• facebook
  • whatsapp
  • telegram

సమస్యల ఊబిలో సూక్ష్మ రుణ సంస్థలు

గ్రామీణ పేదలకు రుణ సదుపాయం కల్పించే ఉద్దేశంతో ఏర్పడిన సూక్ష్మ రుణ సంస్థ (ఎంఎఫ్‌ఐ)లు పలు సమస్యలతో సతమతమవుతున్నాయి. వాటిని నివారించేందుకు రిజర్వు బ్యాంకు సరైన చర్యలు తీసుకోవాలి. రుణ గ్రహీతల ప్రయోజనాలను పరిరక్షిస్తూ సమర్థంగా వ్యాపారం కొనసాగించేలా వాటిని తీర్చిదిద్దాలి.

వర్ధమాన దేశాల్లో పేదరికమే పెద్ద సమస్య. వ్యవసాయంపై ఆధారపడిన భారతదేశ పరిస్థితి అందుకు భిన్నమేమీ కాదు. 2019లో భారత శ్రామిక బలగంలో 42.6శాతానికి వ్యవసాయమే ఉపాధి కల్పించింది. గ్రామీణ పేదలకు, ముఖ్యంగా భూమిలేనివారికి సాధారణంగా బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు, పెట్టుబడులు లభించవు. ఈ లోటును తీర్చడానికి సూక్ష్మరుణాలిచ్చే మైక్రోఫైనాన్స్‌ సంస్థ (ఎంఎఫ్‌ఐ)లు తోడ్పడతాయని బంగ్లాదేశ్‌ అనుభవం చాటింది. 2008లో భారత్‌లో ఏర్పడిన మైక్రోఫైనాన్స్‌ సంక్షోభం ఒక చేదు అనుభవంగా మిగిలింది. చాలామంది గ్రామీణులు ఆర్థిక క్రమశిక్షణ, అవగాహన లేక మితిమీరి రుణాలు తీసుకొని వాటిని తీర్చలేకపోయారు. దానికితోడు పకడ్బందీ నియంత్రణ విధానాలు లోపించడం, నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండటం వంటివి నాటి సంక్షోభానికి మూల కారణాలు. అయినా, ఎంఎఫ్‌ఐలను సరైన విధంగా ఉపయోగిస్తే గ్రామీణ పేదలకు గణనీయ ప్రయోజనాలు కలుగుతాయి.

నియంత్రణ అవసరం

ఎంఎఫ్‌ఐలను బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)లుగా వర్గీకరిస్తారు. నిరుపేదలకు, అత్యంత వెనకబడిన వర్గాలకు రుణ సదుపాయం కల్పించడానికి అవి ఎంతగానో అక్కరకొస్తాయి. పేదలను ఎల్లవేళలా ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి కాబట్టి వారు పదేపదే అప్పులు చేయాల్సి వస్తుంది. సరైన ఆదాయం లేక చేసిన రుణాలు తీర్చలేని దుస్థితి దాపురిస్తూ ఉంటుంది. గ్రామీణ పేదలకు రుణ సదుపాయం కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే సదుద్దేశంతో ఎంఎఫ్‌ఐలు ఏర్పడినా, అవి బ్యాంకులకన్నా ఎక్కువ వడ్డీరేటును వసూలు చేయడం సమస్యలకు దారితీస్తోంది. బ్యాంకులు ఎనిమిది శాతం నుంచి 12శాతం వడ్డీకి రుణాలిస్తే, ఎంఎఫ్‌ఐలు 12నుంచి 30శాతం దాకా వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఇటీవలి వరకూ ఎంఎఫ్‌ఐలు వసూలు చేయగల గరిష్ఠ వడ్డీ రేటు 26శాతమే. రిజర్వు బ్యాంకు ఆ పరిమితిని ఎత్తివేయడంతో ఎక్కువ వడ్డీ వసూలు చేసే వెసులుబాటు ఏర్పడింది. అంత వడ్డీని పేదలు కట్టలేనప్పుడు ఎంఎఫ్‌ఐలు చిక్కుల్లో పడతాయి. బ్యాంకులకు భిన్నంగా ఈ సంస్థలు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలివ్వడం పారు బాకీల బెడదను పెంచుతోంది. రుణాలివ్వడానికి, తిరిగి వసూలు చేసుకోవడానికి సరైన మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోకుండా అప్పులు ఇవ్వడం ఎంఎఫ్‌ఐల సమస్యలకు ఓ ప్రధాన కారణం.

గ్రామీణంలో 76శాతం వయోజనులకు ఆర్థిక పరంగా కనీస పరిజ్ఞానం ఉండటం లేదు. ఎంఎఫ్‌ఐల రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్న అవగాహన వారికి లోపిస్తోంది. దానివల్ల వాటి వ్యాపారం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంటోంది. రిజర్వు బ్యాంకు సైతం ఎంఎఫ్‌ఐలపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. ఈ రంగం కోసం ఇప్పుడైనా ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయకపోతే పేదలకు సముచిత రీతిలో రుణ సౌకర్యం కల్పించడం కష్టమవుతుంది. ఎంఎఫ్‌ఐలు ప్రధానంగా గ్రామాలపై దృష్టి కేంద్రీకరించి, పట్టణ పేదలకు రుణాలివ్వడాన్ని పెద్దగా పట్టించుకోకపోవడమూ సమస్యే. ఉభయ వర్గాలకూ రుణాలివ్వడం ద్వారా పేదరికం స్థాయులను తగ్గించవచ్చని పలు దేశాల అనుభవం చాటుతోంది.

భారత్‌లో ఎంఎఫ్‌ఐలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి, మరింతమందికి రుణ సదుపాయం కల్పించాల్సి ఉంది. ఎంఎఫ్‌ఐలు వడ్డీతోపాటు సర్వీసు చార్జీలనూ వసూలు చేస్తుంటే, ఆ విషయాన్ని రుణ గ్రహీతలకు తెలియజెప్పాలి. ఎంఎఫ్‌ఐలు ప్రారంభ దశలో రకరకాల వ్యాపార నమూనాలతో ప్రయోగాలు చేశాయి. వాటిలో సత్ఫలితాలను ఇచ్చినవి, వికటించినవి రెండూ ఉన్నాయి. ఇకపై వినియోగదారుల (రుణ గ్రహీతల)Ë ప్రయోజనాలను సంరక్షిస్తూ వ్యాపారం చేయడానికి తగిన నమూనాలను అవి అనుసరించాలి. రుణ వితరణతోపాటు పొదుపు, జమలు, ఆర్థిక సలహా సంప్రదింపులనూ అందించాల్సిన అవసరం ఉంది. తద్వారా గ్రామాల్లో వాణిజ్య బ్యాంకులకు ప్రత్యామ్నాయంగా అవి ఎదగాలి. మారుమూల గ్రామాల్లోనూ సేవలు అందించడానికి డిజిటల్‌ సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలి. దానివల్ల ఎంఎఫ్‌ఐలకు నిర్వహణ ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. రుణ వితరణకు కావాల్సిన నిధుల కోసం పూర్తిగా బ్యాంకులపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ వనరులనూ అన్వేషించాలి. మైక్రోఫైనాన్స్‌ రంగానికి పటిష్ఠ నియంత్రణ చట్టం ఏర్పరచి రుణ వితరణ, వసూలును భద్రమైన ప్రక్రియగా రూపుదిద్దాలి. లోపాలుంటే ఎక్కడికక్కడ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. ఎంఎఫ్‌ఐ క్షేత్ర సిబ్బంది పనితీరును, రుణ వసూలు పద్ధతులను పర్యవేక్షించడానికి క్షేత్ర స్థాయి పర్యటనలు తోడ్పడతాయి.

కొన్ని రాష్ట్రాలకే...

పేదలకు రుణ వసతిని అందజేయడంలో ఎంఎఫ్‌ఐలు కీలక పాత్ర పోషించిన మాట నిజం. ఆర్థికాభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేసే సాధనంగా అవి ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. అయితే, వాటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రిజర్వు బ్యాంకు సమగ్ర నియమ నిబంధనలనుË రూపొందించి అమలు చేయాలి. రుణ గ్రహీతల ప్రయోజనాలను రక్షించే నియమాలకు అమిత ప్రాధాన్యం ఇవ్వడం అత్యావశ్యకం. భారత్‌లో ఎంఎఫ్‌ఐలు బాగా విస్తరించినా, అవి ఇచ్చే రుణాల్లో 82శాతం 10 రాష్ట్రాలకే అందుతున్నాయి. తూర్పు, ఉత్తర భారత రాష్ట్రాలకు 37శాతం రుణాలు, దక్షిణ రాష్ట్రాలకు 27శాతం, పశ్చిమ భారత రాష్ట్రాలకు 15 శాతం రుణాలు లభిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లోని పేదలకు రుణ సౌకర్య విస్తరణకు ఎంఎఫ్‌ఐలు నడుంకట్టాలి. అదే సమయంలో పేదల నుంచి బలవంతపు రుణ వసూళ్లకు పాల్పడకూడదు.

ప్రైవేటు బ్యాంకులే ఆధారం

భారత్‌లో అత్యధిక ఎంఎఫ్‌ఐలు 80శాతం నిధులను వాణిజ్య బ్యాంకుల నుంచి, ప్రధానంగా ప్రైవేటు బ్యాంకుల నుంచి తీసుకుని గ్రామాల్లో వడ్డీలకు తిప్పుతాయి. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి ప్రాధాన్య రంగాలకు ఎక్కువ రుణాలివ్వాలనే నియమం ఉంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రైవేటు బ్యాంకులు ఎంఎఫ్‌ఐలపై ఆధారపడతాయి. తాము ఇవ్వాల్సిన రుణాలను ఎంఎఫ్‌ఐల ద్వారా పంపిణీ చేసి నష్ట భయం నుంచి తప్పించుకోవాలని చూస్తాయి. పేదలు రుణాలను తీర్చలేకపోయినప్పుడు ఎంఎఫ్‌ఐలతోపాటు ప్రైవేటు బ్యాంకులూ దెబ్బతింటాయి. నిధుల కోసం ఎంఎఫ్‌ఐలు అతిగా ప్రైవేటు బ్యాంకుల మీద ఆధారపడటమూ మంచిది కాదు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎగుమతుల్లో ప్రాంతీయ భాగస్వామ్యం

‣ ఈసీ స్వతంత్రతపై నీలినీడలు

‣ పంట వ్యర్థాల దహనానికి విరుగుడు

‣ పీడన గుప్పిట్లో స్త్రీ

‣ భాగ్యనగరం... హరిత శోభితం!

‣ సమస్యల ఊబిలో రేపటి పౌరులు

‣ భద్రతతోనే మహిళా సాధికారత

Posted Date: 30-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం