• facebook
  • whatsapp
  • telegram

కచ్చితమైన గణాంకాలే వృద్ధికి పునాది

ఎన్‌ఎస్‌ఓ సమాచారంలో ప్రభుత్వ జోక్యం

ప్రతి అయిదేళ్లకోసారి నిర్వహించే జాతీయ కుటుంబ వినియోగ వ్యయ సర్వే ఫలితాలు చివరిసారిగా 2011-12లో ప్రకటితమయ్యాయి. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) తరవాతి సర్వేను 2017-18లో నిర్వహించింది. నిర్ణీత గడువు ప్రకారం ఆ నివేదికను 2019లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. సర్వే సమాచారంలో నాణ్యత లేదంటూ మొత్తం నివేదికను బుట్టదాఖలు చేసింది. 1950లో జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) స్థాపితమైనప్పటి నుంచి ఏ నివేదికా ఇలా రద్దు కాలేదు. 2019లో ఎన్‌ఎస్‌ఎస్‌ఓ- జాతీయ గణాంక కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ)గా రూపాంతరం చెందింది. 2020-21లో లేదా ఆ తరవాతి ఏడాది పకడ్బందీగా మళ్ళీ సర్వే జరుపుతామని కేంద్రం ప్రకటించింది. కొవిడ్‌ కారణంగా సర్వే వాయిదా పడింది. చివరకు ఈ ఏడాది జులై నుంచి వచ్చే ఏడాది జూన్‌దాకా సర్వేను నిర్వహించబోతున్నారు. ఫలితాలు 2024 ద్వితీయార్ధంలో విడుదలవుతాయి.

అంకెల గారడీ

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, అత్యధిక పేదలు కలిగిన భారత్‌- పేదరికం, నిరుద్యోగం, జీడీపీ వృద్ధి రేటు గురించి సాధికార గణాంకాలు లేకుండా దశాబ్దానికిపైగా పొద్దుపుచ్చవలసి రావడం దిగ్భ్రాంతకరం. 2017-18 జాతీయ కుటుంబ వినియోగ వ్యయ సర్వేను 2019లో పార్లమెంటు ఎన్నికలకు ముందు విడుదల చేయాల్సి ఉంది. కేంద్రం దాన్ని రద్దు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కేంద్ర చర్యను నిరసిస్తూ జాతీయ గణాంక కమిషన్‌ (ఎన్‌ఎస్‌సీ) తాత్కాలిక ఛైర్మన్‌ పీసీ మోహనన్‌, సభ్యురాలు ప్రొఫెసర్‌ జేవీ మీనాక్షి తమ పదవులకు రాజీనామా చేశారు. 2017-18లో ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తొలి వార్షిక ఉపాధి సర్వే నిర్వహించింది. నియతకాల కార్మిక శక్తి సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌)గా వ్యవహరించే ఆ సర్వే ఫలితాలనూ కేంద్రం వెల్లడించకపోవడంపై 108 మంది ఆర్థికవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు నిరసన వ్యక్తం చేశారు. గణాంక సమాచారంలో రాజకీయ జోక్యాన్ని వారు ఖండించారు. 2016లో పెద్ద నోట్ల రద్దు, 2017లో వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) అమలు దేశార్థికంపై పెను ప్రభావాన్ని చూపాయి. అందువల్ల గణాంకాలు సహజంగానే మార్పులకు లోనవుతాయి. అయినా వాటిని యథాతథంగా విడుదల చేసి ఉండాల్సిందని మాజీ ప్రధాన గణాంకాధికారి ప్రణబ్‌ సేన్‌ వ్యాఖ్యానించారు. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం సమయంలో భారత్‌ తీవ్ర అనావృష్టి పరిస్థితులకు లోనైంది. అయినా 2009-10 సర్వేను యథాతథంగా నిర్వహించి సకాలంలో నివేదికను విడుదల చేశామని సేన్‌ చెప్పారు. సర్వేకు ప్రాతిపదిక సంవత్సరాన్ని 2011-12కి మార్చినా అసలైన గణాంకాలను తొక్కిపెట్టకుండా 2009-10 సర్వేను నిర్ణీత సమయానికే విడుదల చేశామని వివరించారు. ఒకప్పుడు యావత్‌ ప్రపంచ మన్ననలు పొందిన భారతీయ గణాంక నమోదు వ్యవస్థను మోదీ ప్రభుత్వం నీరుగార్చిందని పలువురు ఆర్థిక, సామాజిక వేత్తలు విమర్శించారు. 2019 మే 23న కేంద్రం చడీచప్పుడు లేకుండా ఎన్‌ఎస్‌ఎస్‌ఓను కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్‌ఓ)లో విలీనం చేసి ఎన్‌ఎస్‌ఓను సృష్టించింది.

ఎన్‌డీఏ ప్రభుత్వం జీడీపీ వృద్ధి రేటు నమోదుకు ఆర్థిక కార్యకలాపాలను ప్రాతిపదికగా తీసుకోవడం మానేసి, జీడీపీ నమోదుకు ప్రాతిపదిక సంవత్సరాన్ని చీటికీమాటికీ మార్చేస్తోంది. గతంలో పారిశ్రామిక జీడీపీ అంచనాకు పారిశ్రామిక ఉత్పత్తి సూచీని ప్రామాణికంగా తీసుకునేవారు. నేడు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ రూపొందించే కంపెనీ నివేదికలను ప్రాతిపదికగా స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని మొత్తం కంపెనీల్లో మూడో వంతు డొల్ల సంస్థలే. మిగిలినవీ అవసరాన్నిబట్టి తమ ఆదాయాలను ఎక్కువగానో, తక్కువగానో చూపుతుంటాయి. ఇలాంటి సమాచారం ఆధారంగా పారిశ్రామికోత్పత్తిని అంచనా వేయడం వల్ల జీడీపీ లెక్కలు తప్పులతడకగా తయారవుతాయి. దానివల్ల కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వాలకన్నా ఎన్డీఏ సర్కారులే గొప్ప ఆర్థిక విజయాలను సాధించాయని చెప్పుకోవడానికి గణాంకాల్లో గోల్‌మాల్‌ చేస్తున్నాయని అనుమానించడానికి ఆస్కారమేర్పడింది. తీరా ఎన్‌డీఏ కన్నా యూపీఏ హయాములోనే ఎక్కువ జీడీపీ వృద్ధి రేటు నమోదైందని జాతీయ గణాంక కమిషన్‌(ఎన్‌ఎస్‌సీ) తీర్మానించింది. ఆ నివేదికను ఎన్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌ నుంచి కేంద్రం హడావుడిగా తొలగించింది. రాజకీయ పెద్దల ఒత్తిడి మేరకు ఎన్‌ఎస్‌సీ తరవాతి లెక్కల్లో తిమ్మిని బమ్మిని చేసింది. వాస్తవ జీడీపీ వృద్ధి రేటు  4.5 శాతమే అయినా, ఎన్‌ఎస్‌సీ అంకెల గారడీవల్ల అది ఏడు శాతంగా నమోదైందని ఎన్‌డీఏ ప్రభుత్వానికి గతంలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అరవింద్‌ సుబ్రమణియన్‌ వ్యాఖ్యానించారు.

పార్లమెంటుకు జవాబుదారీగా...

పెద్దనోట్ల రద్దువల్ల అసంఘటిత రంగం కుదేలైనా ప్రభుత్వ గణాంకాలు దాన్ని కప్పిపెట్టాయి. దేశంలో నిరుద్యోగిత పెరిగిపోయిందని వెల్లడించిన 2017-18 సర్వే నివేదిక కేంద్రానికి ఏమాత్రం రుచించలేదు. 2011-12 నుంచి 2017-18 వరకు గ్రామీణ వినియోగ వ్యయం తగ్గిపోయిందనే విషయాన్ని పాత్రికేయులు వెలుగులోకి తెచ్చారు. కచ్చితమైన గణాంకాలు ఆర్థికాభివృద్ధి సాధనకు ప్రాతిపదికను అందిస్తాయి. అందువల్ల జాతీయ గణాంక సేకరణ కార్యక్రమానికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలి. దానికోసం 2001లో రంగరాజన్‌ కమిషన్‌ సూచించినట్లు జాతీయ గణాంక సంస్థను పార్లమెంటుకు జవాబుదారీని చేయాలి. ప్రస్తుతం పరిమిత కాల ఛైర్మన్‌, సభ్యులతో పనిచేస్తున్న ఎన్‌ఎస్‌సీకి చట్టబద్ధ హోదానిచ్చి పూర్తికాల నియామకాలు చేపట్టాలి. అధికార కుటుంబ వినియోగ వ్యయ సర్వేలను నిర్ణీత సమయంలో పూర్తిచేసి గడువు తప్పకుండా వెల్లడిస్తుండాలి. చేసిన సర్వేలనే మళ్ళీ చేపట్టకుండా క్రమబద్ధీకరించాలి. గణాంకాలను తారుమారు చేయకుండా విశ్వసనీయ సమాచారాన్ని వెల్లడించాలి. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి పకడ్బందీ గణాంకాలు తోడ్పడతాయి.

నిష్పాక్షిక నివేదిక

స్వతంత్ర భారతంలో పంచవర్ష ప్రణాళికలు, వివిధ సామాజిక, ఆర్థిక కార్యక్రమాలను అమలు చేయాలంటే నిర్దిష్ట గణాంకాలు అవసరమని ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ భావించారు. అందుకే 1950లో విఖ్యాత గణాంకవేత్త పీసీ మహలనోబిస్‌ నాయకత్వంలో ఎన్‌ఎస్‌ఎస్‌ఓను నెలకొల్పారు. అప్పట్లో ఆ సంస్థ ప్రభుత్వానికి వెలుపల స్వతంత్రంగా పనిచేసేది. నిష్పాక్షికంగా ఆర్థిక సమాచారాన్ని సేకరించి సర్కారుకు నివేదించేది. ప్రణాళికల రూపకల్పన, అమలుకు ఎన్‌ఎస్‌ఎస్‌ఓ గణాంకాలు ప్రాతిపదికగా నిలిచేవి. ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పరచిన నీతి ఆయోగ్‌ సైతం అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సమాచారాన్ని ఉపయోగించుకొంటోంది.  విశ్వవిద్యాలయాలు, వివిధ పరిశోధన, అంతర్జాతీయ సంస్థలు సైతం ఎన్‌ఎస్‌ఎస్‌ఓ గణాంకాలను ముడిసరకుగా స్వీకరిస్తున్నాయి. 2015 నుంచి రాజకీయ జోక్యం వల్ల అదంతా గత చరిత్ర అవుతోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సాగు బాగుకు సేంద్రియ మార్గం

‣ అలీన పథం... ఆదర్శ మార్గం!

‣ కార్చిచ్చులు... అడవులకు పెనుముప్పు

‣ విచక్షణాధికారం పేరిట ఏకపక్ష నిర్ణయాలా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 17-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం