• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక అంధకారంలో భారత్‌ వెలుగు రేఖ

ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఇటీవల హెచ్చరించింది. కానీ, భారత్‌లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉంటాయని అది విశ్లేషించింది. వచ్చే ఏడాది భారత్‌ ఆరు శాతానికి పైగా వృద్ధిని నమోదు చేస్తుందని ఐఎంఎఫ్‌ వెల్లడించింది.

నేడు ప్రపంచానికి ఆర్థిక మాంద్యం భయం పట్టుకుంది. 2023లో ప్రపంచ జీడీపీ 2.9శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఈ ఏడాది జులైలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. ఇప్పుడు దాన్ని 2.7శాతానికి తగ్గించింది. వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూడో వంతు వరకు కుంచించుకుపోతుందని హెచ్చరించింది. ప్రపంచ కర్మాగారమైన చైనా, ప్రపంచ వినియోగ కేంద్రమైన అమెరికాలలో ఆర్థిక కార్యకలాపాలు క్షీణిస్తూనే ఉంటాయని వివరించింది. రాబోయే రోజుల్లో ఐరోపాలో కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ కుంచించుకుపోవచ్చు. 2023లో భారత్‌ జీడీపీ 7.8శాతం మేర పెరుగుతుందని ఐఎంఎఫ్‌ ఇంతకుముందు అంచనా వేసింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో పారిశ్రామికోత్పత్తి అనుకున్నంతగా పెరగకపోవడం, మన ఎగుమతులకు పెద్దగా గిరాకీ లేకపోవడం వల్ల దాన్ని 6.8శాతానికి తగ్గించింది. ప్రపంచ బ్యాంకు భారత్‌ వృద్ధిరేటుపై తన అంచనాను ఒక శాతం తగ్గించి 6.5శాతానికి పరిమితం చేసింది. సిటీ గ్రూప్‌ అంచనా ఎనిమిది శాతం నుంచి 6.7శాతానికి తగ్గిపోయింది.

భారత్‌ పరిస్థితి వేరు

చైనా జీరో కొవిడ్‌ విధానం సరఫరా గొలుసులను విచ్ఛిన్నం చేసి ఆర్థిక మాంద్యానికి హేతువు అవుతోంది. మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 19శాతం చైనాలో జరుగుతోంది. అక్కడి పరిశ్రమలకు కావాల్సిన ముడిసరకుల సరఫరా, చైనా నుంచి ఎగుమతుల ప్రవాహానికీ కొవిడ్‌ పెద్ద ఆటంకంగా పరిణమిస్తోంది. చైనా పరిశ్రమలు లాక్‌డౌన్ల వల్ల పనిచేయకపోవడంతో కార్లు మొదలుకొని హైటెక్‌ పరికరాల వరకు పలు వస్తు విక్రయాలు, ఎగుమతులు పడిపోయాయి. జీరో కొవిడ్‌ విధానాన్ని చైనా కాస్త సడలించిన తరవాత అక్కడ కరోనా భీకర విజృంభణ మొదలైంది. ఈ పరిస్థితుల్లో సరఫరా గొలుసుల విచ్ఛిన్నం కొనసాగుతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఆహార, ఇంధన, ఎరువుల ఎగుమతులను దెబ్బతీయడం వల్ల అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం అనివార్యమని వారు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం భారత్‌పైనా ప్రభావం చూపక మానదు. స్వదేశంలో గిరాకీ బాగా ఉండటం, పెట్టుబడులు మళ్ళీ పుంజుకోవడం, ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం కావడం, సర్కారు తీసుకొచ్చిన సంస్థాగత సంస్కరణల మూలంగా భారత్‌ గణనీయ వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విశ్లేషించారు. నిజానికి భారత్‌ను ప్రస్తుతం అత్యంత వేగంగా వృద్ధి పథంలో పరుగుతీస్తున్న ఆర్థిక వ్యవస్థగా ఆర్థిక సంస్థలు గుర్తిస్తున్నాయి. చైనా మాదిరిగా భారత్‌ తన అభివృద్ధి కోసం ప్రధానంగా ఎగుమతులపై ఆధారపడటం లేదు. పెట్టుబడుల విషయంలోనూ విదేశాలపై ఆధారపడటం తక్కువే. ఈక్విటీ షేర్ల విషయమే తీసుకుంటే భారతీయ షేర్లు మదుపరులకు ఇతర దేశాల్లోకన్నా ఎక్కువ లాభాలు తెచ్చి పెడుతున్నాయి. నిజానికి అంతర్జాతీయ షేర్‌ మార్కెట్‌ విలువల్లో 20 నుంచి 25శాతం క్షీణత కనిపించింది. ఇప్పటికి సంవత్సరకాలంగా విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐ), స్వదేశీ మదుపరులు భారతీయ స్టాక్‌ మార్కెట్‌కు దన్నుగా నిలుస్తున్నారు. గత రెండేళ్లుగా భారతీయ కార్పొరేట్‌ రంగం లాభాల్లో ఉన్నందువల్ల షేర్ల విలువలు పెరుగుతూనే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి భారత ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఎప్పటికప్పుడు తీసుకుంటున్న చర్యలూ ఫలిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌ కారు చీకట్లో కాంతిరేఖలా మెరుస్తోందని ఐఎంఎఫ్‌ ప్రశంసించింది. వచ్చే ఏడాది సౌదీ అరేబియా, భారత్‌లు మాత్రమే   ఆరు శాతం కన్నా ఎక్కువ వృద్ధి రేట్లను నమోదు చేయనున్నాయని తెలిపింది. భారత్‌లో ద్రవ్యోల్బణం ఏడు శాతంగా ఉన్నందువల్ల    ఆరు శాతం కన్నా ఎక్కువ వృద్ధి రేటును సాధిస్తేనే నిజమైన అభివృద్ధి సిద్ధించినట్లు అని చాలామంది ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు.

ఆర్థిక మాంద్యం వస్తుందని తెలిసినా లెక్కచేయకుండా అమెరికా ఫెడరల్‌ రిజర్వు ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీ రేట్లను పెంచుతూనే ఉంది. భారతీయ ఎగుమతుల్లో 30శాతం అమెరికా, అయిదు ఐరోపా దేశాలకే వెళ్తాయి. ఆ దేశాల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు అవి దిగుమతి చేసుకునే వస్తుసేవలూ తగ్గిపోతాయి. ఫలితంగా భారత్‌కు నష్టం తప్పదు. ఆర్థిక మాంద్యంలో ముడి సరకులకు గిరాకీ తగ్గడం వల్ల వాటి ధర దిగివచ్చినా, ఉక్రెయిన్‌ యుద్ధంతో చమురు ధరలు పెరిగినందువల్ల వాణిజ్య లోటు ఇతోధికమవుతోంది.

ద్రవ్యోల్బణం కట్టడి

భారత్‌ వాణిజ్య లోటు 2023లో 3.9శాతంగా ఉండవచ్చు. ఇప్పటికే ఆహారం, ఇంధన ధరల పెరుగుదల వల్ల భారత్‌లో ద్రవ్యోల్బణం రిజర్వు బ్యాంకు నిర్దేశించుకున్న ఆరు శాతం పరిమితిని దాటిపోయింది. గడచిన 10 నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఏప్రిల్‌ నుంచి వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే నిధులపై రిజర్వు బ్యాంకు వడ్డీ (రెపో) రేటు 1.9శాతం నుంచి 5.9శాతానికి పెరిగింది. భారత ద్రవ్య విధాన నిర్ణాయక సంఘం వడ్డీరేట్లపై మార్గదర్శకాలేమీ విడుదల చేయలేదు. ద్రవ్యోల్బణ కట్టడికే అమిత ప్రాధాన్యమిచ్చింది. వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నది రిజర్వు బ్యాంకు విధానం. ఏది ఏమైనా మిగతా ప్రపంచం కన్నా భారత్‌ ఆర్థిక స్థితి చాలా మెరుగ్గా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంచనాను నిజం చేయడానికి ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ప్రజల ఆదాయాలను పెంచాలి. ధరలు తగ్గించాలి. వ్యాపారాభివృద్ధి, పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడమూ తప్పనిసరి. స్వల్పకాలంలో విత్త లోటును తగ్గిస్తూనే మౌలిక వసతులపై పెట్టుబడులను పెంచాలి. దానివల్ల ఉపాధి అవకాశాలు పెరిగి భారత ఆర్థికాభివృద్ధి రేటు పరుగుతీస్తుంది.

రూపాయి పతనం

ఇతర దేశాలకన్నా భారత్‌ ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ఆర్థిక ప్రకంపనల నుంచి పూర్తిగా తప్పించుకోలేదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. మిగతా ప్రపంచంలో వస్తుసేవలకు గిరాకీ తగ్గినప్పుడు భారత్‌ తన ఎగుమతులను పెంచుకోవడం సాధ్యపడదు. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం, డాలర్‌తో ఇతర కరెన్సీల విలువ పడిపోవడం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, అంతర్జాతీయ ద్రవ్యోల్బణం- ఇవన్నీ భారత్‌ను ప్రభావితం చేస్తాయి. ఇప్పటికే ఒక డాలర్‌కు మన కరెన్సీ విలువ 82-83 రూపాయలకు పడిపోయింది. ఈ క్షీణత మరికొంతకాలం కొనసాగేలా కనిపిస్తోంది. రూపాయి  విలువను నిలబెట్టడానికి రిజర్వు బ్యాంకు ఇప్పటిదాకా తన విదేశ మారక ద్రవ్య నిల్వల నుంచి 10,000 కోట్ల డాలర్లను ధారపోసింది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పొంచి ఉన్న ఆహార అభద్రత

‣ ప్రాబల్యం కోసం కోరిమరీ వైరం

‣ రైతుకేదీ...‘ఉత్సవం’?

‣ మహిళా బిల్లుకు మోక్షమెప్పుడు?

Posted Date: 28-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం