే నివసించే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా మెగా సిటీలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోవాలి. ప్రజలకు ఆర్థిక, ఉపాధి అవకాశాలు కల్పించాలి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పట్టణ ప్రణాళికలను సరికొత్తగా రూపొందించడం కోసం ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ నియమిస్తాం. ఇందులో పట్టణ ప్రణాళికల నిపుణులు, ఆర్థికవేత్తలు, ప్రసిద్ధ సంస్థలకు ప్రాతినిధ్యం కల్పిస్తాం. నూతన విధానాల రూపకల్పనకు అవసరమైన సలహాలు, సూచనలు, ప్రతిపాదనలను వారి నుంచి స్వీకరిస్తాం’ అని బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి వివరించారు.


2021 - 22లో ద్రవ్యలోటు 6.9%  
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021 - 22) ద్రవ్యలోటు (ఆదాయ, వ్యయాల వ్యత్యాసం) అంచనాను జీడీపీలో 6.8% నుంచి  6.9 ø¥తానికి సవరిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. వృద్ధి కోసం ప్రభుత్వం అధిక వ్యయాలు చేయాల్సి ఉండటం ఇందుకు కారణమన్నారు. పన్ను ఆదాయం గణనీయంగా పెరిగినందున, ద్రవ్యలోటు కాస్త తగ్గుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేయగా, అందుకు భిన్నంగా జరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022 - 23) ద్రవ్యలోటు 6.4 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును రూ.16,61,196 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్యలోటు రూ.15,91,089 కోట్లుగా ఉండనుంది. అంతకుముందు అంచనా ప్రకారం ఇది రూ.1,5,06,812 కోట్లే. ఇక మూలధన వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5.54 లక్షల కోట్లు కాగా.. 2022-23కు 35.4 శాతం పెంచి  రూ.7.50 లక్షల కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. 2022 - 23కు మొత్తం వ్యయాలను రూ.39.45 కోట్లుగా అంచనా వేసింది. 2021 - 22కు మొత్తం వ్యయాల అంచనాను రూ.34.83 లక్షల కోట్ల నుంచి రూ.37.70 లక్షల కోట్లకు సవరించారు.


పోస్టాఫీసు నుంచి బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ
దేశంలోని 1.5 లక్షల పోస్టాఫీసుల్ని ప్రధాన బ్యాంకింగ్‌ వ్యవస్థకు అనుసంధానం చేయబోతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందువల్ల ప్రజలు తమ ఖాతాలను ఆన్‌లైన్‌లో చూసుకోవడంతో పాటు పోస్టాఫీసుల్లోని ఖాతాల మధ్య, పోస్టాఫీసు నుంచి ఏదైనా బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసుకునేందుకు వీలవుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత రైతులు, సీనియర్‌ సిటిజన్లకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్నారు.
75 డిజిటల్‌ బ్యాంకులు: డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వీలుగా షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు 75 జిల్లాల్లో 75 డిజిటల్‌ బ్యాంకులను ఏర్పాటు చేస్తాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఎంబెడెడ్‌ చిప్‌లతో కూడిన ఇ-పాస్‌పోర్టులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. 


అంచనాలకు మించి ప్రత్యక్ష పన్ను వసూళ్లు
మూడేళ్ల అనంతరం తొలిసారిగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు(కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయాల పన్నులు కలిపి) 2021 - 22 బడ్జెట్‌ అంచనాలను మించి నమోదయ్యాయి. ఆర్థిక రికవరీకి ఇది సూచిక. 2021 - 22 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్ను వసూలు అంచనాలను బడ్జెట్‌ అంచనా (బీఈ)ల్లో ఉన్న రూ.11.08 లక్షల కోట్ల నుంచి సవరించిన అంచనా (ఆర్‌ఈ) కింద రూ.12.5 లక్షల కోట్లకు చేర్చారు.ఈ ప్రకారం.. కార్పొరేట్‌ పన్నుల రూపేణ రూ.6.35 లక్షల కోట్లు; వ్యక్తిగత ఆదాయ పన్ను కింద రూ.6.15 లక్షల కోట్లు వసూలవుతాయి. 2022 - 23లో రూ.14.20 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదవుతాయని ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఇందులో రూ.7.2 లక్షల కోట్లు కార్పొరేట్‌ పన్నుల ద్వారా; రూ.7 లక్షల కోట్లు వ్యక్తిగత ఆదాయ పన్ను రూపేణ రావచ్చు.


ప్రైవేటు భాగస్వామ్యంతో బ్యాటరీ స్వాపింగ్‌ విధానం
దేశంలో విద్యుత్‌ వాహనాల వినియోగం పెంచేందుకు బ్యాటరీ స్వాపింగ్‌ విధానాన్ని ప్రభుత్వం తీసుకురానుంది. పట్టణ ప్రాంతాల్లో ఛార్జింగ్‌ స్టేషన్‌ల ఏర్పాటుకు స్థలాలు లభ్యం కాకపోవడం వంటి ఆటంకాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. బ్యాటరీల కోసం స్థిరమైన వ్యాపార విధానాలను తీసుకొచ్చేందుకు ప్రైవేట్‌ రంగాన్ని ప్రోత్సాహించనున్నామని వివరించారు.  ఛార్జింగ్‌ అయిపోయిన బ్యాటరీలను ఈ కేంద్రాల్లో ఇస్తే, పూర్తి ఛార్జింగ్‌ అయిన బ్యాటరీని ఇస్తారు. వాహనం ఎక్కువ సేపు ఆగకుండా, ప్రయాణం కొనసాగించే వీలు ఏర్పడుతుంది. 


మొబైల్‌ కెమేరా లెన్స్‌-ఛార్జర్‌పై సుంకాల తగ్గింపు 
శరీరంపై ధరించే ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల (వేరబుల్స్‌)తో పాటు ఎలక్ట్రానిక్‌ స్మార్ట్‌ మీటర్ల తయారీని దేశీయంగా పెంచేందుకే, వాటికి అవసరమైన విడిభాగాలపై కస్టమ్స్‌ సుంకాలను తగిన విధంగా సవరించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. విక్రయ వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ తయారీ పెంచడమే ధ్యేయమని వివరించారు. మొబైల్‌ ఫోన్‌ ఛార్జర్లు/అడాప్టర్లలో వినియోగించే ట్రాన్స్‌ఫార్మర్‌ విడిభాగాలకు సుంకాలను 10/15 శాతం నుంచి 5 శాతానికి, మొబైల్‌ ఫోన్‌ కెమేరా మాడ్యూల్‌ తయారీకి అవసరమైన కెమేరా లెన్స్‌పై దిగుమతి సుంకాన్ని 10/15 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించినట్లు వివరించారు. 


ఆర్‌బీఐ, బ్యాంకుల నుంచి డివిడెండ్‌ రూ.74,000 కోట్లే 
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)తో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూ.73,948 కోట్ల డివిడెండ్‌ లభిస్తుందని ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం ఆర్‌బీఐ డివిడెండ్‌/మిగులు నిధులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు/ఆర్థిక సంస్థల నుంచి రూ.1,01,353 కోట్లు ఖజానాకు చేరనున్నాయి. దీనితో పోల్చుకుంటే, 2022-23లో వచ్చే మొత్తం రూ.27,400 కోట్లు (27 శాతం) తక్కువ. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత మే నెలలో ఆర్‌బీఐ రూ.99,122 కోట్లు డివిడెండుగా ప్రభుత్వానికి చెల్లించింది.  


పాలిష్డ్‌ వజ్రాలపై దిగుమతి సుంకం 5 శాతానికి 
పాలిష్డ్, కట్‌ వజ్రాలతో పాటు విలువైన రంగురాళ్లపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో వెల్లడించారు. పరిశ్రమ వృద్ధికి ఇది దోహద పడుతుందన్నారు. 
ఇ-కామర్స్‌ ద్వారా ఆభరణాల ఎగుమతికీ అనుమతిస్తామని, ఇందుకు సరళంగా ఉండే మార్గదర్శకాలను ఈ ఏడాది జూన్‌ నాటికి రూపొందిస్తామని వెల్లడించారు. నీ ధర తక్కువగా చూపుతూ దిగుమతి చేసుకుంటున్న ఇమిటేషన్‌ ఆభరణాలపై కిలోకు కనీసం రూ.400 కంటే ఎక్కువగా కస్టమ్స్‌ సుంకం విధిస్తామని ప్రకటించారు. 

2022లోనే 5జీ స్పెక్ట్రమ్‌ వేలం
5జీ స్పెక్ట్రమ్‌ వేలాన్ని ప్రభుత్వం ఈ ఏడాది (2022)లో నిర్వహించనుంది. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్‌ టెలికాం సంస్థలు 5జీ సేవల ప్రారంభించేందుకు ఈ స్పెక్ట్రమ్‌ అవసరమవుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు. టెలికాం సాధారణ, 5జీ సేవలు వృద్ధికి తోడ్పడటంతో పాటు ఉద్యోగావకాశాలను సృష్టిస్తాయని వివరించారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో బ్రాడ్‌బ్యాండ్, మొబైల్‌ సేవలు అందించేందుకు యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ కింద వార్షిక వసూళ్లలో 5 శాతం కేటాయించనున్నట్లు వివరించారు.  భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌ ద్వారా అన్ని గ్రామాల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ వేయనున్నారు.

అత్యవసర రుణ హామీ పథకం 2023 మార్చి వరకు
దేశంలో 1.3 కోట్లకు పైగా ఎంఎస్‌ఎంఈలకు అదనపు రుణాలు ఇచ్చేందుకు తీసుకొచ్చిన అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్‌జీఎస్‌) 2023 మార్చి వరకు పొడిగించనున్నారు. రుణ హామీలకు అదనంగా రూ.50000 కోట్లు చేర్చి రూ.5 లక్షల కోట్లకు పెంచారు. ఆతిథ్యం, అనుబంధ రంగాలను కొవిడ్‌ మునుపటి స్థాయిలకు కోలుకునేందుకు వీలుగా ఈ అదనపు మొత్తాన్ని ప్రత్యేకంగా కేటాయించారు. క్రెడిట్‌ గ్యారెంటీ ట్రస్ట్‌ ఫర్‌ మైక్రో అండ్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ (సీజీటీఎంఎస్‌ఈ) పథకాన్ని అవసరమైన నిధులు చొప్పించడం ద్వారా పూర్తి ప్రక్షాళన చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న సంస్థలకు రూ.2 లక్షల కోట్ల అదనపు రుణాలు అందుతాయని వెల్లడించారు.  

అంకురాలకు ప్రోత్సాహకాలు మరో ఏడాది
కొన్నేళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థలో అంకురాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. విజయవంతమైన అంకురాల సంఖ్యా బాగా పెరిగిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.  2022 మార్చి 31 నాటికి ప్రారంభమైన అంకురాలకు పదేళ్లలో మూడేళ్లపాటు పన్ను ప్రోత్సాహకాలను అందివ్వాలని గతంలో ప్రతిపాదించారు. కొవిడ్‌ నేపథ్యంలో దీన్ని మరో ఏడాదిపాటు పొడిగించి, 2023 మార్చి 31 వరకు ప్రారంభమైన అర్హత ఉన్న అంకురాలకు ఈ పన్ను ప్రోత్సాహకాలను విస్తరించనున్నట్లు ప్రకటించారు. 2016 ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమైన ఎంపిక చేసిన అంకురాలకు పన్ను ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోంది. 

బీఎస్‌ఎన్‌ఎల్‌కు రూ.44,720 కోట్లు 
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.44,720 కోట్ల ఆర్థిక మద్దతు కల్పించబోతున్నట్లు బడ్జెట్‌ పత్రాల్లో తెలిపారు. 4జీ స్పెక్ట్రమ్‌ కోసం ఈ మూలధన సాయం ఉంటుందని పేర్కొన్నారు. సాంకేతికత నవీకరణ, బీఎస్‌ఎన్‌ఎల్‌ పునర్నిర్మాణానికి ఈ నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. మూలధన సాయంతో పాటు మరో రూ.7,443.57 కోట్ల ఆర్థిక మద్దతును సిబ్బంది స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కోసం, రూ.3,550 కోట్లు జీఎస్‌టీ చెల్లింపు గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ కింద ప్రభుత్వం మంజూరు చేయనుంది.

యాంటీ - డంపింగ్‌ సుంకం రద్దు 
లోహాల అధిక ధరలను నియంత్రించడం సహా దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే కొన్ని రకాల ఉక్కు ఉత్పత్తులపై యాంటీ-డంపింగ్‌ సుంకాల్ని రద్దు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. చైనా నుంచి దిగుమతి అవుతున్న హాట్‌ రోల్డ్, కోల్డ్‌ రోల్డ్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఫ్లాట్‌ ఉత్పత్తులపై కౌంటర్‌వెయిలింగ్‌ సుంకాన్ని (సీవీడీ) శాశ్వతంగా తొలగిస్తున్నట్లు తెలిపారు. ‘ఎక్కువ మంది ప్రజల ప్రయోజనాల దృష్ట్యా స్టెయిన్‌లెస్‌ స్టీల్, కోటెడ్‌ స్టీల్‌ ఫ్లాట్‌ ఉత్పత్తులు, అల్లాయ్‌ స్టీల్‌ బార్లు, హై-స్పీడ్‌ స్టీల్‌పై యాంటీ-డంపింగ్, సీవీడీ సుంకాల్ని రద్దు చేస్తున్నామ’ని ఆర్థికమంత్రి వెల్లడించారు.

పీఎల్‌ఐకి రూ.24000 కోట్లు
దేశీయంగా సోలార్‌ సెల్స్, మాడ్యూళ్ల తయారీకి పీఎల్‌ఐ పథకం కింద ప్రోత్సాహకాలను ప్రస్తుతం ఇస్తున్న రూ.4500 కోట్ల నుంచి రూ.24,000 కోట్లకు పెంచనున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. 2030కి 280 గిగావాట్ల ఇన్‌స్టాల్డ్‌ సోలార్‌ సామర్థ్యం సాధించాలన్న  లక్ష్యాన్ని సాధించేందుకు, గతంలో అనుకున్న దానికంటే పీఎల్‌ఐ పథకానికి అదనంగా రూ.19,500 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. రూ.17,200 కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులతో 10,000 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ పీవీ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యాల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అదనపు కేటాయింపులతో దేశీయ తయారీ మరింత పెరిగే అవకాశం ఉంది.

పన్ను పరిధిలోకి క్రిప్టో కరెన్సీ 
క్రిప్టో కరెన్సీలు, ఇతరత్రా వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం 2022 - 23 బడ్జెట్‌ ద్వారా కొంత స్పష్టత ఇచ్చింది. క్రిప్టో కరెన్సీ వంటి వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులకు సంబంధించిన లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయాల మీద 30 శాతం పన్ను విధించడంతో పాటు, ఒక పరిమితికి మించిన వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తుల బదిలీపై 1 శాతం టీడీఎస్‌ (మూలంలో పన్ను కోత) వసూలు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. క్రిప్టో ఆదాయాలను, వాటిపై వచ్చిన నష్టాలతో సర్దుబాటు చేయటానికి వీల్లేదు. అదేవిధంగా షేర్లు, కమొడిటీల వంటి ఇతర ఆస్తులపై వచ్చిన నష్టాలతోనూ సర్దుబాటు చేయలేరు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తాయి. 
మనదేశంలో క్రిప్టో వంటి వర్చువల్‌ కరెన్సీల లావాదేవీలను అనుమతించాలా, వద్దా.. అనే విషయంలో కొంతకాలంగా పెద్దఎత్తున చర్చలు సాగుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక  చట్టాన్ని తీసుకువచ్చే ఆలోచన చేసింది. అదే సమయంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంకు కూడా వర్చువల్‌ డిజిటల్‌ కరెన్సీని ఆవిష్కరించాలనే ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలో వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులకు సంబంధించి బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. దానికి తగ్గట్లుగానే వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులను పన్ను పరిధిలోకి తీసుకువస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. తద్వారా  క్రిప్టో కరెన్సీకి, ఇతర వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులకు ప్రభుత్వం పరోక్షంగా ఆమోద ముద్ర వేసినట్లు అవుతోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 
మూడు రకాలు
ప్రస్తుతం మూడు రకాల వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులు కనిపిస్తున్నాయి. ఇందులో బిట్‌కాయిన్, ఎథేరియమ్, కార్డనో, అవలాంచీ వంటి ప్రైవేటు బిట్‌కాయిన్లు, ఎన్‌ఎఫ్‌టీ లు (నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్లు), ప్రభుత్వాలు జారీ చేసే డిజిటల్‌ కరెన్సీలు ఉన్నాయి. 
కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీ, నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్లకు భారీగా ఆదరణ లభిస్తోంది. దీంతో వందల సంఖ్యలో క్రిప్టో కరెన్సీ, టోకెన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ లావాదేవీలపై ఇప్పటివరకు ప్రభుత్వ నియంత్రణ లేదు.  

సొంత డిజిటల్‌ కరెన్సీ
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన సొంత డిజిటల్‌ కరెన్సీని సీబీడీసీ (సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ) పేరుతో 2022 - 23లో ప్రవేశపెట్టబోతోంది. ‘బ్లాక్‌చైన్‌’ ఆధారిత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆర్థిక మంత్రి వివరించారు.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న బిట్‌కాయిన్, ఎథేరియం వంటి క్రిప్టో ఆస్తులకు, భారత రిజర్వు బ్యాంకు ఆవిష్కరించే సీబీడీసీ కి మధ్య తేడా ఉంది. బిట్‌కాయిన్, ఇతర క్రిప్టో కాయిన్లు/ కరెన్సీ పూర్తిగా ప్రైవేటు కాయిన్లు. నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్లు కూడా అంతే. కానీ సీబీడీసీ మాత్రం ప్రభుత్వ మద్దతు గల వర్చువల్‌ డిజిటల్‌ కరెన్సీ. దీన్ని ఆర్‌బీఐ పంపిణీ చేస్తుంది. అంటే దీనికి ప్రభుత్వ అనుమతితో పాటు పర్యవేక్షణ ఉంటుంది. దీని విలువలో తక్కువ హెచ్చుతగ్గులు ఉండటంతో పాటు,  ప్రభుత్వ మద్దతు కల అత్యంత భద్రమైన డిజిటల్‌ ఆస్తిగా ఉంటుంది. ఇప్పటి వరకు బహమాస్, నైజీరియా, ఆంటిగ్వా, క్రెనడా.. తదితర దేశాల కేంద్ర బ్యాంకులు సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీని విడుదల చేశాయి. 

ఆస్తుల విక్రయ లక్ష్యంలో రూ.లక్ష కోట్ల కోత 
- ఎల్‌ఐసీ ఐపీఓ త్వరలో 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయం, వ్యూహాత్మక ప్రైవేటీకరణ ద్వారా సమీకరించాలనుకున్న రూ.1.75 లక్షల కోట్లను రూ.78,000 కోట్లకు సవరిస్తున్నట్లు ఆర్థికమంత్రి తాజాగా పేర్కొన్నారు. అంటే దాదాపు రూ.లక్ష కోట్ల మేర అంచనాలను ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటివరకు ఎయిరిండియా సహా వివిధ కంపెనీల్లో వాటాల విక్రయం ద్వారా రూ.12,030 కోట్లు సమీకరించింది. ‘ఎయిరిండియా ప్రైవేటీకరణ పూర్తయ్యింది. నీలాంచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌కు వ్యూహాత్మక భాగస్వామి ఎంపిక జరిగింది. ఎల్‌ఐసీ ఐపీఓ త్వరలోనే, ఈ సంవత్సరంలోనే ఉంటుంది. మిగిలిన సంస్థలవి 2022 - 23లో జరుగుతాయి’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు కానీ.. అంతకుమించి వివరించలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా రూ.65,000 కోట్లు సమీకరించాలనుకుంటున్నట్లు తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. 

డేటా కేంద్రాలకు మౌలిక హోదా
అన్ని రంగాలు డిజిటలీకరణ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, డేటా నిల్వ కేంద్రాలు, ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌’ లకు ‘మౌలిక సదుపాయాల హోదా’ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హైదరాబాద్‌కు మేలు చేయనుంది.  దీనివల్ల  డేటా కేంద్రాల పరిశ్రమ బహుముఖంగా విస్తరించే అవకాశం కలుగుతోంది. 
ఇప్పటికే హైదరాబాద్‌లోని కంట్రోల్‌ ఎస్‌ డేటా సెంటర్స్‌ పెద్దఎత్తున కార్యకలాపాలు సాగిస్తోంది. అమెరికాకు చెందిన అమెజాన్, ర్యాక్‌బ్యాంక్‌ కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసే యత్నాల్లో ఉన్నాయి. అగ్రశ్రేణి ఐటీ సంస్థ, మైక్రోసాప్ట్‌ తన డేటా కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్‌ను  కేంద్ర స్థానంగా ఎంచుకుంది. శంషాబాద్‌ పరిసరాల్లోని మూడు ప్రాంతాల్లో మైక్రోసాఫ్ట్‌ డేటా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. దీనిపై త్వరలో మైక్రోసాఫ్ట్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దేశంలోని పెద్ద నగరాలైన ముంబయి, దిల్లీల్లో డేటా కేంద్రాలు నిర్వహించే సంస్థలు, డేటాను నిల్వ చేసుకున్న సంస్థలు.. తదుపరి విస్తరణకు హైదరాబాద్‌ను ఎంచుకోడానికి చూస్తున్నాయి. 
స్థిరాస్తి కన్సల్టెన్సీ సేవల సంస్థ జేఎల్‌ఎల్, గత జూన్‌లో వెల్లడించిన నివేదికలో ‘హైదరాబాద్‌ డేటా కేంద్రాల సామర్థ్యం ప్రస్తుత 30 మెగావాట్ల నుంచి 2023కు 96 మెగావాట్లకు పెరుగుతుంద’ని అంచనా వేసింది. ముంబయి, పుణె, దిల్లీ నగరాలు ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉండగా, అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ముందుండటం ఆసక్తికర అంశం. ఇ-కామర్స్, ఎడ్‌టెక్, డిజిటల్‌ లావాదేవీలు అనూహ్యంగా పెరుగుతున్నందున, మనదేశంలో డేటా కేంద్రాలకు అధిక సామర్థ్యం కావాల్సి వస్తోంది. 

నిధుల సమీకరణ తేలికవుతుంది: 
డేటా సెంటర్లకు మౌలిక సదుపాయాల హోదా కల్పించడం వల్ల, పరిశ్రమ విస్తరణకు అవసరమైన నిధులు సులువుగా సమీకరించే అవకాశం కలుగుతుందని కంట్రోల్‌ ఎస్‌ డేటా సెంటర్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్‌ పిన్నపురెడ్డి తెలిపారు. ‘విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) తీసుకోవచ్చు, బాగా తక్కువ వడ్డీ రేటుకు, దీర్ఘకాలిక నిధులు లభిస్తాయి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ)ని ఆకర్షించే అవకాశం ఉంది’ అని అన్నారు. నూతన బడ్జెట్‌లో ప్రతిపాదించిన విధంగా డిజిటల్‌ యూనివర్సిటీలు, డిజిటల్‌ బ్యాంకులు, డిజిటల్‌ కరెన్సీలు కార్యరూపం దాలిస్తే, డిజిటల్‌ లావాదేవీలు భారీగా పెరుగుతాయని ఆయన అన్నారు. దీనికి తోడు ‘భారత్‌నెట్‌’ ద్వారా ఓఎఫ్‌సీ (ఆప్టికల్‌ ఫైబర్‌  కేబుల్‌) లైన్లను దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ, పట్టణానికి వేయగలిగితే ఎంతో పెద్ద డిజిటల్‌ వ్యవస్థను ఆవిష్కరించినట్లు అవుతుందని పేర్కొన్నారు. దీంతో డేటా నిల్వ అవసరాలు అనూహ్యంగా పెరుగుతాయని వివరించారు.  

వాణిజ్య సిలిండరు ధర తగ్గింపు
వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు చమురు సంస్థలు కాస్త ఉపశమనం కలిగించాయి. వారు వాడే 19 కిలోల సిలిండరు ధరను రూ.89.50 తగ్గించాయి. హైదరాబాద్‌లో నుంచి ఆ సిలిండరు ధరను రూ. 2,087గా ఖరారు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్టులో చమురు ధరల ఆధారంగా  ప్రతినెలా ఒకటో తేదీన సిలిండరు ధరల్లో మార్పులుచేర్పులు చేస్తుంటాయి. గడిచిన రెండు నెలల్లో వాణిజ్య సిలిండరుపై రూ. 190.50 తగ్గినట్లు అయింది. డిసెంబరులో అది రూ. 2,277.50 ఉండగా జనవరిలో రూ. 2,176.50లకు తగ్గింది. తాజాగా మరో రూ.89.50 తగ్గింది. గృహావసరాలకు వినియోగించే  14.2 కిలోల సిలిండరు ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. 2021 అక్టోబరు నుంచి ఉన్న రూ.952 ధరనే కొనసాగిస్తున్నాయి. 

మిల్లెట్స్‌ సాగుకు కేంద్ర బడ్జెట్‌లో ప్రోత్సాహం
తృణధాన్యాల (మిల్లెట్స్‌) సాగును ప్రోత్సహిస్తామని కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది ‘తృణధాన్యాల సంవత్సరం’ అయినందున ఈ పంటలకు అన్ని రకాలుగా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం తెలిపింది. ప్రస్తుతానికి ఈ పంటలు సాగుచేసే రైతులకు ఎటు నుంచీ.. ఏ సాయమూ అందడం లేదు. పంట వేయాలంటే విత్తనాలను వ్యవసాయశాఖ రాయితీపై ఇవ్వదు. నానా కష్టాలు పడి పండిస్తే కొనేందుకు సరైన మార్కెట్లు అందుబాటులో లేవు. రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి 2 కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతున్నా అందులో తృణధాన్యాల విస్తీర్ణం 3 వేల ఎకరాలైనా లేదు. 

కొర్రలు, సామల వంటివాటికి ‘మద్దతు’ లేదు 
వాస్తవానికి యాసంగిలో వర్షాధారంగా తృణధాన్యాల సాగుకు అనువైన భూములు, వాతావరణం తెలంగాణలో ఉన్నట్లు ఇక్రిశాట్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఈ పంటలకు కేంద్రం మద్దతు ధరలు ప్రకటించడం లేదు. కేవలం సజ్జలు, రాగులకే ఇస్తోంది. కొర్రలు, సామలు, ఊదలు, ఒరిగెలు వంటివాటికి లేదు. దీంతో వ్యాపారులు ఎంత ఇస్తే అంతకే రైతులు అమ్మాల్సి వస్తోంది. వారు కొనకపోతే ఇక ఆ పంటలను ఎక్కడ అమ్ముకోవాలో కూడా వారికి తెలియని పరిస్థితి. గతేడాది ఒక స్వచ్ఛంద సంస్థ యాదాద్రి, జనగామ, సిద్దిపేట తదితర జిల్లాల్లో ఈ పంటలను రైతులతో సాగుచేయించింది. వర్షాలు, తెగుళ్ల వల్ల దిగుబడి సరిగా రాలేదు. చివరికి సరైన ధర కూడా రాక రైతులు నష్టపోయారు. పైగా మిల్లెట్స్‌ను శుద్ధి చేసి వంటకు ఉపయోగపడేలా మార్చాలంటే మిల్లులు కావాలి. అవి రాష్ట్రంలో పెద్దగా లేవు. ‘‘ప్రభుత్వం వీటి కొనుగోలుకు మద్దతు ధరలు ప్రకటించి ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేయాలి. శుద్ధికి మిల్లులుండాలి. పంటసాగుకు అవసరమైన విత్తనాలను రాయితీపై ఇచ్చి ప్రోత్సహించాలి. అప్పుడే సాగు విస్తీర్ణం పెరుగుతుంది’’ అని సీనియర్‌ వ్యవసాయ శాస్త్రవేత్త ఒకరు అన్నారు.

మహిళలు, శిశువులపై.. ‘వాత్సల్యం’
కేంద్ర ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమంపై గతేడాదికంటే ఈ సారి కొంత వాత్సల్యమే చూపింది. ప్రస్తుత బడ్జెట్‌లో ఆ శాఖకు రూ.25,172.28 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో కేటాయించిన (రూ.24,435 కోట్ల) నిధుల కంటే ఇది 3 శాతం అదనం. మహిళలు, శిశువుల లబ్ధికి ఉద్దేశించిన సక్షమ్‌ అంగన్‌వాడీ, మిషన్‌ పోషణ్‌ 2.0 కు రూ.20,263 కోట్లు (గతేడాది రూ.20,105) కేటాయించింది. మహిళల రక్షణ, సాధికారతకు చేపట్టిన మిషన్‌ శక్తి కార్యక్రమం కింద రూ.3,184 కోట్లు (గతేడాది 3,109 కోట్లు), చిన్నారుల సంరక్షణ, సంక్షేమానికి ఉద్దేశించిన వాత్సల్య కార్యక్రమానికి రూ.1,472 (గతేడాది రూ.900 కోట్లు) కేటాయించింది. అలాగే జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌), జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీఎం), సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ ఏజెన్సీ (సీఏఆర్‌ఏ)కు రూ.152 కోట్లు (గతేడాది రూ.188 కోట్లు) కేటాయించింది. సక్షమ్‌ అంగన్‌వాడీ కేంద్రాల కార్యక్రమం కింద దేశంలోని 2 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను ఉన్నతీకరించనున్నట్లు మంత్రి నిర్మలాసీతారామన్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

అధికారుల శిక్షణకు రూ.288 కోట్లు
సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ.288 కోట్లు కేటాయించారు. ఇందులోంచి రూ.210.75 కోట్లను ముస్సోరిలోని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమి ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ) ఉన్నతీకరణ, దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్రటేరియట్‌ ట్రైనింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఎస్‌టీఎం)లో శిక్షణ సదుపాయాల పెంపు, ఐఏఎస్, సెక్రటేరియట్‌ అధికారుల శిక్షణ కోసం నిర్ణయించారు.
* కేంద్రం కేబినెట్‌ మంత్రుల వేతనాలు, ప్రయాణ, ఇతర భత్యాలు తదితరాల కోసం రూ.1,711.04 కోట్లు కేటాయించారు. 
* సామాజిక న్యాయం, సాధికారత శాఖకు రూ.13,134 కోట్లు కేటాయించారు. వాటిలో సామాజిక న్యాయం, సాధికారత కోసం రూ.11,922 కోట్లు, దివ్యాంగుల కోసం రూ.1,212 కోట్లుగా నిర్ణయించారు.
* కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌)కు రూ.159 కోట్లు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ)కు రూ.263 కోట్లు కేటాయించారు.
* కేంద్ర సమాచార, ప్రసార శాఖకు బడ్జెట్‌లో రూ.3,980.77 కోట్లు కేటాయించారు. అందులో ప్రసారభారతికి రూ.2,640.11 కోట్లుగా నిర్ణయించారు.

‘సైన్స్‌’కు తగ్గిన కేటాయింపులు 
కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.14,217 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది 3.9 శాతం తగ్గుదల కావడం గమనార్హం. శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖలోని శాస్త్ర, సాంకేతిక విభాగానికి రూ.6వేల కోట్లు, బయోటెక్నాలజీ విభాగానికి రూ.2,581 కోట్లు, శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన విభాగానికి రూ.5,636 కోట్లు కేటాయించారు. ఈ మూడు విభాగాలు దేశంలో కొవిడ్‌-19 మహమ్మారిపై పోరులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

మైనారిటీ మంత్రిత్వ శాఖకు పెరిగిన నిధులు
గత బడ్జెట్‌తో పోల్చితే ఈ సారి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నిధులు పెరిగాయి. 2022 - 23లో ఈ శాఖకు రూ.5,020.50 కోట్లు కేటాయించారు. ఇది గత ఆర్థిక సంవత్సరం సవరించిన గణాంకాల కంటే రూ.674 కోట్లు ఎక్కువ. 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖకు మొత్తం బడ్జెట్‌ అంచనా రూ.4810.77 కోట్లు కాగా.. సవరించిన కేటాయింపులు మాత్రం రూ.4,346.45 కోట్లు. ప్రస్తుత కేటాయింపుల్లో రూ.1425 కోట్లు ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌కు, రూ.515 కోట్లు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ కోసం ప్రతిపాదించారు. అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి కార్యక్రమాలకు రూ.491 కోట్లు ప్రతిపాదించారు. 

యానిమేషన్, గేమింగ్‌ రంగాల కోసం టాస్క్‌ఫోర్స్‌  
దేశంలో యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్‌ రంగాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ రంగాలను ప్రోత్సహించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

‘ఉపాధి’కి ఊపు పెరగలే..
కరోనాతో పేదల ఉపాధి తెగ్గోసుకుపోయిందని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్‌లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎక్కువ నిధులు కేటాయిస్తారని అందరూ భావించారు. కానీ అందుకు విరుద్ధ పరిస్థితి నెలకొంది. ఈ పథకానికి ఈ బడ్జెట్‌లో రూ.73,000 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లోనూ ఇంతేమొత్తం కేటాయించినా.. తరవాత దాన్ని రూ.98,000 కోట్లుగా సవరించారు. అంటే గత సంవత్సరం సవరించిన అంచనాలకంటే ఇది 25.51 శాతం తక్కువ. 

పర్యావరణానికి రూ.3,030 కోట్లు
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు రూ.3,030 కోట్లు కేటాయించారు. అందులో రూ.460 కోట్లు కాలుష్య నియంత్రణకు, రూ.361.69 కోట్లు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ మిషన్‌కు కేటాయించినట్లు బడ్జెట్‌లో ప్రస్తావించారు. 

ఈవీఎంలకు రూ.1525 కోట్లు..
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రా (ఈవీఎం)ల కొనుగోలు, వీవీ ప్యాట్లు, బ్యాలెట్, కంట్రోల్‌ యూనిట్లు తదితరాల కోసం కేంద్రం బడ్జెట్‌లో రూ.1,525 కోట్లు కేటాయించింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రూ.180 కోట్లు, ఫొటో గుర్తింపు కార్డుల కోసం రూ.18 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది.

పెరిగిందెంత.. తగ్గిందెంత?
కేంద్ర బడ్జెట్‌ 2021 - 22లో సవరించిన అంచనాలతో పోలిస్తే 2022 - 23 బడ్జెట్‌లో రూ.1,74,909 కోట్ల మేర కేటాయింపులు పెరిగాయి. కొన్ని రంగాలకు కేటాయింపులు పెరిగితే మరికొన్ని రంగాలకు తగ్గాయి. ప్రధానంగా ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా అసెట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేనందున పౌర విమానయాన శాఖకు కేటాయింపులను భారీగా తగ్గించారు. కరోనా వ్యాక్సిన్‌ను ఇప్పటికే గరిష్ఠ స్థాయిలో అందించినందున మున్ముందు వ్యాక్సిన్‌ అంతగా ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో వైద్య, ప్రజారోగ్య విభాగానికి రూ.33 వేల కోట్లకుపైగా కోతపెట్టారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనకు కూడా కోతపెట్టినట్లు పేర్కొన్నారు. మార్కెట్‌ నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లింపులకు అధిక మొత్తం అవసరం ఉన్నందున ఆ పద్దుకు గరిష్ఠ మొత్తాన్ని పెంచినట్లు బడ్జెట్‌ పత్రంలో తెలిపారు. సమగ్ర శిక్ష, జీఎస్‌టీ పరిహార నిధి, గ్రామీణ సడక్‌ యోజన, స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం గ్రాంట్లు, మూలధన వ్యయం కింద రాష్ట్రాలకు ప్రత్యేక రుణం అందించాల్సినందున రాష్ట్రాలకు బదిలీ చేసే నిధులకు కేటాయింపులు పెంచినట్లు ప్రస్తావించారు. జాతీయ రహదారుల సంస్థకు పెట్టుబడులు అవసరం ఉండటం, భారత్‌నెట్, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ స్పెక్ట్రం కేటాయింపు, సాంకేతిక అభివృద్ధికి చేయూతనివ్వడం కోసం రవాణా, టెలీకమ్యూనికేషన్లకు కేటాయింపులను పెంచాల్సి వచ్చినట్లు తెలిపారు. ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్‌ గ్యారెంటీ స్కీం కింద ఎక్కువ నిధులు కేటాయించడంతో గ్రామీణ, కుటీర పరిశ్రమల రంగానికి నిధులు పెంచాల్సి వచ్చినట్లు వివరించారు.

పది బడ్జెట్లతో మొరార్జీ దేశాయ్‌ రికార్డు
కేంద్ర బడ్జెట్‌ పేరు చెప్పగానే ముందుగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ పేరు గుర్తుకు రాక మానదు. బడ్జెట్లకు ఆయనకు అవినాభావ సంబంధం ఉంది. పది బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఇప్పటికీ దేశ చరిత్రలో ఆయన రికార్డు తిరుగులేనిదే. తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, మూడో ప్రధాని ఇందిరాగాంధీ మంత్రివర్గాల్లో విత్త మంత్రిగా మొరార్జీ పని చేశారు. మొత్తం పది బడ్జెట్లలో ఎనిమిది వార్షిక, రెండు మధ్యంతర బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత ఆయనది. 1896 ఫిబ్రవరి 29 లీప్‌ సంవత్సరంలో జన్మించిన మొరార్జీ 1964, 1968ల్లో అదే తేదీన బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం విశేషం.

దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం..
మొరార్జీ దేశాయ్‌ సమర్థతను, చురుకుదనాన్ని గుర్తించిన నెహ్రూ 1958లో ఆయనకు కీలకమైన ఆర్థికశాఖను అప్పగించారు. మొరార్జీ కూడా నెహ్రూ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమర్థంగా వ్యవహరించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేయడంలో క్రియాశీలకంగా పనిచేశారు. విత్త మంత్రిగా బంగారంపై నియంత్రణలు తీసుకొచ్చారు. దేశం స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో దిగుమతులపై ఆంక్షలు విధించారు. 1969లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ తెరపైకి తీసుకొచ్చిన బ్యాంకుల జాతీయకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పదవికి రాజీనామా చేశారు. నెహ్రూ, ఇందిర సామ్యవాద భావజాలంతో విభేదించిన మొరార్జీ వారి వద్దే సుదీర్ఘ కాలం విత్తమంత్రిగా పని చేయడం విశేషం. మొరార్జీ దేశాయ్‌ సుదీర్ఘకాలం ఆర్థికమంత్రిగా పని చేయడానికి వేరే కారణం ఉందని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు చెప్పేవారు. వాస్తవానికి ఆయనకు హోంశాఖ అంటే ఆసక్తి. హోంశాఖ అయితే నిత్యం వార్తల్లో ఉండవచ్చని, ఆర్థికమంత్రి ప్రాధాన్యం బడ్జెట్‌ సమయంలో తప్ప మిగతా రోజుల్లో ఉండదన్నది ఆయన భావన. అందువల్లే హోంశాఖ కోసం ఇద్దరు ప్రధానుల వద్ద ఆయన పట్టుబట్టారు. కానీ హోంశాఖ పగ్గాలు అప్పగిస్తే మొరార్జీ మరింతగా రాజకీయంగా బలపడతారన్నది నెహ్రూ, ఇందిర ఉద్దేశం. అందువల్లే ఆయనను ఆర్థికశాఖకు పరిమితం చేశారన్న భావన అప్పట్లో రాజకీయ వర్గాల్లో ఉండేది. 

‘నేషనల్‌ టెలి మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌
కరోనా మహమ్మారి విజృంభణతో అన్ని వయసుల వారిలోనూ మానసిక సమస్యలు అధికమయ్యాయని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి నాణ్యమైన సేవలు, ఆయా రుగ్మతలతో బాధపడే వారికి మెరుగైన వైద్య సంరక్షణను అందించేందుకు ‘నేషనల్‌ టెలి మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌’ను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు. టెలి కౌన్సెలింగ్‌ విధానంలో అవసరార్థులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు, సరైన సంరక్షణ చర్యలు చేపట్టేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. దీనికోసం 23 టెలి హెల్త్‌ సెంటర్స్‌తో ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయ మానసిక ఆరోగ్యం, నాడీ వైజ్ఞానిక సంస్థ(ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌-నిమ్‌హాన్స్‌) నోడల్‌ కేంద్రంగా ఉంటుంది. దీనికి అవసరమైన సాంకేతిక మద్దతును బెంగళూరులోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐఐఐటీ) సమకూర్చుతుందని తెలిపారు. 


400 వందే భారత్‌ రైళ్లు

- రైల్వే ‘బడ్జెట్‌’ రూ.1.40 లక్షల కోట్లు
కేంద్ర బడ్జెట్‌లో 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి రైల్వేకు రూ. 1.40 లక్షల కోట్లు కేటాయించారు. 2021 - 22 బడ్జెట్‌   కేటాయింపుల కంటే ఇది రూ. 30,312 కోట్లు, సవరించిన అంచనాల కన్నా రూ.20,311 కోట్లు అధికం. 
వేగంగా దూసుకుపోయే కొత్త తరం ‘వందే భారత్‌’ రైళ్లు ఇక అధిక సంఖ్యలో పరుగులు తీయనున్నాయి. కొత్తగా 400 వరకు ఇలాంటి రైళ్లను పట్టాలెక్కించే దిశగా కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఈమేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రైల్వేకు సంబంధించి వివిధ అంశాలను బడ్జెట్‌లో ప్రకటించారు. వివరాలివి..
కొత్త తరం రైళ్లు..
మెరుగైన విద్యుత్తు సామర్థ్యంతో పనిచేస్తూ.. ప్రయాణికులకు గొప్ప అనుభూతిని పంచే 400 వందే భారత్‌ రైళ్లను రానున్న మూడేళ్లలో తయారు చేస్తారు. ఈ రైళ్ల నిర్మాణంలో ఉక్కును కాకుండా తేలికపాటి అల్యూమినియంను వినియోగిస్తారు. తక్కువ బరువుతో (దాదాపు 50 టన్నుల్లో) వీటిని రూపొందించడం ద్వారా ఇవి ఉక్కుతో చేసిన రైళ్లతో పోలిస్తే తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటాయి. కొత్త వందే భారత్‌ రైళ్లు ఎప్పటిలోగా పట్టాలెక్కుతాయన్న విషయమై మాత్రం ఆర్థిక మంత్రి స్పష్టతనివ్వలేదు. కాగా ఇప్పటికే రైల్వేశాఖ 44 వందే భారత్‌ రైళ్లను రూపొందిస్తోంది. ఈ రైళ్లు 2023 ఆగస్టు 15 నాటికి కనీసం 75 మార్గాల్లో పట్టాలెక్కనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఒక్కో రైలుకు దాదాపు రూ. 120 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
‣ రైతులు, చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలు) ప్రయోజనకరంగా.. మెరుగైన సేవలందించేందుకు గాను రైల్వేలు కొత్త ఉత్పత్తులను, సమర్థ వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నాయి. 
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 చోట్ల బహుళ రీతి (మల్టీ మోడల్‌) పార్కుల ఏర్పాటుకు కాంట్రాక్టులు ఇవ్వనున్నారు. 
‣ వచ్చే మూడేళ్లలో బహుళ రీతి లాజిస్టిక్స్‌ సౌకర్యాల కోసం 100 పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్ల ఏర్పాటు.
పార్శిళ్లను ఎలాంటి అవాంతరాలు లేకుండా గమ్యస్థానాలకు చేర్చేందుకు గాను తపాలా - రైల్వే నెట్‌వర్క్‌ల అనుసంధానం.
స్థానిక వ్యాపార ఉత్పత్తులు, సరఫరా వ్యవస్థలకు రైల్వేల ద్వారా చేయూతనిస్తూ ‘ఒక రైల్వేస్టేషన్‌.. ఒక ఉత్పత్తి (వన్‌ స్టేషన్‌.. వన్‌ ప్రొడక్ట్‌)’ విధానాన్ని అభివృద్ధి చేయనున్నారు.
ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా 2022-23లో.. భద్రత, సామర్థ్యం పెంపునకు ఉద్దేశించిన స్వదేశీ ప్రపంచస్థాయి సాంకేతికత ‘కవచ్‌’ పరిధిలోకి 2,000 కి.మీ.ల మేర రైల్వే నెట్‌వర్క్‌ను తీసుకురానున్నారు.
తగిన విధంగా మెట్రో వ్యవస్థల నిర్మాణానికి నిధులు సమకూర్చడం, వేగంగా అమలు చేయడానికి గాను నవ్య మార్గాలను ప్రోత్సహిస్తారు. 
ప్రాధాన్యత ప్రాతిపదికన రైల్వే స్టేషన్లకు మెట్రోలు, బస్సులు వంటివాటిని బహుళ రీతుల్లో అనుసంధానం చేస్తారు. దేశంలోని పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా మెట్రో వ్యవస్థల (సివిల్‌ నిర్మాణాలు సహా) ఆకృతులను మారుస్తారు. తదనుగుణంగా ప్రమాణాలను నిర్దేశిస్తారు.

వేగం.. భద్రత.. సౌకర్యం..
కేంద్ర బడ్జెట్‌లో రైల్వేకు చేసిన ప్రతిపాదనలను ఆ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ స్వాగతించారు. ‘‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రస్తుతానికి అధునాతన రైళ్లుగా నడుపుతుండగా.. రానున్న కాలంలో ఇవి ‘తదుపరి తరం రైళ్లు’గా నిలుస్తాయి. ఈ రైళ్ల రెండో వెర్షన్‌ ప్రయోగాలు ఏప్రిల్‌లో మొదలవుతాయి. వేగంగా ప్రయాణించే ఈ రైళ్లు ప్రయాణికులకు భద్రత, సౌకర్యం కల్పిస్తాయి’’ అని రైల్వే మంత్రి  తెలిపారు. 


నిర్వహణ నిష్పత్తి 96.98
రైల్వేల ఆదాయ, వ్యయాలకు సంబంధించి 2022-23లో నిర్వహణ నిష్పత్తి 96.98గా    బడ్జెట్‌లో ప్రతిపాదించారు. 2021-22లో ఇది    98.93గా ఉంది. అంతకుముందు రెండేళ్లుగా ఇది మరింత అధ్వానంగా 100కి పైగా ఉండేది. అంటే రైల్వే సంపాదించిన ప్రతి రూ. 100లకు చేసే ఖర్చు రూ.100కి పైమాటేనని అర్థం. ఓవైపు ఆదాయం తగ్గగా.. మరోవైపు అధిక సిబ్బంది, పెన్షన్ల వ్యయం ఉండటంతో ఈ పరిస్థితి ఎదురైంది.

Budget at a Glance (Full)

Key to Budget Document, 2022

Budget Highlights (Key Features)

Budget Speech

Read Latest Budget 2022 , Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 31-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం