• facebook
  • whatsapp
  • telegram

డిజిటల్‌ కరెన్సీతో మేలెంత?

అన్ని జాగ్రత్తలతో అడుగు ముందుకు

ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) డిజిటల్‌ కరెన్సీని ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌లో ప్రకటించారు. దాంతో ఆర్‌బీఐ- సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) వైపు తన మొదటి అడుగు వేయబోతోంది. ఈ తరుణంలో దేశ ఆర్థిక వ్యవస్థపై సీబీడీసీ ప్రభావం ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. సీబీడీసీ అనేది డిజిటల్‌ రూపేణా ఆర్‌బీఐ జారీచేసే చట్టబద్ధమైన డబ్బు లేదా ధనంలాంటి ఆస్తి. అది సంప్రదాయ కరెన్సీలా పనిచేసినా, దానికి భౌతిక రూపం ఉండదు. డిజిటల్‌ కరెన్సీని సైతం వస్తుసేవల కొనుగోలుకు, ఇతర లావాదేవీలకు ఉపయోగించవచ్చు. సీబీడీసీలు రెండు రకాలు. ఒకటి టోకు మార్కెట్‌ వ్యవహారాల్లో కేంద్ర-వాణిజ్య బ్యాంకుల మధ్య ఆర్థిక లావాదేవీల కోసం రూపొందించింది. రెండోది రిటైల్‌ మార్కెట్‌లో సాధారణ ప్రజలకోసం ఉద్దేశించింది. సంప్రదాయ కరెన్సీతో పోలిస్తే సురక్షితంగా నిల్వ చేయడానికి, వ్యాపార కార్యకలాపాలను సులభంగా నిర్వహించడానికి సీబీడీసీ సౌకర్యంగా ఉంటుంది. దానివల్ల కరెన్సీ ముద్రణ వ్యయ భారం చాలావరకు తగ్గుతుంది. అయితే, డిజిటల్‌ కరెన్సీ ప్రయోజనాలు దేశ సాంకేతిక అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయి.

ఉపాధి పెరుగుదలకు అవకాశం

సీబీడీసీని ప్రవేశపెట్టడానికి రిజర్వ్‌ బ్యాంకు ప్రధానంగా మూడు కారణాలు పేర్కొంది. ముందుగా పేపర్‌ కరెన్సీ వినియోగాన్ని తగ్గించవచ్చు. ప్రైవేటు డిజిటల్‌ కరెన్సీలైన బిట్‌కాయిన్‌ లాంటి క్రిప్టోల వల్ల తలెత్తే దుష్పరిణామాలను నివారించవచ్చు. ప్రజలు జాతీయ, అంతర్జాతీయ చెల్లింపులు సులభంగా నిర్వహించడానికి అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బహుళజాతి సంస్థలు డిజిటల్‌ కరెన్సీ చెల్లింపులను ప్రోత్సహిస్తుండటంతో దాని ప్రాధాన్యం పెరిగింది. డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టడం ద్వారా దేశంలో లావాదేవీలు ఊపందుకుంటాయి. ఫలితంగా వస్తుసేవల ఉత్పత్తి పెరిగి, అనేక మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సాధారణ బ్యాంకు డిపాజిట్లలాగా సీబీడీసీకి వడ్డీ రేట్లను ఆపాదిస్తే- ప్రజలు డిజిటల్‌ కరెన్సీ వినియోగంవైపు అధికంగా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాను కేంద్రబ్యాంకు కచ్చితమైన రేటులో నియంత్రించగలుగుతుంది. అంతేకాకుండా వడ్డీ రేట్లను ఏ సమయంలోనైనా ఎంత తక్కువకైనా తగ్గించగలుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు, సీబీడీసీపై కేంద్ర బ్యాంకు ప్రతికూల వడ్డీరేట్లను విధించి గృహస్తుల వినియోగం, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక పురోగతికి తోడ్పడవచ్చు. ఆర్థిక వ్యవస్థ ప్రతిద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నప్పుడు ప్రతికూల వడ్డీరేట్లు అవసరమని 2007-08 ఆర్థిక సంక్షోభం సమయంలో అమెరికా, బ్రిటన్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల అనుభవం తెలియజేస్తోంది. అదేవిధంగా డిజిటల్‌ కరెన్సీ వినియోగంపై ప్రభుత్వంతో కలిసి ఆర్‌బీఐ బలమైన నియంత్రణ చర్యలు చేపట్టడంతోపాటు కొత్త చట్టాలను అమలులోకి తేగలిగితే, భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించి దేశంలో ఉద్యోగాలు, ఉత్పాదకతలను ప్రోత్సహించవచ్చు. డిజిటల్‌ కరెన్సీ అమలువల్ల దేశంలో భౌతిక రూపంలో ఉన్న సంప్రదాయ నగదుపై ఆధారపడటం తగ్గుతుంది. తక్కువ లావాదేవీ ఖర్చులు, ద్రవ్య విధాన సామర్థ్యం మెరుగుపడటం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం వంటి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది.

ప్రతికూల ప్రభావాలూ...

ఆర్థిక వ్యవస్థపై డిజిటల్‌ కరెన్సీ ప్రభావాన్ని మరో కోణంలోనూ చూడవచ్చు. డిజిటల్‌ కరెన్సీ వినియోగంవల్ల బ్యాంకుల పరపతి వ్యవస్థకు మూలమైన, తక్కువ వ్యయంతో కూడిన డిమాండ్‌ డిపాజిట్లను వాణిజ్య బ్యాంకులు క్రమేణా కోల్పోయే అవకాశం ఉంది. దాంతో వాటి పరపతి సామర్థ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. ఫలితంగా బాహ్య నిధులతో కూడిన వినియోగ, వ్యాపార లావాదేవీలు గణనీయంగా తగ్గి ఆర్థికాభివృద్ధి కుంటువడుతుంది. అదే సమయంలో బ్యాంకులు గణనీయమైన మొత్తంలో తక్కువ వ్యయంతో కూడిన డిమాండ్‌ డిపాజిట్లను కోల్పోవడంతో, అవి అందించే రుణ వడ్డీ రేట్లూ పెరిగి పరపతి సృష్టి తగ్గిపోతుంది. దానివల్ల ప్రజల నిధులతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వాణిజ్య బ్యాంకుల ఉనికి ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల వాణిజ్య బ్యాంకుల పనితీరుపై సీబీడీసీ అమలు ప్రభావాన్ని ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండటం తప్పనిసరి. వాటి రుణ సామర్థ్యాన్ని పెంచేందుకు తగిన చర్యలు సైతం తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 29శాతం భారతీయులకు మాత్రమే కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్‌ వంటి సాంకేతిక పరికరాలను ఉపయోగించే పరిజ్ఞానం ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దేశీయంగా 24శాతం భారతీయులు మాత్రమే ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉన్నట్లు గణాంకాలు చాటుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం డిజిటల్‌ కరెన్సీని ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా ప్రవేశపెట్టే ముందు లాభనష్టాలను, అనంతర పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలి. అందుకు అనుగుణంగా విధివిధానాలను రూపొందించడం అత్యావశ్యకం.

- డాక్టర్‌ సత్యనారాయణ మూర్తి

(సహాయ ఆచార్యులు, రాజస్థాన్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉద్యోగరహిత అభివృద్ధి!

‣ యూపీలో భాజపా - ఎస్‌పీ మధ్య తీవ్ర పోటీ

‣ ప్రణాళిక కొరవడి... ప్రగతి తడబడి!

‣ యూపీలో భాజపా - ఎస్‌పీ మధ్య తీవ్ర పోటీ

‣ భూతాపం ఉత్పాదకతకు శాపం

‣ డ్రాగన్‌ వైపు రష్యా మొగ్గు!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 14-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం