• facebook
  • whatsapp
  • telegram

వాణిజ్య ఒప్పందాలపై ఆచితూచి...

బహుళపక్ష వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్‌ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. దేశీయ వ్యాపార సంస్థల ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోలేమని ఇటీవల ఇండో-పసిఫిక్‌ ఆర్థిక చట్రం (ఐపీఈఎఫ్‌) సమా వేశంలో ప్రపంచానికి ఇండియా స్పష్టం చేసింది. అమెరికాతో వ్యూహాత్మక బంధం బలపడుతున్న సమయంలోనూ కీలకమైన వాణిజ్యం విషయంలో రాజీ పడేందుకు భారత్‌ అంగీకరించలేదు.

దుందుడుకు చైనాను కట్టడి చేయడమే లక్ష్యంగా క్వాడ్‌ కూటమి దేశాలు ఇండో-పసిఫిక్‌ వ్యూహానికి పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే ఇండో-పసిఫిక్‌ ఆర్థిక చట్రం(ఐపీఈఎఫ్‌). సభ్యదేశాల మధ్య సరఫరా గొలుసు వ్యవస్థ బలోపేతం, పారదర్శకమైన సుస్థిర వాణిజ్యం, పరిశుద్ధ ఇంధన వినియోగం- కర్బన ఉద్గారాల తగ్గింపు, సరసమైన పన్నులు- అవినీతి నిర్మూలన అనే లక్ష్యాలతో ఇది పనిచేస్తుంది. ఇందులో అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, బ్రునై, ఇండొనేసియా, జపాన్‌, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్‌, మలేసియా, న్యూజిలాండ్‌, సింగపుర్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం, ఫిజీతో కలిపి మొత్తం 14 సభ్య దేశాలున్నాయి. ఇటీవల ఐపీఈఎఫ్‌ మంత్రుల స్థాయి సమావేశం అమెరికాలో జరిగింది. ఈ సమావేశంలో కీలకమైన సుస్థిర వాణిజ్యం అనే అంశం నుంచి భారత్‌ బయటకు వచ్చింది. మిగిలిన మూడు విభాగాల సంయుక్త ప్రకటనల్లో పాల్గొంది.

ఐపీఈఎఫ్‌ వాణిజ్య అంశంలో భాగస్వామి అయ్యేందుకు ఇండియా సంసిద్ధంగా లేదు. ముఖ్యంగా ఇందులో డిజిటల్‌ వాణిజ్యం, పర్యావరణం, కార్మిక చట్టాలు వంటి అంశాలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఇప్పటికే దీనిలో భాగస్వాములైన దేశాలు ఈ అంశంలో ఏ విధంగా లబ్ధి పొందుతాయో చూడాలనే వైఖరిని భారత్‌ అనుసరిస్తోంది. మన దేశ అధికారులు చర్చల్లో పాల్గొన్నా, వాణిజ్య అంశానికి తుదిరూపు వచ్చే వరకు వేచి చూస్తామంటూ వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలు భారత్‌ రక్షణాత్మక వైఖరికి అద్దం పట్టాయి. ముఖ్యంగా డిజిటల్‌ వాణిజ్యం విషయంలో మనదేశం అప్రమత్తంగా ఉంటోంది. ఇప్పటికే డేటాను స్థానికంగా భద్రపరచాలన్న అంశంపై గట్టి పట్టుదలతో ఉంది. అంతేకాదు- ప్రపంచ వాణిజ్య సంస్థలో ఈ అంశంపై జరుగుతున్న చర్చల్లో పాల్గొనడానికీ ఇష్టపడలేదు. మరోవైపు- పర్యావరణం, కార్మికులకు సంబంధించి కఠిన ప్రమాణాలను అమలు చేయాలంటూ అమెరికా చెబుతోంది. అగ్రరాజ్యం పలు దేశాలతో చేసుకొన్న వాణిజ్య ఒప్పందాల్లోని కార్మిక, పర్యావరణ అంశాలను తాజాగా ఐపీఈఎఫ్‌లోకి చొప్పిస్తోందనే అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఐపీఈఎఫ్‌ వాణిజ్యం విషయంలోని ప్రమాణాలను భారత్‌ ఇప్పటికిప్పుడు ఆమోదించే పరిస్థితి లేదు. ఈ ప్రమాణాలను అభివృద్ధి చెందుతున్న దేశాలపై బలవంతంగా రుద్దుతున్నట్లు ఇండియా భావిస్తోంది. అందుకే ప్రస్తుతానికి దీనికి దూరంగా ఉంది. భవిష్యత్తులో పరిస్థితినిబట్టి చేరే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి మొదటి నుంచీ ఐపీఈఎఫ్‌పై భారత్‌ పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ‘ఐపీఈఎఫ్‌లోని కొన్ని ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా లేవు. డిజిటల్‌ గవర్నెన్స్‌ విధానం భారత్‌ విధానాలకు పూర్తి విరుద్ధంగా ఉంది’ అని విదేశాంగ శాఖకు చెందిన మేధా సంస్థ ‘రిసెర్చ్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ ఫర్‌ డెవలపింగ్‌ సెంటర్స్‌’ వెలువరించిన పత్రం తెలిపింది. భారత్‌ ఇప్పటికే సొంతంగా డిజిటల్‌ చట్టాలు, విధివిధానాలపై కసరత్తు చేస్తోంది. వ్యక్తిగత డేటా గోప్యత అంశాన్నీ పరిశీలిస్తోంది. ఇటీవలే వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లును ఉపసంహరించుకొంది. దాని స్థానంలో మరో సమగ్ర చట్టాన్ని తీసుకొస్తామని కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే.

మనదేశం బహుళపక్ష వాణిజ్య ఒప్పందాల కన్నా- దేశాల స్థాయిలోనే స్వేచ్ఛా వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకొంటుంది. వాస్తవానికి ఐపీఈఎఫ్‌లో అమెరికా వంటి పెద్దదేశంతో వాణిజ్యానికి సంబంధించి ప్రయోజనాల కన్నా పర్యావరణ పరిరక్షణ వంటి అదనపు భారాలను మోయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మరోవైపు పాకిస్థాన్‌కు సహాయం అందిస్తామంటూ అమెరికా ప్రకటించడం భారత్‌కు ఇబ్బందికర పరిణామమే. భారీ వరదల్లో చిక్కుకొన్న పాక్‌కు మానవతా సాయానికి బదులు ఆయుధ పరికరాలు పంపడంపై భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో ఐపీఈఎఫ్‌లోని వాణిజ్య అంశం నుంచి మనదేశం బయటకు వచ్చింది. ఇండో-పసిఫిక్‌లో ప్రాబల్యం పెంచుకోవాలనుకుంటే భారత్‌ తోడ్పాటు తప్పనిసరి అనే అంశాన్ని అమెరికా విస్మరించకూడదు.

- ఫణికిరణ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆత్మనిర్భరతే భారత్‌ కర్తవ్యం

‣ సరిహద్దు ఉద్రిక్తతలు చల్లారేనా?

‣ పాలనలో తగ్గుతున్న జనభాగస్వామ్యం

‣ సాగురంగానికి నీటి కొరత ముప్పు

‣ అభివృద్ధి పథంలో భారత్‌

‣ సంక్లిష్ట సమయంలో స్నేహ మంత్రం

Posted Date: 19-09-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం