• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక సంస్కరణలతో లాభపడిందెవరు?

దేశంలో తీవ్ర అసమానతలు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాము (1991-96)లో ఆర్థిక సంస్కరణలు మొదలై ప్రస్తుతం మోదీ పాలనలోనూ కొనసాగుతున్నాయి. ఇవి గత 30 ఏళ్లలో భారతదేశంలో పలు మార్పులు తెచ్చిన మాట నిజం. సంస్కరణల వల్ల పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గాయా అన్నదే కీలక ప్రశ్న. ప్రస్తుతం ప్రపంచంలో జీడీపీ పరంగా, కొనుగోలు శక్తిలో భారత్‌ పైస్థానాల్లోనే నిలుస్తోంది. కానీ, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ (యూఎన్‌డీపీ) 2020లో వెలువరించిన మానవాభివృద్ధి సూచీలోని 189 దేశాల జాబితాలో భారత్‌ 131వ స్థానానికి పరిమితమైంది. ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాల ప్రాతిపదికపై ఆ సూచీ రూపొందుతుంది.

పెరిగిన నిరుద్యోగిత  

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1991 వరకు భారత్‌ పలు నియంత్రణలు, ఆంక్షలతో కూడిన ఆర్థిక విధానాన్ని అనుసరించింది. వాటివల్ల అభివృద్ధి పరంగా అంతంతమాత్రం ఫలితాలే సిద్ధించాయి. స్వాతంత్య్రానికి ముందు ప్రపంచ వాణిజ్యంలో 2.2శాతంగా ఉన్న భారత్‌ వాటా 1985 నాటికి 0.45శాతానికి పడిపోవడమే దానికి నిదర్శనం. ఆ రోజుల్లో ప్రభుత్వ లైసెన్సు లేకుండా ఏ వస్తువునూ ఉత్పత్తి చేయడానికి, దిగుమతి చేసుకోవడానికి వీలుండేది కాదు. లైసెన్సులూ సక్రమంగా సకాలంలో అందేవి కాదు. లైసెన్సులో అనుమతించిన పరిమితికి మించి ఉత్పత్తి చేస్తే జైలుశిక్షను ఎదుర్కోవలసి వచ్చేది. అధికోత్పత్తి సాగించడాన్ని నేరంగా భావించిన దేశం అప్పట్లో భారత్‌ ఒక్కటే. అందుకే స్వాతంత్య్రం వచ్చిన తరవాత తొలి మూడు దశాబ్దాల్లో భారత్‌ జీడీపీ వృద్ధిరేటు 3.5శాతానికి మించలేదు. ఆసియా పులులుగా పేరొందిన హాంకాంగ్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా, తైవాన్‌లు అంతకు రెట్టింపు వృద్ధిరేటు సాధించేవి. సోషలిజం పేరిట బ్యాంకులు, బీమా సంస్థల జాతీయీకరణ ఆశించిన ఫలితాలనివ్వలేదు. ‘గరీబీ హఠావో’ నినాదమూ పేదలకు పెద్దగా ప్రయోజనం చేకూర్చలేకపోయింది. 1981 నాటికి భారత జనాభాతోపాటు పేదల సంఖ్యా రెండింతలైంది. 1947 మొదలుకొని 1983 వరకు దేశ జనాభాలో 60శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువనే ఉండిపోయారు. 1983 నుంచి పేదరికం తగ్గడం ఆరంభించినా, అసలు సిసలు తగ్గుదల ఆర్థిక సంస్కరణల తరవాతనే సంభవించింది. 1993-94లో దేశ జనాభాలో పేదలు   45శాతం; 2019-20 నాటికి అది 21శాతానికి తగ్గింది.

మోదీ నేతృత్వంలో ఏక పార్టీ మెజారిటీ ప్రభుత్వం ఏర్పడటంతో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనే ఆశావాదం నెలకొంది. దానికి తగ్గట్లే 2015-16లో జీడీపీ వృద్ధిరేటు 7.5శాతానికి పెరిగింది. అప్పట్లో చైనా వృద్ధిరేటు 6.5శాతమే. 2016 నవంబరులో మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆర్థికంగా తీవ్రమైన దెబ్బకొట్టిందని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ఆ తరవాత వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రూపంలో మరో దెబ్బ పడిందనే వాదనలున్నాయి. జీఎస్టీ అమలు హేతుబద్ధమే అయినా, దాన్ని 2017 జులైలో హడావుడిగా ప్రవేశపెట్టడంతో జీడీపీ వృద్ధిరేటు తగ్గిపోయింది. 2016-17లో ఎనిమిది శాతంగా ఉన్న వృద్ధిరేటు 2019-20 నాటికి నాలుగు శాతానికి పడిపోయింది. ఈ క్షీణత కొవిడ్‌ మహమ్మారి విరుచుకు పడటానికి ముందే సంభవించింది. గతంలో రెండు నుంచి మూడు శాతంగా ఉన్న నిరుద్యోగం 6.1శాతానికి పెరిగిందని శ్రామిక సర్వే తేల్చింది. కొవిడ్‌ దెబ్బకు నిరుద్యోగిత రేటు రెట్టింపైందని భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ సంస్థ (సీఎంఐఈ) వెల్లడించింది. 2021 నుంచి రెండున్నర కోట్లమంది తమ ఉపాధిని కోల్పోయారు. ఏడున్నర కోట్లమంది అదనంగా పేదరికంలోకి జారిపోయారు.

నిజమైన వ్యవస్థాపకులకు ప్రోత్సాహం

మూడేళ్ల నుంచి ధరల పెరుగుదల దేశాన్ని పీడిస్తోంది. పదేపదే పెరుగుతున్న పెట్రో ఉత్పత్తుల ధరలు ప్రజల నడ్డివిరుస్తున్నాయి. అయినా విత్తలోటును తగ్గించుకోవడానికి ప్రభుత్వం పన్నులు పెంచుతూనే ఉంది. జీడీపీలో వాస్తవ విత్తలోటును రెండుశాతం తక్కువ చేసి చూపుతున్నట్లు ప్రభుత్వం సైతం అంగీకరించింది. దేశంలో ప్రజల కొనుగోలు శక్తితోపాటు గిరాకీ పడిపోయి రూపాయి విలువ క్షీణించింది. ఏతావతా ఆర్థిక సంస్కరణలు ధనిక, పేద అంతరాలను పెచ్చరిల్లేలా చేశాయని పలువురు నిపుణులు విమర్శలు వ్యక్తంచేస్తున్నారు. దేశ జనాభాలో 50శాతం వద్ద కేవలం 13శాతం సంపద ఉండగా, మహా సంపన్నుల వద్ద ధనరాశులు అమితంగా పోగుపడ్డాయి. దేశంలో అగ్రశ్రేణిలో ఉన్న ఒక శాతం కుబేరులు మాత్రమే ఆర్థిక సంస్కరణల వల్ల లాభపడ్డారనే భావనలున్నాయి. భారతదేశం వందో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే (2047) నాటికి సామాజిక అసమానతలకు తావులేని అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని ఇటీవల ఒక విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. అది సాకారం కావాలంటే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని పరిహరించి నిజమైన వ్యవస్థాపకులను ప్రోత్సహించాలి. విద్య, ఆరోగ్య రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించి మేలిమి మానవ వనరులను సృష్టించాలి. ఉద్యోగ కల్పన ఊపందుకోవాలి. నేటి కేంద్ర బడ్జెట్‌లో ఆ దిశగా అవసరమైన అడుగులు పడతాయని ఆశిద్దాం. రాజకీయ పార్టీలు ఓటర్లకు ఉచిత వరాలిచ్చి ఎన్నికల్లో గెలవాలనుకునే ధోరణిని కట్టిపెట్టాలి. నేర చరితులు చట్టసభల్లో ప్రవేశించకుండా కట్టడి చేయాలి. ప్రగతిశీల రాజకీయ, ఆర్థిక విధానాలను చేపట్టాలి.

నిర్వచనంపై పేచీ

దారిద్య్ర రేఖకు భారత ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనంపైనే ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి. 2012లో తెందుల్కర్‌ కమిటీ పట్టణాల్లో రోజుకు   రూ.29, పల్లెల్లో రూ.22 సంపాదనను పేదరికానికి ప్రామాణికంగా తీసుకుంది. ఈ నిర్వచనం పేదరికాన్ని తక్కువ చేసి చూపుతోందని అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ప్రపంచంలో అత్యధిక పేదలు ఉన్న దేశం భారత్‌ మాత్రమే అనేది నిర్వివాదాంశం. 1973లో దేశ జనాభాలో 32 కోట్లమంది పేదలు ఉండగా, 2004 నాటికి ఆ సంఖ్య 30 కోట్లకు తగ్గింది. ఆపైన 2004-05 నుంచి 2011-12 మధ్య భారత్‌ జీడీపీ వృద్ధిరేటు బాగా పుంజుకోవడంతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య 30 కోట్ల నుంచి 26 కోట్లకు తగ్గింది. కానీ, 2012-2020 మధ్య అదనంగా 7.5 కోట్లమంది కొత్తగా నిరుపేదలయ్యారు. ఫలితంగా    నేడు దేశంలోని పేదల సంఖ్య  35 కోట్లకు చేరుకుంది. నిరుద్యోగితపై కొవిడ్‌ మహమ్మారి ప్రభావం తీవ్రంగానే ఉంది.


 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రహస్యాల అన్వేషణలో కీలక అడుగు

‣ ప్రమాదంలో రాజ్యాంగ ప్రమాణాలు

‣ భద్రతా విధానంలోనూ పెడపోకడే

‣ యెమెన్‌లో ఆరని రావణకాష్ఠం

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 01-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం