• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే 2021-22

అంచనాలు అందుకోని పన్నేతర రాబడి 

2021 - 22లో పన్నేతర రాబడి అంచనాలు చేరుకోకపోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనాలను ప్రభుత్వం తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.30,557 కోట్ల పన్నేతర రాబడిని అంచనా వేయగా.. జనవరి వరకు రూ.7 వేల కోట్లలోపు మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో పన్నేతర రాబడి అంచనాలను రూ.25,421 కోట్లుగా పేర్కొంది. ఇందులో భూముల అమ్మకం ద్వారా రూ.15,500 కోట్లను, గనుల శాఖ ద్వారా రూ.6,399 కోట్లను అంచనా వేయగా మిగిలిన మొత్తం ఇతర పన్నేతర రాబడిగా పేర్కొంది.

ప్రతి వంద మందికి 110 సెల్‌ఫోన్‌లు 

రాష్ట్రంలో వ్యక్తుల కన్నా మొబైల్‌ ఫోన్‌ కనెక్షన్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. ప్రతి వంద మందికి 110 సెల్‌ఫోన్‌ కనెక్షన్లు ఉన్నట్లు తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. ప్రతి వంద మందికి అత్యధికంగా దేశంలో గోవాలో 177 మొబైల్‌ ఫోన్‌ కనెక్షన్లు ఉండగా ఆ తరవాత హిమాచల్‌ ప్రదేశ్‌లో 146, కేరళలో 123, పంజాబ్‌లో 122, ఉత్తరాఖండ్‌లో 114, హరియాణాలో 113 కనెక్షన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వంద మందికి 86 ఫోన్‌ కనెక్షన్లు ఉండగా అతి తక్కువగా బిహార్‌లో 51 ఉన్నాయి.

వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం

తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. తద్వారా ఆరోగ్యసూచీల్లో గణనీయమైన ప్రగతి కనబడుతోందని 2022 మార్చి 7న‌ విడుదల చేసిన ‘సామాజిక ఆర్థిక సర్వే - 2022’ వెల్లడించింది. కేసీఆర్‌ కిట్, అమ్మఒడి, ఆరోగ్యలక్ష్మి వంటి పథకాల వల్ల మాతాశిశు సంరక్షణ మెరుగుపడిందని పేర్కొంది. అయితే 2020 - 21లో కరోనా ప్రభావం వైద్యరంగంపై పడింది. ఆసుపత్రుల్లో ఓపీ సేవలు, చేరికలు గణనీయంగా తగ్గాయి. ఆరోగ్యశ్రీ చికిత్సలపైనా కొవిడ్‌ ప్రభావం పడినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.

ముఖ్యాంశాలు
ఆరోగ్య సూచీల్లో దేశం మొత్తమ్మీద తెలంగాణ 69.96 శాతం మార్కులతో మూడో స్థానంలో ఉంది. రాష్ట్రాని కంటే అగ్రపథాన కేరళ (82.20%), తమిళనాడు 72.42%) రాష్ట్రాలున్నాయి.
అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ కాయకల్ప పురస్కారాల సాధనలో కర్ణాటకతో పాటు తెలంగాణ మాత్రమే ముందు వరుసలో నిలిచింది.
కొవిడ్‌ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరికలు, చికిత్సలు తగ్గాయి. ఉదాహరణకు 2019 - 20లో టీవీవీపీ పరిధిలోని ఆసుపత్రుల్లో 1.28 కోట్ల ఓపీ లక్ష్యానికి 1.53 కోట్ల ఓపీ చూశారు. అదే 2020 - 21లో 77.46 లక్షలు మాత్రమే చూడగలిగారు. 59 శాతం లక్ష్యాన్ని మాత్రమే సాధించగలిగారు. చేరికలు కూడా 71 శాతానికే పరిమితమయ్యాయి. ఈ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు 2019 - 20లో 72 శాతం జరగగా 2020 - 21లో 59 శాతమే జరిగాయి. ప్రసవాలు మాత్రం ఆశించిన స్థాయి కంటే అధికంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. 2019 - 20లో 1,46,856 (156 శాతం) కాన్పులు జరగగా 2020 - 21లో 1,39,346 (142 శాతం) ప్రసవాలు సర్కారు దవాఖానాల్లో జరగడం విశేషం.
కొవిడ్‌ కారణంగా ఆరోగ్యశ్రీ చికిత్సలు కూడా తగ్గాయి. 2019 - 20లో 1,58,876 మంది లబ్ధి పొందగా రూ.716.64 కోట్లు ఖర్చయ్యాయి. అదే 2020 - 21లో 96,561 మంది మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందగా రూ.450.38 కోట్లే వ్యయమయ్యాయి.
‣ 2018లో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నొస్టిక్‌ పథకం కింద 2021లో 24,72,502 పరీక్షలు నిర్వహించారు.
ఆసుపత్రి కాన్పులు గడిచిన ఐదేళ్లలో 91.5 శాతం నుంచి 97 శాతానికి పెరిగాయి.
జననమరణాల నమోదులోనూ దేశవ్యాప్తంగా తెలంగాణ గుర్తింపు పొందింది. జననాల్లో 100 శాతం, మరణాల నమోదులో 98.6 శాతం నమోదు చేసి పెద్ద రాష్ట్రాల జాబితాలో ముందు వరుసలో నిలిచింది.

రూ.1.45 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు 

రాష్ట్రం నుంచి 2020 - 21 సంవత్సరంలో రూ.1.45 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. ప్రభుత్వం 2016లో తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) విధానంతో అనేక ఐటీ సంస్థలు రాష్ట్రంలో కొలువుదీరాయి. నూతన ఆవిష్కరణలకు రాష్ట్రం వేదికగా మారింది. ఎలక్ట్రానిక్, రూరల్‌ టెక్నాలజీ, డాటా సెంటర్స్, ఓపెన్‌ డాటా, సైబర్‌ సెక్యూరిటీ, డాటా ఎనలైటిక్స్‌ తదితర విధానాలపై ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి అమల్లోకి తెచ్చింది. గతేడాది రెండో ఐసీటీ విధానాన్ని (2021 - 2026) అమల్లోకి తెచ్చింది. 2026 నాటికి ఐటీ ఎగుమతులను రూ.3 లక్షల కోట్లకు పెంచడంతో పాటు 6.3 లక్షలుగా ఉన్న ఉద్యోగాల సంఖ్యను 10 లక్షలకు పెంచాలనేది నూతన పాలసీలో భాగంగా ఉంది.

ఏడేళ్లలో 119 శాతం పెరిగిన సాగు

ఏడేళ్ల కాలంలో రాష్ట్రంలో సాగునీటి కల్పనపై భరోసా కల్పించడంతో ఆయకట్టు వృద్ధి గణనీయంగా పెరిగినట్లు తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. 2014 - 15 నుంచి 2020 - 21 మధ్య కాలంలో స్థూల సాగు (జీఐఏ) 119 శాతం వృద్ధి చెందింది. సాగు సామర్థ్యం (ఐపీ) 72.70 లక్షల ఎకరాలుగా నమోదైంది. భారీ, మధ్య, చిన్నతరహా సాగునీటి రంగంపై ప్రభుత్వం రూ.1,28,596 కోట్ల వ్యయం చేసి కొత్త ప్రాజెక్టులతో పాటు అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేసింది. అప్పటి వరకు వర్షాలపై ఆధారపడిన రైతులకు సాగునీటిపై భరోసా వచ్చింది. 
కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంతో పాటు పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, దేవాదుల ఎత్తిపోతలను చేపట్టింది. 
రూ.5,349 కోట్లతో 27,665 చెరువులను మిషన్‌కాకతీయ కింద పునరుద్ధరించడంతో 8.93 టీఎంసీల నిల్వ సామర్థ్యం పెరిగింది. 
నాగార్జునసాగర్, నిజాంసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల ఆధునికీకరణ, మేలైన నీటి నిర్వహణ విధానాల అమలుతో పంట దిగుబడులు పెరిగాయి. 
రూ.3,850 కోట్లతో 1,200 చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా తొలిదశలో 638 నిర్మాణాలు పూర్తికానున్నాయి.  
తెలంగాణ ఆవిర్భవించాక సాగునీటి పారుదల రంగంలో చేపట్టిన పలు నిర్మాణాలతో ఆయకట్టు 85.89 లక్షల ఎకరాలకు చేరుకుంది. భూగర్భ జలాల్లో ఆరేళ్ల కాలంలో వృద్ధి 4.14 మీటర్లుగా నమోదైంది. 

గణనీయంగా తగ్గిన పర్యాటకులు
అనేక చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలతో దేశ, విదేశీయుల్ని ఆకర్షిస్తూ రాష్ట్రంలో ఏటికేడు అభివృద్ధి చెందుతూ వచ్చిన పర్యాటక రంగాన్ని కరోనా మహమ్మారి దెబ్బతీసింది. పర్యాటకుల సంఖ్య 2020 - 21, 2021 - 22లో రెండేళ్ల పాటు గణనీయంగా తగ్గింది. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. తెలంగాణ ఏర్పడ్డ తొలి సంవత్సరం 2014 - 15లో 7,23,99,113 ఉన్న దేశీయ పర్యాటకుల సంఖ్య 2019 - 20 నాటికి 8,30,35,894కి పెరిగింది. 14.69 శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో విదేశీ పర్యాటకుల సంఖ్య 75,171 నుంచి 3,23,326కి పెరిగింది. 4.3 రెట్లు విదేశీ పర్యాటకులు పెరిగారు. కొవిడ్‌-19 ప్రభావంతో ప్రయాణాలపై ఆంక్షలు, లాక్‌డౌన్లు, సరిహద్దుల మూసివేత వంటి నిబంధనలతో పర్యాటకుల సంఖ్య తగ్గింది. 2019 - 20లో 8.30 కోట్లు ఉంటే.. 2020-21 నాటికి 4.30 కోట్లకు తగ్గింది. ఒక్క ఏడాదిలోనే 4.29 కోట్ల మంది దేశీయ పర్యాటకులు తగ్గారు. విదేశీ పర్యాటకులు 2.76 లక్షల మంది తగ్గినట్లు సర్వే తెలిపింది. 2021-22లో పర్యాటకుల సంఖ్య మరింతగా తగ్గింది. రామప్ప ఆలయానికి యునెస్కో నుంచి ప్రపంచ వారసత్వ హోదా దక్కగా భూదాన్‌ పోచంపల్లికి ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు లభించింది. 


ప్రతి లక్ష మంది జనాభాకు సర్కారు బడుల లెక్క ఇదీ
ప్రతి లక్ష మంది జనాభాకు హైదరాబాద్‌లో 20 ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయి. అదే సమయంలో కుమురంభీం ఆసిఫాబాద్‌లో ఆ సంఖ్య 160గా ఉండటం గమనార్హం. అంటే ఎనిమిది రెట్లు అధికం. మరో వైపు హైదరాబాద్‌లో ప్రతి లక్ష జనాభాకు ప్రైవేట్‌ పాఠశాలలు 61 ఉండగా...ఆసిఫాబాద్‌లో 27 ఉండటం విశేషం. అతి తక్కువగా మెదక్‌లో 16 మాత్రమే ఉన్నాయి.
* కరోనా కారణంగా 2021 - 22 విద్యా సంవత్సరంలో ప్రైవేట్‌ పాఠశాలల నుంచి 2,35,439 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పొందారు. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల శాతం 46.29కి పెరిగింది. అంతకుముందు సంవత్సరం అది 44.90 శాతం. 

పట్టణ జనాభాలో రాష్ట్రం దూకుడు

‣ 2022 నాటికి దేశంలో పట్టణ జనాభా 34.75 శాతం కాగా తెలంగాణలో అది 46.84 శాతం.
‣ హైదరాబాద్‌లో అత్యధికంగా వందశాతం పట్టణ జనాభానే కాగా ములుగులో అత్యల్పంగా 3.9 శాతం మంది పట్టణంలో ఉన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో 34.9 శాతం మంది కూలీలు ఉపాధి పొందుతుండగా.. పట్టణ ప్రాంతాల్లో ఇది 12 శాతం మాత్రమే. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కూలీలు 43.1 శాతం కాగా పట్టణాల్లో 12.8 శాతం.  
పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా 25.47 శాతం మంది వాహనాల రిపేర్లు, కర్మాగారాల్లో పనిచేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో 70.76 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు. 
పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం సగటున రూ.18,380 కాగా గ్రామాల్లో ఇది రూ.11.608.
ప్రతి వెయ్యి మంది జనాభాకు జరుగుతున్న ఈ-లావాదేవీలో 2019 నుంచి వరుసగా మూడేళ్ల పాటు తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో కొనసాగుతోంది.
‣ 1990 - 91లో 48.19 లక్షల టన్నులున్న ఆహార ఉత్పత్తులు 2020 - 21 నాటికి 171.75 లక్షల టన్నులకు చేరాయి.
2019 - 20లో దేశంలో ఆహార ధాన్యాలు, వరి ఉత్పత్తిలో తెలంగాణ 5వ స్థానంలో ఉంది.  
2008 - 09లో రూ.1,51,291 టన్నుల మత్స్య సంపద ఉత్పత్తికాగా 2020 - 21 నాటికి ఇది 3,48,851 టన్నులకు చేరింది. 
2014 - 15, 2020 - 21 మధ్యకాలంలో మాంసం ఉత్పత్తి 505.05 లక్షల టన్నుల నుంచి 920.25 లక్షల టన్నులకు, గుడ్ల ఉత్పత్తి 1,06,190 మిలియన్ల నుంచి 1,58,470 మిలియన్లకు చేరింది.

మౌలిక వసతుల కల్పన దిశగా..

రాష్ట్రంలో 1,07,871 కి.మీ. రోడ్డు మార్గాలు పూర్తయ్యాయి. ఇందులో 67,276కి.మీ. గ్రామీణ రహదారులే. 
మిషన్‌ భగీరథ పథకం కింద రాష్ట్రంలోని 23,890 గ్రామాలు, 22,882 పాఠశాలలు, 27,310 అంగన్వాడీ కేంద్రాలకు తాగునీరు అందుతోంది.
రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. 2014 - 15లో 9,470 మెగావాట్ల ఉత్పత్తి జరగ్గా 2020 - 21లో 17,218 మెగావాట్లకు పెరిగింది. అతి తక్కువ విద్యుత్తు ట్రాన్స్‌మిషన్‌ నష్టాలతో తెలంగాణ దేశంలో మూడోస్థానంలో నిలిచింది.

అన్ని జిల్లాల్లో పెరిగిన సాగు విస్తీర్ణం
రాష్ట్రంలో 2019 - 21 మధ్యకాలంలో నిర్మల్‌ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో సాగు భూముల విస్తీర్ణం చాలా వరకు పెరిగింది. స్థూల సాగు విస్తీర్ణంలో రాష్ట్ర సగటు 13.7 శాతం కాగా.. 13 జిల్లాలు అంతకంటే ఎక్కువ వృద్ధిరేటును సాధించాయి. మెదక్‌లో అత్యధికంగా 57.2 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. వికారాబాద్‌లో 31.6 శాతం, మహబూబ్‌నగర్‌లో 30.5 శాతం, జనగామలో 30.4 శాతం పెరుగుదల నమోదైంది. అత్యల్పంగా కుమురంభీంలో 1 శాతం, పెద్దపల్లిలో 2.9 శాతం, నిజామాబాద్‌లో 4 శాతం పెరిగింది. గతంతో పోల్చితే నిర్మల్‌లో 11.1 శాతం తగ్గుదల నమోదైంది. ఈ జిల్లాలో మొక్కజొన్న సాగు విపరీతంగా తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొంది.
పత్తి సాగులో 2020లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఆ ఏడాది 6.83 మిలియన్‌ బేళ్ల పత్తిని ఉత్పత్తి చేయగలిగింది. 3 మిలియన్‌ టన్నుల మొక్కజొన్న ద్వారా మూడో స్థానంలో నిలిచింది.
2019 - 20లో దేశంలో పండిన మొత్తం పత్తి పంటలో దాదాపు 19 శాతం, మొత్తం వరిలో 6 శాతం ఒక్క తెలంగాణలోనే పండింది.
2015 - 16లో రాష్ట్రంలో వరి 25 లక్షల ఎకరాల్లో 45 లక్షల టన్నులు, పత్తి 43 లక్షల ఎకరాల్లో 18 లక్షల టన్నుల ఉత్పత్తి అయింది. 2021 ఏడాదికొచ్చేసరికి 1.04 కోట్ల ఎకరాల్లో వరిసాగు ద్వారా 218.5 లక్షల టన్నులు, 58 లక్షల ఎకరాల పత్తి సాగు ద్వారా 30.42 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అయింది.
‣ 2015 - 16 నుంచి 2019 - 20 మధ్యకాలంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అత్యధికంగా 25 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించింది. రెండో స్థానంలో నిలిచిన ఒడిశా వృద్ధిరేటు 9.3 శాతం. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ 16.9 శాతం వృద్ధిరేటుతో నాలుగో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో ఉన్న హరియాణా వృద్ధిరేటు 25.8 శాతం.
పప్పుధాన్యాల ఉత్పత్తిలో 2018 - 20 కాలంలో తెలంగాణ జాతీయస్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ అంశంలో జాతీయ వృద్ధిరేటు 4.3 శాతం కాగా తెలంగాణది 20.49 శాతం.
‣ 2019 - 20తో పోల్చితే 2020 - 21లో ఎరువుల వినియోగం విపరీతంగా పెరిగింది. హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లాలకు గాను 28 జిల్లాల్లో ఈ శాతం పెరిగింది. మహబూబాబాద్‌లో అత్యధికంగా 143.6%, సిద్దిపేటలో 123.2% పెరుగుదల నమోదైంది. ఈ విషయంలో రాష్ట్ర సగటు 19 శాతమే. మెదక్, ఆదిలాబాద్, ములుగు, కరీంనగర్, నారాయణపేట, వరంగల్‌ అర్బన్, మేడ్చల్‌ జిల్లాల్లో వినియోగం తగ్గింది.
2020 - 21లో రాష్ట్రంలో 11.57 లక్షల ఎకరాల్లో ఉద్యానపంటలు సాగు కాగా 59.03 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం సాగు విస్తీర్ణం (214.48 లక్షల ఎకరాలు)లో ఉద్యాన పంటలది 5.39 శాతం. 2015 - 16తో పోల్చితే సాగు విస్తీర్ణం 304 శాతం అధికంగా నమోదైంది. మామిడి, నారింజ, నిమ్మ, జామ, దానిమ్మ తదితర పంటల సాగు పెరిగింది.

తెలంగాణలో వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం

తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. తద్వారా ఆరోగ్యసూచీల్లో గణనీయమైన ప్రగతి కనబడుతోందని సోమవారం విడుదల చేసిన ‘సామాజిక ఆర్థిక సర్వే - 2022’ వెల్లడించింది. కేసీఆర్‌ కిట్, అమ్మఒడి, ఆరోగ్యలక్ష్మి వంటి పథకాల వల్ల మాతాశిశు సంరక్షణ మెరుగుపడిందని పేర్కొంది. అయితే 2020 - 21లో కరోనా ప్రభావం వైద్యరంగంపై పడింది. ఆసుపత్రుల్లో ఓపీ సేవలు, చేరికలు గణనీయంగా తగ్గాయి. ఆరోగ్యశ్రీ చికిత్సలపైనా కొవిడ్‌ ప్రభావం పడినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.
ముఖ్యాంశాలివీ..
‣  ఆరోగ్య సూచీల్లో దేశం మొత్తమ్మీద తెలంగాణ 69.95 శాతం మార్కులతో మూడో స్థానంలో ఉంది. రాష్ట్రాని కంటే అగ్రపథాన కేరళ (82.20%), తమిళనాడు 72.42%) రాష్ట్రాలున్నాయి.
అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ కాయకల్ప పురస్కారాల సాధనలో కర్ణాటకతో పాటు తెలంగాణ మాత్రమే ముందు వరుసలో నిలిచింది.
కొవిడ్‌ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరికలు, చికిత్సలు తగ్గాయి. ఉదాహరణకు 2019 - 20లో టీవీవీపీ పరిధిలోని ఆసుపత్రుల్లో 1.28 కోట్ల ఓపీ లక్ష్యానికి 1.53 కోట్ల ఓపీ చూశారు. అదే 2020 - 21లో 77.46 లక్షలు మాత్రమే చూడగలిగారు. 59 శాతం లక్ష్యాన్ని మాత్రమే సాధించగలిగారు. చేరికలు కూడా 71 శాతానికే పరిమితమయ్యాయి. ఈ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు 2019 - 20లో 72 శాతం జరగగా 2020 - 21లో 59 శాతమే జరిగాయి. అయితే ప్రసవాలు మాత్రం ఆశించిన స్థాయి కంటే అధికంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. 2019-20లో 1,46,856 (156 శాతం) కాన్పులు జరగగా 2020-21లో 1,39,346 (142 శాతం) ప్రసవాలు సర్కారు దవాఖానాల్లో జరగడం విశేషం.
కొవిడ్‌ కారణంగా ఆరోగ్యశ్రీ చికిత్సలు కూడా తగ్గాయి. 2019 - 20లో 1,58,876 మంది లబ్ధి పొందగా రూ.716.64 కోట్లు ఖర్చయ్యాయి. అదే 2020 - 21లో 96,561 మంది మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందగా రూ.450.38 కోట్లే వ్యయమయ్యాయి.
2018లో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నొస్టిక్‌ పథకం కింద 2021లో 24,72,502 పరీక్షలు నిర్వహించారు.
‣ ఆసుపత్రి కాన్పులు గడిచిన ఐదేళ్లలో 91.5 శాతం నుంచి 97 శాతానికి పెరిగాయి.
జననమరణాల నమోదులోనూ దేశవ్యాప్తంగా తెలంగాణ గుర్తింపు పొందింది. జననాల్లో 100 శాతం, మరణాల నమోదులో 98.6 శాతం నమోదు చేసి పెద్ద రాష్ట్రాల జాబితాలో ముందు వరుసలో నిలిచింది.

మౌలిక వసతుల కల్పన దిశగా..

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన దిశగా తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నట్లుగా సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. స్వయంసమృద్ధి సాధించే దిశగా పలు విజయాలు నమోదు చేసినట్లుగా పేర్కొంది. 
రాష్ట్రంలో 1,07,871 కి.మీ. పొడవున రోడ్డు మార్గాలు పూర్తయ్యాయి. ఇందులో 67,276 కిలో మీటర్లు గ్రామీణ రహదారులే ఉన్నాయి. 
మిషన్‌ భగీరథ పథకం కింద రాష్ట్రంలోని 23,890 గ్రామాలకు, 22,882 పాఠశాలలకు, 27,310 అంగన్‌వాడీ కేంద్రాలకు తాగునీరు అందుతోంది.
రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. 2014 - 15లో 9,470 మెగావాట్స్‌ ఉత్పత్తి జరగగా 2020 - 21లో 17,218 మెగావాట్స్‌ ఉత్పత్తి జరిగింది. అతి తక్కువ విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ నష్టాలతో తెలంగాణ దేశంలో మూడోస్థానంలో నిలిచింది.

జీడీడీపీ, తలసరి ఆదాయంలో ప్రథమ స్థానంలో రంగారెడ్డి జిల్లా
జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ), తలసరి ఆదాయాల్లో రంగారెడ్డి జిల్లా తొలి స్థానాల్లో నిలిచి అదరగొట్టింది. పారిశ్రామిక అభివృద్ధి, సేవలు, ఫార్మ తదితర రంగాల్లో ముందున్న జిల్లా రూ.1,93,507 కోట్ల జీడీడీపీని నమోదు చేసింది. అత్యధిక తలసరి ఆదాయం రూ.6,58,757గా నమోదు అయింది. జీడీడీపీలో రంగారెడ్డి తరువాత హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ములుగు జిల్లా రూ.5,746 కోట్లతో అట్టడుగున ఉంది. మెరుగైన గణాంకాలతో నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్‌నగర్, కరీంనగర్‌ జిల్లాలు సత్తాచాటాయి. సోమవారం విడుదల చేసిన రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వేలో ఈ వివరాలను పొందుపర్చారు. ఒక జిల్లా పరిధిలోని వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, తదితర రంగాల్లోని ఉత్పాదకతను పరిగణనలోకి తీసుకుని ఆ జిల్లా స్థూల ఉత్పత్తిని నిర్ధరిస్తారు. 

తలసరి ఆదాయంలో జాతీయ స్థాయిని దాటి..  
పరిశ్రమలు, ఫార్మా, సాఫ్ట్‌వేర్, కుటీర పరిశ్రమలు తదితర ఉపాధి వనరులు అధికంగా ఉండటంతో తలసరి ఆదాయం/పెర్‌ క్యాపిటా (రూ.6,58,757)లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో, తరువాతి స్థానంలో హైదరాబాద్‌ నిలిచాయి. జాతీయ తలసరి ఆదాయం రూ.1,26,757తో పోల్చితే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ముందున్నాయి. జిల్లాల్లోని తలసరి ఆదాయాన్ని పోల్చితే చివరి స్థానంలో వికారాబాద్‌ నిలిచింది. 

తెలంగాణ ఆర్థిక సర్వే 2021-22 పీడీఎఫ్‌

Posted Date: 08-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం