• facebook
  • whatsapp
  • telegram

వృద్ధిపథంలో భారతావని

ఒక దేశ ప్రజలు, సంస్థల ఆదాయాలు పెరిగితే స్థూల దేశీయోత్పత్తీ (జీడీపీ) సహజంగానే పెరుగుతుంది. ప్రభుత్వం సమర్థ విధానాలను అవలంబించినప్పుడు వ్యక్తులతోపాటు దేశమూ ఆర్థికంగా పురోగమిస్తుంది. ఇందుకు ప్రభుత్వం ప్రాధాన్య ప్రాతిపదికపై సరైన విధానాలు, కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది.

కరోనా మహమ్మారి నుంచి భారత్‌ భద్రంగానే బయటపడినా వివిధ కారణాల వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతున్న ప్రతికూల పవనాలు, మనదేశంపైనా ప్రభావం చూపుతున్నాయి. అయినా క్లిష్ట పరిస్థితులకు ఎదురీది అభివృద్ధి సాధించాలని భారత్‌ కృతనిశ్చయంతో ఉంది. 2023లో జీ-20 దేశాలన్నింటిలోకీ భారతే అధిక వృద్ధి రేటు సాధించనున్నదని మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ సంస్థ స్పష్టం చేసింది. ఈ ఏడాది భారత జీడీపీ 4.8 శాతం వృద్ధి రేటును అందుకొంటుందని 2022 నవంబరులో మూడీస్‌ అంచనా వేసింది. ఇటీవల ఆ రేటును 5.5 శాతానికి పెంచింది. 2024లో ఈ రేటు 6.5 శాతానికి పెరుగుతుందని తెలిపింది. పెట్టుబడి వ్యయాన్ని పెంచడం, దేశం ఆర్థికంగా వేగం పుంజుకోవడం దీనికి కారణాలుగా వివరించింది.

మౌలిక వసతులే చోదక శక్తి

పెట్టుబడి వ్యయంలో పెద్ద భాగం ప్రైవేటు రంగం నుంచి రావాలని ప్రభుత్వం ఆశిస్తోంది. తద్వారా ఉపాధి అవకాశాలను, వస్తు సేవలకు గిరాకీని పెంచడం సాధ్యపడుతుందని భావిస్తోంది. ఈ ప్రతిపాదనలు కార్యరూపం ధరిస్తే 2023-24లోనే భారతదేశ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు ఏడు శాతానికి చేరుకుంటుందని భారత రిజర్వు బ్యాంకు అంచనా. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ సారథ్యంలోని భారత ద్రవ్య విధాన సంఘం అంచనా ఇది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మన జీడీపీ వృద్ధి రేటు ఏడు శాతమని జాతీయ గణాంక సంస్థ తెలిపింది. ప్రపంచంలో మరే పెద్ద దేశంలోనూ ఇంత వృద్ధిరేటు నమోదు కాలేదు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ), సానుకూల వ్యాపార వాతావరణ సృష్టికి కృషి చేయడం, కార్మిక నిబంధనల క్రమబద్ధీకరణ, ఎలెక్ట్రానిక్స్‌ తదితర పారిశ్రామికోత్పత్తులు పుంజుకోవడం వల్ల 2024లో ఎగుమతులు పెరుగుతాయన్నది- ఇటీవల ప్రకటించిన విదేశీ వాణిజ్య విధానం అంచనా. ప్రత్యేక రసాయనాలు, సేంద్రియ ఉత్పత్తులు, సాధన సామగ్రి, సాంకేతికతల (స్కోమెట్‌) ఎగుమతి విదేశీ వాణిజ్య విధానంలో అంతర్భాగం. దీనికింద ప్రతి జిల్లానూ ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదిస్తున్నారు. భారతీయ రేవుల వెలుపలా ప్రత్యక్ష వాణిజ్యం చేపట్టాలని తలపెట్టారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగించినా సాటి దేశాలకన్నా భారత్‌ ఎక్కువ వృద్ధి రేటు సాధించే అవకాశాలున్నాయి. ఎగుమతులకన్నా స్వదేశీ వినియోగంపై భారత్‌ ఎక్కువగా ఆధారపడటమే ఇందుకు కారణం. మనకు భిన్నంగా చైనా తన ఆర్థికాభివృద్ధికి ఎగుమతుల మీదనే అత్యధికంగా ఆధారపడుతోంది. ఇండియా, చైనాలు జనాభాపరంగా దాదాపు సమాన స్థాయిలో ఉన్నా భారత్‌ కన్నా చైనా ఎంతో ఎక్కువగా ఎగుమతులను చేయగలుగుతోంది. ఏ దేశ అభివృద్ధికైనా మౌలిక వసతులే ప్రధాన చోదక శక్తి. ఈ సంగతి గ్రహించడంవల్లే మోదీ ప్రభుత్వం గతిశక్తి కార్యక్రమానికి అత్యధిక ప్రాముఖ్యం ఇస్తోంది. బహువిధ అనుసంధానం కోసం చేపట్టిన జాతీయ కార్యక్రమమిది. దీని కింద పారిశ్రామిక కారిడార్లు, రహదారులు, రైల్వే, రేవులు, విమానాశ్రయాలు, రవాణా, జలమార్గాలు, బట్వాడా కేంద్రాలను నిర్మిస్తున్నారు. పరిశ్రమల అభివృద్ధికి గతిశక్తి పటిష్ఠ పునాది వేస్తుంది. భారతీయ సరకులు అంతర్జాతీయ మార్కెట్‌లో ఇతర దేశాల ఎగుమతులతో పోటీ పడటానికి తోడ్పడుతుంది. దీనికి తోడు కార్మిక చట్టాల సంస్కరణలు చేపట్టడం, వినియోగదారుల్లో నమ్మకం పెంచడం అవసరం. వస్తుసేవలకు గిరాకీ పెరిగితే దాన్ని తీర్చడానికి పరిశ్రమలు విస్తరించి, ఉపాధి అవకాశాలూ వెల్లువెత్తుతాయి. మరోవైపు, భారతదేశ పారిశ్రామికోత్పత్తి క్రమంగా క్షీణించడానికి కారణమేమిటో పరిశీలించాలి. 1998లో భారత జీడీపీలో 15.83 శాతంగా ఉన్న పారిశ్రామిక రంగం వాటా 2009లో 17.14 శాతానికి పెరిగింది. కానీ, అది క్రమంగా తగ్గిపోతూ 2021లో 13.98 శాతానికి పడిపోయింది.

ఆదాయం పెరిగే అవకాశాలు

అంతర్జాతీయ ఉద్రిక్తతలు, వాతావరణ మార్పులు భారత జీడీపీ వృద్ధికి ప్రతికూలంగా నిలుస్తున్నాయి. అయితే, 2023లో భారత్‌ సహా ఇతర జీ-20 దేశాలు మెరుగైన వృద్ధి రేటు నమోదు చేస్తాయని మూడీస్‌ అంచనా. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) కృషి వల్ల ఆసియా-పసిఫిక్‌ దేశాల అభివృద్ధి రేటు పెరగనున్నది. 1966లో స్థాపితమైన ఏడీబీలో 68 దేశాలకు సభ్యత్వం ఉంది. ఏడీబీ వ్యవస్థాపక దేశాల్లో భారత్‌ ఒకటి. 2023లో ఏడీబీ చేపట్టే సంక్షేమ, ఆర్థిక కార్యక్రమాలు భారత ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి. భారతీయ కుటుంబాల ఆస్తులు, అప్పుల మధ్య సమతౌల్యం ఉన్నందువల్ల ప్రభుత్వంతోపాటు కుటుంబాలూ ఉత్పాదక ఆస్తుల సృష్టికి ఎక్కువ పెట్టుబడి వ్యయం చేయగలుగుతాయని మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ అంచనా. దీనివల్ల గిరాకీ, ఉపాధి అవకాశాలు వృద్ధి చెందనున్నాయి. 2023-24లో ప్రభుత్వ విధానాలు, ఆర్థిక పునాదుల పటిష్ఠత, బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల తగ్గుదల వల్ల జీడీపీ వేగంగా వృద్ధి చెందనున్నది. కంపెనీలు రుణాలు చేసి పెట్టుబడికి వెచ్చిస్తాయని, అది దేశార్థికానికి ప్రోత్సాహమిస్తుందని ఏడీబీ వెల్లడించింది. 2024లో పర్యాటకంతోపాటు సేవా రంగమూ విస్తరించనున్నది. పంటల ప్రణాళికకు డిజిటల్‌ ఊతం, వ్యవసాయ అంకుర సంస్థల విస్తరణ వల్ల సేద్య రంగం అధిక ఉత్పాదకతను సాధించనున్నది. 2024లో ద్రవ్యోల్బణం అయిదు శాతానికి దిగిరావచ్చు. 2025లో 4.5 శాతానికి తగ్గవచ్చు. 2024లో వాణిజ్య లోటు జీడీపీలో రెండు  శాతానికి దిగివస్తుందని అంచనా. సేవల ఎగుమతులు పుంజుకోనున్నందువల్ల దిగుమతి వ్యయంకన్నా ఎగుమతుల ద్వారా ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి.

విత్తలోటుపై దృష్టి

కేంద్ర బడ్జెట్‌ 2024 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి వ్యయాన్ని రూ.10లక్షల కోట్లకు పెంచాలని ప్రతిపాదించింది. అది జీడీపీలో 3.3 శాతానికి సమానం. 2023లో పెట్టుబడి వ్యయాన్ని రూ.7.5 లక్షల కోట్లుగా నిర్ణయించారు. తాజా బడ్జెట్‌ దీన్ని మూడో వంతు పెంచింది. విత్త లోటును జీడీపీలో 5.9 శాతం వద్ద పట్టి నిలుపుతూ పెట్టుబడి వ్యయాన్ని జీడీపీలో 3.3 శాతానికి పెంచదలచింది. కానీ, విత్త లోటును జీడీపీలో మూడు శాతానికి పరిమితం చేయడం అన్నివిధాలా అభిలషణీయం. ప్రస్తుతానికి 5.9 శాతం వరకు విత్త లోటును అనుమతించినా, 2025-26 కల్లా దాన్ని   4.5శాతం లోపు తీసుకురావాలని ప్రభుత్వం లక్షిస్తోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బొగ్గు దిగుమతితో విద్యుత్‌ ఖరీదు

‣ తైవాన్‌పై చైనా దూకుడు

‣ కదలని పట్టణ ప్రగతిరథం

‣ కృత్రిమ మేధ ఎంత లాభం.. ఎంత నష్టం?

‣ వాణిజ్య ఒప్పందంలో చిక్కుముళ్లు

‣ పుడమి తల్లికి గర్భశోకం

Posted Date: 01-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం