• facebook
  • whatsapp
  • telegram

విదేశీ వాణిజ్యం కొత్తపుంతలు

ఎగుమతుల్లో భారత్‌ ముందడుగు

 

 

దేశ ఆర్థికాభివృద్ధిలో ఎగుమతులదే కీలక పాత్ర. విదేశ మారక నిల్వలు పెరిగి దేశ కరెన్సీ బలపడేందుకు ఎగుమతుల్లో పెరుగుదల దోహదపడుతుంది. భారత్‌ ఎగుమతుల రంగంలో గణనీయ స్థాయిలో వృద్ధిపథంలో సాగుతోంది. మొదటి పంచవర్ష ప్రణాళిక అయిదేళ్లలో మన ఎగుమతుల సగటు విలువ కేవలం రూ.647 కోట్లు; 2022 నాటికి అవి సుమారు రూ. 32 లక్షల కోట్లకు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా వృద్ధి నమోదైంది. వీటిలో అత్యధికంగా పెట్రోలియం, ఇంజినీరింగ్‌, వ్యవసాయ ఉత్పత్తులు, ఎలెక్ట్రానిక్‌ పరికరాలు, వస్త్రాలు, రసాయనాలు ఉన్నాయి. 2022 మార్చి నెలలో  ఎగుమతులు నాలుగువేల కోట్ల డాలర్లు దాటాయి. ఇది 2021 మార్చితో పోలిస్తే 14 శాతం కన్నా అధికం. 2021-22లో భారత్‌ నుంచి పలురకాల ఉత్పత్తులను దిగుమతి చేసుకొంటున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా- తరవాతి స్థానాల్లో వరసగా చైనా, యూఏఈ, హాంకాంగ్‌, బంగ్లాదేశ్‌, సింగపూర్‌, యూకే, జర్మనీ, నేపాల్‌, నెదర్లాండ్స్‌ నిలిచాయి.

 

మారుతున్న పరిస్థితులు

భారత ఎగుమతుల్లో ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు మొదటి స్థానంలో ఉండగా పెట్రోలియం సంబంధిత ఉత్పత్తులు, వస్త్రాలు, ఆభరణాలు, రసాయనాలు, మందులు, ఎలెక్ట్రానిక్‌ పరికరాలు, వస్త్రాలు, చేనేత, రెడీమేడ్‌ దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, ప్లాస్టిక్స్‌ తరవాతి స్థానంలో ఉన్నాయి. పెట్రోలియం సంబంధిత ఉత్పత్తులు, అల్యూమినియం, పత్తి, పంచదార ఎగుమతుల విలువ పెరుగుదలలో వాటి పరిమాణం కన్నా వాటి ధరలు అధికం కావడమే కీలక పాత్ర పోషించింది. 2021-22 మొత్తం ఎగుమతుల్లో పెట్రోలియం సంబంధిత ఉత్పతుల వాటా 15 శాతం, వ్యవసాయ ఉత్పత్తుల వాటా మొదటి 10 నెలల్లో 25 శాతం, ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల వాటా 26 శాతం, రసాయనాల వాటా ఏడు శాతం, ఔషధ ఉత్పతుల వాటా ఆరు శాతంగా ఉంది. ఇంతకాలం రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి సరకులు దిగుమతి చేసుకున్న దేశాలన్నీ ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి. వీటిలో ఉక్కు, గోధుమలు మొదటి వరసలో ఉంటాయి. చైనాలో విధించిన లాక్‌డౌన్‌తోపాటు- తాజా యుద్ధం మూలంగా, ఆయా దేశాల నుంచి ఉక్కు ఉత్పత్తులు కొంటున్న టర్కీ యూఏఈ, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్‌ దేశాలకు సరఫరా గొలుసులో అడ్డంకులు ఎదురవడంతో ఆయా దేశాలన్నీ ఇప్పుడు తమ ఉక్కు అవసరాలకు భారత్‌ వైపు చూస్తున్నాయి. గోధుమ వినియోగంలో 80 శాతం రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి దిగుమతి చేసుకొంటున్న ఈజిప్ట్‌- తాజాగా భారత్‌ నుంచి గోధుమల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకొంది. బంగ్లాదేశ్‌ కూడా ఇదే బాటలో పయనించనుంది. ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన 1991 నాటికి భారత్‌ ఎగుమతులు కేవలం 1800 కోట్ల డాలర్లు. శతాబ్దం చివరి నాటికి అవి దాదాపుగా రెట్టింపయ్యాయి. 2010-11 నాటికి 25 వేలకోట్ల డాలర్లకుపైగా పెరిగాయి. 2012లో ఇవి 30 వేల కోట్ల డాలర్లకు చేరాయి. అక్కడి నుంచి 40 వేల కోట్ల డాలర్ల స్థాయిని చేరడానికి సుమారు పదేళ్లు పట్టింది. భారత్‌ తాను నిర్దేశించుకున్న అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరాలంటే ఎగుమతులు లక్ష కోట్ల డాలర్లకు పెరగాలి. కాకపోతే ప్రస్తుతం ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం, ఇప్పటికీ పొంచిఉన్న కరోనా మహమ్మారి ముప్పు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగడం వంటివి ఈ ఆశయ సాధనకు అడ్డంకులు మారే అవకాశం కనిపిస్తోంది.

 

 

రాష్ట్రాల భాగస్వామ్యం కీలకం

మొత్తం దేశ ఎగుమతుల్లో సుమారు 70 శాతాన్ని- గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌లే ఆక్రమించాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా వీటిని ఆదర్శంగా తీసుకొని తమ ఎగుమతుల వాటాలను పెంచుకోవాల్సి ఉంది. రాష్ట్రాల మధ్య పోటీతత్వాన్ని కల్పించేందుకు నీతిఆయోగ్‌ తనవంతుగా కృషి చేస్తున్నా, ఈ విషయంలో మరింత ప్రోత్సాహకర వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. వివిధ రకాల సరకులు, ఇతర దేశాల నుంచి తీవ్ర పోటీ వంటివి ఈ రంగంలో భారత్‌ ముందున్న సవాళ్లు. భారత్‌ ఎగుమతి చేస్తున్న సరకుల్లో ఇన్నేళ్లుగా పలు మార్పులు చోటు చేసుకుంటున్నా- వజ్రాలు, ఆభరణాలు, వస్త్రాలు, హస్తకళలు, తోలు ఉత్పత్తులు వంటి సంప్రదాయ రకాలకు చెందినవే అధికంగా ఉంటున్నాయి. మొత్తం ఎగుమతుల విలువలో వీటి వాటా గణనీయమే. ఈ విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి భారత్‌ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఇంజినీరింగ్‌, రసాయనాల ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ ఇతర దేశాల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. కార్మిక శక్తి చవకగా లభిస్తున్న చైనా, తైవాన్‌ వంటి దేశాలు వీటిని తక్కువ ధరకే విక్రయిస్తున్నాయి. అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్న పలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ధర నాణ్యత వంటి విషయాల్లో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ధరల పోటీని ఎదుర్కోవడానికి కేంద్రం కొన్ని సరకులపై కస్టమ్స్‌ సుంకాలు తగ్గించింది. ఎగుమతుల్లో దీర్ఘకాలిక వృద్ధిని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వపరంగా ఎన్నోరకాల చర్యలు చేపట్టినా అది మాత్రమే సరిపోదు. ఎగుమతులను కేంద్రం మాత్రమే పెంచలేదు. రాష్ట్రాలు కూడా ఈ యజ్ఞంలో తమ వంతు కృషి చేయాల్సి ఉంటుంది. ప్రపంచంలోని దిగుమతి చేసుకునే దేశాల్లో వినియోగం పెరుగుదలపై ఇతర దేశాల ఎగుమతులు ఆధారపడి ఉంటాయి. అందుకని ప్రపంచ దేశాల అభివృద్ధి ఏ మాత్రం తగ్గినా ఆ ప్రభావం ఎగుమతులపై పడుతుంది. అంతేకాకుండా ఎగుమతి దేశాల ఆర్థిక వ్యవస్థపైనా ఆ ప్రభావం ఉంటుంది. ఇప్పటికే భారత్‌- యూఏఈ, ఆస్ట్రేలియా దేశాలతో సులభతర స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు చేసుకొంది. యూకే, ఐరోపా సమాఖ్యలతో కూడా త్వరలోనే ఇలాంటి ఒప్పందాలు చేసుకోనుంది.

 

సరఫరా మెరుగుదలపై దృష్టి

కొన్నేళ్లుగా కేంద్రం సరఫరాకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీనిలో భాగంగా మౌలిక వసతులపై భారీ పెట్టుబడులు, 14 రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, ఎంఎస్‌ఎంఈల పెట్టుబడుల కోసం రుణ సదుపాయ కల్పన, భూ-కార్మిక చట్టాలను సవరించి సులభతర వాణిజ్యానికి ఊతమివ్వడం, ఎఫ్‌డీఐలను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపట్టింది. వాటి ప్రభావం భారత్‌ ఎగుమతులపై ప్రతిఫలించింది. ముడి సరకుల ఎగుమతుల్లో ఇనుము, పత్తి అగ్ర స్థానాల్లో ఉన్నాయి. అటు సేవారంగ ఎగుమతులు కూడా 25 వేల కోట్ల డాలర్లతో కీలక భూమిక పోషించాయి. బ్లాక్‌చైన్‌ డేటా అనలిటిక్స్‌, ఐఓటీ వంటి సేవల ఎగుమతుల ద్వారా భారత్‌ పేరు ప్రఖ్యాతులు మరింతగా ఇనుమడించాయి.
 


********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆర్థిక వృద్ధికి ద్రవ్యోల్బణం దెబ్బ

‣ సరిహద్దుల్లో సం‘గ్రామాలు’

‣ క్షేత్ర పాలన... ప్రజాస్వామ్యానికి ఆలంబన!

‣ కశ్మీరంలో ప్రగతి సమీరం

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 03-05-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం