• facebook
  • whatsapp
  • telegram

సవాళ్లు అధిగమిస్తేనే సమ్మిళిత అభివృద్ధి

భారత్‌ ఎదుట దండిగా అవకాశాలు

 

 

ఉపాధి, స్టాక్‌ మార్కెట్లు, జీడీపీ- ఇలా ఏ రంగాన్ని చూసినా భారత్‌ నేడు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిని అధిగమించి- అభివృద్ధిలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశమూ ఇండియాకు ఉందని లండన్‌ నుంచి వెలువడే విఖ్యాత పత్రిక ‘ఎకానమిస్ట్‌’ ఇటీవల అంచనా వేసింది. భారతదేశం గతంలోకన్నా ఇప్పుడే ఎక్కువగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమైంది. అందువల్ల దేశంపై అంతర్జాతీయ పరిణామాలు ఆర్థికంగానే కాక సామాజికంగానూ ప్రభావం చూపుతున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభంతో ఆహార ధాన్యాలు, వంటనూనెలు, ముడి చమురు ధరలు పెరిగి భారత్‌లో ద్రవ్యోల్బణం హెచ్చడం దీనికి ఉదాహరణ. అంతర్జాతీయంగా గోధుమ ధరలు 40శాతం పెరిగాయి. చైనాలో కొవిడ్‌ లాక్‌డౌన్లు కొనసాగడం అంతర్జాతీయ వస్తు సరఫరా గొలుసులను విచ్ఛిన్నం చేసి- ధరలు పెరగడానికి మరో ముఖ్య కారణమైంది.

 

విజృంభించిన ద్రవ్యోల్బణం

ప్రపంచ దేశాలపై కొండలా పెరిగిపోయిన రుణభారం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అస్థిరతను సృష్టిస్తోంది. ఫలితంగా ప్రపంచ ఆర్థికాభివృద్ధి రేటు జనవరిలో అంచనా వేసినదానికన్నా తక్కువగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ఏప్రిల్‌లో వెల్లడించింది. కొవిడ్‌ కాలంలో ప్రభుత్వాలు వడ్డీరేట్లను తగ్గించి, మార్కెట్‌లో ద్రవ్యలభ్యతను భారీయెత్తున పెంచాయి. వాతావరణ మార్పులతో పంట నష్టం, సరఫరా గొలుసుల విచ్ఛిన్నంవంటివి ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలయ్యాయి. కొవిడ్‌ కాలంలో ఆదాయ నష్టం, ఉద్దీపన పథకాలపై భారీ వ్యయం, ద్రవ్య లభ్యత వంటివాటివల్ల ప్రభుత్వాలపై పెనుభారం పడిందని అంచనా. మార్కెట్‌లో ద్రవ్య లభ్యత పెరగడంవల్ల ధరలూ పెరుగుతున్నాయి. దీన్ని నిరోధించడానికి భారతీయ రిజర్వు బ్యాంకుతో సహా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచడం మొదలుపెట్టాయి. 2022-23లో భారతదేశ ఆర్థికాభివృద్ధి రేటు 7-7.5 శాతంగా ఉన్నా, 2023-24లో ఆరు శాతానికి తగ్గిపోవచ్చు. కొవిడ్‌కు ముందు సంవత్సరమైన 2019-20తో పోలిస్తే 2020-21లో జీడీపీ కొద్దిగానే హెచ్చు. 2021-22లో జీడీపీ వృద్ధిని కోల్పోయాం. 2020-21, 2021-22, 2022-23 సంవత్సరాల్లో భారీ ఆదాయనష్టం సంభవించింది. 2022 ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 7.8 శాతమని వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ)ని బట్టి తెలుస్తోంది. ఇది ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంత అధిక స్థాయి ద్రవ్యోల్బణం. ఆహారం, వంట నూనెలు, కూరగాయలు, ఇంధనం, విద్యుత్‌, దుస్తులు, పాదరక్షల ధరలు, రవాణా, కమ్యూనికేషన్‌ ఛార్జీలు బాగా పెరిగాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ప్రకారం ద్రవ్యోల్బణం 31 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 15.1 శాతానికి చేరుకుంది. భారతదేశంలో గోధుమ ఉత్పత్తి, సేకరణ తగ్గి, ధరలు పెరగడంతో ప్రభుత్వం వాటి ఎగుమతులను నిషేధించింది. దీనివల్ల విదేశాలకే కాదు, భారతీయ రైతులకూ నష్టమే. ఎగుమతుల నిషేధం ఒక రకంగా రైతుపై పరోక్ష పన్ను వేయడం కిందకు వస్తుంది. విశ్వసనీయ ఎగుమతిదారుగా భారత్‌కు ఉన్న పేరు దెబ్బతింటుంది.

 

మూల స్తంభాలు

కొవిడ్‌ మహమ్మారి సమసిపోయిన తరవాత మరో పదేళ్ల వరకు నాలుగు అంశాలు ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తాయని ‘ఎకానమిస్ట్‌’ పత్రిక అంచనా. అవి- ఏకీకృత జాతీయ మార్కెట్ల ఆవిర్భావం; పునరుత్పాదక ఇంధనాలతో పారిశ్రామిక రంగ విస్తరణ, చైనా నుంచి సరఫరా గొలుసుల తరలింపు; ఐటీ సేవలు, కృత్రిమ మేధ వంటి సాంకేతిక రంగాల విజృంభణ; హైటెక్‌ సంక్షేమ యంత్రాంగం ఆవిర్భావం. అభివృద్ధికి మూల స్తంభాలుగా నిలిచే ఈ నాలుగు అంశాల్లో మొదటిదైన ఏకీకృత జాతీయ మార్కెట్‌ స్థాపనలో భారత్‌ ముందున్నది. ఆధార్‌, బయోమెట్రిక్‌ గుర్తింపు వ్యవస్థ, అందరికీ బ్యాంకు ఖాతాలు, డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థలు, జీఎస్‌టీ కలగలిసి భారత్‌లో ఇప్పటికే ఏకీకృత జాతీయ మార్కెట్‌ను ఏర్పరచాయి. రెండో మూలస్తంభమైన పారిశ్రామిక రంగం భారత్‌లో విస్తరించే అవకాశాలు పుష్కలం. కొవిడ్‌ చేదు అనుభవంవల్ల సరఫరా గొలుసులు చైనా నుంచి తరలిపోనుండటం భారత్‌కు కలిసివస్తుంది. మూడో మూలస్తంభమైన సాంకేతికతలో భారత్‌ ఇప్పటికే అగ్రగాముల జాబితాలో నిలుస్తోంది. ప్రపంచమంతటా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల కొరత భారత్‌కు అవకాశంగా పరిణమిస్తుంది. యూనికార్న్‌లు ఇక్కడ విరివిగా అంకురిస్తున్నాయి. నాలుగో మూలస్తంభమైన డిజిటల్‌ సంక్షేమ యంత్రాంగ స్థాపనలోనూ భారత్‌ ముందడుగు వేస్తోంది. పింఛన్లు, సబ్సిడీలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో చేరిపోవడం దీనికి నిదర్శనం. ఈ ఏడాది 95 కోట్లమంది లబ్ధిదారులకు రూ.6.24 లక్షల కోట్లు డిజిటల్‌ పద్ధతిలో అందాయి. ఇది జీడీపీలో మూడు శాతానికి సమానం. నాలుగేళ్ల క్రితం ఇది ఒక శాతమే. రేపటి డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో విజయ కేతనం ఎగురవేసే సత్తా భారతదేశానికి ఉందనేది నిర్వివాదాంశం. అయితే, ధనికులు పేదల మధ్య ఆదాయపరంగా పెరిగిపోతున్న అసమానతలను తక్షణం సరిదిద్ది సమ్మిళిత అభివృద్ధిని సాధించాలి. అవకాశాలను అందిపుచ్చుకొంటే- భారతదేశ జీడీపీ ఇప్పటి మూడు లక్షల కోట్ల డాలర్ల నుంచి 2026-27కల్లా అయిదు లక్షల కోట్ల డాలర్లకు, 2030కల్లా తొమ్మిది లక్షల కోట్ల డాలర్లకు, 2047కల్లా 40 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని సీఐఐ అంచనా.

 

సమస్యల తీరు

రైతులకు కష్టం: డీజిల్‌, ఎరువుల ధరలు మిన్నంటడంతో రైతుల ఉత్పత్తి వ్యయమూ పెరిగిపోయింది. వారికి మిగిలేది అరకొర ఆదాయం మాత్రమే.

తగ్గిన ఉపాధి: దేశంలో ఉపాధి కల్పన ఇప్పటికీ కొవిడ్‌ ముందునాటి స్థాయికి తిరిగిరాలేదు.  అధిక ఉపాధిని కల్పించగల నిర్మాణ రంగం, వర్తకం, హోటళ్లు, రెస్టారెంట్లలో వ్యాపారం మందగించినందువల్ల అవకాశాలు పెరగడం లేదు.

రుణ వితరణ: రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లను పెంచినందువల్ల ఫైనాన్స్‌ రంగానికి, బ్యాంకులకు మిగిలే లాభాలు అరకొర మాత్రమే. పరిశ్రమలు, వ్యాపారాలకు ఎక్కువ రుణాలు ఇచ్చే స్తోమత భారత్‌కు ఉంది. దాన్ని సద్వినియోగం చేయాలి.

మార్కెట్లకు కళ్లెం: సంపన్న దేశాల్లో వడ్డీరేట్లు దాదాపు సున్నాగా ఉండటంతో అక్కడ పెరిగిన ద్రవ్య లభ్యత భారత్‌ వంటి దేశాల స్టాక్‌ మార్కెట్లలో ప్రవేశించి మార్కెట్‌ విజృంభణకు కారణమైంది. ఇప్పుడు అమెరికాతో సహా అన్ని సంపన్న దేశాలూ వడ్డీరేట్లను పెంచుతూ ద్రవ్య లభ్యతను తగ్గిస్తున్నాయి. అది స్టాక్‌మార్కెట్ల పతనానికి దారితీస్తోంది. దీంతో భారతీయ స్టాక్‌ మార్కెట్ల విజృంభణకు కళ్లెం పడుతోంది. కంపెనీలు, రిటైల్‌ మదుపరులు మారిన పరిస్థితుల్లో సర్దుకుపోవడానికి కొంత సమయం పడుతుంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బొగ్గు కొరతతో విద్యుత్‌ సంక్షోభం

‣ ఖలిస్థానీ ముఠాలకు ఐఎస్‌ఐ దన్ను

‣ రైతుకు ద్రవ్యోల్బణం సెగ

‣ కడలిపై పెత్తనానికి డ్రాగన్‌ కుయుక్తులు

‣ పట్టాలకెక్కాల్సిన పన్నుల వ్యవస్థ

‣ నేపాల్‌తో బలపడుతున్న బంధం

Posted Date: 07-06-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం