• facebook
  • whatsapp
  • telegram

యూఏఈతో సరికొత్త వాణిజ్య బంధం

భారత ఆర్థిక ప్రగతికి ఊతం

పశ్చిమాసియాలో కీలక దేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)తో భారత్‌ చరిత్రాత్మక సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రపంచంలోని కీలక వ్యవస్థల్లో ఒకటైన భారత్‌- మరింతగా దూసుకువెళ్లేందుకు ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక ప్రగతికి దన్నుగా నిలవనుంది. భారత్‌, యూఏఈల మధ్య ఇటీవల సంతకాలు జరిగిన ఒప్పందాన్ని ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం-సెపా’గా పరిగణిస్తున్నారు.

యూఏఈ అరేబియన్‌ ద్వీపకల్పంలోని ఏడు ఎమిరేట్స్‌ల సమాహారం. దుబాయి, అబుధాబి, షార్జా, అజ్మన్‌, రస్‌అల్‌ఖైమాలు ముఖ్యమైనవి. పెట్రో ఉత్పత్తుల లభ్యతతో ఆర్థిక ప్రగతి సాధించాయి. యూఏఈ అంతర్జాతీయ వాణిజ్యానికి కీలక బిందువుగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌-యూఏఈల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు ఆరువేల కోట్ల డాలర్లదాకా ఉంటుందని ఆర్థిక నిపుణుల అంచనా. ఉభయ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో వ్యాపారం మరింత పెరగనుంది. అమెరికా-చైనాల తరవాత యూఏఈతోనే భారత్‌ వాణిజ్య సంబంధాలు అధికంగా ఉన్నాయి. ఈ ఒప్పందంతో భారత్‌కు చెందిన వజ్రాలు, ఆభరణాలు, జౌళి, తోలు, పాదరక్షలు, ఫర్నిచర్‌, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులు, ప్లాస్టిక్స్‌, ఇంజినీరింగ్‌ పరికరాలు, ఔషధాలు, ఆరోగ్య పరికరాలు, క్రీడావస్తువుల తయారీ రంగాలకు మరింత లబ్ధి చేకూరనుంది. యూఏఈకి అదనంగా ఎగుమతులు చేయాల్సి రావడంతో దేశీయంగా వీటి తయారీకి అధిక సంఖ్యలో మానవ వనరుల అవసరం ఏర్పడుతుంది. దీంతో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. యూఏఈలో దుబాయి అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా, షాపింగ్‌ కేంద్రంగా పేరు పొందింది. మధ్యప్రాచ్యం ఉత్తర ఆఫ్రికాల సమీపంలో ఉండటంతో ఈ వేదిక ద్వారా భారత్‌ తన ఉత్పత్తులను అంతర్జాతీయ కొనుగోలుదారులకు విక్రయించే అవకాశం లభించనుంది. దుబాయి బంగారం మార్కెట్‌కు మంచిపేరుంది. అక్కడ షాపింగ్‌ చేసే కొనుగోలుదారులను భారతీయ బంగారు ఆభరణాలు ఆకర్షిస్తాయనడంలో సందేహం లేదు. భారత్‌లో బంగారానికి విశేషమైన డిమాండ్‌ ఉండటంతో విదేశాల నుంచి భారీయెత్తున దిగుమతులు జరుగుతున్నాయి. దుబాయి నుంచి బంగారం ఎక్కువగా భారత్‌లోకి వస్తోంది. ఈ నూతన ఒప్పందంతో బంగారం స్మగ్లింగ్‌ తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా భారత్‌లోకి యూఏఈ నుంచి వస్తువుల దిగుమతులు వెల్లువెత్తకుండా దేశీయ రంగ పరిశ్రమల కోసం కొన్ని సంరక్షణ చర్యలు చేపట్టారు. పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, కాఫీ, తేయాకు, పొగాకు, టైర్లు తదితర ఉత్పత్తులను ఒప్పందం నుంచి మినహాయించారు. ‘సెపా’ ఒప్పందంతో రానున్న అయిదేళ్లలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం పది వేల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఒప్పందం అమలులోకి రాకముందే ముడి సరకుల లభ్యతపై కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాల్సి ఉంది. కొన్ని ముడి పదార్థాల ధరలు అధికంగా ఉన్నాయి. వాటిని ఇంకా దిగుమతి చేసుకుంటున్నాం. దేశీయంగా తయారీని ప్రోత్సహిస్తే కొత్త వ్యాపారవేత్తలు ఈ రంగంలోకి అడుగుపెట్టి, పారిశ్రామిక ఉత్పత్తుల సామర్థ్యం పెరుగుతుంది.

ప్రధాని మోదీ 2015లో తొలిసారిగా యూఏఈలో పర్యటించారు. అప్పుడే సమగ్ర వాణిజ్య ఒప్పందానికి బీజాలు పడ్డాయి. 2017 గణతంత్ర దినోత్సవాలకు అబుధాబి యువరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అమెరికా ఆంక్షల మేరకు ఇరాన్‌ నుంచి చమురు సరఫరా భారత్‌కు నిలిచిపోవడంతో మంగళూరులోని వ్యూహాత్మక పెట్రోలియం నిల్వ కేంద్రానికి యూఏఈ చమురును సరఫరా చేసింది. యూఏఈలోని చమురు క్షేత్రం లోయర్‌ జకుమ్‌లో భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీకి భాగస్వామ్యముంది. భారత్‌కు చమురు దిగుమతులతో పాటు మన దేశం నుంచి జనరిక్‌ ఔషధాలు యూఏఈకి ఎగుమతి అయ్యేందుకు వీలుగా ఒప్పందంలో అంశాలను పొందుపరిచారు. యూఏఈ కేంద్రంగా జనరిక్‌ మందుల విక్రయాలు కొనసాగిస్తే ఆఫ్రికా దేశాలకు ఉపయుక్తంగా ఉంటుంది. అబుధాబి నుంచి మనదేశంలోకి పెట్టుబడులు వచ్చేందుకూ నూతన కార్యాచరణ చేయూత ఇవ్వనుంది. ఈ ఒప్పంద స్ఫూర్తితో భారత్‌ మరిన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ముందడుగు వేయాలి.

- కె.శ్రీధర్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నూనెగింజల్లో స్వయంసమృద్ధికి బాటలు

‣ డిజిటల్‌ కరెన్సీతో మేలెంత?

‣ ఉద్యోగరహిత అభివృద్ధి!

‣ యూపీలో భాజపా - ఎస్‌పీ మధ్య తీవ్ర పోటీ

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 01-03-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం