• facebook
  • whatsapp
  • telegram

ఉపాధిలేని వృద్ధితో ఉపయోగమెంత?

వర్తమాన అవసరాలను తీర్చడంకన్నా భవిష్యత్తుపై రంగుల కలలను ఆవిష్కరించడానికే ప్రతి బడ్జెట్‌ ప్రాధాన్యమిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023-24 సంవత్సరానికి ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్‌ సైతం అందుకు మినహాయింపేమీ కాదు. దీర్ఘకాలంలో ఘనకార్యాలు సాధిస్తామంటూ ఇప్పటికిప్పుడు సహాయం అవసరమైన వర్గాలను తాజా పద్దు విస్మరించింది.

ప్రస్తుత విధానకర్తల ఆలోచనలు ఎలా ఉన్నాయో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మళ్ళీ గెలిస్తే ఎలాంటి విధానాలు చేపట్టదలచారో కొత్త బడ్జెట్‌ను చూస్తే అర్థమవుతుంది. మౌలిక వసతులను, డిజిటల్‌ యంత్రాంగాన్ని విస్తరించడానికి, బహుళ రాష్ట్ర సహకార సంఘాల ఏర్పాటుకు కేంద్ర పాలకులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టమవుతోంది. తరచూ బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయించే నిధులు పూర్తిగా విడుదల కాకపోవడమో లేదా సంపూర్ణ వినియోగానికి నోచుకోక పోవడమో కనిపిస్తుంది. అందువల్ల బడ్జెట్‌ లక్ష్యాలు ఎంతమేరకు నెరవేరాయో చెప్పలేం. 2023-24 బడ్జెట్లో సానుకూలాంశాలు కొన్ని ఉన్నాయి. ప్రజారోగ్యానికి అధిక నిధులు కేటాయిస్తామని ఈ బడ్జెట్‌ వాగ్దానం చేసింది. పట్టణ స్థానిక సంస్థల్లో రాష్ట్రాలు తగిన సంస్కరణలు చేపడితే అదనపు రుణాలిస్తామని చెప్పింది.

పెరుగుతున్న పెట్టుబడి వ్యయం

పెట్టుబడి వ్యయాన్ని పెంచడం ద్వారా ఆర్థికాభివృద్ధికి గొప్ప ఊతమిస్తామని తాజా బడ్జెట్‌ ద్వారా ప్రభుత్వం చాటుకుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పెట్టుబడి వ్యయం పెరుగుతూ వస్తోంది. 2018లో రూ.2.63 లక్షల కోట్లుగా ఉన్న పెట్టుబడి వ్యయం 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.3.35 లక్షల కోట్లకు, 2021లో రూ.5.92 లక్షల కోట్లకు పెరిగింది. గత బడ్జెట్లో అది రూ.7.5 లక్షల కోట్లుగా ఉంటుందనుకున్నా చివరకు రూ.7.28 లక్షల కోట్లుగా లెక్కతేలింది. తాజా బడ్జెట్‌ దాన్ని రూ.10 లక్షల కోట్లకు పెంచింది. ఇది కాకుండా ఉత్పాదక ఆస్తుల సృష్టికి అదనంగా రూ.3.69 లక్షల కోట్ల మేరకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఇస్తామనీ ప్రతిపాదించింది. పెట్టుబడులు పెంచుతామనడం హర్షించాల్సిన అంశమే. అయితే, ప్రస్తుతం భారత్‌ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య- ఉపాధి అవకాశాల కొరత. పెట్టుబడులను, ముఖ్యంగా ప్రైవేటు తరఫునుంచి ఇతోధికం చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధి రేటును పెంచితే ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతాయని ప్రభుత్వం అంచనా వేసుకొంటోంది. అది నెరవేరాలంటే చౌక వడ్డీకి నిధులు పుష్కలంగా లభించాలి. ప్రాజెక్టులను వేగంగా చేపట్టి, గడువులోగా, వీలైతే అంతకన్నా ముందే పూర్తిచేయాలి. భారీ రాయితీలు ఇచ్చి పరిశ్రమలను విస్తరిస్తే ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. భారత్‌లోనే కాదు, ప్రపంచమంతటా అధునాతన సాంకేతికతలు, అధిక పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపిస్తున్నా ఉపాధి అవకాశాలు అందుకు దీటుగా పెరగడం లేదు. చివరకు జీడీపీ, కార్పొరేట్‌ లాభాలు పెరిగి గతంలోకన్నా కార్మికుల సంఖ్య తరిగిపోతోంది. యువ జనాభా అధికంగా ఉండి, ఏటా కొత్త యువశక్తి మార్కెట్లోకి ప్రవేశిస్తున్న ఇండియాలో ఉపాధి రహిత అభివృద్ధి పెను సమస్యగా పరిణమిస్తోంది.

రసాయన ఎరువులపై సబ్సిడీలు తగ్గించి ప్రత్యామ్నాయ (సేంద్రియ) ఎరువుల వాడకాన్ని పెంచాలని ఆర్థిక మంత్రి లక్షిస్తున్నారు. ఈ విషయంలో శ్రీలంక విఫల ప్రయోగాన్ని గుర్తుంచుకొని పటిష్ఠ ప్రణాళికతో అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆర్థికాభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు నిధులు గుమ్మరిస్తూ పేదలకు రాయితీలను తగ్గించడం, మధ్యతరగతిపై పన్నులు పెంచడం దేశ భవిష్యత్తుకు శ్రేయస్కరం కాదు. సహకార సంఘాల నిర్వహణను కేంద్రీకృతం చేయడానికి తాజా బడ్జెట్‌ ప్రాతిపదికను ఏర్పరచడం ఆందోళనకర పరిణామం. రాజ్యాంగం ఏడో షెడ్యూలు ప్రకారం సహకార సంఘాలు రాష్ట్రాల జాబితాలోకి వస్తాయి. బహుళ రాష్ట్ర సహకార సంఘాల పేరుతో రాష్ట్రాల పరిధిని కుదించడం మంచిది కాదు.

అంతర్జాతీయ విపణిలో పోటీపడే స్థాయికి భారత్‌ ఎదగాలంటే ఉత్పాదకత వృద్ధి, మేలైన విద్య, నైపుణ్యాలు కీలకం. వాటికి కేటాయింపులు ఇతోధికం చేయాలన్న అంశాన్ని తాజా బడ్జెట్లో విస్మరించారు. భారత్‌ అగ్రగామి దేశంగా ఎదగాలంటే ఈ లోపాన్ని అధిగమించాలి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల చమురు ధరలు పెరగడం, కొవిడ్‌ వల్ల విచ్ఛిన్నమైన సరఫరా గొలుసులు ఇంకా పూర్వస్థాయికి రాకపోవడమే దేశీయంగా ద్రవ్యోల్బణం పైకి ఎగబాకడానికి ప్రధాన కారణాలు. ఇవేవీ భారత ప్రభుత్వం అదుపులో ఉండవు. ఇకపైనా చమురు ధరలు అధికమవుతూనే ఉండవచ్చు. కాబట్టి ద్రవ్యోల్బణమూ హెచ్చే అవకాశం ఉంది. ధరలు పెరిగితే వస్తుసేవలకు గిరాకీ తగ్గి ఆర్థికాభివృద్ధి కుంటువడుతుంది. అలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ఎంతగా పెట్టుబడి వ్యయం పెంచినా ఆర్థిక రథం పరుగులు తీయడం కష్టమే!

పెట్టుబడి వ్యయం పెంచాలంటే దిగువ అంచె ప్రజలకు రాయితీల్లో కోత పెట్టక తప్పదని ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. తాజా బడ్జెట్లో ఆహార సబ్సిడీకి కేటాయింపుల్లో దాదాపుగా రూ.90వేల కోట్ల మేరకు, ఎరువుల రాయితీలో రూ.50 వేల కోట్లు, పెట్రో సబ్సిడీల్లో రూ.6,900 కోట్లు తెగ్గోశారు.  

ప్రధానమంత్రి ఆవాస్‌ పథకానికి గత బడ్జెట్‌ కన్నా ఎక్కువగా రూ.79,590 కోట్లు కేటాయించారు. 2021-22లో ప్రత్యేకించిన రూ.90,000 కోట్లకన్నా ఇది తక్కువే.

కొవిడ్‌ వల్ల గత రెండేళ్లలో ప్రజలకు భారీగా నగదు బదిలీ చేయడం వల్లనే ద్రవ్యోల్బణం పెరిగిందనే తప్పుడు అంచనాలు ప్రచారంలో ఉన్నాయి. 2020 మార్చి నాటికి దేశంలో ద్రవ్య చలామణీ రూ.24.4 లక్షల కోట్లు. 2022 డిసెంబరు నాటికి చలామణీలో ఉన్న కరెన్సీ విలువ రూ.32.3 లక్షల కోట్లు. ద్రవ్యోల్బణం వల్ల ప్రజల చేతికి అందిన రాయితీల విలువ క్షీణించింది. పీఎం-కిసాన్‌ పథకం కింద రైతులకు అందిన నగదు విలువ 20శాతం తగ్గింది.

ద్రవ్య, ఆదాయ, ప్రాథమిక లోట్లు మూడూ అధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. అవి ఇప్పట్లో భర్తీ అయ్యే సూచనలు కనిపించడంలేదు. మొత్తం ప్రభుత్వ వ్యయంలో 20శాతం వడ్డీ చెల్లింపులకే సరిపోతోంది. దానికి తోడు ‘అసలు’ చెల్లింపులకూ కేటాయింపులు జరగాలి.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్వావలంబనే పటుతర రక్షణ

‣ భావోద్వేగాల‌పై ప‌ట్టు పెంచుకోండి!

‣ లాభసాటి పద్ధతులతో పండుగలా సేద్యం

‣ మౌలిక వసతులే భవితకు బాటలు

Posted Date: 03-02-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం