• facebook
  • whatsapp
  • telegram

ముప్పు ముంగిట ప్రపంచార్థికం

కొవిడ్‌ తరవాత కోలుకొంటుందనుకున్న ప్రపంచార్థికం మళ్ళీ పాతాళానికి జారిపోనున్నదన్న భయాలు పెరుగుతున్నాయి. మహా మాంద్యం మళ్ళీ ప్రపంచాన్ని చుట్టేయనుందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ప్రపంచదేశాలతో సహా భారత్‌పైనా దాని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దానివల్ల గిరాకీ పడిపోయి ఉద్యోగాలు, వ్యాపారాలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.

ప్రపంచానికి సుదీర్ఘ మాంద్యం ముంచుకొస్తోందని విఖ్యాత ఆర్థికవేత్త నూరియల్‌ రూబీనీ హెచ్చరించారు. అది 2023లోనే వచ్చిపడుతుందని సుప్రసిద్ధ మదుపరి స్టాన్లీ డ్రకెన్‌మిల్లర్‌ అంచనా వేశారు. 1980ల నుంచి విరుచుకుపడిన ప్రతి ఆర్థిక సంక్షోభానికీ రెండే కారణాలున్నాయి. అవి- అమెరికా డాలర్‌ విలువ పెరగడం, అగ్రరాజ్య కేంద్ర బ్యాంకు లేదా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచడం. 1982లో లాటిన్‌ అమెరికా దేశాల్లో రుణ సంక్షోభం, 1994లో మెక్సికో రుణాల ఎగవేత, 1997లో తూర్పు ఆసియా దేశాల ఆర్థిక సంక్షోభం, 1998లో రష్యా రుణాలకు ఎగనామం, 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం- ఇలా ప్రతి దాని వెనకా పైన చెప్పుకొన్న కారణాలే ఉన్నాయి. ఈ ఏడాదీ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటును రెండు శాతం పెంచింది. ఫలితంగా డాలర్‌ విలువ 22శాతం పెరిగింది. గడచిన కొన్ని నెలలుగా ప్రపంచమంతటా స్టాక్‌ మార్కెట్‌ మదుపరులు 32 లక్షల కోట్ల డాలర్ల మేర సంపద కోల్పోయారు.

క్షీణించిన బాండ్‌ మార్కెట్‌

రెండు ప్రపంచ యుద్ధాల మధ్య పీడించిన తీవ్రస్థాయి ద్రవ్యోల్బణం మళ్లీ వచ్చిపడనున్నదా అని ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తరం వారికి దాన్ని తట్టుకొనే శక్తి లేదు. సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కరెన్సీని అధికంగా ముద్రిస్తే ద్రవ్యోల్బణం పెచ్చరిల్లుతుంది. అయితే, అమెరికా పుట్టించిన ద్రవ్యోల్బణం మిగతా ప్రపంచంపై పడుతుంది. డాలర్‌ను అందరూ రిజర్వు కరెన్సీగా వాడటం దానికి కారణం. 50 ఏళ్ల తరవాత మొదటిసారి ప్రపంచ దేశాలు, అమెరికా కట్టకట్టుకుని వడ్డీ రేట్లను పెంచుతున్నాయని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. వచ్చే ఏడాదీ అవి అధికమవుతూనే ఉంటాయి. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల మూలంగా కంపెనీలు, కుటుంబాల వద్ద ఉన్న పొదుపు మొత్తాలు ఖర్చయిపోయి, వస్తుసేవలపై వ్యయం చేసే సత్తా తగ్గిపోతుంది. ఫలితంగా గిరాకీ పడిపోయి దానితోపాటే ఉత్పత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు దెబ్బతింటాయి. గతంలో చేసిన అప్పులపై వడ్డీ భారం పెరిగిపోతుంది. ఖర్చులు తగ్గించుకోవడానికి కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతాయి.

ప్రస్తుత సంక్షోభానికి బీజాలు 1980ల్లోనే పడ్డాయి. కొవిడ్‌ వల్ల పరిస్థితి ముదురు పాకాన పడింది. 2019 మే నుంచి 2021 జూన్‌ వరకు అమెరికాలో ద్రవ్య లభ్యత 40శాతం పెరిగిపోయింది. అగ్రరాజ్యం ఈ కాలంలో సగటున నెలకు నాలుగు వేల కోట్ల డాలర్ల నుంచి అయిదు వేల కోట్ల డాలర్ల దాకా అదనపు కరెన్సీని ముద్రించింది. బాండ్ల రూపంలో మార్కెట్‌ రుణాల సేకరణను ఆపివేసి వడ్డీ రేట్లను పెంచింది. ప్రపంచంలో ఇతర దేశాల పరిస్థితీ అలాగే ఉండటంతో అంతర్జాతీయ బాండ్‌ మార్కెట్‌ భారీగా క్షీణించింది. గతంలో తాము కొన్న బాండ్లను పూచీకత్తుగా చూపి కొత్త రుణాలు సేకరించి నష్ట ప్రమాదం ఎక్కువగా ఉండే మదుపు సాధనాల్లో పెట్టుబడి పెట్టిన పింఛన్‌ నిధుల భవితవ్యం ప్రమాదంలో పడింది. ఇతర సంపన్న దేశాల పింఛన్‌ నిధుల పరిస్థితీ ఇలానే ఉంది. ఆ దేశాల జీడీపీలో పింఛన్‌ నిధులు 50 నుంచి 150శాతం దాకా వాటా ఆక్రమిస్తున్నాయి. కొత్త పెట్టుబడులకు మూలాధారమైన పింఛన్‌ నిధులు సంపన్న ఓఈసీడీ దేశాల జీడీపీలో 63శాతం వాటా కలిగి ఉన్నాయి. వాటి భవిష్యత్తు అస్థిరమైతే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు ముప్పు వాటిల్లుతుంది. బ్రిటన్‌ కరెన్సీ అయిన పౌండ్‌ ఈ ఏడాది 22శాతం విలువ కోల్పోతే, యూరో విలువ 18శాతం పడిపోయింది.

భారత్‌పై ప్రభావం

ప్రస్తుత సంక్షోభం నుంచి భారత్‌ బయటపడుతుందనే తప్పుడు సూత్రీకరణలు వినిపిస్తున్నాయి. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే అమెరికన్‌ డాలర్‌తో భారతీయ రూపాయి విలువ కేవలం 9.7శాతం క్షీణించడాన్ని దానికి ఆధారంగా చూపుతున్నారు. సంక్షోభం మొదట సంపన్న దేశాల్లో ప్రారంభమై తరవాత భారత్‌ లాంటి వర్ధమాన దేశాలకూ పాకుతుంది. అంతర్జాతీయ బాండ్‌ సూచీలతో భారత్‌ పూర్తిగా అనుసంధానం కాలేదు. అందువల్ల బ్రిటన్‌ తరహా బాండ్‌ మార్కెట్‌ పతనాన్ని ఇప్పటిదాకా వాయిదా వేయగలిగింది. మరోవైపు పడిపోతున్న రూపాయి విలువను నిలబెట్టడానికి భారతీయ రిజర్వు బ్యాంకు ఇప్పటిదాకా పదివేల కోట్ల డాలర్లను గుమ్మరించింది. ఫలితంగా మన విదేశ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం వల్ల ఇకపై వడ్డీ రేట్లను మరింత పెంచుతూనే ఉండాలి. కుటుంబాల వ్యక్తిగత రుణాలూ కొండలా పెరిగిపోయాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల రుణ భారం హద్దులు దాటింది. ప్రస్తుతానికి రష్యా నుంచి చవకగా చమురు కొంటున్నందువల్ల వాణిజ్యలోటు పెద్దగా పెరగలేదు. ఇకపైనా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పలేం. అమెరికా వద్దనున్న చమురు నిల్వలూ తరిగిపోతున్నాయి. ఫలితంగా సమీప భవిష్యత్తులోనే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు విజృంభించే ప్రమాదం ఉంది. అది భారతీయ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయక మానదు. ప్రస్తుత పరిస్థితిలో కుటుంబాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణ భారాన్ని తగ్గించుకోవడం అవసరం. దురదృష్టవశాత్తు దానికి భిన్నమైన పరిస్థితి నెలకొని, భవిష్యత్తును అస్థిరంగా మారుస్తోంది.

కొనసాగనున్న అనిశ్చితి

కొవిడ్‌, ఉక్రెయిన్‌ యుద్ధం, వయోధికుల పెరుగుదల వల్ల ఇప్పటికే ప్రపంచార్థికం మందగించిన వేళ పులి మీద పుట్రలా ఇతర పరిణామాలు వచ్చిపడుతున్నాయి. 2008 ఆర్థిక సంక్షోభంలో చెక్కుచెదరకుండా నిలిచి ప్రపంచార్థికాన్ని ఆదుకున్న చైనా సైతం నేడు స్థిరాస్తి బుడగ పగిలిపోయి, వృద్ధుల జనాభా పెరుగుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2020 చివరకు ప్రపంచ రుణభారం 226 లక్షల కోట్ల డాలర్లు. అది ప్రపంచ జీడీపీకన్నా 256శాతం ఎక్కువ. కొవిడ్‌ వల్ల సరఫరా గొలుసులు విచ్ఛిన్నం కావడంతో పరిశ్రమలు, పెట్టుబడులు చైనా నుంచి, వర్ధమాన దేశాల నుంచి మళ్ళీ అమెరికా, ఐరోపాలకు మరలిపోతున్నాయి. ఉక్రెయిన్‌, తైవాన్‌ సంక్షోభాలతో అమెరికా, ఐరోపా దేశాలు తమ సొంత భూభాగాల్లోనే పెట్టుబడులు, పరిశ్రమలను కేంద్రీకరించడం ఉత్తమమని భావిస్తున్నాయి. ఈ రూపాంతరం ప్రపంచార్థికానికి బ్రేకులు వేస్తోంది. కొత్త దశ మొదలయ్యే వరకు అనిశ్చితి కొనసాగనుంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చిరుధాన్యాలతో ఆహార భద్రత

‣ ఆవరణ వ్యవస్థకు ప్రాణాధారం

‣ 5G ఎన్నో సవాళ్లు... మరెన్నో అవకాశాలు!

‣ పెచ్చరిల్లుతున్న వాణిజ్యలోటు

‣ బాల్య విద్య... భవితకు గట్టి పునాది

‣ ‘ఉచిత’ భారానికి సౌర విద్యుత్‌ పరిష్కారం

‣ ఆర్కిటిక్‌... మన ప్రయోజనాలకు కీలకం!

Posted Date: 08-10-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం