• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక వృద్ధికి ద్రవ్యోల్బణం దెబ్బ

కుదేలవుతున్న పరిశ్రమలు

 

 

కొన్ని వారాల క్రితం వరకు భారత్‌తోపాటు యావత్‌ ప్రపంచానికి కొవిడ్‌ ప్రధాన ముప్పుగా ఉంది. వరసగా మూడు దశల్లో కొవిడ్‌ విరుచుకుపడినా భారతదేశం అత్యధిక జనాభాకు టీకాలు వేయడం ద్వారా మహమ్మారిని అదుపుచేయగలిగింది. అంతలోనే, కొత్త సవాళ్లు ముందుకొచ్చాయి. వాటిలో ప్రధానమైనది భారత ఆర్థిక వ్యవస్థకు మళ్ళీ ఊపు తీసుకురావడమెలా అన్నది. కొవిడ్‌ కాలంలో క్షీణించిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మళ్లీ వృద్ధి బాట పట్టినా, ధరల పెరుగుదల ప్రజలను, ప్రభుత్వాన్ని భయపెడుతోంది. మార్చిలో ద్రవ్యోల్బణం 6.95శాతానికి పెరిగిందని కేంద్ర గణాంకాల శాఖ ఈ నెల 12న ప్రకటించింది. గడచిన కొన్ని నెలల్లో ఇదే అత్యధిక ద్రవ్యోల్బణ రేటు. ద్రవ్యోల్బణాన్ని ఆరు శాతానికి కట్టడి చేయాలన్న రిజర్వు బ్యాంకు లక్ష్యానికి ఇది గండి కొట్టింది.

 

పెరిగిన వ్యయాలు

ఇవాళ ఆహారం, వంటగ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌, దుస్తులు, పాదరక్షలు మొదలుకొని గృహోపకరణాలు, ఎలెక్ట్రానిక్‌ వస్తువుల వరకు అన్నింటి ధరలూ పెరిగిపోయాయి. దేశమంతటా దాదాపు అన్నిచోట్లా పెట్రోలు ధర లీటరుకు 110 రూపాయలు దాటిపోయింది. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగడంతో సరకుల రవాణా వ్యయం పెరిగిపోయింది. కొవిడ్‌ వల్ల కోల్పోయిన ఉద్యోగాలు తిరిగిరాలేదు. ఉద్యోగాలు ఉన్నవారికి వేతనాలు స్తంభించిపోయాయి. వెరసి ప్రజల ఆదాయాలు పడిపోవడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చేతిలో డబ్బు ఆడక ప్రజలు ఖర్చుల్ని తగ్గించుకోవడంపై దృష్టిపెట్టారు. స్తోమత ఉన్నవారూ కార్లు, ఇళ్లు కొనడం వాయిదా వేసుకుంటున్నారు. ఇటీవల ఉత్పత్తి సాధనాల వ్యయం పెరిగిపోవడంతో పరిశ్రమలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఫ్యాబ్రికేషన్‌ యూనిట్లకు కావలసిన మైల్డ్‌ ఉక్కు ధర రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపైంది. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ధరలూ రెట్టింపయ్యాయి. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ తయారీకి ఉపయోగించే నికెల్‌, మిశ్రమ లోహాల ధరలు నాలుగింతలు పెరిగాయి. ఇక రోడ్డు, నౌకా రవాణా ఖర్చులు తలకుమించిన భారమవుతున్నాయి. 2019తో పోలిస్తే ఇప్పుడు ముంబయి నుంచి న్యూయార్క్‌కు నౌక ద్వారా ఒక కంటైనర్‌ పంపడానికయ్యే ఖర్చు భారీగా పెరిగింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) ఏ ధరకు ఆర్డర్లు సంపాదిస్తాయో అవే ధరకు సరఫరా చేస్తుంటాయి. ముడిసరకుల ధరలు పెరిగితే తమ ఆర్డరు విలువా పెంచాలనే నిబంధనను ఒప్పందంలో పొందుపరచలేవు. అన్ని వస్తువుల ధరలూ పెరిగిపోతున్న ఈ కాలంలో నష్టమంతా ఎంఎస్‌ఎంఈ సంస్థలే భరించాల్సి రావడంతో, అవి కుదేలవుతున్నాయి. వ్యాపారంలో నిలదొక్కుకోవడం కష్టమవుతోంది. వరసగా రెండేళ్లపాటు కొవిడ్‌ వల్ల స్తంభించిపోయిన ఆర్థిక వ్యవస్థ తేరుకుంటూ, చమురుతోపాటు ఉక్కు, అల్యూమినియం, రాగి, నికెల్‌, జింకు తదితరాల అవసరం పెరిగింది. కానీ, అంతర్జాతీయ సరఫరా గొలుసులు విచ్ఛిన్నమైనందువల్ల గిరాకీకి తగిన సరఫరా లేక ధరలు మిన్నంటుతున్నాయి. భారత్‌లో మాత్రం అంతర్గత గిరాకీకన్నా విదేశాల నుంచి దిగుమతుల వ్యయం పెరగడం వల్లనే ద్రవ్యోల్బణం హెచ్చుతోంది. స్వదేశంలో గిరాకీ పడిపోతే పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకురారు. భారతీయ పరిశ్రమలు తమ ఉత్పత్తి సామర్థ్యంలో 65 నుంచి 70 శాతమే వినియోగించుకొంటున్నాయని ఫిక్కి వెెల్లడించింది. ఉన్న సామర్థ్యాన్నే పూర్తిగా వినియోగించుకోలేకపోతే అదనపు ఉత్పత్తి సామర్థ్య సృష్టికి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉండదు.

 

కొవిడ్‌ తరవాత 2022 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత్‌ 5.4 శాతం వృద్ధిరేటు సాధించినా ద్రవ్యోల్బణం వల్ల క్షీణించే అవకాశం ఉంది. అందుకే రిజర్వు బ్యాంకు 2023 జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. కరోనా కాలంలో ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లను తక్కువస్థాయిలో ఉంచింది. కానీ, ఇప్పుడు ధరలు అధికమవుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లు పెంచి మార్కెట్‌లో ద్రవ్యలభ్యతను నియంత్రించక తప్పని పరిస్థితి వచ్చిపడుతోంది. వడ్డీ రేట్లు పెంచితే పెట్టుబడి వ్యయం పెరిగి ఆర్థికాభివృద్ధి మందగిస్తుంది. వడ్డీ రేట్లు పెంచకపోతే మార్కెట్‌లో ద్రవ్య లభ్యత పెరిగి ధరలూ హెచ్చుతాయి. రిజర్వు బ్యాంకు ప్రస్తుతం ఎదుర్కొంటున్న డోలాయమాన స్థితి ఇది.

 

ధరల నియంత్రణ కీలకం

ప్రభుత్వం ఇంధనంపై పన్నులతోపాటు జీఎస్టీని తగ్గించి, పేదలకు ఉచిత ఆహార పథకాలను విస్తరించి, ఎంఎస్‌ఎంఈ రంగానికి నగదు బదిలీ చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధికి ఊపునివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. దానివల్ల ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. అయినా, కేంద్రం ఇంతవరకు ఆ దిశగా చొరవ తీసుకోవడం లేదు. ప్రభుత్వం వద్ద భారీగా ఆహార నిల్వలు ఉన్నందువల్ల పేదలకు ఆహార భద్రత కల్పించడం సాధ్యమే. అందుకే ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ పథకాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. మార్చి 31తో ముగియాల్సిన ఈ పథకం సెప్టెంబరు వరకు కొనసాగుతుంది. దీనికింద 80 కోట్లమందికి పైగా పేదలకు కుటుంబంలో ప్రతి వ్యక్తికీ తలా అయిదు కిలోల ఆహార ధాన్యాలు అందుతాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతంగా ఉండబోతున్నా ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అది చాలదు. 2023లో 14 శాతం వృద్ధిరేటు సాధిస్తే తప్ప, ఆర్థిక రథం పరుగు మొదలుపెట్టదు. ధరలను నియంత్రించడం దానికి తొలి మెట్టు కావాలి. ధరల పెరుగుదలను అరికట్టలేకపోవడం వల్లనే శ్రీలంక, పాకిస్థాన్‌ నేడు దివాలా స్థితికి చేరాయి. ఆ దుస్థితి భారత్‌కు పట్టకూడదంటే ధరలకు తక్షణం కళ్ళెం వేయాలి.

 

భయపెడుతున్న ముడి చమురు

ఇప్పటికే కొవిడ్‌తో సతమతమవుతున్న చిన్నాపెద్దా పరిశ్రమలకు పులిమీద పుట్రలా ఉక్రెయిన్‌ యుద్ధం వచ్చి పడింది. రష్యా దండయాత్ర ప్రారంభించిన వెంటనే అంతర్జాతీయ విపణిలో చమురు, వ్యాపార సరకుల ధరలు చుక్కల్ని తాకసాగాయి. మార్చి ఏడున ఒక పీపా ముడి చమురు ధర 139 డాలర్లకు చేరింది. 2008 తరవాత ఇదే అత్యధిక ధర. గత డిసెంబరులో పీపా ధర 78 డాలర్లు మాత్రమే. అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ)లు రష్యాపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించడంతో రష్యా నుంచి చమురు సరఫరా నిలిచిపోయి అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి. ఇప్పుడప్పుడే ఉక్రెయిన్‌ యుద్ధం ముగిసే సూచనలు కనబడకపోవడంతో చమురు, గ్యాస్‌ ధరలు భయపెడుతూనే ఉంటాయి. ముడి చమురులో 80 శాతాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకొనే భారత్‌కు ఇది తీరని నష్టం కలిగిస్తోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సరిహద్దుల్లో సం‘గ్రామాలు’

‣ క్షేత్ర పాలన... ప్రజాస్వామ్యానికి ఆలంబన!

‣ కశ్మీరంలో ప్రగతి సమీరం

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 30-04-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం