• facebook
  • whatsapp
  • telegram

డిజిటల్‌ ప్రపంచంలో కొత్త వాణిజ్యం

ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా భారత్‌ తన చట్టాలను మార్చుకుంది. ఫలితంగా దేశంలోకి విదేశీ పెట్టుబడులు పెరిగాయి. దేశం నుంచి ఎగుమతులూ ఎగబాకాయి. అయినా, ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్‌ కేవలం రెండు శాతం వాటాకే పరిమితమైంది! కొత్త వాణిజ్య విధానంతో దీన్ని మరింతగా పెంచుకోవాలి.

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఆవిర్భవించి ఈ జనవరి ఒకటి నాటికి 27 ఏళ్లయింది. 1948 నుంచి 1994 వరకు ప్రపంచ వాణిజ్యాన్ని గాట్‌ (సుంకాలు, వాణిజ్యంపై సార్వత్రిక ఒప్పందం) నిబంధనలే నడిపించేవి. గాట్‌ స్థానంలో 1995 జనవరి 1న డబ్ల్యూటీఓ అవతరించింది. అంతకుముందు 47 ఏళ్లపాటు గాట్‌ వివిధ దేశాల నడుమ తాత్కాలిక ఒప్పంద సంస్థగా వ్యవహరించింది. సుంకాల పరంగా, ఇతరత్రా అడ్డంకులు తొలగించి, అంతర్జాతీయ వాణిజ్యం ఇబ్బడిముబ్బడిగా పెరిగేందుకు తోడ్పడింది. గాట్‌ ప్రధానంగా సరకుల వాణిజ్యానికి తోడ్పడితే, దాని స్థానంలో వచ్చిన డబ్ల్యూటీఓ పరిధిలోకి సరకులతోపాటు సేవలు, మేధా హక్కులనూ తీసుకొచ్చారు. డబ్ల్యూటీఓ వల్ల ప్రధానంగా అమెరికా, చైనా, జర్మనీలే లాభపడ్డాయనే వాదన ఉన్నా- ఆ సంస్థ మూలంగా అంతర్జాతీయ వాణిజ్యం స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరిగి అనేకానేక దేశాలకు లబ్ధి చేకూరిన మాట వాస్తవం.

ఉన్నత ఆశయాలతో ఆరంభం

వాణిజ్యం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఉద్యోగావకాశాలను విస్తరించడం, మొత్తంగా జన జీవితాలను సౌకర్యవంతంగా మార్చడం డబ్ల్యూటీఓ లక్ష్యాలు. వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోవడానికి, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ సంస్థ వేదికగా ఉపయోగపడుతోంది. 1995 నుంచి డాలర్లలో ప్రపంచ వాణిజ్య విలువ నాలుగు రెట్లు పెరగ్గా, పరిమాణరీత్యా పెరుగుదల 2.7 రెట్లు మాత్రమే. ఇదే కాలంలో ప్రపంచ స్థూల ఉత్పత్తి రెండు రెట్లు పెరిగింది. ప్రపంచ వాణిజ్యం మరింత విస్తరించాలంటే పారిశ్రామిక ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడం, వాటి ఎగుమతుల పరిమాణంపై ఆంక్షలు తొలగించడం చాలా అవసరం. ఈ మేరకు డబ్ల్యూటీఓ ఛత్రం కింద ఒప్పందం కుదరాలి. అన్ని అడ్డంకులనూ అధిగమించి ప్రపంచ విపణిలో పోటీపడగల సంస్థలు, దేశాలు దీర్ఘకాలంలో బాగా లబ్ధి పొందగలుగుతాయి.

డబ్ల్యూటీఓ వాణిజ్య సంబంధ పెట్టుబడుల (ట్రిమ్స్‌) ఒప్పందం ప్రకారం ప్రపంచ దేశాలు స్వదేశీ, విదేశీ పెట్టుబడుల మధ్య భేదం పాటించకూడదు. దేశాల మధ్య పెట్టుబడులు స్వేచ్ఛగా ప్రవహించడానికి తోడ్పడే ఒప్పందమిది. వాణిజ్య సంబంధ మేధా హక్కుల పరిరక్షణ ఒప్పందం (ట్రిప్స్‌) కొత్త వస్తుసేవల సృష్టికర్తల ప్రయోజనాలను సంరక్షిస్తోంది. ఈ కొత్త వస్తుసేవలను ఇతరులు చట్టవిరుద్ధంగా ఉపయోగించుకోకుండా కాపాడుతోంది. పేటెంట్లు, కాపీరైట్లు, పారిశ్రామిక డిజైన్లు, సర్క్యూట్లు, వాణిజ్య రహస్యాల రక్షణకు ట్రిప్స్‌ కవచంగా పనిచేస్తోంది. ట్రిప్స్‌ నిబంధనలు అన్ని సభ్య దేశాలకూ వర్తిస్తాయి. వీటికి అనుగుణంగా భారత్‌ తన పేటెంట్‌, కాపీరైట్స్‌, వ్యాపారం, వ్యాపార సరకుల చట్టాలన్నింటినీ సవరించింది. సాంకేతికత పరిజ్ఞానాల బదిలీని ట్రిప్స్‌ ఒప్పందం ప్రకారమే చేపట్టాల్సి ఉంటుంది.

వాణిజ్య సంబంధ వివాదాల పరిష్కారానికి సంబంధించి అప్పిలేట్‌ సంస్థలో సంస్కరణలు తీసుకురావాలని 2019లో భారత్‌ ప్రయత్నించినా డబ్ల్యూటీఓ సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. డబ్ల్యూటీఓలో చేరినప్పటి నుంచి భారత్‌కు విదేశీ పెట్టుబడులు పెరిగాయి. తానూ విదేశాల్లో పెట్టుబడులు పెట్టి భారతీయ దుస్తులు, వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ పెంచుకుంది. 2001లో ప్రారంభమైన దోహా చర్చలు వాణిజ్యానికి అడ్డంకులు తగ్గించాయి. డబ్ల్యూటీఓ డంపింగ్‌ విషయంలో సంస్కరణలు తీసుకొచ్చి, ఉత్పత్తులకు నిర్దిష్ట ప్రమాణాలను నిర్ణయించింది. స్వచ్ఛంద సంస్థలు, సమాచార మాధ్యమాలు, పార్లమెంటేరియన్లు, అంతర్జాతీయ సంస్థలతో పాటు సామాన్యులతోనూ ఆ సంస్థ మాటామంతీ నెరపుతూ- దోహా చర్చల పురోగతి విశేషాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తోంది. సభ్య దేశాల మధ్య పెట్టుబడి ప్రవాహాన్ని పెంచి ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు డబ్ల్యూటీఓ నిరంతరం ప్రయత్నిస్తోంది. ప్రజలతోపాటు వృక్ష జంతుజాలాలు, పర్యావరణం పరిరక్షణకు చర్యలు తీసుకునేలా డబ్ల్యూటీఓ ఒప్పందాల్లో తగు జాగ్రత్తలను పొందుపరుస్తున్నారు. వస్తుసేవల ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు, దిగుమతిదారులు సులభంగా వ్యాపారం నిర్వహించుకొనేలా చూడటానికి డబ్ల్యూటీఓ ప్రాధాన్యమిస్తోంది. స్వదేశీ, విదేశీ వ్యాపారాభివృద్ధి వల్ల ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం పెరిగి సామాజిక సంక్షేమం, మౌలిక వసతులపై ఎక్కువ నిధులు వెచ్చించగలుగుతాయి. డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం ద్వారా వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు వాణిజ్యాన్ని విస్తరించుకోగలుగుతాయి. సభ్య దేశాలు ఉన్నపళాన సుంకాలు పెంచడం లేదా ఇతర మార్గాల్లో వాణిజ్యానికి అడ్డంకులు సృష్టించకుండా డబ్ల్యూటీఓ నిబంధనలు జాగ్రత్త తీసుకుంటాయి. దానివల్ల విదేశీ కంపెనీలు, ప్రభుత్వాలు డబ్ల్యూటీఓ సభ్య దేశాల్లో స్వేచ్ఛగా, నిర్భయంగా పెట్టుబడులు పెట్టగలుగుతాయి.

ఎగుమతులకు ప్రోత్సాహం

ప్రపంచంలో డిజిటల్‌ వాణిజ్యాన్ని పెంచడానికి తీసుకోవలసిన చర్యల గురించి డబ్ల్యూటీఓ సభ్యదేశాలు చర్చించుకొంటున్నాయి. ఈ-కామర్స్‌ విస్తరణకు సానుకూల వాతావరణం ఏర్పరచడానికి నడుంకట్టాయి. భారతదేశం చివరిసారి 2015లో తన వాణిజ్య విధానాన్ని ప్రకటించింది. ఆ తరవాత వచ్చిన మార్పులను పొందుపరుస్తూ కొత్త వాణిజ్య విధానాన్ని ఇంకా తీసుకురావలసి ఉంది. అమెరికా, ఐరోపా సమాఖ్యలు తమ రైతులకు భారీగా రాయితీలను ఇస్తూ, భారతీయ రైతులకు సబ్సిడీ తగ్గించమంటున్నాయి. తమ వ్యవసాయ, పాడి ఉత్పత్తులు భారత్‌లో భారీయెత్తున ప్రవహించడానికి వీలు కల్పించాలంటున్నాయి. భారత్‌ ఇందుకు అంగీకరించడం లేదు. ప్రధానంగా వ్యవసాయ దేశమైన భారత్‌ తన రైతు ప్రయోజనాల రక్షణకు డబ్ల్యూటీఓ నిబంధనలు అడ్డురాకుండా చూసుకోవాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సైతం ఎగుమతులను పెంచేలా ప్రోత్సహించాలి. ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్‌ వాటా కేవలం రెండు శాతం. దీన్ని మరెంతో పెంచుకోవాలి.

సమ్మిళిత అభివృద్ధి

ప్రపంచంలో సగటు వాణిజ్య సుంకాలు గత 27 ఏళ్లలో 10.5 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గిపోయాయి. ఇదే కాలంలో ప్రపంచమంతటా పేదరికం స్థాయులూ తగ్గుముఖం పట్టాయి. రోజుకు 1.90 డాలర్లకన్నా తక్కువ సంపాదించేవారిని నిరుపేదలుగా ప్రపంచ బ్యాంకు వర్గీకరించింది. ఆ కొలమానం ప్రకారం 1995లో ప్రపంచ జనాభాలో మూడోవంతు మంది అత్యంత పేదలు కాగా, ఇప్పుడు వారి సంఖ్య 9 శాతానికి తగ్గింది. నేడు ప్రపంచ వాణిజ్యంలో మహిళలు, చిన్న వ్యాపారులు సైతం పాల్గొనేలా ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్య దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. సమ్మిళిత అభివృద్ధి సాధనకు తోడ్పడే చర్య ఇది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పాకిస్థాన్‌పై తాలిబన్‌ తిరుగుబావుటా

‣ అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం

‣ జన సంద్రం... వినియోగించుకుంటే వరం!

‣ ఆర్థిక అంధకారంలో భారత్‌ వెలుగు రేఖ

Posted Date: 07-01-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం