• facebook
  • whatsapp
  • telegram

పట్టాలకెక్కాల్సిన పన్నుల వ్యవస్థ

త్వరలో జీఎస్టీ మండలి సమావేశం

దేశంలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు స్థిరంగా పెరుగుతున్నాయి. జీఎస్టీని ప్రవేశపెట్టి ఈ ఏడాది జులై ఒకటి నాటికి అయిదేళ్లు నిండుతాయి. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం కింద చెల్లింపులు జూన్‌తో నిలిచిపోనున్నాయి. జీఎస్టీ రేట్లను క్రమబద్ధీకరించాల్సిన అవసరం గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) ఆడిటింగ్‌లో జీఎస్టీ పన్ను ఎగవేతల గురించి బయటపడింది. ఇలాంటి కీలక పరిణామాల మధ్య ఈ నెలాఖరులో జరగనున్న జీఎస్టీ మండలి 47వ సమావేశం ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. మండలి సమావేశంలో ఈ అంశాలన్నీ చర్చకు వస్తాయి. జీఎస్టీని ప్రవేశపెట్టిన తరవాత అత్యధిక వసూళ్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదయ్యాయి. కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ, ఐజీఎస్టీలను కలుపుకొని మొత్తం వసూళ్లు రూ.1,67,540 కోట్లు. సెస్సు కింద రూ.10,649 కోట్లు వసూలయ్యాయి. ఈ రికార్డు పెరుగుదలకు కారణాలు- జీఎస్టీఎన్‌ కింద నమోదైన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2019 జూన్‌లో 1,22,58,569 కాగా 2022 మార్చి 31 కల్లా వారి సంఖ్య 1,36,33,998కి పెరగడం. డేటా ఎనలిటిక్స్‌, కృత్రిమ మేధల సాయంతో జీఎస్టీ పన్ను వసూలు యంత్రాంగాన్ని పటిష్ఠం చేయడంతో సక్రమంగా పన్ను చెల్లించేవారి సంఖ్యా పెరిగింది. ఈ-వే బిల్లు యంత్రాంగం లోపాలను ఈ-ఇన్వాయిస్‌ సాయంతో అధిగమించడం, ద్రవ్యోల్బణం పెరగడమూ జీఎస్టీ పన్ను వసూళ్లు పెరగడానికి కారణమయ్యాయి.

పరిహారంపై వివాదం

జీఎస్టీని ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్రాలకు కలిగే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి అయిదేళ్లపాటు పరిహారం చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అందుకు సంబంధించి ఒక చట్టమూ చేసింది. పాన్‌మసాలా, పొగాకు ఉత్పత్తులు, బొగ్గు, కార్ల అమ్మకాలపై సెస్సు విధించి, తద్వారా వచ్చే మొత్తాలతో జీఎస్టీ పరిహార నిధి ఏర్పాటు చేశారు. అందులోని మొత్తాలు ఏ ఏటికాయేడు పెరుగుతూ వచ్చాయి. 2017-18లో రూ.49 వేల కోట్లుగా ఉన్న జీఎస్టీ పరిహార నిధి 2019-20 నాటికి రూ.1.65 లక్షల కోట్లకు పెరిగింది. అయితే కొవిడ్‌ మహమ్మారి కాలంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారమూ అంతే భారీగా పెరిగింది. 2020-21లో రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం బాగా పెరగడంతో కేంద్రం రూ.1.1 లక్షల కోట్ల అప్పు చేసింది. 2021-22లో రూ.1.59 లక్షల కోట్లు అప్పుతెచ్చింది. 2021-22లో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ.1.59 లక్షల కోట్లను పరిహారంగా విడుదల చేసినా 2022 ఏప్రిల్‌ నాటికి చెల్లించాల్సిన పరిహార బకాయిలు రూ.78,704 కోట్లు. అవి నాలుగు నెలల చెల్లింపులకు సమానం. పరిహార నిధిలో తగినన్ని నగదు నిల్వలు లేకపోవడంతో మార్కెట్‌ నుంచి రుణాలు సేకరించక తప్పలేదు. జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని కేంద్రంకాని, రాష్ట్రాలుకాని ఊహించలేదు. పరిహార నిధికి ఏర్పడిన కొరతను అధిగమించడానికి తీసుకున్న మార్కెట్‌ రుణాలను జీఎస్టీ సెస్సు సాయంతో తీర్చాలని నిశ్చయించారు. అందుకే జీఎస్టీ మండలి 2026 వరకు సెస్సు పరిమితిని పొడిగించింది.

మరోవైపు రాష్ట్రాలు 2022 జూన్‌ తరవాత కూడా జీఎస్టీ పరిహారం చెల్లించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ, జీఎస్టీ చట్టం ప్రకారం పరిహారం చెల్లింపు గడువు 2022 జూన్‌తోనే ముగిసిపోతుంది. ఈ చిక్కు సమస్యను అధిగమించడానికి- సెస్సును జీఎస్టీలో కలిపేయడం, సిగరెట్లు, మద్యం, జూదం తదితరాలపై ప్రత్యేక రేటును నిర్ణయించడం వంటి పరిష్కారాలను ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల కేంద్ర జీఎస్టీలో 41 శాతంతోపాటు రాష్ట్ర జీఎస్టీలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకే దఖలు పడే అవకాశం ఏర్పడుతుంది. జీఎస్టీ వసూళ్లు ఇప్పటిలాగే పెరుగుతూ ఉంటే కేంద్ర, రాష్ట్రాలు రెండింటికీ ప్రయోజనం కలుగుతుంది. ఇక అప్పుడు సెస్సు అవసరం ఉండదు. సెస్సును విడిగా కొనసాగించాలనే మరో పరిష్కారాన్ని సూచిస్తున్నా- సెస్సు వసూళ్లను విభాజ్య నిధికి కలపరు కాబట్టి, దానిపై రాష్ట్రాలకు హక్కు ఉండదు. అందువల్ల ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమోదయోగ్యంగా లేదు.

పరిష్కారాలపై ఆసక్తి

గృహనిర్మాణంపై జీఎస్టీ విధింపునకు సంబంధించి ఇటీవల గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఆస్తులపై అదనపు విలువ జోడింపుగా జీఎస్టీని వసూలు చేస్తున్నారు. నిర్మాణం జరుగుతున్న భూమి విలువ ఆధారంగా జీఎస్టీని చెల్లించే పద్ధతిలో హైకోర్టు తీర్పు మార్పు తెచ్చింది. విమాన ఇంధనమైన ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌)ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రం రాష్ట్రాలకు నచ్చజెబుతోంది. రాబోయే జీఎస్టీ మండలి సమావేశంలో జీఎస్టీఎన్‌ లొసుగులను సరిదిద్దడానికీ ప్రయత్నించాలి. పన్నుల ఎగవేతదారులను, మోసగాళ్లను కనిపెట్టడానికి సీబీఐసీ, ఆదాయ పన్ను శాఖ, విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌ కార్యాలయం కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. నకిలీ ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లులు, పన్ను ఎగవేతలను సమర్థంగా కనిపెడుతున్నాయి. గడచిన 18 నెలల్లో 20 వేల నకిలీ జీఎస్టీఎన్‌లను, రూ.50 వేల కోట్ల నకిలీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్లను కనిపెట్టి, రూ.2,400 కోట్లను రాబట్టుకున్నామని సీబీఐసీ చైర్మన్‌ వెల్లడించారు. జీఎస్టీ విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య, పన్ను చెల్లింపుదారులు, పన్ను వసూలు అధికారులకు మధ్య వివాదాలు తలెత్తుతూ ఉంటాయి. వీటిని పరిష్కరించే బాధ్యత సుప్రీంకోర్టుదా లేక జీఎస్టీ మండలిదా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా మహమ్మారి వల్ల జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులు తలకిందులయ్యాయి. ఈ గడ్డుస్థితిని అధిగమించడానికి 47వ జీఎస్టీ మండలి ఎలాంటి పరిష్కారాలు చూపుతుందనే ఆసక్తి నెలకొంది. 2022-23 కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లతోపాటు జీఎస్టీ మండలికి కూడా వివిధ పన్ను రాయితీల ద్వారా ఆర్థిక పునరుజ్జీవనానికి చేయూత ఇచ్చే సత్తా ఉంది.

రేట్ల క్రమబద్ధీకరణ

జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణకు 2021 సెప్టెంబరులో నియుక్తమైన మంత్రుల బృందం ఇంతవరకు తన నివేదిక సమర్పించలేదు. జూదశాలలు, గుర్రపు పందాలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్రిప్టో కరెన్సీల మీద 28 శాతం జీఎస్టీ విధించాలని డిమాండు వస్తున్నా, వివిధ రకాల క్యాసినో (జూదశాలలు), ఆన్‌లైన్‌ గేమ్స్‌ను వర్గీకరించడమెలా అన్నది ప్రశ్న. ఆన్‌లైన్‌ గేమ్స్‌ అన్నీ జూదం కావని, వాటిలో నైపుణ్య క్రీడలూ ఉన్నాయని గేమింగ్‌ పరిశ్రమ వాదిస్తోంది. ఇలాంటి క్రీడలపై 28 శాతం పన్ను విధించడం సరికాదంటోంది. క్రిప్టోలపై ఇప్పటికే 30 శాతం ప్రత్యక్ష పన్ను, ఒక్కశాతం టీడీఎస్‌ విధిస్తున్నందు వల్ల, జీఎస్టీ పేరిట మళ్లీ పరోక్ష పన్ను విధిస్తే భారత్‌లో చట్టబద్ధ క్రిప్టో మార్కెట్‌ తుడిచిపెట్టుకుపోయి అంతర్జాతీయ ఎక్స్ఛేంజీలు, ప్రైవేటు వ్యాలెట్లకు తరలిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి క్రిప్టోల విషయంలో వెనకాముందూ ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నేపాల్‌తో బలపడుతున్న బంధం

‣ ఆగని పోరుతో సంక్షోభం తీవ్రం

‣ అడవులను కబళిస్తున్న కార్చిచ్చులు

‣ మోయలేని పన్నుల భారం

‣ మానవ హక్కులకు పాతర!

Posted Date: 26-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం