• facebook
  • whatsapp
  • telegram

చేయూత అందిస్తే దేశానికే పెన్నిధులు

 

 

నానాటికీ ప్రపంచ జనాభా, ముఖ్యంగా యువజన సంఖ్య పెరుగుతున్నాయి. యువత కోసం 2030కల్లా నైపుణ్యం అవసరమైనవి, అంతగా నైపుణ్యాలు అక్కర్లేనివి మొత్తంగా సుమారు 60 కోట్లదాకా ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. ప్రపంచంలో ప్రతి 10 వ్యాపారాల్లో తొమ్మిది, ప్రతి మూడు ఉద్యోగాల్లో రెండు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగంలోనే ఉన్నాయి. తగిన నిధులు సమకూరిస్తే భారీ స్థాయిలో ఉపాధి కల్పించే సత్తా ఎంఎస్‌ఎంఈ రంగానికి ఉంది. కానీ, వర్ధమాన దేశాల్లో 13.1 కోట్ల ఎంఎస్‌ఎంఈ సంస్థలు తగినన్ని పెట్టుబడులు, రుణాలు అందక అల్లాడుతున్నాయి. ఇవి ఆ దేశాల్లోని ఎంఎస్‌ఎంఈలలో 41 శాతానికి సమానం. వర్ధమాన దేశాల్లో ఎంఎస్‌ఎంఈ రంగానికి 4.5 లక్షల కోట్ల డాలర్ల మేరకు రుణాలు అవసరమైనా అవి అందే మార్గం లేదు. అందులో 32 శాతం రుణాలు మహిళల యాజమాన్యంలో నడిచే ఎంఎస్‌ఎంఈలకే అవసరం. ఎంఎస్‌ఎంఈలలో 23 శాతాన్ని మహిళలే నడుపుతున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ), చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎస్‌ఎంఈ) ఆర్థికాభివృద్ధికి, ముఖ్యంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సాధనకు కీలకమని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఏటా జూన్‌ 27వ తేదీని ‘అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ దినోత్సవం’గా జరపాలని 2017లో సమితి జనరల్‌ అసెంబ్లీ 74వ ప్లీనరీ సమావేశం నిర్ణయించింది. ఎంఎస్‌ఎంఈ రంగం సృజనాత్మకత, నవీకరణ, కొత్త సాంకేతికతలను చేపడితే అపార ఉపాధి అవకాశాలను సృష్టించి పేదరికాన్ని తగ్గించగలుగుతుందని, వ్యక్తుల్లో వ్యవస్థాపక సామర్థ్యాన్ని పెంచి పరిశ్రమల విస్తరణకు పునాది వేస్తుందని, వీటన్నింటి ఫలితంగా సమితి ఆశించినమేర 2030కల్లా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించగలుగుతామని ప్లీనరీ భావించింది. మొత్తం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కొన్ని నేరుగా పేదరికం, నిరుద్యోగ నిర్మూలనను, ఆర్థికాభివృద్ధిని లక్షిస్తున్నాయి. వాటిలో మొదటిది- పేదరిక నిర్మూలన, రెండోది-ఆకలిని పారదోలడం, మూడోది-మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, అయిదోది- లింగ సమానత్వం, ఎనిమిదోది- హుందా అయిన ఉపాధిని కల్పిస్తూ సమ్మిళిత అభివృద్ధి సాధించడం, తొమ్మిదోది- నవీకరణ, సుస్థిర పారిశ్రామికీకరణ.

 

భారీగా ఉపాధి

కనీసం 10 మందికి ఉపాధి కల్పించే సంస్థలను సూక్ష్మ సంస్థలుగా, 300 మందికి ఉద్యోగాలిచ్చే పరిశ్రమలను చిన్న, మధ్యతరహా సంస్థలుగా వర్గీకరిస్తారు. ప్రపంచంలో 70శాతం ఉద్యోగాలను సూక్ష్మ,చిన్న పరిశ్రమలు కల్పిస్తున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 2019 నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని కంపెనీలన్నింటిలో 90శాతం చిన్న, మధ్యతరహా కంపెనీలేనని, జీడీపీలో 50శాతం ఎంఎస్‌ఎంఈ రంగం ద్వారానే సమకూరుతున్నట్లు అంతర్జాతీయ చిన్న వ్యాపారాల మండలి (ఐసీఎస్‌బీ) లెక్కకట్టింది. ఆసియాలోని పరిశ్రమలు, వ్యాపారాల్లో 96శాతం ఎంఎస్‌ఎంఈ రంగంలోనే ఉన్నాయని, ఉపాధి కల్పనలో 62శాతం, జీడీపీకి 42శాతం వాటాను ఈ రంగం అందిస్తోందని 2019లో ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) వెల్లడించింది. జి-20 దేశాలలో అత్యధిక పరిశ్రమలు, ఉద్యోగాలు ఎస్‌ఎంఈ రంగంలో ఉన్నాయి. జపాన్‌ వ్యాపార, పారిశ్రామిక సంస్థలన్నింటిలో సింహభాగం ఎస్‌ఎంఈలే. ఆ దేశంలో 70శాతం ఉపాధి ఈ సంస్థలే కల్పిస్తున్నాయి. జపాన్‌ పారిశ్రామికోత్పత్తిలో సగభాగానికి ఇవే మూలం. ప్రపంచమంతటా ఎంఎస్‌ఎంఈ రంగం అత్యధిక మహిళలు, యువతకు ఉపాధి కల్పిస్తోంది. వారిలోని నవీకరణ ప్రతిభను వెలికి తీస్తోందని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) 2020లో వివరించింది. 2019 ఎంఎస్‌ఎంఈ ఆర్థిక సూచీల సమాచార నిధి ప్రకారం- ప్రపంచంలో అత్యధిక ఎంఎస్‌ఎంఈలు తూర్పు ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఉన్నాయి. తదుపరి స్థానాన్ని భారత్‌, బంగ్లా తదితర దక్షిణాసియా దేశాలు ఆక్రమిస్తున్నాయి. ఐరోపా, అమెరికాలవి ఆ తరవాతి స్థానాలే.

 

ఆర్థికంగా ఆదుకుంటే...

కొవిడ్‌ వల్ల దెబ్బతిన్న ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకుంటే ఆ రంగం 2030కల్లా ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు, తద్వారా మానవాళి ప్రగతికి గొప్ప ఊతమిస్తుంది. ఇంకా ఎంఎస్‌ఎంఈ రంగానికి అధునాతన యంత్రాలు, మౌలిక వసతులను సమకూర్చి సిబ్బంది సాంకేతిక నైపుణ్యాలను పెంచాలి. తమ ఉత్పత్తులను దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ విపణిలోనూ విక్రయించుకొనే సౌలభ్యం, మార్కెటింగ్‌ యంత్రాంగాన్ని సమకూర్చాలి. అంతర్జాతీయ పోటీని తట్టుకునే సామర్థ్యాన్ని కల్పించాలి. ప్రభుత్వం ముడి సరకులు, మౌలిక వసతులు, మార్కెటింగ్‌ వసతితోపాటు పెట్టుబడులు, రుణాలు సమకూర్చాలి. పన్ను రాయితీలు, పన్ను విరామాలు ప్రకటించాలి. 2025కల్లా అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని ఆశిస్తున్న భారతదేశం- ఎంఎస్‌ఎంఈ రంగ వృద్ధికి తోడ్పడేలా నిబంధనలను సరళతరం చేయాలి. ఇప్పటికే ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న దేశం హోదాను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) భారత్‌కు కట్టబెట్టింది. ఆ సంస్థ లెక్కల ప్రకారం భారత్‌ జీడీపీ వృద్ధిరేటు ఈ ఏడాది 8.7శాతంగా ఉండబోతోంది. చైనా రేటు 8.1శాతం! బ్రిటన్‌ (7.4), ఫ్రాన్స్‌ (7), అమెరికా (5.7), జర్మనీ (2.8), జపాన్‌ (1.6) వృద్ధి రేట్లలో భారత్‌ కన్నా వెనకే ఉన్నాయి. భారత్‌ ఏటా 10 శాతానికి పైగా వృద్ధిరేటు సాధిస్తే జీడీపీ వృద్ధి మరింత వేగం పుంజుకోవడంతోపాటు పేదరికం కూడా చాలా త్వరగా తరిగిపోతుంది. భారత అభివృద్ధి గాథలో కొత్త అధ్యాయాన్ని లిఖించే సత్తా ఎంఎస్‌ఎంఈ రంగానికి ఉంది. అందుకు తగిన అవకాశాలు, వాతావరణాన్ని ప్రభుత్వం శీఘ్రంగా కల్పించాలి.

 

భారత్‌ పరిస్థితి ఇదీ...

భారతదేశంలోని పరిశ్రమల్లో 94శాతం ఎంఎస్‌ఎంఈ సంస్థలే. వాటిలో ఎక్కువ భాగం గ్రామాల్లో ఉన్నాయి. భారత ఎగుమతుల్లో 40శాతం ఎంఎస్‌ఎంఈ రంగం నుంచే జరుగుతున్నాయి. 2021నాటికి ఈ రంగంలో ఎనిమిది కోట్లమంది ఉపాధి పొందుతున్నారు. అంటే, వ్యవసాయం తరవాత ఎక్కువమందికి ఉపాధి చూపుతున్నది ఎంఎస్‌ఎంఈలే. వీటివల్ల గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాలకు జీవనాధారం దొరుకుతోంది. ఎంఎస్‌ఎంఈలను పీడిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపి ఆర్థిక ఉద్దీపనను కలిగిస్తే స్థానిక స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఆర్థికంగా, ఉపాధిపరంగా మరింత లబ్ధి చేకూరుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ‘గవర్నమెంట్‌ ఈ-మార్కెట్‌ ప్లేస్‌ (జీఈఎం-జెమ్‌)’ ద్వారా ఎంఎస్‌ఎంఈ సంస్థల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తోంది. ఈ ఏడాది మార్చి 24 నాటికి జెమ్‌ పోర్టల్‌ ద్వారా రూ. 2,19,071 కోట్ల మేరకు క్రయవిక్రయాలు జరిగాయి. ఎంఎస్‌ఎంఈలు 72శాతం జమ, చెల్లింపులను డిజిటల్‌ పద్ధతిలోనే చేస్తున్నాయి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సముద్ర సంపదపై సాంకేతిక నేత్రం

‣ గుక్కెడు గంగకూ కరవే!

‣ వర్ధమాన దేశాల ‘వాణిజ్య సమరం’

‣ ఏటా తప్పని విత్తన గండం

‣ పోరుబాటలో ఆకాశనేత్రం

Posted Date: 29-06-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం