• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్రాల అసంతృప్తి గళం

వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టడంతోనే పన్నులన్నీ తగ్గిపోతాయని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భరోసా వట్టి భ్రమగా మిగిలిపోయింది. జీఎస్టీని ప్రవేశపెట్టి అయిదేళ్లు కావస్తుండగా, దానివల్ల తమకు ఒరిగిందేమీ లేదని రాష్ట్రాలకు అవగతమవుతోంది. పన్నులు విధించడానికి రాజ్యాంగం ద్వారా తమకు దఖలు పడిన హక్కును జీఎస్టీ మండలికి ధారాదత్తం చేయడం పొరపాటు అని రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇది స్వయంకృతాపరాధమే అయినా నిందను కేంద్రంపైకి తోసేస్తున్నాయి. మరోవైపు రాష్ట్రాలకు తాను ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి కేంద్రం కరోనా మహమ్మారిని సాకుగా చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 28-29 తేదీలలో చండీఘర్‌లో జరగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో రాష్ట్రాలు కేంద్రం నుంచి మరిన్ని రాయితీలు సంపాదించడానికి ప్రయత్నిస్తాయని అవగతమవుతోంది. జీఎస్టీ మండలి నిర్ణయాలు సిఫార్సులే తప్ప కేంద్రం, రాష్ట్రాలు విధిగా పాటించాల్సిన ఆదేశాలు కావని మే నెల 19న సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌ను ఆయుధంగా చేసుకుని కేంద్రం నుంచి మరిన్ని రాయితీలు సాధించడానికి రాష్ట్రాలు గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది.

ఎదుర్కొంటున్న సమస్యలు

రాష్ట్రాలు విధిస్తున్న పన్నులన్నీ జీఎస్టీలో కలిసిపోవడం వల్ల రాష్ట్రాలకు జరిగే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం పరిహారం ఇస్తుందని 2017నాటి చట్టం చెబుతోంది. దీనికోసం 2017 నుంచి 2022 జులై ఒకటో తేదీ వరకు మొత్తం అయిదేళ్లపాటు ప్రత్యేకంగా నష్టపరిహార సెస్సు వసూలు చేయాలని ప్రతిపాదించింది. తదనుగుణంగా పొగాకు ఉత్పత్తులు, పాన్‌మసాలా, వంటగ్యాస్‌, కొన్ని తరగతుల మోటారు వాహనాలు, విడిభాగాలపై నష్టపరిహార సెస్సు వసూలు చేశారు. ఇంకా కస్టమ్స్‌ చట్టాల పరిధిలోకి వచ్చే కొన్ని దిగుమతులపై కూడా సెస్సు వసూలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేశారు. కొవిడ్‌ వల్ల తాము భారీ ఆదాయ నష్టానికి గురైనందువల్ల నష్ట పరిహార సెస్సును మరి కొంతకాలం పొడిగించాలని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ, తాను పరిహారం ఇవ్వడం కాకుండా రాష్ట్రాలే అప్పులు చేసి ఆదాయ నష్టాన్ని పూడ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కరోనా మహమ్మారి వల్ల 2019-20లో జీఎస్టీ వసూళ్లకు రూ.70 వేల కోట్ల మేర కోత పడింది. 2020-21లో ఈ కొరత రూ.2.3 లక్షల కోట్లకు పెరిగిపోయింది. జీఎస్టీ మండలి సమావేశంలో నష్టపరిహార సెస్సు మీద వాదప్రతివాదాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

పన్ను రేట్లను క్రమబద్ధీకరించాలని ఏడుగురు మంత్రుల బృందం ఇచ్చిన నివేదిక కూడా సమావేశంలో చర్చకు రానుంది. లాటరీలు, జూదశాలలు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గేమింగ్‌ మీద 28 శాతం పన్ను వేయాలనే ప్రతిపాదనపైనా జీఎస్టీ మండలి చర్చించవచ్చు. సాధారణంగా క్రమబద్ధీకరణ అంటే వీలైనంత మేరకు పన్నులు తగ్గించి, పన్ను చెల్లింపుల్లో చిక్కులు తొలగించి, వినియోగదారుడికి సౌకర్యవంతంగా పన్నులు వసూలు చేయడమని అర్థం. భారతదేశంలో మాత్రం క్రమబద్ధీకరణ అంటే పన్నులు పెంచడమే. ప్రభుత్వానికి పన్ను వసూళ్లు పెరిగిన తరవాత కూడా జీఎస్టీని తగ్గించకపోవడం వినియోగదారులకు మింగుడు పడటం లేదు. మొదట్లో జీఎస్టీని మినహాయించిన వస్తువుల జాబితా, పన్ను లేని వస్తువుల జాబితా, మూడు శాతం, అయిదు శాతం పన్నురేట్లు వర్తించే వస్తువుల జాబితాలు ఉండేవి. క్రితంసారి క్రమబద్ధీకరణలో ఈ జాబితాల నుంచి కొన్ని వస్తువులను తొలగించి వాటిపై పన్నులు వేశారు. ప్రాణరక్షక మందులు, వైద్య సాధనాలు, ఆరోగ్య ఉపకరణాలు, వ్యవసాయ సామగ్రి వంటివి ఇప్పటికీ 18 శాతం, 28 శాతం పన్ను శ్లాబులలో ఉండటం ఏమాత్రం సమర్థనీయం కాదు. దీన్ని సరిదిద్దాల్సింది పోయి 12 శాతం శ్లాబును 18 శాతం శ్లాబులో కలిపేయాలని, అయిదు శాతం శ్లాబును ఎనిమిది శాతానికి పెంచాలని ప్రతిపాదిస్తున్నారు.

విభేదాలకు దారితీసే అంశాలు

మహమ్మారి పేరు చెప్పి ఇలా అడ్డగోలుగా పన్నులు పెంచేయడం ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ప్రజలకు, వ్యాపారాలకు తీవ్ర నష్టదాయకమవుతుంది. అసంబద్ధంగా పెంచుకున్న ఆదాయాన్ని ఆర్థిక పునరుజ్జీవనానికి కాకుండా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దుబారా చేయడం దేశార్థికానికి దీర్ఘకాలంలో చేటు చేస్తుంది. ఈ నెల జీఎస్టీ మండలి సమావేశంలో నష్టపరిహార సెస్సును రాజ్యాంగ సవరణ ద్వారా మరో అయిదేళ్లు పొడిగించాలని రాష్ట్రాలు పట్టుపట్టే అవకాశం ఉంది. భాజపాయేతర రాజకీయ పక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలు సుప్రీంకోర్టు తాజా తీర్పును ఆధారంగా చేసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావచ్చు. ఆ తీర్పు ప్రకారం జీఎస్టీ మండలి సిఫార్సులను తోసిపుచ్చే అధికారం, హక్కు పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలకు ఉంది. నష్టపరిహార సెస్సును పొడిగించడానికి జీఎస్టీ మండలి ఇష్టపడకపోతే రాష్ట్రాలు తమకుతాముగా అదనపు పన్నులు విధించుకునే వెసులుబాటును రాజ్యాంగం ఎటూ ఇస్తోంది. అదే జరిగితే వస్తుసేవల పన్నుల పునాదులు కదిలిపోతాయి. ఏతావతా జీఎస్టీ పన్ను రేట్లను పెంచడం, నష్టపరిహార సెస్సును పొడిగించడం సమస్యకు పరిష్కారాలు కానే కావు. రాష్ట్రాలకు జరిగిన ఆదాయ నష్టాన్ని పూడ్చటానికి కేంద్రమే రుణాలు తీసుకుని రాష్ట్రాలకు ఇచ్చి ఉంటే ఉభయ తారకంగా ఉండేది. అలా కాకుండా పన్నులు పెంచుతూ పోయి ఆదాయం పెంచుకోవాలనుకోవడం ఆర్థికంగా వినాశకరం. దీన్ని నివారించాలంటే ప్రాణ రక్షక ఔషధాలు, వ్యవసాయ సాధనాల వంటి అత్యవసర వస్తువులను తక్కువ పన్ను శ్లాబులోకి మార్చి, వ్యవస్థాపరమైన ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి. ఆ సంస్కరణలు   ధరలను కట్టడి చేసి సామాన్యుడికి మేలు చేయాలి.

ఆదాయ సమతుల పన్ను రేటు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను ఆదాయాలు జీఎస్టీని ప్రవేశపెట్టడానికి ముందున్న స్థాయిలోనే, జీఎస్టీ తరవాత కూడా కొనసాగాలంటే నిర్ణీత రేటులో పన్ను విధించాల్సి ఉంటుంది. దాన్నే ఆదాయ సమతుల పన్ను రేటు అంటారు. మొదట్లో 14.4 శాతంగా ఉన్న ఈ రేటు 2019లో 11.6 శాతానికి తగ్గింది. ఇది వాస్తవానికి 15.5 శాతంగా ఉండాలంటున్నారు. ఆ రేటును సాధించాలంటే జీఎస్టీ మండలి జనం మీద పన్నులు పెంచాలి లేదా పన్ను మినహాయింపు జాబితా నుంచి పలు వస్తువులను తొలగించాలి. రాష్ట్రాల ఆదాయం ఏడాదికి 14 శాతం చొప్పున పెరుగుతూ ఉంటుందనే అంచనా మీద సమతుల రేటును నిర్ణయించడమే తప్పు. జీఎస్టీకి ముందు కేవలం అయిదు రాష్ట్రాల ఆదాయం మాత్రమే ఏటా 14 శాతానికి పైగా పెరిగిందని, మిగతా రాష్ట్రాల ఆదాయ వృద్ధి అయిదు నుంచి 12 శాతంలోపేనని ఒక అధ్యయనం తేల్చింది. జీఎస్టీ అమలుకు ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటించడానికి వ్యక్తులకు, సంస్థలకు అయ్యే వ్యయాన్ని అనువర్తన ఖర్చు అంటారు. ఇది పెద్ద కంపెనీలకు బాగా తగ్గిపోగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు విపరీతంగా పెరిగిపోయి ఆ రంగాన్ని దెబ్బతీసింది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట

‣ చేయూత అందిస్తే దేశానికే పెన్నిధులు

‣ సముద్ర సంపదపై సాంకేతిక నేత్రం

‣ గుక్కెడు గంగకూ కరవే!

‣ వర్ధమాన దేశాల ‘వాణిజ్య సమరం’

‣ ఏటా తప్పని విత్తన గండం

‣ పోరుబాటలో ఆకాశనేత్రం

Posted Date: 29-06-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం