• facebook
  • whatsapp
  • telegram

ఆహార శుద్ధితో ఆదాయ స్థిరత్వం

పంట ఉత్పత్తికి విలువ జోడిస్తే రెట్టింపు ధర దక్కుతుంది. భారత్‌లో ఓ వైపు విలువ జోడించిన పంట ఉత్పత్తులు సూపర్‌మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. మరోవైపు ఆహారశుద్ధి రంగంలో దేశీయ తయారీ పరిశ్రమ ఇంకా వేగాన్ని అందుకోలేకపోతోంది. ఆహారశుద్ధి పరిశ్రమలను విస్తరించి, వ్యవసాయంతో అనుసంధానిస్తేనే కర్షకులకు మేలు జరుగుతుంది. స్థిరమైన ఆదాయాలు అందుతాయి. ఆహార శుద్ధిపై హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా..

ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌- 142 కోట్ల వినియోగదారులున్న అతి పెద్ద మార్కెట్‌. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్‌ను ఇతరత్రా ఏ దేశమూ విస్మరించలేని పరిస్థితి నెలకొంది. అత్యధిక వినియోగ మార్కెట్‌ కావడంతో విదేశీ సంస్థల దృష్టి మన దేశంపైనే ఉంది. 15.2 శాతం వృద్ధితో భారత ఆహార శుద్ధి రంగం వేగంగా పురోగమిస్తోంది. ప్రస్తుతం మొత్తం దేశ ఎగుమతుల్లో ఆహారశుద్ధి రంగం వాటా 10.4 శాతం. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులను వంద శాతం అనుమతించాక దేశీయ పరిశ్రమలకు భారీ పోటీ ఎదురవుతోంది. దీన్ని తట్టుకునేందుకు కేంద్రం కొంత చేయూతనిస్తున్నప్పటికీ పరిస్థితి మరింత మెరుగుపడాల్సి ఉంది.

మౌలిక వసతుల కొరత

ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా మన ఉత్పత్తి సామర్థ్యాలను, ఎగుమతుల్ని పెంపొందించేందుకు రూ.10,900 కోట్ల ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం ఆహార శుద్ధి పరిశ్రమల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఆహార శుద్ధి ఉత్పత్తులను గణనీయంగా పెంపొందించడం, కొత్త తరహా, సేంద్రియ ఉత్పత్తులు పెంపొందించే చిన్న పరిశ్రమలకు చేయూతనివ్వడంతోపాటు, విదేశాలలో భారతీయ బ్రాండ్లకు మద్దతు కల్పిస్తారు. ఈ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవడంపై దేశీయ తయారీ రంగం దృష్టి నిలపాల్సి ఉంది. 2019 నాటికి దేశంలో ఆహారశుద్ధి రంగంలో సుమారు 40,579 భారీ పరిశ్రమలు రిజిష్టరయ్యాయి. వీటిలో అత్యధికంగా మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఏర్పాటయ్యాయి. 24 రాష్ట్రాల్లో 42 మెగా ఫుడ్‌పార్కులను కేంద్రం మంజూరు చేయగా, వీటిలో ప్రస్తుతం 17 మెగా ఫుడ్‌పార్కులు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అలాగే 297 శీతల గొలుసుకట్టు యూనిట్లలో 183 వరకు పూర్తయ్యాయి. సుగంధ ద్రవ్యాలు, పాలు, జనుము, పప్పుధాన్యాల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. పండ్లు, కూరగాయలు, పంచదార, పత్తి, తేయాకు, వేరుసెనగ, నువ్వులు, ఉల్లి, గుడ్లు, ఆహారధాన్యాల ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. వీటిని తక్కువగా ఉత్పత్తి చేస్తున్న పలు చిన్న దేశాలు సైతం విదేశీ మార్కెట్లలో మనకు తీవ్ర పోటీ ఇస్తున్నాయి. మార్కెట్లలో వ్యూహాత్మకంగా ఉత్పత్తిని సీజన్‌కంటే ముందుగానే వచ్చేలా చూడటం, నాణ్యత, రసాయన అవశేషాలు లేని ఉత్పత్తులు తదితర కారణాలతో ఐరోపా మార్కెట్లు మన ఉత్పత్తుల కంటే ఈ దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్‌ నైపుణ్యాలను పెంచుకోవడం ఎంతో కీలకం. ఉత్పత్తిని పండించడమే కాదు- వాటిని సకాలంలో మార్కెట్‌కు చేర్చడం, నాణ్యతా ప్రమాణాలను కలిగి ఉండటం ఎంతో కీలకం. ఈ విషయంలో తీవ్ర మౌలిక వసతుల కొరత మన రైతుల్ని, ఎగుమతిదారుల్ని వేధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పండిస్తున్న పంటల నుంచి ఆహారశుద్ధి చేసే అవకాశాలను జిల్లాల వారీగా గుర్తించి పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సుమారు రూ.808 కోట్ల విలువైన నాలుగు మెగా ఫుడ్‌పార్కులు, ఏడు సమీకృత శీతల గిడ్డంగుల ప్రాజెక్టులు, 20 మధ్యతరహా ఆహారశుద్ధి ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి. పసుపు, బత్తాయి సాగులో అగ్రస్థానంతోపాటు దేశంలో నిమ్మ, ద్రాక్ష, మామిడి, సోయాచిక్కుడు సాగులో 40 శాతం వాటా తెలంగాణదే. ఈ పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్ళే దిశగా ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తోంది. ఏయే ఉత్పత్తులు ఏ ప్రాంతంలో అధికంగా పండుతున్నాయో గుర్తించి ఎగుమతి అవకాశం ఉన్న ఉత్పత్తులపై దృష్టి పెట్టి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ఉద్యాన ఉత్పత్తుల్లో దేశంలో అయిదో స్థానంలో నిలిచింది. దాదాపు మూడు వేల ఆహారశుద్ధి పరిశ్రమలు నడుస్తున్నాయి. మామిడి, బొప్పాయి, టొమాటో, నిమ్మ, మిర్చి, పసుపు, గుడ్లు, చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానాన్ని, వరి, వేరుసెనగ, మొక్కజొన్న ఉత్పత్తిలో రెండో స్థానాన్ని ఏపీ సాధించింది.

నాణ్యతా ప్రమాణాలు

పండ్లు, కూరగాయలు, డెయిరీ, ఆహార ధాన్యాలు, కోళ్లు, మాంసం, మత్స్య ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టి ఆహారశుద్ధి రంగంలో మన వాటాను గణనీయంగా పెంచుకోవాలని భారత్‌ భావిస్తోంది. పంట కోత అనంతర మౌలిక వసతుల కల్పనపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపితే ప్రయోజనం దక్కుతుంది. దేశంలో సమీకృత ప్యాకింగ్‌ యూనిట్లను, శీతల ట్రక్కులను పెంచాల్సి ఉంది. శీతల గోదాముల సామర్థ్యాన్ని అదనంగా పెంపొందించాలి. రైతుల ఆదాయాలు పెంపొందించడం, ఉత్పత్తిదారులకు మార్కెటింగ్‌ తోడ్పాటును అందించడం, ఆహార వృథాను బాగా తగ్గించడం, పంట ఉత్పత్తులు పొలం నుంచి మార్కెట్లు, వినియోగదారులకు చేరేదాకా మౌలిక వసతుల్ని మెరుగుపరచడం, ఉత్పత్తి నాణ్యత నిర్ధారణ సదుపాయాలను పెంపొందించడం వంటి చర్యలు ఆహారశుద్ధి రంగం మరింత వృద్ధి చెందేలా చేస్తాయి. అదే సమయంలో ఎగుమతి ఉత్పత్తుల్ని క్లస్టర్లుగా విభజించి మౌలిక వసతులు కల్పిస్తే ఆహార ఎగుమతులు రెట్టింపు కావడం ఖాయం. అత్యాధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు నవీకరించడంతో పాటు ఆయా దేశాల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఎగుమతిదారులకు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ముఖ్యంగా ఎగుమతిదారులు, సంస్థలతో రైతుల్ని, ఉత్పత్తిదారుల సంఘాలను (ఎఫ్‌పీఓ) అనుసంధానించడం, నాణ్యతా ప్రమాణాల పట్ల వారికి అవగాహన కల్పించడం కీలకాంశం. ఇవన్నీ సాధ్యపడితేనే రైతులకు స్థిరమైన ఆదాయాలతో పాటు మెరుగైన ధరలు అందుతాయి.

ఎగుమతుల దిశగా..

వ్యవసాయ ఎగుమతులకు సంబంధించి ఏపీ, తెలంగాణ సహా 18 రాష్ట్రాలు కార్యాచరణ ప్రణాళికలను ఇప్పటికే పూర్తిచేశాయి. ఇతర రాష్ట్రాలు ఆ దిశగా ముందుకు సాగుతున్నాయి. సరకు రవాణా ధరలు, కంటెయినర్ల కొరత వంటి లాజిస్టిక్‌ సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ 2010-19 మధ్య భారత వ్యవసాయ ఉత్పత్తులు, ఆహారశుద్ధి ఉత్పత్తుల ఎగుమతులు  స్థిరంగా పెరిగాయి. ఏటా 5.49 శాతం వృద్ధితో భారత వ్యవసాయ ఎగుమతులు గత పదేళ్లలో 3,737 కోట్ల డాలర్లకు చేరాయని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (అపెడా) ద్వారా భారత్‌- 2020-21లో రూ.15,30,050 కోట్ల ఆహారశుద్ధి ఉత్పత్తులను ఎగుమతి చేసింది.

- అమిర్నేని హరికృష్ణ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బీజింగ్‌ మధ్యవర్తిత్వం ఫలిస్తుందా?

‣ పేదల నెత్తిన పరోక్షభారం

‣ మానవాళికే సవాళ్లు

‣ రక్షణ ప్రాజెక్టుల నత్తనడక!

Posted Date: 01-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం