• facebook
  • whatsapp
  • telegram

ఎగుమతులు పెరిగితేనే ఆర్థిక ప్రగతి

ఒక దేశ ఆర్థికాభివృద్ధిలో ఎగుమతులు కీలకపాత్ర పోషిస్తాయి. గతంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్‌ నుంచి సరకుల ఎగుమతులు భారీగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ పరిణామాలతో పాటు ఇతర అంశాలు దీనికి కారణమయ్యాయి.

గత ఆర్థిక సంవత్సరం (2021-22) భారత సరకుల ఎగుమతులు రికార్డు స్థాయిలో 40 వేల కోట్ల డాలర్ల మార్కును దాటడంతో పాలకులు, ఆర్థిక నిపుణులు సంబరపడ్డారు. 2020-21 సరకుల ఎగుమతులతో పోలిస్తే అవి 43శాతం అధికం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. నిరుడు జూన్‌ నుంచి ఎగుమతులు ప్రతినెలా దిగజారుతూ అక్టోబరులో మరింతగా పతనమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎగుమతులు అంతకు ముందు అదే కాలంతో పోలిస్తే    25శాతం పెరిగాయి. రెండో త్రైమాసికంలో మూడు శాతమే అధికమయ్యాయి. మొదటి ఆరు నెలల్లో అవి 12.3శాతం పెరుగుదలతో 26,300 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులను మినహాయిస్తే, వృద్ధి మూడుశాతం కన్నా తక్కువే.

ఆంక్షల ప్రభావం

నూలు, దుస్తులు, చేనేత వస్త్రాలు, ఇనుప ఖనిజం, హస్తకళా ఉత్పత్తులు, తివాచీలు, ప్లాస్టిక్‌ ఎగుమతులు తగ్గడమే భారత్‌ ఎగుమతులు పడిపోవడానికి కారణం. అంతర్జాతీయ మాంద్యంతో పాటు కొన్ని ప్రభుత్వ విధాన నిర్ణయాలూ ఎగుమతులపై ప్రభావం చూపాయి. స్టీలు ఉత్పత్తుల ఎగుమతులపై గత మే నెలలో విధించిన అదనపు సుంకం వల్ల వాటి ఎగుమతులు 55శాతం పతనమయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల వాతావరణం వల్ల వియత్నాం, బెల్జియం వంటి దేశాల నుంచీ స్టీలు ఎగుమతులు సన్నగిల్లాయి. తాజాగా కేంద్రం కొన్ని రకాల స్టీలు ఉత్పత్తులు, నాసిరకం ఇనుప ఖనిజం ఎగుమతులపై సుంకాలను ఎత్తివేసింది.

ఎగుమతి సుంకాలు దేశీయంగా ఉత్పత్తిని దిగజార్చి, అభివృద్ధికి అవరోధంగా నిలుస్తాయి. భారత్‌కు తొంభై లక్షల టన్నుల పంచదారను ఎగుమతి చేసే సత్తా ఉంది. కొవిడ్‌ వల్ల చైనా విపణి మూతపడటంతో పాటు, ప్రభుత్వం విధించిన అధిక ఎగుమతి సుంకం సైతం జతకలిసి గత సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పంచదార ఎగుమతులు డ్రాగన్‌ దేశానికి భారీగా తగ్గాయి. 2021 అక్టోబరుతో పోలిస్తే నిరుడు అదే నెలలో ఇండియా నుంచి ఇనుము ఎగుమతులు 80శాతం తెగ్గోసుకుపోయాయి. గత సెప్టెంబరులో ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులు అంతకు ముందు ఏడాది అదే నెలతో పోలిస్తే 10.85శాతం క్షీణించాయి. భారత్‌ ఎగుమతి చేస్తున్న సరకుల్లో ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు ముందు వరసలో ఉంటాయి. అవి అత్యధికంగా 25 దేశాలకు సరఫరా అవుతున్నాయి. వాటిలో 15 దేశాలకు గత సెప్టెంబరులో బాగా తగ్గాయి.

నిరుడు ఏప్రిల్‌-సెప్టెంబరు కాలంలో భారత్‌ ఎగుమతుల్లో ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల విలువ 5,400 కోట్ల డాలర్లకు పైమాటే. శుద్ధిచేసిన చమురు ఉత్పత్తుల ఎగుమతులు దాదాపు అయిదు వేల కోట్ల డాలర్ల విలువతో రెండో స్థానంలో నిలిచాయి. ఫలితంగా జూన్‌-సెప్టెంబరు కాలంలో వాణిజ్య లోటు 220 కోట్ల డాలర్ల మేర తగ్గింది. ఇండియా నుంచి ఇంధనేతర ఎగుమతులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఇంధనేతర వాణిజ్యలోటు 2022 మార్చితో పోలిస్తే సెప్టెంబరులో 1,000 కోట్ల డాలర్లు అధికంగా నమోదయింది. నిరుడు ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య కాలంలో భారత ఎగుమతులు అంతకు ముందు ఆర్థిక సంవత్సరం అదే కాలంతో పోలిస్తే 660 కోట్ల డాలర్ల మేర దిగజారాయి. ఇండియా మొత్తం ఎగుమతులను పరిశీలిస్తే కేవలం శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతులు మాత్రమే అధికమయ్యాయి. ఎలెక్ట్రానిక్‌ ఉత్పత్తులు, ఔషధాలు, రసాయనాలు, వజ్రాలు, ఆభరణాలు, రెడీమేడ్‌ దుస్తుల ఎగుమతులు గతేడాది ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య కాలంలో పెరిగాయి. భారత ప్రభుత్వం ఆంక్షల వల్ల బియ్యం, వస్త్రాలు వంటి కొన్నింటి ఎగుమతులు తగ్గాయి. వాస్తవానికి ఇటీవల అంతర్జాతీయ విపణిలో బియ్యానికి గిరాకీ పెరిగింది. పాకిస్థాన్‌, థాయ్‌లాండ్‌, వియత్నామ్‌లతో పోలిస్తే భారత్‌ చాలా తక్కువ ధరకు బియ్యాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇటీవల బాసుమతేతర బియ్యం ఎగుమతులపై ఆంక్షలను భారత ప్రభుత్వం ఎత్తివేసింది. నూలు, వస్త్రాల ఎగుమతులపైనా నిషేధం విధించాలని డిమాండ్లు వినిపించినా కేంద్రం దాన్ని అమలులోకి తేలేదు.

చేయూత అవసరం

పీఎం గతిశక్తి ప్రణాళిక ద్వారా దేశీయంగా ప్రపంచస్థాయి మౌలిక వసతుల సృష్టికి అవకాశం ఉంది. వజ్రాలు, రత్నాలు, రసాయనాలు, ఎలెక్ట్రానిక్‌ ఉత్పత్తులపై సుంకాలను తగ్గిస్తే, వాటిని తక్కువ ధరలకే ఎగుమతి చేయవచ్చు. తద్వారా అంతర్జాతీయ విపణిలో పోటీని తట్టుకొని భారత్‌ నిలబడవచ్చు. ఎగుమతుల జోరును పెంచడంలో సమర్థ రవాణా వ్యవస్థ కీలకంగా నిలుస్తుంది. ఇండియాలో రవాణా వ్యయం అధికంగా ఉండటం ఎగుమతులకు ప్రతిబంధకంగా మారుతోంది. అవి దిగివచ్చేలా చూడటం తప్పనిసరి. జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టడమూ హర్షణీయం. దేశీయంగా పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిని ఒడ్డున పడేసేలా మెరుగైన ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉంది. ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తులపై సుంకాలనూ తగ్గించాలి. తద్వారా అవి ఉత్పత్తులను పెంచుకొని దేశాభివృద్ధిలో కీలకంగా నిలుస్తాయి.

సమధిక నిధులు

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ముడి చమురు ధరలు చుక్కలనంటాయి. కొవిడ్‌ ఆంక్షల కారణంగా సరఫరా గొలుసులు అస్తవ్యస్తమయ్యాయి. ఈ పరిణామాలు ప్రపంచ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపాయి. యుద్ధం కారణంగా భారత్‌ నుంచి ఉక్రెయిన్‌, రష్యాలకు ఫార్మా, టెలికాం పరికరాలు, టీ, కాఫీ, సముద్ర ఉత్పత్తులు తదితర ఎగుమతులు తగ్గాయి. ప్రపంచ గోధుమ విపణిలో రష్యా, ఉక్రెయిన్ల వాటా  25శాతం కన్నా ఎక్కువే. యుద్ధం కారణంగా ఆ రెండు దేశాల నుంచి గోధుమ సరఫరాలు నిలిచిపోయాయి. ఈ తరుణంలో భారత్‌ గోధుమ ఎగుమతులపై దృష్టి సారించాలి. అయితే, యుద్ధం కొనసాగినన్నాళ్లే గోధుమ ఎగుమతులకు అవకాశం ఉంటుంది. ఎగుమతుల పరంగా భారత్‌కు దీర్ఘకాలిక లబ్ధి చేకూరాలంటే భవిష్యత్తులో వృద్ధికి అవకాశం ఉన్న ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధన వనరులు, ఎలెక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌ తదితర రంగాలపై దృష్టి సారించాలి. అంకుర సంస్థలను ప్రోత్సహించాలి. మౌలిక వసతులను ఇతోధికంగా పెంచి, ఉత్పత్తి సామర్థ్యాన్ని ద్విగుణీకృతం చేసుకోవాలి. పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)కి సమధిక నిధులు కేటాయించడమూ తప్పనిసరి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈశాన్యంలో కొత్త కాంతులు

‣ సిరిధాన్యాలతో ఆహార భద్రత

‣ డ్రోన్‌ సాంకేతికతతో మార్కెట్‌కు రెక్కలు

‣ అనిశ్చితి నామ సంవత్సరానికి తెర

Posted Date: 13-01-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం